Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 7

 

    "రాధా! ఈ రోజు మా అమ్మ నీలో ప్రవేశించిందేమో! మాతృ స్థానంలో వుండి, బిడ్డ చిన్నదనీ, సంసారం చేసుకునే సామర్ధ్యం వుందో లేదో ననీ బాధపడుతున్నావ్! అంతే కానీ, ఈ రోజుల్లో పిల్లలు మునపటిలా కాక, ఒకరినొకరు బార్యాభర్తలు అర్ధం చేసుకుని, వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా నడుచుకుంటూ, చాలా చక్కగా సంసారాలు చేసుకుంటున్నారు. మన కౌసల్య కేం తక్కువనీ? షీ.....ఈజ్.....ఏ.....జెమ్! ఈ రత్నం మనింట్లో ఎంత వెలుగు నిచ్చి, తృప్తి నిచ్చిందో అటు మెట్టినింటా అలాగే మెరిసిపోతూ వుండాలని నా కోరిక. నా చెల్లెలు అలాగే ఉంటుంది కూడా!" ధీమాగా చెబుతున్న అతని మాటలు మరొకప్పుడయితే ఎలా వుండేవో గాని ఇప్పుడు మాత్రం కడుపులోని నరాలను కోసేస్తున్నంత బాధ కలిగించాయి. ఆ బాధ రాధామ్మకీ, కౌసల్యకీ తప్ప ఇంకెవరికీ తెలుసు? కానీ ఆ వాతావరణాన్ని పూర్తిగా విషాదం అలముకోక,ముందే మాట మార్చే ప్రయత్నంలో "ఏమండీ! పానకాలు గారి తాలూకూ వాళ్ళెవరూ రాలేదేం ఇంకా? కనీసం పిల్లనొక్కసారి చూసుకోవడానికన్నా ఎవరు రాలేదు!" అంది రాధ.
    "వొస్తారట!"
    "ఇంకా ఎప్పుడు?"
    "ఇంకా నాలుగు రోజులు టైముందిగా! అయినా పిల్లవాడు కోరుకుని పెళ్ళి చేసుకుంటానని అన్నాక, వాళ్ళు ఇంకా పిల్లని చూసేదేముంది? ఏకంగా పెళ్ళే చెయ్యడానికోస్తారు. వాళ్ళంతా వస్తారని పానకాలు గారి మామయ్య కూడా చెప్పారుగా!" అన్నాడు సుధాకర్ తేలిగ్గా అదేదో అసలు చర్చా విషయమే కాదన్నట్టుగా!
    'ఆయనకీ వూర్లో మామయున్నాడా?" అడిగింది కౌసల్య.
    'అవును, జగన్నాధరావు గారు అతని మేనమామేగా! వీళ్ళ ఊరు విజయవాడ దగ్గర అదేదో పల్లెటూరు - ఏదో పేరు చెప్పాడు. గుర్తు రావటం లేదు. అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేటు కాలేజిలేవీ  లేవని ఇక్కడి కొచ్చి చదువుకుంటూన్నట్ట. ఆ మాట అతని మామయ్యే చెప్పాడు.'
    కౌసల్య ఏమి మాట్లాడలేదు. వింటూ ఊరుకుంది. ఏదో ఆలోచిస్తూ, రాధమ్మ ఊ కొడుతూ వుంది అతను చెప్పే మాటలకి.
    ముహూర్తం రోజు రానే వచ్చింది . రకరకాల బ్యాండు మేళాలతో కల్యాణ మంటపం సందడిగా వుంది. జనంతో కిటకిటలాడిపోతూ ఉంది.రాగిణి, సుభద్ర, భార్గవి బృందం అంతా పెందరాడే వొచ్చేశారు. వారే అలంకరించారు పెళ్ళి కూతురిగా కౌసల్యని.
    "కౌసల్యా మమ్మల్ని క్షమించవే అనవసరంగా నీ మనస్సు నొప్పించాం! "బ్యూటీ ఈజ్ మెంటల్ అని నువ్వు నిజంగానే ఋజువు చేశావు" అన్నారు. కౌసల్య కంట్లో నీతి పొరలు కనబడకుండా జాగ్రత్తగా చిరునవ్వు నవ్వేసింది!
    పానకాలు తండ్రికి వొంట్లో బాగులేక పెళ్ళికి రాలేకపోయారని చెప్పాడు అతని మేనమామ జగన్నాధరావుగారు. అందుకు సుధాకర్ కాస్త బాధపడ్డా , కౌసల్యకి ఆ బాధ కనబడకుండా జాగ్రత్తపడ్డాడు.
    కాలేజీ లేక్చరర్లూ, క్లాస్ మేట్స్ , బంధువులూ మిత్రులూ అందరూ అక్షింతలూ వేసి ఆశీర్వదించారు కోసల్యా, పానకాలుని. ఘనంగా పెళ్ళి ఏర్పాట్లు చేసిన సుధాకర్ ని అందరూ అభినందించారు. "కంగ్రాచ్యులేషన్స్ పానకాలూ! బంగారం లాంటి పిల్లని భార్యగా పొందావు గుణవతే కాదు రూపవతి కూడా" అని అందరూ అంటూంటే పానకాలు మొహం ముడుచుకుపోవటం , ఆ గొడవలో ఎవరు చూశారో లేదో గానీ, కౌసల్య మాత్రం చూసింది!'

                                                        *    *    *    *

    "ఎక్కడికి ముస్తాబవుతున్నావ్?" అడిగాడు పానకాలు.
    "కాలేజీకి!" ముక్తసరిగా సమాధానం చెప్పి పుస్తకాలు సర్దుకుంటోంది కౌసల్య.
    "నో!......నువ్వు కాలేజీకి రావడానికి వీల్లేదు.'
    "ఎందుకనీ?" పుస్తకాలు పట్టుకుని అడిగింది.
    "మనకి పెళ్ళయింది. మొగుడు పెళ్ళాలిద్దరూ పుస్తకాలు పట్టుకుని చదువుకోడానికి వెళ్ళడానికి మనమీమీ మిడిల్ స్కూలు పిల్లలం కాదు. ఆ పుస్తకాలు అక్కడ పడేసి ఇంటి పన్లు చూసుకో! అయినా ఆడాళ్ళకి చదువులెందుకు? పెళ్ళి కోసమేగా! అది అయిపొయింది గదా! ఇంకెందుకు ? నేనంటే మొగాణ్ణి! కాలేజీ వెళతాను! కచ్చేరికీ వెళతాను!' అన్నాడు కొత్తగా కొన్న బూట్లకి లేసు లెక్కించుకుంటూ.
    కౌసల్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇంకెవరయినా ఇలా అంటే నచ్చ చెప్పటానికి ప్రయత్నించడమో, బతిమాలడమో లేదా దిక్కరించి సమాధానం చెప్పి తన అభిప్రాయం చెప్పడమో చేసుండేది. కానీ ఇతనితో మాట్లాడడ మంటే ఆమెకు ఒంటిమీద తేళ్ళూ, జేర్రులూ పాకినట్టవుతుంది. అతనితో కలిసి భోం చేయడం , అతడి పిచ్చి సంభాషణలు వినడం , ఆమెకి పిచ్చెక్కినట్టవుతుంది. అతని ముఖంలోకి డైరెక్టుగా చూడకుండానే  ఎలాగో కాపురం చేస్తోంది. కనీసం చదువులో పడైన సంసారం గురించి కొన్నాళ్ళు మరచి పోదామనుకుంది. కానీ అదీ నిరాశే అయిపొయింది ఈరోజు. అతడితో మాట్లాడడానికి మనస్కరించని కౌసల్య పుస్తకాలు టేబిలు మీద పడేసి , చెప్పు లిప్పేసి లోపలికి వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS