Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 6

 

        "అవును ప్రతాప్. నాయుడితో మా అగ్రిమెంట్- మిమ్మల్ని ట్రాన్స్ ఫర్ చేయడం వరకే అని మీతో చెప్పాము. నెలరోజుల తరువాత మిమ్మల్ని చంపెయ్యడం ఆ అగ్రిమెంట్ లో ఒక భాగం అని చెప్పలేదు. అది చెప్పడానికే వచ్చాను."   
    రాణా ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆమె అంది- "ఎలాగో ఒకలా మా పని పూర్తి చేసుకోవాలన్న ఆశతో మీ ఇద్దరిమధ్యా ఈ సంధి కుదిర్చామే తప్ప- కేవలం మీ ట్రాన్స్ ఫర్ తో నాయుడి కసి చల్లారుతుందా? మీ మీద అతడు బాగా పగబట్టి వున్నాడు. ఇక్కడ కాకుండా తన వూళ్ళో అయితే మిమ్మల్ని చంపడం సులభం అని సలహా ఇచ్చింది నేనే."    
    అతడు విచలితుడై - ఆమెవైపు నమ్మశక్యం కానట్టు చూస్తూ "అంత గొప్ప సలహా ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మరి ఇక్కడకు వచ్చి నాకీ విషయం ఎందుకు చెపుతున్నారు?" అని అడిగాడు.    
    "నేనా సలహా ఇచ్చే సమయానికి మిమ్మల్ని చూడలేదు కాబట్టి."    
    చాలా చిన్న వాక్యం అది. బాణంలా తగిలింది. అతడు చివుక్కున తలెత్తాడు.    
    ఆమె గుమ్మం దగ్గర వెనుదిరుగుతూ అంది- "నేనో అద్భుతమైన నటిని అని మీ తమ్ముడి లాటివాళ్ళు అంటూ వుంటారు. నటనలో జీవిస్తాను. జీవితంలో నటిస్తాను అని మీ అందరికీ తెలుసు. మనసు పెట్టి నటిస్తానే తప్ప మనసుతో నటించనని మాత్రం ఎవరికీ తెలీదు."    
    ఆమె నీడ చీకట్లో కలిసిపోయింది. అతడు అలాగే కూర్చుండిపోయాడు. మధ్యాహ్నం తను మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. ఆ సంభాషణకి 'కామాయే' గానీ, ఫుల్ స్టాప్ అయినట్టు లేదు.    
    వడివడిగా బయటకొచ్చాడు. మాట్లాడవలసింది మిగిలిపోయింది.    
    డ్రైవర్ లేడు. ఆమే స్టీరింగ్ దగ్గర కూర్చుని వుంది.    
    అతడు రావడం చూసి ఆమె కారు స్టార్ట్ చేయకుండా ఆపి "థాంక్స్ చెప్పడానికొచ్చారా?" అంది.    
    "కాదు రైల్వేస్టేషన్ వరకూ లిఫ్ట్ ఇస్తారేమోనని అడగటానికొచ్చాను. మీరేమీ భయపడరు కదా?" అన్నాడు ఆమె తటపటాయించడం చూసి కవ్విస్తున్నట్టు.    
    "అటువంటిదేమీ లేదు. పదండి-"    
    అతడు లోపలికి వెళ్ళి పెట్టె, బెడ్డింగ్ కార్లో పెట్టాడు. ఆమె కారు స్టార్ట్ చేస్తూ "మిమ్మల్ని తీసుకు వెళ్ళడానికి మీ జీపు రాదా?" అంది. "పన్నెండున్నరకి రమ్మన్నారు. అయినా ఇంత మంచి కంపెనీ వుండగా ఇక ఆ జీపెందుకు?"    
    ఆమె చివుక్కున తలతిప్పి అతనివైపు చూసింది. అతడు నవ్వేడు. కారు కదిలింది.
    అతనన్నాడు- "నాయుడి చేతులకి నేను బేడీలు వేసింది పదిమందీ చూస్తూ వుండగా! అంతటి అవమానాన్ని అతడు దిగమ్రింగి వూరుకోడని నాకు తెలుసు. దానికి శిక్షగా మీరు 'ట్రాన్స్ ఫర్' అనగానే నాకు అనుమానం వచ్చింది, మీరప్పుడు చెప్పలేదు. కాబట్టి నేనూ చెప్పలేదు. ఇప్పుడు చెప్పారు కాబట్టి నేనూ చెపుతున్నాను."
    ఆమె నుమానంగా "ఏమిటది?" అని అడిగింది.    
    "ఫ్రెంచిలో ఒక సామెత వుంది. "నీ శత్రువుని ఎంతసేపు నొక్కిపట్టి వుంచాలంటే అంతసేపు నువ్వూ వంగొని వుండాలి" అని! అంటే అంత టైమ్ మనకీ వృధా అన్నమాట. మా వాళ్ళతో నేనామాటే చెప్పాను. ట్రాన్స్ ఫర్ కి నేను వప్పుకున్నది కూడా అందుకే నన్నెలా చంపాలా అని నాయుడు ఇంతకాలం ఆలోచిస్తూ సమయం వేస్టు చేస్తున్నాడు. అతడి చేతులకి బేడీలు వేసిన మరుక్షణం నుంచీ నేను రంగంలోకి దిగాను. అతడి గురించి మొత్తం ఎంక్వయిరీ చేశాను. ఒకప్పుడు అనామకుడుగావున్న నాయుడు ఇప్పుడు లక్షాధికారి ఎలా అయ్యాడు? అతనెందుకు పదిరోజులకి ఒకసారి ఎస్.పురం వెళ్తున్నాడు? వెళ్ళినప్పుడల్లా ఎందుకు అరవింద్ చౌరసియాని కలుసుకుంటున్నాడు?"    
    ఆమె చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి. మొహంనిండా చెమటలు పట్టాయి. ఒకప్పుడు ఆమె భర్త ఆమెని నాగుపాము అనుకున్నాడు. ఆ విధంగానే ఆమె తన పేరు సార్ధకం చేసుకుంటూ ఎంతో మందిని ఆడించింది. కానీ ఇప్పుడు తన ప్రక్కనున్న ఇన్ స్పెక్టర్ ని చూసి మొదటిసారి భయపడుతోంది. నాయుడు తాలూకు సంఘటన జరిగి వారంరోజులు కూడా కాలేదు. అప్పుడే ఈ ఇన్ స్పెక్టర్ ఇన్ని విషయాలు కనుక్కున్నాడు. ముఖ్యంగా-    
    అరవింద్ చౌరసియా గురించి ప్రస్తావిస్తున్నాడు.    
    అ....ర....విం....ద్..చౌ.... ర.....సి....యా    
    ఆమె తన మొహంలో భావాలు దాచుకోవడానికి ప్రయత్నిస్తోంది. రాణా చెప్పుకు పోతున్నాడు.    
    "నా అదృష్టం బావుంది. నన్ను మీరు సరిగ్గా ఆ అరవింద్ చౌరసియా వున్న వూరుకే ట్రాన్స్ ఫర్ చేశారు. థాంక్స్ నాయుడు నన్ను చంపడానికి నెల రోజులు పథకం వేస్తున్నాడు. కానీ నేనింకో ఇరవై తొమ్మిది రోజుల్లోనే అతడి డొంక కదుపుతాను. థాంక్స్  స్టేషన్ వచ్చింది. ఇక కారు ఆపుతారా?"    
    ఆమె అప్రయత్నంగా కారు ఆపింది. అతడు సామాను దింపుకుంటూ అన్నాడు.    
    "ప్రతీ యుద్ధంలోనూ ఒక రాజనీతి వుంటుంది. ఇరుపక్షాలూ దాన్ని పాటించాలి. నా చావు విషయం మీరు నాకు చెప్పారు. దాన్ని నేను రహస్యంగా వుంచుతాను. అలాగే నేను చేస్తున్న ఎంక్వయిరీ విషయం కూడా మనిద్దరి మధ్యే వుండాలి. ఆ రాజనీతిని మీరు పాటిస్తారనే ఆశిస్తున్నాను. మీకు మరో మారు కృతజ్ఞతలు."    
    అతడు వెళ్ళిపోయాడు.    
    దూరంగా కూత వినిపిస్తోంది.    
    రైలు వచ్చి స్టేషన్ లో ఆగింది.    
