"నీరజా మీ పిన్ని బొంబాయి వుందన్నావుగా ఆవిడని చూడాలనివుంది' అంది శారద.
"వెళదాంలే ఆవిడ చాలా బిజ్జీ మనిషి, ఓపట్టాన ఎవరికే దొరకదు. సంక్రాంతి సెలవులప్పుడు వెడదాం' అంది నీరజ.
వీధిలో పోస్టుమాన్ కేకతో శారద ఈ లోకంలోకి వచ్చింది ఉత్తరం గుమ్మంలో పడుంది. రామం దగ్గర నుంచి రెండురోజుల్లో వస్తున్నాడు, అక్కడ పనులు అవుతున్నాయి - అదీ విషయం. ఉత్తరం చేతిలోనే వుంది. శారద ముఖం వెలతెలపోయింది. రెండురోజుల్లో వస్తాడా. ఈ పదిహేనురోజుల్లో తనలో వచ్చిన మార్పు గమనిస్తే, తన ఆలోచనా ధోరణీ ఎంతమారిపోయిందో తెలుస్తే - శారద ముఖంలోనిఖంగారు గుర్తించింది నీరజ.
'ఏమైందీ' -
'మా వారు వస్తారు ఎల్లుండి'
"ఓ - మీ వారా - భయపడుతున్నావ్ దేనికీ -మెడబోసిగా వుందేమని అడుగుతే ఏం చెప్పాలి అనా. పెళ్ళయిన ఆడది ఇలా వుంటుందా అంటే ఏం చెప్పాలి అనా. మరేం భయపడకు నేనున్నానుగా. అతన్ని ఒప్పిస్తాను నువ్వు చేసిందాంట్లో తప్పులేదని - అతని గురించా నీ భయం ఎంత పిచ్చదానివి - ఇలా అయితే ఎలా బతకగలవ్ ఈ సంఘాన్నెదిరించి అతన్ని ప్రేమిస్తున్నావ్ - అతను నీ భర్త అంతే - ఈపై పై సూత్రాలు గాజులు, గొలుసులు అన్నీ సరదాలే - "నవ్వింది నీరజ"
'నీరజా -నాకు చాలాభయంగా వుంది' శారద ఉత్తరం కేసి చూస్తోంది.
* * *
4
లలిత రాసిన ఉత్తరం రామాన్ని చాలాకలవరపరచింది. "నువ్వు ఇక్కడ లేక పోతే పరిస్థితి చాలా తారుమారు అయిపోతోంది. ఉత్తరం అందగానే వచ్చేయి. వివరాలు వచ్చాక చెప్తా - రామం చేతిలో లలిత ఉత్తరం కదులుతోంది. తను శారదని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆమె స్వభావాన్ని అర్ధం చేసుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు. ఆమె పట్టుదలలు, పంతాలు క్షమించాడు. ఆఖరికి తన మనసు ఎంతో గాయపడినా, ఆడపిల్లవద్దని అబార్షన్ చేయించుకున్న శారదని ఎంతో నిగ్రహంతో క్షమించి ఆమెతో కలసి హాయిగా బతకాలనే ప్రయత్నంలో వున్నాడు తను. మరి శారద ప్రవర్తనలో మార్పు ఇంతవేగంగా ఎందుకొస్తోంది - అసలు నీరజ ఎవరూ - శారదకి నీరజకి అంత స్నేహం ఎప్పటి నుంచి మొదలైంది - రామం చేతిలో ఉత్తరం కదులుతోంది. నిజానికి ఇంకా పదిహేనురోజులు పనులున్నాయి - ఆ పనులన్నీ అలా ఆపేసి ఊరుబయలుదేరటానికి సిద్దమయి శారదకి ఉత్తరం రాసాడు రామం.
"అమ్మా పనులు నీ మీద వదిలివెడుతున్నా. అక్కడ చాలా ముఖ్యమయిన పనులున్నాయి. శారదకి ఒంట్లోబాగాలేదు. నేను వెళ్ళాలి. అన్నం తింటూ రామం తల్లితో అన్నాడు.
'అమ్మాయి ఆరోగ్యం ముఖ్యం. నువ్వెళ్ళు. ఇక్కడ పనులకేంలే అవి అలావుంటూనే వుంటాయి - అయినా అది ఒట్టి మనిషికూడా కాదు. అవసరమైతే ఇంట్లో పనులు కూడా నువ్వే చేయి. అమ్మాయిని ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి." అరవైఏళ్ళ తల్లిమాటలు వినిపించటంలేదు రామానికి. అన్నం చేదుగా గొంతులోకి దిగుతోంది. ఆ చేదునిజం అమ్మకి చెప్పకపోవటమే క్షేమం.
"అలాగే అమ్మా, అలాగే. అన్నం కూడా నేనే వండిపెడతాను సరేనా" లేచాడురామం బల్లముందునుంచి.
రామంతెల్లారే వస్తాడని శారదకి తెలుసు. పరిస్థితులు ఎంత చిత్రచిత్రంగా మారిపోతున్నాయో తల్చుకుంటే భయమేస్తోంది ఆ శారదకి. గాడ్రెజ్ తెరిచి భద్రంగా దాచిన చిన్న పెట్టి తీసింది. మిలమిలా మెరుస్తూ, పవిత్రంగా భావించబడే మంగళ సూత్రాలు, నల్లపూసలు, ఆ చిన్న పెట్టెలు ఒదిగి ఒదిగి వున్నట్టనిపించింది శారదకి. గుండెదడదడ కొట్టుకుంది. గబుక్కున సూత్రంగొలుసు మెళ్ళో వేసుకుంది. అద్దం ముందు నిలబడింది. రిజిష్టరాఫీసులో సంతకాలయ్యాక రామంతనని వెంటబెట్టుకుని బంగారువస్తువుల షాపులోకి, తీసుకెళ్ళటం. తను కోరి కోరి అందంగా వున్న ఒకేసైజు సూత్రాలు తీసుకోటం, అక్కడే ఆషాపులోనే బంగారపు గొలుసులో అవి వేసుకోటం, ఆ తర్వాత ఆ సూత్రాలగొలుసు రామం హోటల్ గదిలో తనమెళ్ళో వేయటం - అన్నీ కళ్ళముందునిల్చాయి. తనకి ఏ దయ్యమైనా పట్టిందేమో - లేకపోతే ఏమిటీ వింత ధోరణి ! - శారద తనను తానే ప్రశ్నించుకుంది. అలానే మెడలో సూత్రాల గొలుసుతోనే నిద్రపోయింది. మనసులోని సంఘర్షణను తట్టుకోలేని శారద అలసిపోయింది. ఏది తప్పు, ఏది ఒప్పు - మంచి చెడ్డలు నిర్ణయించేదెవరు. ఈ నిర్ణయాలు చేసేవాళ్ళంతా మంచివాళ్ళా, ఏమో!! ఈ అనంతమైన ప్రశ్నలకి సమాధానాలు ఎవరు చెప్తారూ శారదకి నిద్ర పట్టీ పట్టనట్లుగా, చిరాగ్గా వుంది. కలతనిద్రలో వుంది.
"ఇవిలేనపుడు అదెందుకూ" - ఎవరిదోగొంతు తన నుదుటనున్న బొట్టును లాగేస్తున్నారు - ఎవరూ, ఎవరూ "శారద అరుస్తోంది 'అయ్యో బొట్టులేని ఆడది శారద గబగబా మంగళ సూత్రాలు కళ్ళకద్దుకుంది "వీటితో నీకేంపని....ఇటియ్యి" -ఎవరూ ఎవరది రామంగొంతు వినిపిస్తోంది శారద చెవులకి......ఉలిక్కిపడిలేచింది. "శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం, భజేవాయుపుత్రం" గబగబా అప్రయత్నంగా నోటితో అనేసింది. ఇది చాలానాళ్ళనాటి అలవాటు. ఎప్పుడైనా భయమేస్తే, ఏదైనా పీడకలవస్తే ఇది చదువుకో అంది. తన అక్క విజయ ఎప్పుడో శారద మంచంమీద కూచుంది. గడియారం ఐదుగంటలు కొట్టింది. ఏడుగంటల బస్సుకి రామం వస్తాడు.
ముఖంకడుక్కుని అద్దంలో చూసుకుంది. "ఇదేమిటీ ఇవి మళ్ళీ నా మెడలోకెలావచ్చాయి." గబగబా తీసేసి గాడ్రెజ్ లో దాచేసింది శారద.
అయినాతనకి రామం మీద కోపమెందుకూ - రామానికి తన మీద కోపమని ఎందుకనుకుంటోంది- ఒకవేళ రామంతనని ప్రశ్నిస్తే - తనేం తప్పుచేసిందని భయపడటానికి - తనుకొత్తగా నమ్ముతున్న విషయాలగురించి చెప్పి అతన్ని ఒప్పిస్తుంది - అంతే!! శారద ధైర్యం కూడగట్టుకుంది.
వంటింటిలోకెళ్ళి రామానికిష్టమని చపాతీలు చేసింది. గోబీ ఆలు, కలిపి కూర చేసింది. వంటింట్లో వుండే పనుల మధ్యలో వుంటూ అనుకుంది సూత్రాలు మెళ్ళో వేసుకుంటే, లేకపోతే రామం చూడగానే షాక్ తింటాడు. అతన్నెందుకు భయపెట్టటం! వేసుకుంటా అయినా నీరజ రాదు ఇవాళ - రెండు రోజులు ఇద్దర్నీరా వద్దన్నాను. రెండు రోజులయ్యాక తనేవెడుతుంది - శారద వంటింట్లో పని పూర్తి చేసుకుని గడియారం వంక చూసింది. ఇంకా ఆరున్నరే - స్నానం చేసింది శారద - దీపం పెట్టడం, పూజచెయ్యటం వారం రోజులుగా మానేసింది - అయినా ఈ రోజు దీపం పెట్టాలి దేముడి దగ్గర - అది అతనికిష్టం - మరి తనెందుకు చేయద్దూ - శారద దేముడి దగ్గర దీపం వెలిగించింది - చేయి వణికింది ఎవరిదో నవ్వు చెవుల్లో మారు మ్రోగింది. "శభాష్ - మళ్ళీ పూజలు వ్రతాలు, మంగళసూత్రాలు, నైవేద్యాలు, నమస్కారాలు ..... ఊ, కానీయ్ మనం అనుకున్న సిద్దాంతాలకి ఇవేవీ కుదరవు - మనదంతా నమ్మిన సిద్దాంతాన్ని నమ్ముకోటమే - వెనక్కి పోవటంలేదు. ఇలా అయితే నిన్ను మాలో చేర్చుకోటం కష్టం.." నీరజ వంటింటి గుమ్మంలో నుంచుని అంటోంది - శారదకి ఒక్కసారి ఊపిరి ఆగి పోయినంత పనైంది.
'ఇప్పుడొచ్చావేమిటి. ఆరుముప్పయి అయిదా అంది శారద. ఇంక కొద్ది నిముషాల్లో వచ్చేస్తాడు రామం, అతనొచ్చే టైముకి ఇంట్లో వాళ్ళిద్దరూవుంటే, శారద వంటింట్లోంచి బయట కొచ్చింది. దినేష్ సిగరెట్టు వెలిగించాడు.
