Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 6

 

    "ఎంటే పెళ్ళంటున్నారు ఎవరికి?" అంటూ చేతులు పైట కొంగుకు తుడుచుకుంటూ వచ్చింది కస్తూరి.

    "పందేనికి ఒప్పుకున్నట్లేనా?" అంది జయంతి.

    "ఏం పందెమే" అడిగింది కుతూహలంగా కూతుర్ని కస్తూరి.

    "ఓడిపోయినవాళ్ళు రేపు లవకుశ సినిమాకి తీసుకెళ్ళాలమ్మా చెప్పింది జయంతి.

    "ఏంటి లవకుశ సినిమా వచ్చిందా.....?" అడిగింది కస్తూరి ఆశ్చర్యంగా.

    "అవునక్కా! అందరం వెళ్దామా రేపు" కుతూహలంగా అడిగింది పార్వతి.

    "అలాగే వెళ్దాంలే మీ బావగారితో చెప్పి" అంది కస్తూరి.

    దాక్షాయణి జయంతి వేపు నవ్వుతూ చూసింది.

    జయంతి నెత్తి కొట్టుకుంది.

    "ఏంటే లవకుశ సినిమాకి వెళ్దామంటే నెత్తికొట్టుకుంటావ్?" చిరాగ్గా అంది కస్తూరి.

    "జయంతి కొట్టుకుంటుంది అందుకుకాదులే అక్కా" అంది నవ్వుతూ దాక్షాయణి.

    "మరెందుకు?" అడిగింది ఆశ్చర్యంగా కస్తూరి.

    "అబ్బా! ఏమిలేదులే, నీకు అన్ని వివరంగా చెప్పాలి"విసుక్కుంది జయంతి.

    "దీనికి ప్రతిదానికి విసుగే. ఎవడొస్తాడోగానీ దీన్ని చేసుకుంటానికి వాడు రెండు నెలల్లోనే అడవులకు పారిపోతాడు" అంది గిరిజ.

    "ఎవడో ఏంటే సురెంద్రే దాని మొగుడు" అంది నవ్వుతూ దాక్షాయణి.

    "అబ్బా! పిన్ని మీకు నా పెళ్ళి విషయం తప్పించి వేరే ముచ్చట లేదా? ముందు గిరిజక్క పెళ్ళి అయ్యాకేకదా నా పెళ్ళి గిరిజక్క గూర్చి ఎవరూ మాట్లాడరే...." అంది జయంతి.

    "అమ్మో! ఏంటే ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు హటాత్తుగా నామీద పడ్డావ్?" అంది గిరిజ నవ్వుతూ.

    "అవునక్కా! ముందు నీ పెళ్ళి అవ్వాలికదా....తరువాతే నా ముచ్చట" అంది జయంతి.

    వీళ్ళ సంభాషణంతా మురిపంగా చూస్తూ వింటోంది కస్తూరి.

    "అవునక్కా! గిరిజకు సంబంధాలు చూస్తున్నారా బావగారు?" అడిగింది దాక్షాయణి కస్తూరిని.

    జయంతి నవ్వుతూ గిరిజ వేపు చూసింది.

    ఈసారి గిరిజ నెత్తి కొట్టుకుంది.

    "చూస్తున్నారమ్మా! వచ్చే ఎండల్లో చేయాలనుకుంటున్నారు" అంది కస్తూరి.

    "నాకప్పుడే పెళ్ళేంటి? వీళ్ళ పిచ్చి గానీ మరో నాలుగయిదు ఏళ్ళు వరకూ చేసుకునేది లేదు." అంది గిరిజ మెల్లగా జయంతి చెవిలో.

    జయంతి నవ్వింది.

    "ఏంటే అక్కా చెల్లెళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు?" అంది దాక్షాయణి.      

    "కోరుక్కోవటానికి ఏం దొరక్కా...." అంది జయంతి సిరియన్ గా.

    జయంతి మాటలకు అందరూ నవ్వారు.

                                             4

    వెన్నెల పిండారబోసినట్లుంది.

    పున్నమినాటి నిండు చంద్రునితో పిల్ల మేఘాలు దోబూచులాడుతున్నాయి.

    ఆ ఉమ్మడి కుటుంబంలో అందరికంటే పెద్దావిడ అయిన భ్రమరాంబగారితో సహా ఆడవాళ్ళంతా రెండు ఎడ్లబండ్లలో కుర్చుని వున్నారు. భ్రమరాంబగారి ఏకైక కుమారుడు సురేంద్ర ఒక బండి తోలుతుండగా, మరో బండి పనివాడు వెంకటేశం తోలుతున్నాడు. అందరూ లవకుశ మొదటి అట చూసి వస్తున్నారు. ఎద్దుల మెడలకు కట్టిన గంటలు వింత శబ్దంతో పిల్లల అరుపులు, నవ్వులతో ఆ వెన్నెల నేపధ్యంలో ఆ బండ్లు ఆనందంగా ముందుకు సాగుతున్నాయి.

    "ఏరాసురేంద్ర! నువ్వు జయంతిని చేసుకుంటావా? గిరిజని చేసుకుంటావా?" అడిగింది దాక్షాయణి.

    "ఇద్దర్ని" అన్నాడు సురేంద్ర చండ్రాకోలుతో ఎద్దులను కొడుతూ ఆ మాటలకు దాక్షాయణి పగలబడి నవ్వింది.

    ""చూశారటే మీ ఇద్దరినీ చేసుకుంటాడట మా సురేంద్ర" అంది.

    "అబ్బో ఆ ముఖానికి అదొక్కటే తక్కువ. ఎద్దుల మెడలోగంటలు కట్టడం కాదు మా మెడల్లో తాళి కట్టడమంటే....ఓ అత్తో! మీ కొడుక్కి చెప్పు-నోరు కాస్త అదుపులో పెట్టుకోమని" అంది జయంతి.

    "నేను చెప్పటమెందుకే....ఆ మాటేదో నువ్వే చెప్పవే నా ముద్దుల కోడలపిల్లా" అంది భ్రమరాంబ.

    "మీ తల్లీ కొడుకుల పప్పులు నా దగ్గర ఉడకవు. నేను పట్నంలో చదువుకోవాలి. అక్కడ చదువు అయిపోయిన తరువాత....ఇంకా పెద్ద చదువులు చదవాలి. ఏ గొప్ప అఫీసరో వస్తాడు నన్ను చేసుకోవటానికి. అంతేకానీ ఈ పల్లెటురి మొద్దునా నేను చేసుకునేది" అంది జయంతి.

    "అబ్బో ఎంత పెద్ద గుమ్మడికాయైనా కత్తిపిటకు లోకువేనే అమ్మా! ఈ మాట చెప్పు ఆ పొగరుబోతు గిత్తకి" అన్నాడు సురేంద్ర.

    "మా బాగా చెప్పావు నాయనా! రేపే దీని బాబుకి చెప్పి ఈ ఎండకాలంలోనే మీకు మూడుముళ్ళు వేయిస్తాను" అంది భ్రమరాంబ కొడుకుని కోడల్ని మురిపంగా చూసుకుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS