Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 6


    "ఎట్లా చచ్చిపోతారు?" గోపాలం ప్రశ్నించాడు తండ్రిని.
    "చచ్చిపోతారు అంతే!" అన్నాడు తండ్రి ఇంకేం చెప్పాలో తోచక.
    "చచ్చిపోవటం అంటే?" గోపాలం ప్రశ్నించాడు మళ్ళీ.
    "నువ్వెళ్ళి ఆడుకో వెధవ ప్రశ్నలూ నువ్వూనూ." తండ్రి కసురుకున్నాడు జవాబు తోచక గోపాలం కదల్లేదు.
    "చచ్చిపోవటం అంటే ప్రాణంపోవటం" అవధాన్లు జవాబిచ్చాడు.
    "ప్రాణం పోవటం అంటే?"
    "ప్రాణం పోవటం అంటే మాట్లాడరు. నడవరు. నువ్వాడుకొనే బాట్ లా బిగుసుకుపోతారు. అప్పుడు వాళ్ళను కాల్చేస్తారు." అన్నాడు అవధాన్లు.
    ఓ నిమిషం పసివాడి మొహంలో భయం, కుతూహలం ఒక దాన్నొకటి తోసుకొని వచ్చాయి.
    "ప్రాణం ఎలా పోతుంది?"
    "ప్రాణం ఎగిరిపోతుంది."
    "ప్రాణానికి పక్షికిమల్లే రెక్కలుంటాయా?" ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిచేస్తూ ప్రశ్నించాడు.
    "కాదు......అవును....." పసివాడికి ఏం జవాబు  చెప్పాలో తోచక అవధాన్లు తికమకపడ్డాడు.
    "ప్రాణం ఎక్కడనుంచి వస్తుంది."
    "భగవంతుడి దగ్గరనుంచి." గోపాలంతండ్రి జవాబిచ్చాడు.
    "ఎక్కడకు మళ్ళీ ఎగిరిపోతుంది?"
    "భగవంతుని దగ్గరకే."
    "భగవంతుడే మళ్ళీ తీసుకుంటాడా?"
    "ఆఁ అవును!" అవధాన్లు జవాబిచ్చాడు.
    "జపాను, అమెరికా, వాళ్ళ ప్రాణాలుకూడా భగవంతుడి దగ్గరికే పోతాయా?"
    "అవును." అనేశాడు అవధాన్లు.
    "యుద్ధంకూడా భగవంతుడే చేయిస్తున్నాడా?"
    "అవును!"
    "అయితే భగవంతుడు మంచివాడు కాదా?"
    అవధాన్లూ, తండ్రీ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు' వాకిట్లోకి వచ్చిన కుక్కపిల్లను చూసి గోపాలం అన్నీ మర్చిపోయి దాని దగ్గరకు పరుగెత్తాడు.
    "ఏమండీ గురూజీ! చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నా ప్రశ్నకు జవాబివ్వలేదు?"
    ఉలిక్కిపడి ఆలోచనల్నుంచి బయటపడ్డాడు అవధాని. "నీ ప్రశ్నకు ఆనాడే జవాబివ్వలేకపోయాను. ఇవ్వాళేం ఇవ్వగలను?" అనుకున్నాడు మనస్సులోనే. పైకి గాంభీర్యంగా అన్నాడు. "నా సిద్దాంతాలు పరస్పరం విరుద్దంగా వున్నాయి అన్నావు! అవునా?"
    "అవునండీ ఒకవైపు ఆత్మానంద స్వరూపం, స్వయం స్వతంత్రమైంది అంటున్నారు. దానికి శరీరం తాలూకు ఈతిబాధలు కల్మషం అంటదన్నారు. మరోవైపు యోగమాయచేత కప్పబడిన ఆత్మ ఐహికసుఖాలకోసం ఆరాటపడుతుందంటున్నారు. స్వయంస్వతంత్రమూ, సాక్షాత్తూ పరమాత్మ  అంశమూ అయిన ఆత్మను యోగమాయ కప్పి వేయటం ఏమిటి స్వామీ? ఇందాక శవం ఎదురైనప్పుడు 'మృతుని ఆత్మకు శాంతి కలుగుగాక' అన్నారు. సత్ చిత్ -ఆనందస్వరూపం అయిన ఆత్మకు శాంతికలగటం ఏమిటి స్వామీ? ముక్కోటి ఏకాదశి రోజు చనిపోయినవాడి ఆత్మ తిన్నగా వైకుంఠం చేరుతుందన్నారు. అసలు ఆ ఆత్మే పరమాత్మ అంశం అయినప్పుడు అక్కడికి చేరుకోక మరెక్కడికి చేరుకుంటుంది? పైగా చావుబ్రతుకులనేవి ఈభౌతిక కాయానికి సంబంధించినవికదా? మరి....." గోపాలం అవధానుల మొహంలోకి చూసి ఠక్కున ఆగిపోయాడు.
    అవధానుల నుదురుమీద ముత్యాల్లా స్వేదబిందువులు దొర్లుతున్నాయి. కోపంతో ఆ పచ్చని మొహం రాగివర్ణాన్ని పులుముకుంది. చిటికలో మిగిలిపోయిన ముక్కుపొడుంను గట్టిగా పీల్చాడు. అది నశాళానికి అంటి ఉక్కిరిబిక్కిరయ్యాడు. గోపాలానికి అవధానులమీద జాలి వేసింది. పెద్దవాడు. అతని నమ్మకా లతనివి. తన కెందుకులే. కాని ఇలాంటివాళ్ళు వాళ్ళ నమ్మకాలను ఇతరుల నెత్తిన రుద్దటానికి ప్రయత్నిస్తారు. అందుకే తనకు వళ్ళుమంట!
    "ఒకసారి యింటికి రండి! నాన్నగారు ఒకటే కలవరిస్తున్నారు" అన్నాడు గోపాలం మాటమారుస్తూ.
    "అలాగేనోయ్" తేరుకొంటూ అన్నాడు అవధాన్లు.
    "ఇవ్వాళ ఎగ్జిబిషన్ గ్రౌండ్సులో పదహారు సంవత్సరాల కుర్రాడు పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని, మూడువందల గజాల ఎత్తునుంచి కిందవున్న బావిలోకి దూకుతాడట! వెళదామా చూట్టానికి?" అడిగాడు అవధాన్లు గోపాలం మళ్ళీ మొదటికీ రాకుండా వుంచే ప్రయత్నంలో.
    గోపాలం ఆశ్చర్యంగా అవధాన్ల మొహంలోకి చూశాడు.
    "మీకు ఇలాంటి ఇన్ ట రెస్టులు కూడా వున్నాయా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS