Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 6

 

    "అలా అనుకోవడం నీ మూర్ఖత్వం కౌసల్యా! తెలిసో తెలియకో ఏదో చిన్న తప్పు చేసినందుకు ఇంత పెద్ద శిక్షా! అయినా నువ్వు చేసిన తప్పేముందని? ఇలా జరగడానికి వీల్లేదు. నేనేప్పుకోను. మీ అన్నయ్యకి జరిగినదంతా చెప్తాను." లేవబోయింది రాధ.
    "వొదినా! నా మీదొట్టే! అమ్మా నాన్నా లేకపోయినా నన్ను పువ్వుల్లో పెట్టి పెంచారు. ఏ లోటూ రాకుండా. నా పెళ్ళని అనుకున్నప్పటి నుంచీ అన్నయ్య మొహం దివ్వెలా వెలిగిపోతోంది. ఇప్పుడు నిజం చెప్పి అతని మనస్సు ముక్కలు చేయలేను. అన్నయ్యను అలా సంతోషంగా చూడడమే నా కోరిక. అందుకోసం నేను ఏ త్యాగమైనా చేస్తాను. నా ప్రాణమైనా ఇస్తాను.' ఆవేశంగా అంది కౌసల్య.
    "కౌసల్యా! నీలో ప్రస్తుతం ఆవేశం తప్ప ఆలోచన లోపించింది. త్యాగానికైనా ఒక అర్ధం వుండాలి! సముదాయించి చెప్పాలని చూసింది రాధ.
    "త్యాగం కాదోదినా! భయం! భయమే!" మొహాన్ని దోసిలిలో దాచుకుని ఏడుస్తూ అంది కౌసల్య.
    "కౌసల్యా! నాలుగేళ్ళ పిల్లప్పటి నుంచి ఎత్తుకొని తిప్పి, పక్కలో పడుకోబెట్టుకుని, గుండెల మీద కూర్చోబెట్టుకొని, కధలు చెప్పి , పాటలు పాడి ఆడించిన అన్నయ్య అంటే భయమా? నీకు కాస్త ఒళ్ళు వెచ్చబడితే, తనకి ఒళ్ళు కాలి పోతున్నట్లుగా బాధపడి కన్నీరు కార్చే కరుణామయుడు. అన్నయ్య అంటే భయమా? ఏంటమ్మా ఇదీ? ఆశ్చర్యంగా వుంది?" అంది లాలనగా రాధ.
    "అన్నయ్యంటే కాదొదినా! దేవుణ్ణి చూసి ఎవరైనా భయపడతారా? నా భయం ఆ రాక్షసుణ్ణి చూసి వాడొక అమాయకుడనుకుని భ్రమపడ్డాను. కానీ కాలాంతకుడని ఇప్పుడే తెలుసుకున్నాను. జరిగిన విషయం తెలిస్తే అన్నయ్య ఈ పెళ్ళి రద్దు చేస్తాడు. ఇప్పటికే ఊరంతా పొక్కినా ఈ పుకార్లకీ, పానకాలు కక్ష కొద్దీ వేరే రూపకల్పన చేస్తే, అన్నయ్య అదంతా చూసి భరించగలడా? చెప్పోదినా చెప్పు? దేవతల్లాంటి అన్నయ్యకీ నీకు నేనిచ్చే ప్రతిఫలం ఇదేనా చెప్పు? నాకోసం మీరు కుమిలిపోతూ వుంటే స్మిత ఏమౌతుందో చెప్పు? తన అమ్మా నాన్నా నా కోసం పడుతున్న బాధ చూసి నన్ను అసహ్యించుకోదూ?"
    "అమ్మా కౌసల్యా! చిన్నపిల్ల వనుకున్నాను. ఎంత ఎదిగిపోయావమ్మా! ఇంత దూరం ఆలోచిస్తున్నావా?" కౌసల్యని చుట్టేసి హృదయానికి హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది రాధ. ఇరువురి గుండెల్లోని ఖేదం కరిగి కన్నీరై ప్రవహించింది. అంతలో సుధాకర్ "రాదా! రాధా!' అంటూ పిలవడంతో ఇద్దరూ ఒకర్నొకరు విడిచి కళ్ళు తుడుచుకున్నారు.
    "ఒస్తున్నా! అంటూ బయటికొచ్చింది రాధ.
    "వొదినా! ఏమైనా చేప్తే అన్నయ్యకి నా మీదొట్టే. మరోసారి హెచ్చరించింది మెల్లగా రహస్యంగా చెబుతూ కౌసల్య వొదినగారిని.
    'అలాగేలే" అంటూ రాధ వెళ్ళిపోయింది.
    కోసల్య శూన్యంలోకి చూస్తుండిపోయింది.

                                                         *    *    *    *

    ముహూర్తం కూడా దగ్గర్లోనే కుదిరింది. సుధాకర్ హడావుడికి హద్దు లేదు. దగ్గరుండి చీరలూ, నగలూ కొనిపించాడు. బంధువులందరికీ పది రోజులు ముందుగానే రమ్మని ఉత్తరాలు రాశాడు. పానకాలుకి పది జతల బట్టలు కుట్టించాడు. అతనడగ్గానే వెంటనే వెళ్ళి స్కూటర్ కొనుకోచ్చాడు. బ్లాకులో గాదియారం, బూట్లూ, సూటు కేసులూ ఒకటా! పానకాలు ఏదడిగితే అది కాదనకుండా కొంటూ వచ్చాడు.
    "ఎమిటన్నాయ్యా ఇది? అతనడిగిందల్లా ఇవ్వడమేనా? రేపు స్మితకీ శ్వేతకీ ఏమి చేస్తావ్?" కోపంగా అడిగింది కౌసల్య. నిజానికి ఆమె కోపం అన్నయ్య మీద కాదు. అలా లేకిగా అడుగుతున్నా పానకాలు మీద.
    "కౌసల్యా! నువ్వు నాకు స్మిత, శ్వేతల లాంటి దానివే కదమ్మా! నీ భర్తకి కావలసినవి కొనివ్వడం నాకు బాధకాదూ, బరువు కాదూ."
    కౌసల్య కళ్ళల్లో నీళ్ళు నిండి, దుఃఖం గొంతులో అడ్డుకుంటూ వుంటే మరి మాట్లాడలేక తలదించుకుంది.
    అది చూసి రాధ కూడా చాటుగా వెళ్ళి కళ్ళు తుడుచుకుంది.
    "ఏమిటి వొదినా మరదళ్ళలా సైలెంటుగా వుంటున్నారు? పెళ్ళయ్యాక ఒకళ్ళనొకళ్ళు విడిచి పెట్టిపోవాలని దిగులా?" వేళాకోళంగా అన్నాడు సుధాకర్.
    "అవునండీ! కౌసల్య ఉత్త అమాయకురాలు. ఎమ్. ఎ వరకూ చదివినా ఇంకా, నల్లనివన్నీ నీళ్ళూ, తెల్లని వన్నీ పాలు అనుకునే మనస్తత్వమే తప్ప ఎత్తులూ, జిత్తులూ తెలీని పిల్ల. ఎలా సంసారం చేసుకుంటుందో ఏమిటో?" అంది బాధగా రాధ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS