వీణ, రవి ఇంట్లో అడుగుపెట్టారు ఆ పసిపిల్లతో!
వీణ లోపలికెళ్ళి, ఉప్పు తెచ్చి దిష్టి తీసింది పిల్లకి.
"అలా నవ్వకండి, ఎవరి దిష్టీ పిల్లకి తగలకుండా కాపాడుకోవాలి మనం" అంది చీర కుచ్చెళ్లు పైకి దోపుకుంటూ.
వంటింట్లో స్టౌ మీద నీళ్ళు కాగుతున్నాయి. బీరువాలోంచి ఉతికిన తుండుగుడ్డ తీసింది.
"ఇటివ్వండి"
పిల్లని వీణ చేతిలో పెడుతుంటే రవి చేతులొణికాయి. ఈ పిల్లని పెంచి పెద్దదాన్ని చేసి ఓ వ్యక్తిగా సమాజంలో బతికేలా చేయగలమా! అంత ఓర్పు, ధర్మం, న్యాయం, నిస్వార్ధం ఇలాటివి మరెన్నో మాకు ఆ దేవుడే ప్రసాదించాలి! సరదాగా జీవితం గడిపేయాలనుకునే వీణ ఇంత పెద్ద బాధ్యత నెత్తికెత్తుకుంది. ఇంతకీ ఆ పిల్ల చేసుకున్న పుణ్యం- ఇక్కడికొచ్చిందంతే!
రవి అప్రయత్నంగా గోడనున్న దేవుని పటం దగ్గరకెళ్ళి, నమస్కరించి చెంపలేసుకున్నాడు.
"చూడండి, ఎంత బావుందో ... పువ్వల్లే!"
పసిదానికి స్నానం చేయించింది. బాబు చొక్కా వేసింది.
ఒంటి నిండా పౌడరు పూసింది.
పాపని మంచం మధ్యలో పడుకోబెట్టి భార్యా- భర్త అటుఇటు పడుకున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు కాసేపు.
"వీణా... అసలు సమస్య ఇప్పుడు!" అన్నాడు రవి.
"సమస్యలు లేవు, ఏమీ లేవు" అంది పిల్ల వంక చూస్తూ.
"ఈ పిల్ల ఎవరని, ఎక్కడనుంచి వచ్చిందాని, ఎందుకు తెచ్చారని అడిగే వారుంటారుకదా! ఏం చెప్దామ్..?" అన్నాడు నెమ్మదిగా.
"భయపడుతున్నారా?" అంది నవ్వి.
"భయం కాదు" అన్నాడు రవి.
"ఉన్న విషయమే చెప్తాం. ఇందులో రహస్యమేమిటీ..?" అంది ధైర్యంగా.
"నిజమే... రాజీవ్ గుమ్మం ముందు వుంచారెవరో! రాజీవ్ భార్య అనాధ పిల్లని చూసుకోనంది. పోనీ.... అని జాలితో పిల్లని తెచ్చాం అంతే. ఇదేకదా నిజం!" అన్నాడు రవి.
"ఏమిటీ... మీ బాధ!" అంది వీణ.
"కాదు - మనం చేసే పనికి లోకానికి సమాధానం కూడా చెప్పాలి. ముఖ్యంగా మీ వదిన చూడను పొమ్మంటే మనం తెచ్చాము. మనం పిల్లని పెంచుతున్నామని తెలిస్తే మీ వదిన మన గురించి ఎన్నిరకాలుగా మాట్లాడుతుందో తెలుసుగా..! పైగా ఆవిడకీ, నీకూ పడదు. ఇన్ని ఆలోచించి..." ఏదో చెప్పబోయాడు రవి.
"మీరేమీ ఖంగారుపడకండి. ఓ మంచిపని చేయటానికి అంత భయపడితే ఎలా? నే చెప్తా ఎవరడిగినా - ఓ అనాధ పిల్లని తెచ్చి పెంచుకుంటున్నామని..! మానవత్వం దృష్టితో, ఇంకా మాట్లాడితే- 'మీకందరికీ అనవసరం... నా పిల్ల నా యిష్టం'- అంటాం!" అంది ఉత్సాహంగా పిల్ల జుట్టు నిమురుతూ వీణ.