    అతడిని ఎక్కించుకుని కదిలింది.    
    ఆమె ఇంకా అలాగే కార్లో కూర్చుని వుండిపోయింది. ఆమె శరీరంలో రక్తం అంతా ఎవరో పిండేసినట్లు తెల్లగా పాలిపోయింది.   
    రేపు మధ్యాహ్నానికి ఈ రైలు "తన" ఊరు చేరుతుంది.    
    థానే అతడిని తన వూరు ట్రాన్స్ ఫర్ చేయించుకుంది. జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక మొగవాడిని చూసి చలించింది. అదే తను చేసిన తప్పా?    
    అందుకు తాను పెద్ద "ఖరీదు" చెల్లించబోతుందా?    
    అతడు దిగగానే అరవింద్ చౌరసియా గురించి నిశ్చయంగా వాకబు మొదలుపెడతాడు.
      ఇతడి ఎంక్వయిరీ నాయుడితో ఆగిపోతే బావుండును.    
    ఆగక.... పో....తే?    
    తన సామ్రాజ్యంలోకి అనధికారంగా ఒక ఈగ ప్రవేశించినా అరవింద్ చౌరసియా క్షమించడు. రాణా (నాయుడు అనే) తీగె పట్టుకుని వెళ్తున్నాడు. డొంకవైపు కాదు ఆక్టోపస్ వైపు.

                                                                   2    

    "మజ్జిగ తీసుకుంటారా సార్?" అన్న మాటలకి ఆలోచన్ల నుంచి తెప్పరిల్లాడు రాణా వద్దన్నట్టు తలూపాడు.
    ట్రైన్ వేగంగా వెళ్తూంది. దిగవలసిన వూరు రావడానికి ఇంకా గంట టైముంది.    
    తను ఇన్ స్పెక్టర్ నని చెప్పాక పాప తల్లి దగ్గర కూర్చుంది. ఆవిడ తనవైపు ప్రార్ధనా పూర్వకంగా చూస్తూ వుండడంతో, "ఆయన్ని ఎందుకు లాకప్ లో పెట్టారు?" అని అడిగాడు.    
    "తెలీదండీ-"    
    "ఆయన ఏం చేస్తుంటారు"    
    "జర్నలిస్టు"    
    "ఏ వూళ్ళో?"    
    ఆమె చెప్పింది. అతడు ఆశ్చర్యంగా, "మరి ఆ వూళ్ళో అరెస్ట్ చేయడం ఏమిటి?" అన్నాడు.    
    "ఆయన ఏదో పనిమీద ఈ వూరొచ్చారు. ఇక్కడ అరెస్ట్ చేశారట."    
    "ఏ పనిమీద?" పోలీసుల కుండే స్వభావ సిద్దమైన మనస్తత్వంతో ప్రశ్నలు వేస్తున్నాడు అతడు.    
    "తెలీదు. ఏదో వ్యాసం వ్రాస్తున్నారు ఆయన. ఆ పనిమీద ఈ వూరు వెళ్తున్నాననీ, నాలుగు రోజుల్లో తిరిగి వస్తాననీ చెప్పారు. మధ్యలో ఇది జరిగింది. వాళ్ళ నాన్నగారిది ఆ వూరే. ఆయన టెలిగ్రాం ఇవ్వడంతో మేం వెళ్తున్నాం."    
    "ఆయన దేనిమీద వ్యాసం వ్రాస్తున్నారు?"    
    "పేరు గుర్తులేదు. ఫుట్ పాత్ మీద బ్రతికే వాళ్ళపై అనుకుంటా"    
    "దాని గురించి ఆ వూరు వెళ్ళటం ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు.    
    "తెలీదు కానీ వెళ్ళే ముందురోజు మాత్రం చాలా పరధ్యానంగా వున్నట్టు కనిపించారు."    
