రాత్రి పదయింది.
అభినయ్ నాలుగు చపాతీలు, పెప్పర్ చికెన్, ఫిష్ కర్రీ తిని వెళ్ళాడు.
విరజకి నిద్రకూడా రావడం లేదు....కడుపులో మెలితిప్పే ఆకలి.
సోఫాలో ముడుచుకుని కూచుంది విరజ.
ఆకలి తీవ్రత అర్ధం కాసాగింది.
మెల్లిగా, పిల్లిలా అడుగులు వేస్తూ వెళ్ళి అభినయ్ పడుకున్న రూమ్ లోకి తొంగి చూసింది.
హాయిగా నిద్రపోతున్నాడు.
ఇక ఆగలేక పోయింది. ప్రాణం పోతున్న ఫీలింగ్ ప్రపంచంలొ ఇప్పుడు తనకి ఏదీ అక్కర్లేదు. కడుపుకి కాస్తంత అన్నం కావాలంతే.
చడీ చప్పుడు లేకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. చపాతీలు, చికెన్ కర్రీ వున్నాయి. నోరూరింది.
అభినయ్ రూమ్ దగ్గరికి వెళ్ళి, ముందు జాగ్రత్తగా బయట్నుంచి బోల్డ్ పెట్టింది ఒకవేళ అతను లేచినా, డైనింగ్ హాలులోకి రాకుండా!
చికెన్, చపాతీ, వున్న డిష్ లని తీసుకొని డైనింగ్ టేబుల్ కింద కూచుంది. తన గదిలో నుంచి అభినయ్ చూసినా కనిపించకుండా మరో జాగ్రత్త అది!
గబగబా చపాతీ, చికెన్ తినసాగింది. ఉదయం నుంచి పెరిగిపోతున్న ఆకలిని తట్టుకోలేక అప్పుడే ఓ పిల్లి అటుగా వచ్చి, గుర్రుగా విరజ వైపు చూసింది.
"ఒసే పిల్లి ముండా... ఏమిటే... అలా చూస్తావు? దొంగపిల్లీ! నా సొమ్ము... నా యిష్టం.... వెళ్ళవే" అంది కోపంగా పిల్లివైపు చూస్తూ విరజ.
ఆ పిల్లి ఏ మాత్రం భయపడకుండా, యింకా ఆ 'గుర్రు'ను కంటిన్యూ చేస్తూనే ఉంది.
విరాజ ఇక అదేమీ పట్టించుకునే స్థితిలో లేదు. అయిదంటే అయిదే నిమిషాల్లో చపాతీ, చికెన్ తినేసింది. వాటర్ జబ్బు అందుకోవడం కోసం డైనింగ్ టేబుల్ కింది నుంచే చేతిని పైకి పెట్టి వెతకసాగింది.
వాటర్ జగ్ ఆమె చేతిలోకి వచ్చింది. తనింకా వాటర్ జగ్ ని అందుకోకుండానే వాటర్ జగ్ తన చేతిలోకి ఎలా వచ్చిందా? అని ఆశ్చర్యపోతూ చూసింది. ఎదురుగా మోకాళ్ళమీద కూచుని తనవైపే చూస్తూ వాటర్ జగ్ అందించాడు అభినయ్.
"తొందరగా తాగండి. చికెన్ గొంతులోకి అడ్డం పడగలదు" నవ్వుతూనే అన్నాడు.
"మీ.....రు..... మీరా.... మీరెలా వచ్చారు?"
"విండో డోర్ ఓపెన్ చేసి..." తాపీగా చెప్పేడు అభినయ్.
* * *
"సారీ.... నేనే ఓడిపోయాను" అంది తలొంచుకొని విరజ.
"ఈ ప్రపంచంలో మీరే కాదు.... ఎవరైనా ఆకలి ముందు ఓడిపోతారు. ఆకలి అంత పవర్ ఫుల్ కలది. నాకా విషయం తెలిసే మీతో ఎందుకు పందెం కట్టానో తెలుసా? ఆ ఆకలిబాధ కోసమే..... మీతో పందెం కట్టిన ఈ రెండ్రోజులు నాకు ఫుడ్ ప్రాబ్లెం ఉండదని..."
"నిజమే అభినయ్ గారూ...! ఇక ఉండలేకపోయాను. చిన్నప్పటినుంచీ నాకు ఆకలంటే ఏమిటో తెలియదు. ఎందుకంటే ఎప్పుడూ అన్నీ రెడీగా వుంటాయి. ఏది కావాలంటే అది... క్షణంలో చేసి ఇచ్చే నౌకర్లూ, బయట నుండి అయితే తెచ్చియిచ్చే పనివాళ్ళూ వుండేవారు. నాకిక ఆకలి గురించి ఎలా తెలుస్తుంది. కార్లు, బంగళా, బ్యాంకు బ్యాలెన్స్, క్రెడిట్ కార్డ్స్, స్టేటస్.... అన్నీ.... అన్నీ వున్నాయి. ఒక్క అమ్మ తప్ప.... ఒక నాన్న తప్ప.... ఆ యిద్దరూ యాక్సిడెంట్ లో చనిపోయారు నన్ను ఒంటరిని చేసి...."
"ఓహో... అయామ్ వెరీసారీ.... ఈ ప్రపంచంలో ఎన్నికోట్ల జనం వున్నా, ఏ యిద్దరూ ఒకేలా ఎలా వుండరో- కష్టాలు కూడా అంతే... ఒకరి కష్టానికి, మరొకరి కష్టానికి పోలికే వుండదు. చిత్ర విచిత్రమైన విషాదాలు. ఒకదానికి మరోటి పోలిక లేకుండా!
మీకు ఆస్తి వుంది. అంతస్తు వుంది. అష్ట ఐశ్వర్యాలూ ఉన్నాయి. కానీ అమ్మా, నాన్నా లేరు. నాకు... నాకసలు అమ్మెలా వుంటుందో...? నాన్న ఎలా వుంటారో...? కూడా తెలియదు. నాకు ఊహ తెలిసేక అనాధశరణాలయంలొ వున్నాను.
అందరూ 'అనాధ వెధవ' అనే వాళ్ళు. అదే నా పేరుగా చాన్నాళ్ళు స్థిరపడింది. అందరూ అదే పేరుతొ పిలిచి పని చేయించుకునే వాళ్ళు. అందుకే కసి.... జీవితంపై కసి.... అప్పట్నుంచి కసితో పెరిగాను. ఆ కసితోనే చదివాను. ఇంకా విచిత్రమేమిటంటే.... నా పేరు నేనే పెట్టుకున్నాను. అలా పెరిగాను. నాలోని కసి నన్ను విద్యావంతుడ్ని చేసింది. కానీ ఆ చదువు నా ఆకలిబాధని తీర్చలేకపోయింది.
ఆకలి తీర్చుకోవడం నా టార్గెట్.... అభినయ్ చెప్పుకుపోతున్నాడు.
విరజ అతను చెప్పింది వింటూ వుండిపోయింది. ఈ ప్రపంచంలో ఆ దేవుడు అందరికీ అన్నీ యివ్వడా? బహుశః అందరికీ అన్నీ యిస్తే తన ఉనికిని గుర్తించరన్న భయం కాబోలు.
* * *
"విరజ గారూ.... నేనిక వెళ్తాను. నా జీవితంలో మీరో మిరాకిల్. ఎప్పటికీ మరిచిపోలేను. అందులోనూ అన్నంపెట్టిన దేవతని" సిన్సియర్ గా అంటోన్న అతన్ని చూస్తే ఆమెలో చిన్నకదలిక.
మరోసారి అభినయ్ వైపు చూసింది. ఆమెలో ఓ ఆలోచన అప్పుడప్పుడే రూపు దిద్దుకుంటోంది.
"మిష్టర్ అభినయ్! మీకు జాబ్ కావాలి కదా!"
"అవును"
"ఆ జాబ్ నేను యిస్తాను"
"సానుభూతితోనా?" సూటిగా అడిగాడు అభినయ్.
"కాదు..... స్వార్ధంతో...."
"స్వార్ధమా?"
"అవును.... యిద్దరు కష్టాల్లో వున్నవాళ్ళు.... కలిస్తే ఆ కష్టం సమాధవుతుందిట. మీ ఆకలిబాధ నేను తీర్చగలను. అలాగే నాక్కావలసిన కాసింత అభిమానం. యింకాసింత ప్రేమ మీ దగ్గర దొరుకుతుంది. అఫ్ కోర్స్... మీరు మా కంపెనీలో జాబ్ చేయొచ్చు".
"మీ కంపెనీలోనా.....?"
"అవును విరజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఓ ఉద్యోగం చేద్దురుగానీ...."
అతనొక క్షణం విభ్రాంతిలో నుంచి తేరుకొని....
"నేను చేయాల్సిన జాబ్ ఏమిటో చెబుతారా?"
"కొన్నాళ్ళపాటు నాతోపాటు కంపెనీకి వచ్చి, అబ్జర్వ్ చేయండి. ఆ అబ్జర్వేషన్ లో మీరు ఏం చేయగలరో తెలుస్తుంది. మీకు సూటయ్యే జాబ్ లో జాయిన్ అవ్వొచ్చు. యిక మిగతా సమయాల్లో ఓ ఫ్రెండ్ గా నాతోపాటు వుండాలి....నాకు కంపెనీ యివ్వాలి".
"ఈ జాబ్ ఏదో బావున్నట్టుంది. మీరు అడ్వాన్స్ యిస్తే వెంటనే కొంపో, రూమో అద్దెకు తీసుకోవాలి" అన్నాడు అభినయ్.
"మరి ఇప్పటివరకూ మీరు ఎక్కడ వుంటున్నట్టు?
"మీకు రైల్వేస్టేషన్ తెలుసా?"
"తెలిస్తే?"
"అక్కడ వాడుకలో లేని రెండు పట్టాలు ఆ పట్టాల మీద పనికిరాని గూడ్స్ బోగీ వుంది అదే నా రాజమహల్".
అభినయ్ వంక చూసింది విరజ.
అతను చాలా సాధారణంగా చెప్పుకుపోతున్నాడు. తన బాధలను చాలా సరదాగా చెబుతున్నాడు. చేదు మాత్రలకు షుగర్ కోటెడ్ లా.
ఈ ప్రపంచంలో చాలామంది ఇతరుల సానుభూతి కోసం బ్రతుకుతారు. యితరుల నుంచి సానుభూతి ఆశిస్తారు. చిన్న కష్టాన్ని పెద్ద కష్టంగా ఫీలవుతూ, యితరులకు ఆ కష్టాన్ని చెబుతూ, తామెంత కష్టపడుతున్నదీ చెబుతారు.
కానీ ఈ మనిషేమిటి? కనీసం నివసించడానికి ఓ షెల్టర్ లేని మనిషి.
"హలో.... ఏమిటాలోచిస్తున్నారు? త్వరగా చెబితే నా సామాన్లు సర్దుకోవాలి. యిల్లు వెతుక్కోవాలి..."
"మీరు ఈ యింట్లోనే వుండొచ్చు. యింతపెద్ద యింట్లో.... చాలా యిరుగ్గా బ్రతుకుతున్నాను నేను".
"హమ్మయ్య! యిల్లు వెతుక్కునే బాధ తప్పిందన్న మాట.... మరి వాటెబౌట్ ఫుడ్?"
"అది కూడా!"
"అయితే ఒక్క కండిషన్.... నేనిక్కడ పేయింగ్ గెస్ట్ గా వుంటాను..."
"అలాగే..." అంది విరజ.