వీణకి అంత వ్యక్తిత్వముందని, అంత ధైర్యముందని, అంత ఓర్పూ వుందని ఊహించని రవి ఆశ్చర్యపోయాడు. ఇంట్లో పనిచేసుకోటం, వినోద్ ని చూడటంతోనే అలసిపోతున్నానని, పనిపిల్లని చూడండని రోజూ చెప్పే వీణ- ఈరోజు ఇంత సాహసంగా, మాతృత్వం పొంగి పొర్లి పిల్లని గుండెలకి హత్తుకోటం ఎంతో అనందంగా అనిపించింది రవికి. నాలుగురోజులు చూసి, ఆ తర్వాత 'అబ్బా... నేను చూడలేను' అని ఏ ఆశ్రమంలోనో దింపమంటుందని భయపడుతున్నారన్న భయం ఆ క్షణాన తొలగిపోయింది. సినిమాలు, షికార్లు, పార్టీలు అంటూ కాలం గడపాలనుకొనే వీణలో ఇంతటి కరుణ, సేవాదృష్టి వున్నాయని అర్ధంకాగానే రవి-వీణని అభినందించకుండా వుండలేకపోయాడు.
"వీణా... నువ్వే మరో రూపంలో దేవతలా కనిపిస్తున్నావు నా కళ్ళకి! ఆర్తత్రాణ పరాయణురాలైన అమ్మవారిలా కనిపిస్తున్నావు... నిజంగా!"
వీణ ఫక్కున నవ్వింది. "ఒక్కమాట అర్ధంకావటం లేదు. ఆ భాషేమిటీ.... గోల! నన్ను దేవతని, అమ్మవారిని చేయకండి. నేను మనిషిని... అంతే! సరేకాని, ఆ లాగు యిటివ్వండి, అప్పుడే పక్క తడిపేసింది" అంది.
రవి బుట్టలో వున్న చిన్న లాగు తీసిచ్చాడు.
పాప కేరింతలు కొడుతోంది. దానికేం తెలుసు- ఏ అమ్మ అయితేనేం... దానికి కావలసింది- ప్రస్తుతం ఆకలి తీరటం! పాలసీసా నోట్లో పెట్టుకుని దిక్కులు చూస్తోంది.
స్కూటర్ ఆగిన చప్పుడవటంతో వీధిలోకి చూసాడు రవి.
"ఇంకా రాలేదేమో.... అనుకుంటున్నాం. దూడను తెచ్చుకుంటే చాలు-ఆవు అదే పరిగెత్తుకు వస్తుందని మన పెద్దలు చెప్పేమాట నిజం చేసావు నువ్వు" రవి అంటుంటే లోపలకొచ్చాడు రాజీవ్.
వీణ ఒళ్ళో వున్న పిల్లని గబుక్కున ఎత్తుకుని ముద్దాడాడు. 'ఎక్కడనించి ఎక్కడకొచ్చావ్ తల్లీ" అన్నాడు గుండెలకి హత్తుకుంటూ రాజీవ్.
నల్లని కళ్ళతో అటు ఇటు చూస్తోంది పిల్ల.
"వదినకి చెప్పావా.... పిల్ల నా దగ్గరుందని!" అంది వీణ.
"వదినకా..? చెప్పకూడదు. తెలిసిందంటే వచ్చి పిల్లని బయట విసిరేయగలదు"
"కానీ అన్నయ్యా..! తెలియకుండా వుంటుందంటావా?" అంది వీణ.
"తెలిస్తే అప్పుడే చూద్దాం ఏం చేయాలో! ఇప్పుడైతే ఎక్కడో పంపేశా... అన్నాను సుమతితో!" రాజీవ్ దీర్ఘంగా నిట్టూర్చాడు.
"రోజూ వస్తాను బావగారూ...మీరేమనుకోకూడదు. అంతే కాహ్డు-సుమతి మనసు మారుతుందని ఆశ వుంది. అదే జరిగితే ఈ చిట్టితల్లి నా దగ్గరే వుంటుంది. అంతదాకా మీరే తల్లీ, తండ్రి!"
రాజీవ్ మాటలకి ఉలిక్కిపడింది వీణ. అంటే.... ఒకవేళ సుమతి మనసు మార్చుకుంటే ఈ పిల్లని తీసికెళ్ళి పోతాడా?
"అన్నయ్యా..." ఆ మాట ఏదో చెప్పాలనుకునేలోగా రాజీవ్ స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.
రాజీవ్ ఇంటికొచ్చేసరికి భద్రకాళిలా అరుస్తోంది సుమతి.
గేటులోంచి ఎవరో తలొంచుకు వెళ్ళిపోతున్నట్టనిపించింది. హిస్టీరియాలాగా పెద్దగా కేకలు వేస్తూ అటూఇటూ తిరుగుతోంది. రాజీవ్ కి భయమేసింది.
సుమతికి ఏమైందీ..? తను ఇంట్లోంచి వెళ్ళేప్పటికీ, ఇప్పటికీ ఏమైందీ..?! తను లేనప్పుడు ఇంట్లోకెవరైనా వచ్చి...!! ఛీ, పాడు ఆలోచనలు!! ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ "సుమతీ... ఏమిటిది, ఎవరిమీద అరుస్తున్నావ్?" అన్నాడు.
భర్తని ఒక్క తోపు తోసింది. గుమ్మాన్ని పట్టుకు నిలబడ్డాడు.....లేకపోతే కిందపడి తల పగలాల్సిందే!!
"ఎవరొచ్చారో చెప్పు, ఏమైందో చెప్పు" అన్నాడు సుమతిని గదిలోకి తీసుకెళ్ళి పక్కమీద పడుకోబెట్టి.
రాజీవ్ మాటలకి కొంత సేద తీరినట్టయింది సుమతికి. లేచి లోపలకెళ్ళింది. ముఖం కడుక్కుంది. పౌడరు రాసుకుని, బొట్టు పెట్టుకుంది.
"ఎంత భయమేసిందో తెలుసా... అదొచ్చింది, నా పిల్ల ఏదీ.. అంటుంది"
"ఎవరూ..?" రాజీవ్ గొంతు మార్మోగింది.
"ఏమీ తెలియనట్టు అడుగుతారేం..? ఆ పిల్ల తల్లి!"
"ఏమిటీ... పిల్ల తల్లా? తల్లి బతికుందా..? అయ్యో... సుమతీ- ఎంత తప్పు చేసావూ...నేనొచ్చేవరకూ కూచోపెట్టలేకపోయావా?"
"ఏమిటీ? మీరొచ్చేవరకూ కూచోపెట్టాలా..? ఇంకానయం- అన్నం పెట్టి ఆదరించమనలేదు!"
"అవును, అన్నం పెట్టాల్సింది! సరే, ఇంతకీ...ఏమందీ?"
"ఏమో... మళ్ళీ వస్తే కాళ్ళు విరక్కొడతానన్నా! ఆ పిల్ల ఎక్కడుందో తెలియదు పొమ్మన్నా!"
"సుమతీ, సుమతీ... చాలా అన్యాయం చేశావు. ఇప్పుడెలా తెలుస్తుంది- ఆవిడ ఎక్కడుందో!"
"చాల్లెండి... నాటకాలు ఆపండి. దానికి మీ ఇల్లు తెలుసు, మీ పిల్లని మీకప్పగించింది అదీ మీకు తెలుసు. నే చెప్పాలా- దానిల్లు ఎక్కడుందో!" సుమతి గుడ్లు భగభగ మండిపోతున్నాయి.
"అదీ, మీరూ కలిసి ఆడుతున్న నాటకం కాదూ..!?"
రాజీవ్ నోట మాటరాలేదు. ఈ సుమతిని ఒప్పించడమెలాగా... అనే బాధకన్నా ఆ తల్లీ పిల్లల్ని ఎలా కలపగలడు తను..? అనే బెంగ ఎక్కువైపోయింది.
రాజీవ్ చాలా కోపంగా సుమతి దగ్గరికి వచ్చాడు.
"ఆఖరిసారిగా చెప్తున్నా... ఆ పిల్లని నేనూ, నువ్వూ ఒకేసారి చూసాం. ఆ తల్లి ఎవరో నాకు తెలియదు, నాకు లేని అక్రమ సంబంధం అంటగట్టి మహా పాపం చేస్తున్నావు. నా మాట విను. నీ మీదొట్టు-కేవలం మానవత్వంతోనే ఆ బిడ్డని కాపాడాలనుకున్నా...! ఇంకా నువ్వు నమ్మకపోతే, నేనే వెళ్ళిపోతా ఈ ఇల్లు వదిలి... నీ కర్మ నీది!!" -రాజీవ్ అంత కోపంగా వుండడం ఎప్పుడూ చూడని సుమతి గజగజ వణికిపోయింది.
నిజంగా భర్త ఎక్కడికైనా వెళ్ళిపోతే ఈ పిల్లాడిని పెట్టుకు బతకగలదా? అయినా-తన మూర్ఖత్వం ఏమిటీ... ఏదో గుమ్మంలో పడున్న పిల్లని కాపాడాలని అతననుకుంటే, ఇన్ని అపార్ధాలు తెచ్చిందే తను!! ఎందుకు..!
సుమతి మనసు క్షణాల్లో మారిపోయింది. పశ్చాత్తాపం మనసుని చుట్టేసింది. తను మాట్లాడే ఏ ఒక్కమాటకి అర్ధం లేదు, ఋతువు లేదు. ఆ తల్లిమీద తనకి విరోధమా..? ఆ పిల్ల మీద తనకి కసి! ఛీ... సుమతి కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి.
అంతలో గొల్లున పిల్లాడి ఏడుపు!
