ప్రేమిస్తున్నానని చెపితే వెనక్కి తగ్గడం సహజమైతే అయివుండొచ్చుగానీ ఈ కాలం అమ్మాయిలు మర్యాదగా, "హలో" అని పలకరిస్తే, తిరిగి మర్యాదగా "హలో" అని జవాబు ఇవ్వడం వరకూ ధైర్యం చేయగలరని అనుకుంటున్నాడు బాలూ. కానీ ఈమె విషయం దానికి పూర్తిగా విరుద్దంగా వుంది. ఆమె నడక వేగం చూస్తూ వుంటే అతనేదో ఆమెని రేప్ చేసేవాడిలాగా కనబడుతున్నట్టు వుంది. అతని అహం దెబ్బతిన్నది.
"మాది ఈ కాలేజీయే! పోటీలో మీ ముందర గిటార్ వాయించాను."
తెలుసన్నట్లు ఆమె తల వూపింది.
"మీలాంటివాళ్ళు పోటీలో వున్నారని నాకు తెలీదు. తెలిస్తే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాయించి ఉండేవాణ్ణి."
ఆమె మాట్లాడలేదు.
"కొద్దిగా క్లాసికల్ టచ్ యిచ్చి తర్వాత పాప్యులర్ మ్యూజిక్ వాయించడం మంచి టెక్నిక్ మీకు మాస్ సైకాలజీ బాగా తెలుసనుకుంటాను" సంభాషణ కొనసాగించటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. లాభం లేకపోయింది. ఆమె బేరం అడక్కుండానే రిక్షా ఎక్కింది.
"మీది ఉమెన్స్ కాలేజీ కదూ!"
ఆమె అస్పష్టంగా తలూపింది.
ఎవరో బంధువుని రిక్షా ఎక్కించి జాగ్రత్త చెప్పినట్లు మొహం లోపలికి పెట్టి "మీ పేరు తెలుసుకోవచ్చా" అని అడిగాడు.
మొట్టమొదటిసారి మాట్లాడుతూ తన పేరు చెప్పింది.
"సౌదామిని".
3
"ఏ అమ్మాయీ నిన్ను ప్రేమించదని నా ఉద్దేశం" అన్నాడు అహమ్మద్. బాలు సౌదామిని విషయం చెప్పగానే.
"ఎందుకు?" అన్నాడు కోపాన్ని అణుచుకుంటూ.
"కొంచెం ఆడంగితనం వున్న అబ్బాయిల్నే వాళ్ళు ప్రేమిస్తారు."
"అంటే?"
సుబ్బారావు కల్పించుకుంటూ, "ఏకాంతంలో వాళ్ళ గొప్పతనాన్ని అంగీకరిస్తూ తన మానసిక బలహీనతల్ని ఒప్పుకున్నట్లు నటించేవాడిని వాళ్ళు ఇష్టపడతారు. ఇలాంటి భావుకత్వపు మాటలు నువ్వు చెప్పావు కాబట్టి నీలాంటి వాణ్ణి ఏ అమ్మాయి ప్రేమించదు."
"నాన్సెన్స్" అన్నాడు బాలు. "కొంచెం తెలివైన ప్రతీ ఆడదీ రీజనల్ థింకింగ్ వున్న మగాడినే కోరుకుంటుంది. అసలు మగవాడే ఆడదాని చుట్టూ ఎందుకు తిరగాలి? అతడి ఆశయం పెళ్ళి అనే పవిత్రమైన గమ్యం అయితే దానివల్ల అతడికి ఎంత లాభం వుందో, ఆమెకి అంతే లాభం వుంది. అటువంటప్పుడు ఆమె వెంటపడి దేబెరించుకుంటూ తిరగటం దేనికి?"
"కాని నువ్వామెకు నచ్చాలికదా! నీలాంటివాళ్ళు కోకొల్లలు."
"ఆమెకి నేను నచ్చాలి! అనటం వరకూ ఒప్పుకుంటాను. కానీ నాలాంటివాళ్ళు కోకొల్లలు అంటే ఒప్పుకోను. 'కోప్పడే తండ్రీ, ఏడ్చే తల్లి నాకు లేరు. కట్నం ప్రసక్తి లేకుండా ప్రేమ పేరిట మోసం చెయ్యకుండా మనిద్దరం కలసి ఒక చిన్న ఇంటిని నిర్మించుకుందాం' అంటే ఏ అమ్మాయి మెచ్చుకోకుండా వుండదు?"
సుబ్బారావు నవ్వి "ఆలూలేదు, చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించనే లేదు. అప్పుడే పెళ్ళి, కట్నం ఇవన్నీ ఏమిటిరా?" అన్నాడు.
"అంటే నేను ఓడిపోతానంటావా?"
ఇద్దరూ ముక్తకంఠంతో "నిశ్చయంగా!" అన్నారు.
బాలూ లేచి నిలబడి "ఎంతెంత పందెం?" అన్నాడు.
"మీ పెళ్ళికి మంగళసూత్రం మేం చేయిస్తాం. మరి నువ్వు ఓడిపోతే?"
"నేను నా మ్యూజిక్ కాంపోజిషనూ, గిటారూ అన్నీ పూర్తిగా మానేస్తాను."
వాళ్ళిద్దరూ ఒక్కసారిగా నోళ్ళు తెరిచి "నో! నో! ఇంత పెద్ద పందెం వద్దు" అని అభ్యంతరం పెట్టబోయారు.
బాలూ ఇంకేమీ వాదించకుండా లేస్తూ "మీరే అన్నారుగా నేను మెటీరియలిస్టుననీ" అన్నాడు. * * *
"అదీ జరిగింది!"
సౌదామిని ఇంకా విస్మయం నుంచి తేరుకోలేదు. బాలూ చెప్పటం కొనసాగించాడు.
"....కాబట్టి ఇప్పుడు నిర్ణయించుకోవలసింది మీరు. ఇలా నిలబెట్టి నన్ను ప్రేమిస్తావా? ప్రేమిస్తావా? అని అడగటం చాలా ఇరకాటమే అని నాకు తెలుసు. ఇబ్బందికరం కూడా. అయినా అసలు ప్రేమంటే ఏమిటి? మొట్టమొదటి చూపులో ఒక రకమైన ఇష్టం ఆకర్షణ ఏర్పడటం. ఆ ఆకర్షణే కలిసి తిరగ్గా తిరగ్గా ప్రేమగా మారుతుందంటారు. మన ప్రేమని వివాహంతోనే మొదలు పెడదాం. నా లాజిక్ మీరు అర్ధం చేసుకోండి. నేను వ్యక్తిగా అసలు మీకు నచ్చలేదంటే అది వేరే విషయం. కొంతమందిని చూస్తే అకారణంగానే అయిష్టం ఏర్పడవచ్చు. అలాంటిది నా పట్ల ఏర్పడితే మొహమాటం లేకుండా చెప్పేయండి. నేను దురదృష్టవంతుణ్ణనుకుని వెళ్ళిపోతాను. నేను చెప్పిందంతా మీరు అర్ధం చేసుకోవటానికీ, ఒక నిర్ణయానికి రావటానికీ కొంతకాలం పట్టచ్చు. తర్వాత కలుసుకోమంటే వచ్చి కలుసుకుంటాను."
ఆమె సమాధానం చెప్పకుండా చాలాసేపు వుండిపోయింది. తర్వాత కళ్ళెత్తి "ఇలా మీరింతకు ముందు ఎంతమంది అమ్మాయిల దగ్గర ప్రపోజ్ చేశారు?" అని అడిగింది.
కమ్చీతో కొట్టినట్టయింది బాలూకి- ఈ అమ్మాయికి జీవితంపట్ల తనకన్నా ఎక్కువ అవగాహన వున్నట్లుంది. గొంతు సవరించుకుని నెమ్మదిగా అన్నాడు, "చూడండి. ఫస్టు క్లాసులు రాకపోయినా నేనెప్పుడూ ఫేలవలేదు. రాత్రి ఆరునుంచీ పదకొండు వరకూ నా మ్యూజిక్ తోనే సరిపోతుంది. ఇంతవరకూ నాకు మూడో దానికి దేనికీ టైమ్ దొరకలేదు. ఇంకో నెలలో చదువైపోతుంది. జీవితంలో సెటిల్ అవ్వచ్చు. సరిగ్గా ఇదే సమయానికి మీరు కనబడ్డారు. మీరు అడగవచ్చు "నేనంటే నీ కెందుకింత అభిమానం? అదీ ఏ మాత్రం పరిచయం లేకుండా పెళ్ళి చేసుకోవాలనేటంత బలంగా ఎందుకు క్షణాల్లో ఏర్పడింది" అని. మనతోపాటూ ఒక్క రత్నాన్ని మాత్రమే తీసుకెళ్ళగలిగే స్కోప్ వున్నప్పుడు గదిలోంచి బయటకు వస్తూ మనకి బాగా నచ్చినదాన్ని ఒకదాన్ని ఏరుకుంటాం అది గాజురాయయితే మన దురదృష్టమంతే! భాగస్వామి విషయంలో కూడా అంతే-"
ఆమె మాట్లాడలేదు.
"నా మాటలు మరీ పచ్చిగా వున్నట్టున్నాయి."
"లేదు లేదు" అందామె.
"మీకు నేనే మాత్రం నచ్చి మీరు 'ఊ' అన్నా, నా భార్యగా మీకే కష్టమూ రాకుండా చూసుకుంటాను సౌదామినీ!"
"మన వివాహం జరగదు!"
"ఏం?"
"జరగదంతే!"
"ఎందుకని?"
ఆమె మాట్లాడలేదు.
"మీరింతకుముందు ఎవర్నయినా ప్రేమించారా?"
"లేదు లేదు" అందామె కంగారుగా.
"మరి నేనంటే మీకు ఏ మాత్రం ఇష్టంలేదా?"
"అబ్బే...." అంటూ ఏదో చెప్పబోయి ఆమె సంశయిస్తూ ఆగిపోయింది ఆ ఒక్క తాటాయింపులోనే ఆమె మనసు అతనికి అవగతమయింది.
"నా స్నేహితులన్నట్టు మీకేమీ ఆలోచించుకోవటానికి స్కోప్ ఇవ్వని మెటీరియలిస్టుగా కనబడుతున్నావా?"
"లేదు. మీ ప్రాక్టికాలిటీ నాకెంతో నచ్చింది."
"పోనీ మీకు ఇప్పట్లో వివాహం చేసుకోవటం ఇష్టంలేదా? ఆశ్రమమూ, ఆధ్యాత్మిక చింతనా మానను అటువైపుందా?"
ఆమె నేలవైపు చూడసాగింది.
"చెప్పండి సౌదామినీ! పోనీ కొంతకాలం ఆగమంటే ఆగుతాను."
"వద్దు వద్దు" అందామె కంగారుగా. "ఎన్నో కోణాల్నించి మీరాలోచించారు. ఎంతో నిజాయితీగా ఇవన్నీ అడిగారు. ప్రేమ సంగతలా ఉంచండి. ఈ వివాహం జరగదు. జరగదంతే!"
"ఎందుకు?" రెట్టించాడు. "మీరు నన్ను ప్రేమించటం లేదా ....? అని అడగను. "మీరు నన్ను ప్రేమించలేరా" అని అడుగుతాను."
"మీరు వివాహం ఆలోచన మానుకోవటానికి 'నేను మిమ్మల్ని ప్రేమించటంలేదు' అన్న సమాధానమే కావలసివస్తే మీరలాగే అనుకోండి. నా కభ్యంతరం లేదు."
"అబద్దం" అరిచాడు. "మీకెందుకో వివాహం ఇష్టంలేదు?"
ఆమె మాట్లాడలేదు. మౌనంగా అక్కడినుండి వెళ్ళిపోయింది. ఆమె ఏడుస్తూ వెళ్ళిపోతూందని మాత్రం అతని కర్ధమైంది.
* * *
"పందెం ఓడిపోయావు బాస్! ఒప్పేసుకో."
"ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమేనని నా మనసు చెప్తోంది. కానీ ఎందుకో ఆ అమ్మాయి- వివాహం అంటే విపరీతంగా భయపడుతోంది. దీనికి కారణం ఆమె జీవితంలో జరిగిన ఏదో సంఘటన అన్నా అయివుండవచ్చు లేక పెరుగుతున్న వాతావరణమన్నా అయివుండవచ్చు."
"ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనని అంత నిశ్చయంగా ఎలా చెప్పగలవ్?"
"ఆ రోజు ఫంక్షన్ లోనే ఆమె నన్ను గమనించిందీ అన్నది నిర్వివాదాంశం. మీరు దీన్ని అహం అనుకోకపోతే కేవలం కళాకారులకే ఆ గమనింపు తెలుస్తుంది. నా ఉద్దేశ్యం కరక్టయితే ఆమె మానసికంగా చాలా ఒంటరిది."
"ఇంక వదిలిపెట్టేసెయ్ బాస్! అయిందేదో అయిపోయింది-" అన్నాడు సుబ్బారావు.
బాలూ లేచి నిలబడ్డాడు "ఏమీ అయిపోలేదు అసలిక్కడి నుండే ప్రారంభం అయ్యింది. ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె అంటే ముందుకన్నా ఎక్కువ ఇష్టం ఏర్పడుతోంది."
"అయితే ఏం చేస్తావ్?"
"నాకు సైకాలజీ అంతగా తెలీదు. కానీ ఆమెను చూస్తుంటే ఆమె అదో రకమైన న్యూనతాభావంతో బాధపడుతూంది అనిపిస్తూంది. మనసులో ఆప్యాయత వుండి, అది బైటికి చెప్పుకోలేని స్థితి. ఇలాంటివాళ్ళే ఎంతో మెటీరియలిస్టిక్ గా కనబడతారు. కొద్దిగా వేడి తగిలిందంటే అది కరిగిపోతుంది. ఆనకట్ట బ్రద్దలై ప్రేమ పొంగి పోరాలుతూ బయటికి వచ్చేసి అవతలివారిని చుట్టుముడుతుంది. ఆ అవతలివాడిని నేనే అవ్వాలనుకుంటున్నాను."
"అందుకని..."
"అందుకని ఆమె మనసు కరిగించే పని ఏదైనా చెయ్యాలి."