    రాణాకి రాజాచంద్ర అనే కుర్రవాడు గుర్తొచ్చాడు. తను ముందు పనిచేసే వూళ్ళో ప్రతిరోజూ ప్రొద్దున్నే పోలీస్ స్టేషన్ కి టీ, టిఫిన్ తీసుకు వచ్చేవాడు. రాత్రి ఒంటిగంట వరకూ హోటల్లో పనిచేసి, హోటల్ బయటే ఫుట్ పాత్ మీద పడుకునేవాడు. అకస్మాత్తుగా వాడు కనిపించడం మానేసేడు. యజమానిని అడిగితే, "వీళ్ళింతె సార్ గాలి లాటివాళ్ళు ఇంకొకచోట కాస్త మంచి పని దొరికితే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు." అన్నాడు. నిజమేనేమో అర్ధరాత్రి వరకూ పని. మళ్ళీ తెల్లవారు ఝామునే లేచి గిన్నెలు కడుక్కోవడంతో దినచర్య ప్రారంభం చలిలో, వర్షంలో, తుఫానులో కూడా హోటల్ బయట అరుగుమీద పడుకోవాలి. ఇలాటి బ్రతుకుల మీద వ్యాసం.    
    'సారే జహాసే అచ్చా' అన్న టైటిల్ పెడితే బావుంటుందా?

    'ప్రియభారత జనయిత్రీ' అంటే బావుంటుందా?    
    అతడు వాళ్ళని ఓదార్చడం కోసం "నేను ఇన్ స్పెక్టర్ గా వెళ్ళేది ఆ పోలీస్ స్టేషన్ కే. విషయం ఏమిటో చూసి విడిపిస్తాన్లెండి" అన్నాడు. ఆ మాత్రం హామీకే వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.    
    "ఆయన పేరేమిటి?" అని అడిగాడు.    
    "భరత్."    
    అతడు కాస్త ఆశ్చర్యపోయాడు. సారే జహాసే అచ్చా- రచయిత భరత్- సబ్జెక్టు - ఫుట్ పాత్ మీద బ్రతుకులు.    
                                              *    *    *    
    రైలు దిగి రిక్షా ఎక్కి మంచి లాడ్జీకి తీసుకెళ్ళమన్నాడు. రిక్షా వెళ్తూ వుండగా సంభాషణ కలిపాడు. ఆ అయిదు నిముషాల్లోనూ రిక్షావాడు లాడ్జింగుల్లో బ్రోతల్స్ నుంచీ వేదాంతం వరకూ మాట్లాడాడు. ఆ వూళ్ళో రెండు పార్టీలున్నాయి. పులిరాజు, నరసింహం చెరొక పార్టీకి ప్రతినిధులు నరసింహనాయుడు ఎమ్మెల్యే అతడి పార్టీయే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో వుంది. పులిరాజు తక్కువాడేమీ కాదు. అతడు పార్లమెంటు మెంబరు. ఆ పార్టీ సెంట్రల్ లో అధికారంలో వుంది.    
    చాలా ఆకస్మాత్తుగా జరిగిందా సంఘటన! కిళ్ళీ కొట్టు దగ్గర నలభై ఏళ్ల వ్యక్తి సిగరెట్లు కొనుక్కుని వస్తున్నాడు. ఒక ఇంటి పక్కనుంచి ఇద్దరూ, మరో సందులోంచి ఇద్దరూ కర్రలతో అతడివైపు దూసుకొచ్చి దిగ్బంధం చేశారు. ఆ వయసులో కూడా అతడు అలా పరుగెడతాడనుకోరు ఎవ్వరూ.    
    జువ్వలా పరుగెత్తాడు.    
    వాళ్ళూ అతడి వెనకాల వెంటబడ్డారు.    
    రాణా రిక్షా దిగి అటు వెళ్ళేసరికే ఆ వ్యక్తిమీద కర్రలు పడ్డాయి. రక్తపు మడుగులో కూలిపోయాడు.    
    క్షణాల్లో వీధి నిర్మానుష్యమైపోయింది.    
    కిళ్ళీ కొట్టువాడు తలుపులు దింపేసేడు. రోడ్డు కిరువైపులా ఇళ్ళవాళ్ళు తలుపులు వేసుకున్నారు. రిక్షావాడు ఎప్పుడో వెళ్ళి పోయాడు. దూరంగా మలుపులో బండి ఒకటి కనిపిస్తుంది. అటు పరుగెత్తి "తొందరగా ఆ వీధిలోకి పోనీ" అన్నాడు.    
    "ఎందుకు బాబూ"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS