'మా ఫ్రెండు శారద' అంది నీరజ అందరితో.
శారద ఆ పక్కన కుర్చీలో కూచుంది. తనెందుకొచ్చిందో తనకే తెలియని స్థితిలో పడిపోయింది శారద. తనకి పేకాటరాదు. తను ఇంతవరకు డ్రింక్ తాగలేదు. పైగా ఇక్కడున్న వాళ్ళెవరూ తనకి తెలియదు. చాలా చిరాగ్గా, మొఖమాటంగా కూర్చుంది శారద.
పేకాట సాగుతోంది. గ్లాసులు నిండుతున్నాయి.
'నేను మళ్ళీ వస్తాను' లేచింది శారద.
'కూర్చో. ఒక్క రౌండ్. వచ్చేస్తా' - నీరజ శారదని కదలనీయలేదు గడియారం పదకొండు గంటలు కొట్టింది.
"పదకొండా." శారద ఖంగారుగా అంది.
'ఖంగారు పడకు. నేను వచ్చి నిన్ను దింపుతాను' - శారదకి ఏం చేయాలో తోచలేదు.
ఇప్పుడతను ఒంటరిగా ఎలా ఇల్లు చేరగలదు - ఆటో రానంటుంది - వచ్చినా తను ఒక్కర్తీ రాత్రి పదకొండున్నర దాటాక ఆటోలో ఇంటికెళ్ళటం ఎలాగో - శారదకి భయమేసింది.
"మీకెందుకు భయం - రండి నేను కారులో దింపుతాను' నీరజతో పేకాట ఆడుతున్న దినేష్ లేచాడు.
కారులో నీరజ, దినేష్, శారద కూచున్నారు. మీ వారు నీ కోసం ఎదురు చూస్తుంటారు కదూ అంది నీరజ.
'ఆ - పరధ్యానంగా ఎటో చూస్తోంది శారద.
"మీ వారా - అదే వచ్చిన గొడవ - మీలాంటి అందమైన అమ్మాయిలంతా తొందర తొందరగా పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. మాలాంటి వాళ్ళు వెతుకుతూనే ఉంటారు. దినేష్ మాటలు ముద్దముద్దగా వినిపిస్తున్నాయి.
"ఇందాకా పేరు మాత్రమే చెప్పాకదూ. ఇతను మా బావ అంది నీరజ దినేష్ వంక చూస్తూ.
'కాబోయే' - దినేష్ చేయి నీరజ నడుంచుట్టూ వేస్తూ అన్నాడు. శారదకి చాలా చిరాగ్గా వుంది. ఊపిరి బిగ పట్టి కూచుంది.
ఇంటి ముందుకారు ఆగగానే ప్రాణం వచ్చినట్టు అనిపించింది శారదకి. శారద గబగబా లోపలకొచ్చేసింది. వీధిలో పుస్తకం చదువుకుంటున్న రామంకారు ఆగటం వెళ్ళిపోవటం గమనించకపోలేదు.
మూడు నెలలైంది శారద ఇంటికొచ్చి పెద్దనాన్నగారూ పోయారని ఊరెళ్ళిన లలిత. ఆరోజు ఊరినుండి వచ్చింది. వచ్చిన సాయంత్రమే శారదయింటికొచ్చింది. 'ఈ పాటికి కోపం పోయి వుంటుంది - శారద రామం కలిసి పోయి వుంటారు. అయినా భార్యాభర్తల మధ్య ఆ పాటి తగవులు తప్పవేమో - ఎంతో సంతోషంగా ఇంట్లో అడుగుపెట్టిన లలిత ఒక్కక్షణం అవాక్కయిపోయింది.
నీరజ, దినేష్, శారద పేకాట ఆడుకుంటున్నారు. నీరజ లలితకి కూడా క్లాస్ మేట్. అయినా ఎందుకో నీరజ అంటే లలితకి మొదటినుంచీ మంచి అభిప్రాయంలేదు. శారద లలితని చూసింది.
'హాయ్ లలిత, ఎలా వున్నావ్, ఎక్కడున్నావ్. నీరజ పలకరిస్తోంటే లలిత సమాధానం చెప్పి అటు ఇటు చూసింది.
'ఓ, లలితా, రామంకోసం చూస్తున్నావా. ఊరెళ్ళారు."
"ఊరా" అంది వెంటనే లలిత.
"అంత ఆశ్చర్యమేముంది - వ్యవసాయం పనులు చూసుకోవాలని ఒక పదిహేను రోజులు సెలవు పెట్టాడు. 'శారద దృష్టి పేకలమీదే వుంది. దినేష్ లలితని నఖశిఖ పర్యంతం చూసి పేకాటలో మునిగిపోయాడు.
శారదవైపే చూస్తోంది లలిత -
'అదేమిటీ' గట్టిగా అరిచింది లలిత శారదవైపు మళ్ళీ మళ్ళీ చూస్తూ, ఇంటికెళ్ళడానికి లేచి నిలబడింది లలిత.
'ఓ అదా తీసేశాను' తేలిగ్గా అనేసిఆటలో మునిగి పోయింది. శారద అవితీసేయడానికి మనసులో చాలా మధన పడింది శారద ఒక వారం రోజులుగా సంప్రదాయాలు, ఆచారాలు, మూఢ నమ్మకాలు -ఇలాటివెన్నో ఆడవాళ్ళనే పట్టి పీడిస్తున్నా ఎందుకో అని చాలా ఆలోచన చేసింది. తను కూడా అందరిలాగే ఈ ఆందోళనలో నుంచి బయట పడకుండా అందులో అందులో మునిగిపోవటం అర్ధంలేదనిపించింది. మూడుముళ్ళ బంధం మనిషి జీవితాన్ని ఇంతగా శాసించాల్సిన అవసరాన్ లేదనిపించింది. తన అభిప్రాయాలకు, ఆవేశానికి తోడుగా నిల్చింది నీరజ - నీరజ ప్రభావంలో పూర్తిగా మునిగిపోయింది శారద "నిజమే శారద మంగళ సూత్రాలు మెడలో లేక పోయినంత మాత్రాన భర్త భర్తకాకుండా పోతాడా. అయినా నువ్వు చాలా చిన్న, అతి చిన్న ప్రపంచంలో వున్నావు. ఒక్కసారి బయటకిరా. మా పిన్ని బొంబాయిలో వుంది. నిన్ను అక్కడికి తీసుకెడతా ఒక్కసారి. ఆవిడ ఎంతో చదువుకున్నది - ప్రేమించి పెళ్ళి చేసుకుంది - అయితేనేం, అభిప్రాయ బేధాలొచ్చాయి - భర్తని వదిలేసింది నీరజ అనగానే, 'భర్తనివదిలేసిందా'. వెంటనే అంది శారద ఆశ్చర్యంగా.
"ఏం, ఎందుకు వదిలేయ కూడదూ దాని మాటకి విలువ లేదని అనిపించింది. అతని హరాస్ మెంట్ భరించలేక పోయింది. అంతే, వదిలిపారేసింది. నవ్వింది నీరజ "హరాస్ మెంటా" - ఆశ్చర్యంగా అడిగింది శారద.
"అవును. అంటే కొట్టడం. తిట్టడం చేయక్కర్లేదు అబ్బబ్బ మాటలతోనే దాని మనసు విరిచేవాడు. మనసులు అతక్కుండా కలసి బతక్కూడదు ఏమంటావ్".
"ఆ అంటే అదే కలసి బతకటం అనేది పెద్ద సమస్య" శారద ఆలోచనలో మునిగింది.
చదువుకొనే రోజుల్లో శారద చాలా అభ్యుదయవాది పెళ్ళి విషయంలో చాలా ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి పెళ్ళి ఆడదాన్ని స్వేచ్చని, వ్యక్తిత్వాన్ని ఏరకంగానూ చంపకూడదనే గాఢమైన భావం వుండేది. అదే ప్రచారం చేసింది కూడా. పిల్లల్ని కనడంలో కూడా ఆడదానికి స్వేచ్చ వుండాలి. ఇష్టమైతేనే పిల్లలు - అక్కర్లేదంటే అక్కర్లేదంతే అంత స్వేచ్చ ప్రవృత్తి వున్న శారదకి ఈనాటికి మనసుకి నచ్చిన స్నేహితురాలు దొరికింది.
'శారదా ఇంకా ఆశ్చర్యపోతావు నేను చెప్పే విషయాలు వింటే"-
"చెప్పు వింటాను" చాలా ఆసక్తిగా అంది శారద.
"మేమిద్దరం అదే నేను దినేష్ పెళ్ళి చేసుకోలేదు తెలుసుగా"
"ఆ చేసుకుంటారు"
"అక్కడే పొరబాటు. కొన్ని రోజులు లివింగ్ టుగెదర్ - అంటే పెళ్ళి చేసుకోకుండానే కలిసి వుంటాము. పెళ్ళి అవసరం వుందా, లేదా అని మేము గట్టిగా అనుకున్న రోజున ఆలోచిస్తాం. లేకపోతే ఇలాగే గడుపుతాం. ఏం, బాగాలేదా" నీరజ శారద కళ్ళలోకి చూసింది.
శారదకి చాలాఖంగారుగావుంది. ఏమిటీ అర్ధం కావటంలేదు. "పెళ్ళి చేసుకోకుండా కలసి బతకటం ఏమిటీ.
"ఏమోనే నాకు చాలా ఖంగారుగా వుంది నీ ధోరణి. ఉండు మంచినీళ్ళు తాగివస్తానుండు" -శారద గబగబా నీళ్ళు తాగేసింది.
వారం రోజులయింది శారద మెళ్ళో మంగళ సూత్రాలు నల్లపూసలు తీసేసింది!!
'అవును నీకు పెళ్ళి అయిందని తెలిపేందుకు ఇన్నివున్నాయి - అతనికి పెళ్ళి అయిందని చెప్పటానికి ఏమున్నాయి - పెళ్ళి ఆడదానికి అంత విలువనిస్తే మగాడికివ్వదా' - నీరజ అడిగింది - శారద మౌనంగా తల ఊపింది ఆ క్షణం నుంచి శారద మనసు పూర్తిగా మార్పుచెందింది ఆలోచనా ధోరణిలో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఇప్పుడు నీరజ ఏంచెప్తే అదే వేదం.
