"అయితే, ఏం ఇయ్యమంటుంది?" అన్నాడు సాంబయ్య.
"అన్నం, బట్టలూ ఇచ్చి, సాలుకు పుట్టేడు గింజలు ఇస్తే బాగుంటుంది." అన్నాడు సాంబయ్య మామ.
"ఏంటేంటీ? అన్నం బట్టలూ యిచ్చి ఏడాదికి పుట్టెడు గింజలు కొలవాలా? నావల్ల కాదు." అని పంచ దులుపుకొని సాంబయ్య లేచి నిలబడ్డాడు.
"ఆయ నేమిస్తాడో చెప్పమనండి!" అంది రామమ్మ. ఆ ముసలమ్మ గొంతులో నిరాశ స్ఫురించింది.
"ఏడాదికి రెండు జతలు పంచెలూ, తిండీ ఇచ్చి, పందుంగింజలిస్తా. ఇష్టమయితే బయలుదేరమనండి." నిక్కచ్చిగా చెప్పాడు సాంబయ్య.
ముసలమ్మ నీరుకారిపోయింది. చివరకు ఒప్పుకొంది.
అయినా ముసలమ్మా ఇంటి పనిలో ఎలాంటి అశ్రద్దా చూపలేదు. పిల్లవాణ్ణి సొంత మనవడిలాగే చూసుకొంది. ఇంటి చాకిరి అంతా వంచిన నడుం ఎత్తకుండా అసలు వొంగిపోయిన నడుమే కాబట్టి చేసుకుపోయేది. సాంబయ్యకు రామమ్మ వచ్చాక చాలా బాధ్యతలు తప్పినట్లుగా వుంది. పుల్లాపిడకా పోకుండా ఇంటికి కుక్కకాపలా కాస్తుంది. వెంకటపతికి తల్లి కొదవలేకుండా వుంది. సాంబయ్య తన దృష్టినంతా పొలం మీదనే కేంద్రీకరించటానికి వీలుగావుంది. ముసలమ్మకు ఇచ్చే బట్టలూ, పెట్టే తిండీ, కొలిచే గింజల వారకంటే తనకు లాభసాటిగానే వుందని భావించాడు సాంబయ్య.
వెంకటపతికి ఏడాది వెళ్ళింది. పిల్లాడు వళ్ళుచేసి నిగనిగలాడుతున్నాడు. వాడి అదృష్టం. ఆ ఏడు సాంబయ్య పొలం వెర్రిగా పండింది. ధాన్యం అమ్మిన డబ్బు భద్రంచేసి, కొడుకుని భుజాన వేసుకొని, గొడ్లసావిట్లో తిరుగుతోన్న సాంబయ్యకు కనకయ్య పిలుపు విన్పించింది.
"ఎవరూ? కనకయ్యా! ఇటురా! సావిట్లోకి." సాంబయ్య తిరిగి కేకవేశాడు. కనకయ్య ముచ్చెమటలు తుడుచుకుంటూ సాంబయ్య ముందుకొచ్చి పడ్డాడు.
"ఏంటా హడావిడి? రొప్పుతున్నావ్? ఏంటి యిసేషం!" సాంబయ్య సాలోచనగా అడిగాడు. కనకయ్య అలా వచ్చాడంటే ఏదో పనిమీదే వస్తాడని సాంబయ్యకు అనుభవమైనదే.
"అదే - కాంతమ్మను - మనవర్తి పొలం కాంతమ్మను కింద పెట్టారు!" వగరుస్తూ చెప్పాడు కనకయ్య.
"డెబ్బై పైచిలుకు లేవూ! ఇంకెంతకాలం బతుకుద్ధి లేవయ్యా?" సాంబయ్య అంటీ అంటనట్లు అనేశాడు. ఆ వార్తలో ప్రత్యేకత ఏమీ లేనట్టూ, దాంతో తనకేం సంబంధం లేనట్టూ, ముఖం పెట్టి, చంకలో వున్న కొడుకును ముద్దాడటం మొదలుపెట్టాడు.
కనకయ్య పని రబ్బరు బొమ్మలోంచి గాలి తీసేసినట్లయింది. కాసేపు గట్టిగా గాలి పీల్చుకొని, వదిలి, పుంజుకొని సాంబయ్యను నిలదీసినట్లు అడిగాడు:
"ఏం సాంబయ్యా! మనోవర్తి పొలం ఐదెకరాలు కొనే ఉద్దేశ్యం మానుకున్నావా?"
"నీ గత్తర దొంగల్దోల! ఏంటి కనకయ్యా తొందర? అవతల మనిషి ఇంకా..."
"ఆఁ, ముసల్ది సచ్చిందాకా ఆ పొలం అట్టాగే వుంటుందనుకుంటున్నావా? అప్పుడే బేరం కూడా మొగ్గుకొచ్చింది." కనకయ్య సాంబయ్యమీద మారణాస్త్రం లాంటిదే ప్రయోగించాడు.
సాంబయ్య చుట్టూ కట్టుకొన్న గోడ పెచ్చులు పెచ్చులుగా వూడి రాలి పడి పోయినట్లయింది. కొడుకును ఇంట్లో వదిలి పైపంచ భుజాన వేసుకొని, ఇంత పొగాకు చేత్తో పట్టుకొని బయటకు వచ్చాడు.
కనకయ్య ధీమాగా అరుగుమీద కూర్చొని కాలిబొటనవేలు ఆడించసాగాడు. ఇంత పొగాకు కనకయ్య మీదకు విసిరి సాంబయ్య అడిగాడు:
"కనకయ్యా! ఇంతకీ ఏంది కత?"
"వీరభద్రయ్యగారి కొడుకు బలరామయ్య లేడూ? అప్పుడే వడ్లమూడి వెళ్ళాడంట." చుట్టమొన కొరికి ఊస్తూ చెప్పాడు కనకయ్య.
సాంబయ్య చుట్ట వెలిగించుకొని "ఇదిగో చూడు కనకయ్యా! ఎంత మనవర్తికి వారసులయితే మాత్రం మనిషి ఇంకా ఆడవుండగానే బేరం పెడ్తారంటావా?" అన్నాడు.
"కాంతమ్మ భర్త తమ్ముడి కొడుకు లైలా పచ్చీసు మనిషి, బస్తీలుపట్టి తిరుగుతుంటాడ్లే! అయినకాడికి అమ్మేరకం. వున్నదంతా ఆర్పి గుంటకాడినక్కలా ఆ ముసలమ్మ చావుకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఇక్కడ ముసలమ్మను కింద పెట్టగానే బలరామయ్య మన ఊరి పొలిమేర దాటాడు."
"ఎట్టెట్టా!" సాంబయ్య మెత్తపడిపోయాడు. చేతికందింది కాస్తా బలరామయ్య కొట్టేస్తాడేమోనని జంకు పట్టుకొంది.
"ఆ మరేమిటి? మూటమీద మూటలుగట్టి, నెత్తిమీన చుక్కలు లెక్కలు పెట్టుకొనే మనిషనుకొన్నావా బలరామయ్య? ఏదో కాడిగట్టు పొలం, మీ తండ్రి హయాం నుంచి దానిమీద బతికినవాళ్ళు! దానిమీద మనసున్నవాళ్ళు కదా అని నేను కళ్ళల్లో వత్తులు వేసుకొని, ఆ లావాదేవీలు గమనిస్తున్నామరి! ఇదంతా ఎవరికోసం చేస్తున్నానంటావ్ సాంబయ్యా!"
"ఆ మాట నేను కాదన్నానటయ్యా?" గుటకమింగి అన్నాడు సాంబయ్య.
"ఏదో! మన సాంబయ్యకు ఎలా అయినా ఆ పొలం కలిస్తే బాగుంటుందికానీ, లేకపోతే ఈపాటికి, ఏదీ ఈపాటికి ఆ బలరామయ్యకే బేరం పైసలుచేసి, నాలుగు పైసలు కళ్ళచూసేవాన్నా కాదా? నువ్వే చెప్పు సాంబయ్యా?"
"అంతవరకెందుకులే కనకయ్యా? నీ మాట నేనెప్పుడయినా తోసేశానా? చెప్పు! నీ సలహా సంప్రదింపుల్ లేకుండా ఒక్క వ్యవహారం చెయ్యలేదుగదయ్యా! అది నీకు తెలవదా ఏం?"
"సరేలే! వట్టి మాటలెందుగ్గానీ, ఇంతకీ కాంతమ్మ మనవర్తి చేను నీక్కావాలా? వద్దా? తేల్చి చెప్పు?" కనకయ్య కరుగ్గానే అన్నాడు.
"అదేదో నువ్వే చూడు!" సాంబయ్య తన ముక్కుతాళ్ళు పూర్తిగా కనకయ్య చేతుల్లో పెట్టాడు.
"అయితే బయలుదేరు. ఆ బలరామయ్య వడ్లమూడి వదలివచ్చేముందే మనం అక్కడ వుండాలి! ఇక మిగతా భాగోతం నేను నడుపుతా. నువ్వట్టా చూస్తా వుండు!"
సాంబయ్య చొక్కా తగిలించుకొని, కర్ర తీసుకొని బయలుదేరాడు.
"బయానాకు డబ్బు తేస్తున్నావా? వట్టి చేతులు ఆడించుకుంటూ వస్తున్నావా?" ఓ చురక విసిరాడు కనకయ్య సాంబయ్యమీదకు.
మొలపంచన దోపిన మూటను ఓసారి తడివిచూసుకొని సాంబయ్య సాలోచనగా అన్నాడు:
"ఇంతకీ ఆ ముసలమ్మ చావకపోతేనో?"
"ఆ, చవక ఉట్టిగట్టుకొని ఎలాడ్తాది! పదవయ్యా! నువ్వూ నీ అపశకునపుమాటలూను!" అంటూ కనకయ్య వడ్లమూడి మట్టిరోడ్డు ఎక్కాడు.
అలా వెళ్ళిన సాంబయ్యా, కనకయ్యా వడ్లమూళ్ళో మూడురోజులు ఉండి పోవాల్సివచ్చింది. ఇంతకీ బలరామయ్య ఆ ఊరు అసలు రానేలేదు. బలరామయ్య బస్తీకి వెళ్ళాడని తెలుసుకున్న కనకయ్య ఈ విత్తనం వేసి సాంబయ్యకు పురెక్కించాడు. కాంతమ్మ వారసుడు పాపారావుతో, బలరామయ్య పొలం బేరం ఆడి వెళ్ళినట్లు చెప్పమన్నాడు కనకయ్య. ఇద్దర్నీ - అమ్మేవాణ్ణీ కొనేవాన్నీ కిందా మీదా పెట్టి పొలం బేరం కుదిర్చాడు కనకయ్య. కనకయ్య చెప్పినట్టు పాపారావు పొలం అయిన కాడికి అమ్ముకుపోయేరకంగా కన్పించలేదు సాంబయ్యకు. తను పెడదామన్నరేటుకంటే ఎకరానికి రెండొందలు ఎక్కువే చెప్పాడు. సాంబయ్య తలకిందులైపోయాడు. కనకయ్యను కసురుకున్నాడు. ఆ బలరామయ్యవల్లే ఇదంతా అయిందనీ, పాపారావు రేటు పెంచాడనీ, లేనిమనిషిమీద తోసేశాడు కనకయ్య.
ఏమయినా బంగారంలాంటి భూమి! తన వంశానికి అచ్చి వచ్చింది. ఆ భూమిచేసే తన తండ్రి బాగుపడ్డాడు. పైగా కాడిగట్టు పొలం. ఆ భూమిమీదవున్న మమకారం, ఆస్తి పెంచుకావాలన్న తాపత్రయం సాంబయ్యను ముందుకుతోసినై. ఆలస్యం అయితే చెయ్యి జారిపోతుందని అనుక్షణం బెదిరించసాగాడు కనకయ్య.
బేరం ఖాయమయింది. బలవంతంమీద మొలన ఉన్న మూటవిప్పి పైకం లెక్కపెట్టి బయానా ఇచ్చాడు సాంబయ్య. బతుకుజీవుడా అన్నట్టు నిట్టూర్చాడు కనకయ్య. అయితే కనకయ్య అనుకొన్నట్టు, సాంబయ్య ఆశించినట్టు కాంతమ్మ మూడురోజుల్లో చనిపోలేదు. మళ్ళీ పుంజుకుందని మంచంమీద వేశారు.
అది తెలిసి పాపారావు బస్తీకి ప్రయాణం అయాడు. బయానా డబ్బులు జేబులో వేసుకొని, సాంబయ్యా, కనకయ్యా కాళ్ళీడ్చుకుంటూ ఇంటిముఖం పట్టారు. త్రోవలో సాంబయ్య కనకయ్యను చెడామడా తిట్టాడు.
