Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 6


    అసలు తనకు బుద్ది లేకపోతే సరి....తగుదునమ్మా అంటూ ఆవిడగారి తలుపు తట్టి ఆవిడ దివ్యమంగళ విశ్వరూపం చూసి, చొంగకార్చి సెంటర్లో స్టాట్యూలా వున్న తనకు బుద్ది లేదు. పోనీ లేని బుద్ది ఎలాగూ లేదు. సిగ్గు విడిచి, ఆవిడగారి గదిలో వెళ్ళి కమిటైపోతే...అన్న ఆలోచన కూడా వచ్చిందతనికి.
    "ఛీ...నాకామాత్రం ఆత్మాభిమానం లేదా?" అంటూ అంతరాత్మ హెచ్చరించేసరికి...తల విదిల్చాడు.
    "ఆమె నీమనిషి...ఆమె మీద నీకు "ఎ టు జడ్" అదికారాలున్నాయని ఓ పక్క శరీరం ఘోషిస్తుంటే, నువ్వు మాత్రం సిగ్గూ, ఎగ్గూ లేకుండా చేసిన ప్రతిజ్ఞ ఏమైందని తిట్టిపోసింది.
    అతనికి బుర్ర గిర్రున తిరిగి పోతోంది.
    ఆ కోపం క్రమక్రమంగా ప్రనూష మీదికి షిప్టయింది.' ఆవిడ గారికైనా సిగ్గుండాలా? తలుపుకు బోల్టు పెట్టకుంటే ఆవిడగారి సొమ్మేం పోయింది. తగుదునమ్మా అంటూ పెద్ద ఎగ్జిబిషనొకటి పెట్టి, ఆ పైగా తననే...' ఆడాళ్ళ అందాలు దొంగచాటుగా చూసి చొంగకార్చే టైప్" అంటుందా? ఎంత పొగరు, ఎంత అహంకారం ఒక్క క్షణం ఉక్రోషం ముంచుకొచ్చింది.
    టీవీ ఆన్ చేశాడు మూడ్ మార్చడం కోసం. ఎం.టి.విలో నుంచి మంచి ఆల్భం ఒకటి వస్తోంది. రొమాంటిగ్గా వుంది. పిచ్చెక్కించేలా డ్యాన్స్. వెంటనే ఆఫ్ చేశాడు.
    "యిలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడే రావాలా?" అని ఎంటివి ఛానెల్ వాళ్ళని తిట్టుకున్నాడు.
    ఓసారి మళ్ళీ పక్కగదిలోకి వెళ్ళి తొంగిచూస్తే....ఆ కోరిక కలగ్గానే దాని రిజల్ట్ కూడా కళ్ళముందు కనిపించింది.
    తనా పనిచేస్తే తెల్లవార్లూ తనని, తన వంశవృక్షంలోని వాళ్ళనీ, కాండాలనీ, ఆకులనీ కలిపి శాపనార్ధాలు పెడుతుంది.
    మళ్ళీ వెళ్ళి ఈసారి డిడి-8 నొక్కాడు. "సతీ సుమతి వస్తోంది. పెద్ద పద్యమొకటి అందుకుంది సుమతి.
    జుట్టు పీక్కోవాలన్న కోరికను అణచుకుని "నువ్వెప్పుడు బాగుపడతావే..." అని ఆ ఛానెల్ని తిట్టుకున్నాడు.
    అలా....పరిపరి విధాలుగా ఆలోచించి, మంచంమీద వాలిపోయాడు. ఏ అర్ధరాత్రో నిద్రపట్టేసింది.
    ఆ నిద్రలో కూడా.... ప్రనూష బ్లౌజు హుక్కు పెట్టుకుంటూ, తనని చూసి కంగారుగా పళ్ళమధ్య బిగించి పట్టుకుని పైటను వదిలేసినా దృశ్యమే కనిపిస్తోంది.
    
                                                                      * * *
    
    గోడ గడియారం వంక చూసింది ప్రనూష.
    అర్దరాత్రి పన్నెండు గంటలు.... చదువుతున్న పుస్తకాన్ని పక్కనపెట్టి ఎదురుగా గోడకు తగిలించి ఉన్న చార్ట్ వైపు చూసింది. ఆ చార్ట్లో మూడువ వందల అరవై అయిదు గదులున్నాయి. ఒక్కో గదిలో ఒక్కో నెంబర్. ఒకటి నుంచి మూడువందల అరవై అయిదు వరకూ అంకెలు. యాభైతొమ్మిది వరకూ బ్లాక్ స్కెచ్ తో కొట్టివేసి వున్నాయి.
    టేబుల్  సొరుగులో ఉన్న బ్లాక్ స్కెచ్ పెన్ను తీసుకుని, అరవయ్యో గడిని అడ్డంగా కొట్టేసింది స్కెచ్ పెన్ తో.
    ఇలాంటి చార్టే శ్రీచరణ్ గదిలోనూ వుంది. "హమ్మయ్య అరవై రోజులు ఇంకా మూడు వందల అయిదువందల రోజులున్నాయి" అనుకుంది.
    మంచమ్మీద ఒరుగుతూ, శ్రీచరణ్ ని గుర్తుచేసుకుంది. అతను తన అందాలను తాగేసేలా చూడ్డం గుర్తుకొచ్చింది.
    చిత్రంగా ఆమెకు కోపం రాలేదు. గర్వంతో కూడిన నవ్వొచ్చింది.
    
                                                              * * *
    
    డోర్ బెల్ అదేపనిగా మోగుతూ వుండటంతో ఉలిక్కిపడి లేచాడు శ్రీచరణ్. ఏడు దాటింది.
    'పాలబ్బాయి అయివుంటాడు" అనుకున్నాడు. వెంటనే ఇవ్వాళ పాల ప్యాకెట్ తీసుకునే డ్యూటీ ప్రనూషది కదా....అన్న విషయం గుర్తొచ్చింది.
    వెంటనే వెళ్ళి డోర్ తీశాడు.
    'సార్...పది నిమిషాల్నుంచి డోర్ బెల్ నొక్కుతున్నా రావట్లేదు" ఫిర్యాదు చేస్తున్నత్తుగా అన్నాడు.
    "కదా...." అని...."బెల్ నొక్కాల్సింది రైట్ సైడ్ ది....ఇవ్వాళ ఏరోజో మర్చిపోయావా? రైట్ సైడ్ బెల్ నొక్కు. ఆవిడగారొచ్చి తీస్తుంది తలుపు...." అని తలుపేసి చక్కా తన పడగ్గదిలోకి వెళ్ళి మంచంమీద అడ్డంగా పడుకున్నాడు.
    పలబ్బాయికి తల తిరిగిపోయింది.
    అసలా ఇల్లుచూస్తేనే అతనికి పిచ్చెక్కుతుంది.
    ఆ యింటిగుమ్మానికి రెండు బెల్లులున్నమాట నిజమే. ఒకరోజూ ఒక బెల్ మరో రోజు మరో బెల్ నొక్కాలని అతనికి చెప్పాడు శ్రీచరణ్.
    ఓరోజు శ్రీచరణ్ పాల పాకెట్ తీసుకుంటే, మరో రోజు ప్రనూష తీసుకుంటుంది. నిన్న శ్రీచరణ్ తీసుకున్నాడు. ఈరోజు ప్రనూష..ఆ విషయం మరిచిపోయాడు పాలబ్బాయి.
    అతనికి అర్ధంకాని విషయం మరోటి ఉంది. తను పొరపాటున బెల్ నొక్కినప్పుడు లేచి వచ్చిన ఆ పెద్దమనిషి పాలపాకెట్ తీసుకోవచ్చుగా....తలుపేసుకుని మరీ "బెల్ నొక్కమని వెళ్ళడమెందుకు?
    బుర్ర గోక్కుంటూ రైట్ సైడ్ బెల్ నొక్కాడు. అయిదు  నిమిషాల తర్వాత ప్రనూష లేచొచ్చి డోర్ తీసి పాల పాకెట్లు తీసుకుంది.
    "ఏం కాంబినేషన్....? రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో వాళ్ళ కారెక్టర్లా అర్ధమవ్వరు వీళ్ళిద్దరూ..." అనుకుంటూ వెళ్ళిపోయాడు. రామ్ గోపాల్ వర్మ సినిమాలు తెగచూసే ఆ అబ్బాయి.
    పాల ప్యాకెట్టు తీసుకుని, ఓసారి శ్రీచరణ్ గదివైపు చూసింది.
    అడ్డంగా పడుకున్న శ్రీచరణ్ ని చూసి "అడ్డగాడిదలా పడుకున్నాడు" అనుకుంది కసిగా.
    ఓ పాల ప్యాకెట్ అతనికి కిచెన్ రూమ్లో పెట్టబోతూ చూసింది. తన చేతిలో ఉన్న పాలపాకెట్లో ఒకదానికి చిన్న రంధ్రం పడి చుక్కలు చుక్కలుగా పాలు కింద పడుతున్నాయి.
    వెంటనే ఆ చిన్న రంధ్రం ఉన్న పాల ప్యాకెట్ ని శ్రీచరణ్ కిచెన్లో పెట్టి బావున్నదాన్ని తను  తీసుకుంది.
    అంతా చేసి ఊర్కోకుండా రంధ్రం ఉన్న భాగాన్ని పైకెత్తి నోరు తెరిచింది. ఒక్కో పాల చుక్కా తన నోట్లోకి జారిపోతుంటే..." హా...పాల చుక్కల టేస్ట్ ఎంత అద్భుతం...యిలాగే పావు లీటరు పాలు తాగేస్తా..." అనుకుంది.
    రెండు నిమిషాల్లో అలా తలెత్తడంతో మెడ పట్టేసినట్టయింది. పాల ప్యాకెట్ కిచెన్ ఫ్లాట్ ఫామ్ మీద పెట్టి వెనక్కి తిరిగి అవాక్కయిపోయింది.
    ఎప్పుడొచ్చాడో...నడుమ్మీద చేయేసి, ఓ చేయి గుమ్మానికి ఆనించి, కోపంగా ప్రనూష వంకే చూస్తూ కనిపించాడు శ్రీచరణ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS