"బావుందా?" అడిగింది.
"ఆ!"
"ఏమిటి సూపా? నీ సవతా?" అనడిగింది.
నేను షాక్ తిన్నాను.
"నేను రాగానే చూశాన్లే! ఫరవాలేదు. ఇలాంటి వాటన్నిటికీ నీ గుండె తట్టుకోవాలి. అంటే ఒకింత బండబారిపోవాలి. అప్పుడు ఏ స్పందనా వుండదు" అంది.
నా కన్నీళ్ళు ఇంక ఆగలేం అంటూ బయటికి దూకాయి.
"ఒద్దే....సూప్ లో ఉప్పు ఎక్కువయితే బావుండదు. కన్నీళ్ళు కార్చకు! పైగా కాస్త రేషన్ గా వాడడం నేర్చుకో అవి నిత్యావసర వస్తువులు కదా" అంది.
నేను బాధగా చూశాను.
ప్రియంవదా, ఆనంద్ లేచి వెళుతున్నారు. అతను ఆమె చెప్పేది శ్రద్దగా వింటూ తల ఊపుతున్నాడు. ఆమె ఆగి అతని ముక్కు పట్టిఊపి ఏదో అని నవ్వుతోంది.
అంత చనువుగా నేను జీవితంలో అతనితో ప్రవర్తించలేనేమో!
"భోజనం చెయ్యి ఏం చెయ్యాలో తర్వాతాలోచిద్దాం" అంది మాధవి.
"ఏం చెయ్యగలం?" నిస్పృహగా అన్నాను.
"కోర్టుకి ఎక్కచ్చు!" వెంటనే చెప్పింది.
"ఆ!"
"భార్యకానీ భర్తకానీ శారీరకమైన అవసరం పార్టనర్ కి తీర్చకుండా వేరొకరితో తీర్చుకుంటున్నట్లయితే కేసుపెట్టి నష్టపరిహారం పొందవచ్చు!" అంది.
కన్నీళ్ళతో దాని మొహంలోకి చూస్తున్న నాకు ఒక విషయం స్ఫురించి నవ్వొచ్చింది. చిన్నగా నవ్వుతున్న నేను పొలమారేదాకా నవ్వాను.
మాధవి భయంగా చూసింది. నాకు పిచ్చెక్కిందేమోనని దానికి అనుమానం వచ్చినట్లుంది.
"ఏమైందే?"
"కోర్టు నష్టపరిహారం డబ్బు రూపంలో కట్టిస్తుందా లేక..." అంటూ మళ్ళీ నవ్వాను.
అది నావైపు జాలిగా చూస్తుండిపోయింది.
* * *
బెడ్ లైట్ వెలుగు డిమ్ గా వెలుగుతోంది. మంచంమీద వాలుగా పడుకుని ఆనంద్ ఏదో మేగజైన్ చదువుతున్నాడు. దానిపేరు 'టైమ్' అని వుంది. ఔను అతని టైమ్. నేను 'మిర్రర్' మేగజైన్ చేతిలోకి తీసుకుని అతని పక్కగా వెళ్ళి పడుకున్నాను.
అతను ఒకసారి తలతిప్పి నావైపు చూసి మరింత పక్కకి జరిగి పడుకొన్నాడు.
"ష్....అబ్బా!" నేను పైటకొంగు తీసి విసురుకున్నాను. లోనెక్ జాకెట్ లోంచి అందాలవైపు చూసుకుంటే నాకే ఎలాగే అయింది. పుస్తకం పక్కన పడేసి ఒళ్ళు విరుచుకున్నాను. చీర నెమ్మదిగా మోకాళ్ళదాకా పైకి జరిగింది. అలాగే కళ్ళు మూసుకున్నట్లు పడుకున్నాను.
ఆనంద్ లేచి రిమోట్ చేతిలోకి తీసుకుని టీవీ ఆన్ చేసాడు. అర్ధరాత్రి అవుతోంది. ఏవేవో ఛానెల్స్ మార్చి చూస్తున్నాడు.
నేను నిద్రలో జరిగినట్లుగా అతనికి దగ్గరగా జరిగాను. నా శ్వాస అతని చెంపకి తగిలేటట్లుగా పడుకున్నాను. అతనికెలా వుందో కానీ నాకయితే కొలిమిలో పెట్టినట్లు శరీరమంతా ఆవిర్లు రాసాగాయి.
అతని చెయ్యి నా నడుంమీద పడింది.
నేను కళ్ళు మూసుకునే అతని ముఖంవైపు తిరిగాను.
అతని పెదవులు ఆత్రంగా నా పెదవులకి హత్తుకున్నాయి. నాకు ఉక్కిరిబిక్కిరి అనిపించింది. అయినా ఎంతో బావుంది. అతని చేతులు చాలా మొరటుగా శరీరంలోని ప్రతి అణువుని నలిపేస్తున్నాయి. అతని పన్ను నా పెదవిలో కసుక్కున దిగింది. రక్తం వుప్పగా నాలికకి తగిలింది. అయినా ఇంకా అతను అలాగే నా రక్తాన్ని పీల్చేస్తే బావుణ్ణుననిపిస్తోంది!
తొలి సంగమం మృదువుగా హాయిగా..... ప్రశాంతంగా వుండాలని ప్రతి ఆడపిల్లా కోరుకుంటుంది. కానీ ఇదేమిటి నేనిలా అతను నన్ను హింసించాలని కోరుకుంటున్నానూ!
అతను పూర్తిగా అలిసిపోయినట్లు రొప్పుతున్నాడు.
నాకైతే నా శరీరం మొత్తం నా నుండి విడిపోయినట్లుగా వుంది ఎక్కడయినా ముట్టుకుంటే చాలా నెప్పిగా వుంది.
ఆనంద్ లేచి వెళ్ళాడు.
నేను మిర్ర్ మేగజైన్ లోంచి పడిన మాధవి ఉత్తరం తీసి ముద్దు పెట్టుకున్నాను.
నా మొగుడ్ని నేను సక్సెస్ ఫుల్ గా షెడ్యూల్ చేయగలిగాను. తృప్తిగా పడుకున్నాను.
మర్నాడు ఆనంద్ నిద్ర లేచేసరికి స్నానం చేసి ప్రత్యేకంగా తయారయ్యి కాఫీ తీసుకెళ్ళి అందించాను.
అతను కాఫీ అందుకోలేదు.
"ఇవాల్టినుండీ నువ్వు వేరే బెడ్ రూంలో పడుకో!" అన్నాడు.
నాకు రోషం వచ్చింది. "ఏం? రాత్రి చేసిన పనికి ఫీలవుతున్నారా?" అన్నాను.
"ఔను! మొదటి రాత్రే చెప్పాను. అలాంటిదేం వుండదని. అయినా నువ్వు వినలేదు?" అతని గొంతులో నిష్ఠూరం.
"నేనేం చేశాననీ? మీరేగా టెంప్ట్ అయిందీ?" అన్నాను.
అతను అక్కడినుండి వెళ్ళబోతుంటే-
"కాఫీ తాగి వెళ్ళండి" అన్నాను.
"చూసావా ఒక్క రాత్రికే నామీద నీకు ఎంత అధికారం వచ్చేసిందో?" అనేసి వెళ్ళిపోయాడు.
నాకు చాలా ఉక్రోషం వచ్చింది. హక్కుగా నేను పొందవలసినదాన్ని ముస్టేసినట్లుగా వేసి, పైనుండి ఇలా అంటాడేమిటి? ఇతన్ని ఎలా నా దారికి తెచ్చుకోవాలీ? నాకు రాత్రింబవళ్ళు ఇదే ఆలోచనై పోయింది.
ఆనంద్ వేరే గదిలో పడుకుంటున్నాడు.
రోజులు గడిచిపోతూనే వున్నాయి.
అమ్మమ్మకి బాగా సుస్తీచేసి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆనంద్ పేరే ఆవిడ కలవరించింది.
ఆనంద్ ని పట్టుకోవడం నాకు చాలా కష్టమయిపోయింది. ఆఫీసులో లేడు. అతని సెల్ ఆఫ్ లో వుంది. చివరికి ధైర్యంచేసి ప్రియంవద ఇంటికి ఫోన్ చేసాను.
ప్రియంవదే తీసింది.
"ప్రియా హియర్" చాలా స్టయిల్ గా అంది.
"నేను....నేను ఆనంద్ భార్యని" మొదటిసారిగా ఆమెతో మాట్లాడటం వలన తడబడ్డాను.
"నువ్వా? ఏమిటీ?" అంది. ఆమె అలా ఏకవచన ప్రయోగం చేసినా నాకు ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఆమె నాకంటే చాలా పెద్దది.
