"మీ పేరూ?" అడిగాడు.
"వర్ష" అంది.
"అడగకపోయినా చెప్తున్నాను. నా పేరు సంజయ్. ప్నుమేటిక్ టైర్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను" అన్నాడు.
ఆమె తల ఊపింది.
"మీరు ఇంటికెళ్ళే దార్లోనే వుంది. థర్డ్ రోడ్ దగ్గర మీరు టర్న్ అయ్యేటప్పుడు అక్కడ ఆగి ఎదురుగా వున్న జడేజా కోకాకోలా పోస్టర్ దగ్గర లిల్లీఫ్లవర్స్ కొంటున్నప్పుడు ఓసారి తల ఎత్తి చూస్తే ఆ షాన్ బాగ్ బిల్డింగ్స్ లో ఫోర్త్ ఫ్లోర్ లో వుంటుంది మా ఆఫీసు!" అన్నాడు.
వర్షకళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె నిజంగానే జడేజాయాడ్ వున్న పోస్టర్ దగ్గర ఆగి తను ఆఫీసులో వేజ్ లోకి లిల్లీలు కొంటూ వుంటుంది.
"మీకెలా తెలుసు!" గట్టిగా అరిచింది. "ఎస్.....ఎనీ ప్రాబ్లమ్ మేడమ్?" ఎయిర్ హోస్టెస్ చాక్ లెట్స్ ట్రేతో దగ్గరకొచ్చి అడిగింది.
"నో.....థాంక్స్" సిగ్గుపడ్తూ చెప్పింది వర్ష.
సంజయ్ నవ్వి గుప్పెటనిండా చాక్ లెట్స్ తీసుకొని "ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే విష్చేస్తున్నాను. హేపీ బర్త్ డే" అన్నాడు.
"వాట్? మీకు సూపర్ పవర్స్ ఏమైనా వున్నాయా?" వర్ష ఉద్విగ్నంగా అడిగింది.
"నాకు ఇంకా చాలా విషయాలు తెలుసు. నెమ్మది మీద చెప్తాను. లేకపోతే ఇన్ని షాక్స్ ఒక్కసారే భరించలేరు. సో...... మీరు రేపు యాంకీ డూడిల్ ఐస్ క్రీం పార్లర్ కి ఎన్ని గంటలకి వస్తున్నారూ?" అడిగాడు.
"మైగాడ్.....అది నా ఫేవరేట్ ఐస్ క్రీమ్ షాప్. అది కూడా తెలుసా? ఎవరు మీరు? స్వదేశీ డిటెక్టివా లేకా విదేశీ టెర్రరిస్టా?" కాస్త భయంగా అడిగింది.
"అమాయకమైన ఆడపిల్లల వెంబడి పడి ఈ డీటైల్స్ సేకరించేపనిలేని వెధవల్లా కనిపిస్తున్నారా వాళ్ళు మీకళ్ళకీ? అవేమీ కాదు చెప్పానుగా ఐయామ్ సంజయ్! ప్రస్తుతానికి ఈ పరిచయం చాలు" అన్నాడు.
వర్ష అతన్నే విచిత్రంగా చూస్తుండిపోయింది.
"చాక్ లేట్....." రేపర్ తీసి ఆమెకి అందించాడు.
వర్ష అందుకుని "మీకు నాగురించి ఎలా తెలుసో చెప్పండి.....ప్లీజ్! లేకపోతే నాకీ రాత్రి నిద్రపట్టదు" అంది.
"చెప్తాను మనం విడిపోయేలోగా!" అన్నాడు.
ఎయిర్ పోర్ట్ బయట వర్ష కోసంకారు తీసుకొని డ్రైవర్ రెడీగా వున్నాడు.
"అమ్మరాలేదా?" వర్ష కళ్ళలోకి ఆశాభంగం.
"అమ్మగారికి......" అతను ఆగిపోయాడు.
"ఏమైంది?" వర్ష ఆతృతగా అడిగింది.
"కంగారేంలేదమ్మా కానీనిన్న చిన్న ఏక్సిడెంట్ అయింది."
"ఆ.....ఏక్సిడెంటా-? ఏమైంది" వర్ష గాబరాగా అడిగింది.
"చాలాచిన్నదెబ్బ.....కాలు మడతపడింది. సూపర్ బజార్ దగ్గర రోడ్ క్రాస్ చేస్తుంటే వెనకనుండి ఎవరోస్కూటర్ మీదొచ్చి తగిలాడు." అన్నాడు.
"త్వరగా పద....." వర్ష అతన్ని తొందరపెడ్తూ కారు ఎక్కేసింది.
కారు స్టార్టయ్యాక ఆమెకి సంజయ్ గుర్తొచ్చాడు. విండో గ్లాసు ఓపెన్ చేసి వెనక్కి తిరిగి చూసింది. అతను సూట్ కేస్ తో తనకారు వైపే చూస్తూ నిలబడ్డాడు. ఒక్క నిమిషం ఆగి ఎటు వెళ్ళాలో అడుగుదామా అనిపించింది.
కానీ అంతలోనే తల్లిగుర్తొచ్చి మనసుమార్చుకుంది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి అమ్మనుచూడాలి!
వర్షవచ్చేసరికి విద్యవరండాలో కూర్చుని వుంది.
"అమ్మా....." కారు దిగుతూనే వర్ష తిరునాళ్ళలో తప్పిపోయి మళ్ళీ దొరికిన చిన్నపిల్లలా వచ్చిచుట్టేసుకొంది.
"వర్షా......నా బంగారూ.... ఎలా వున్నావురా?" నుదుటి మీదముద్దు పెట్టుకుంటూ అడిగింది విద్య.
"నేను నిక్షేపంలా వున్నాను. నువ్వే..... రెండురోజుల్లోనే ఏక్సిడెంట్ చేసుకుని కూర్చున్నావు. కాలేది. చూడనీ...." కన్నీళ్ళతో అంది వర్ష.
"అసలీ సంగతి నీకు అప్పుడే చెప్పొద్దని చెప్పానే డ్రైవర్ తో" అంది విద్య.
"నువ్వు నడవగలిగే స్థితిలో వుంటే నా కోసం ఎయిర్ పోర్ట్ కి రాకుండా వుంటావా? నాకా మాత్రం తెలీకుండా వుంటుందనుకున్నావా? చెప్పాడు కాబట్టి సరిపోయింది.....లేకుంటే సడెన్ గా ఈ కట్టు చూసి..... ఓ మైగాడ్!" గుండెలమీద చెయ్యి వేసుకుంది.
"పిచ్చిపిల్లా......ఒక వారంలో సెట్ అయిపోతుంది. అదృష్టం కొద్దీ ఫ్రాక్చర్ అవలేదు" నవ్వింది విద్య. ఆ తర్వాత ఇద్దరూ వ్యాపారం గొడవల్లో పడిపోయారు.
విద్య హఠాత్తుగా "వర్షా......వసుంధరా ఆంటీకినీ డ్రెస్ డిజైన్ చేసి ఇచ్చి వచ్చాను. ఫోన్ చేసి కుట్టిందోలేదో కనుక్కో!" అంది.
"ఎందుకు"
"అదేంటే? రేపు నీ బర్త్ డే కదా!" అంది విద్య.
"చాల్లే! నీకిలా వుంటే నాకు బర్త్ డే ఒకటే తక్కువయింది" అందివర్ష.
"వర్షా...ఇప్పుడు ఏమయిందని? కాలుమడతపడింది అంతే! అమ్మ ఇంకా బ్రతికే వుందిగా!"
"అమ్మా!" దెబ్బతిన్నట్లు చూసింది వర్ష.
"నీకు అది మామూలు బర్త్ డే మాత్రమే. కానీ నాకుమాత్రం రీబర్త్ డే.....పునర్జన్మ! నాకు వచ్చే ఒకే ఒక పండగ!" విద్య చలిస్తున్నగొంతుతో అంది.
"అమ్మా....." వర్ష వెళ్ళి తల్లిమెడచుట్టూ చేతులువేసి "నేను ఎంత అదృష్టవంతురాల్ని అమ్మా!" అంది.
"సరే......సరే..... ముందు వెళ్ళి ఫోన్ చెయ్యి."
వర్ష ఫోన్ చేసి "పంపిస్తానన్నారు" అంది.
* * *
వర్ష ఆ రోజు తల్లికి ఇష్టమైన విధంగా తయారయ్యింది. తలంటుపోసుకుని పట్టుపరికిణీ, ఓణీ వేసుకొని దేవుడికి పూజ చేసింది. వంటమనిషిని బయటకి పంపించి తల్లి చేసినట్లే పరమాన్నం, పులిహోరాచేసింది.
