మరి ఆలస్యం చెయ్యకు తండ్రీ. మాదేశం అయిదువందల మైళ్ల దూరం అని మరిచిపోకు నాయనా? అన్నాడు ముసిలాయన.
పరుగెత్తికెళ్ళి పరుగెత్తుకొస్తాను.
దారిలో రూపాయీ, అర్థా దొరికితే చెరిసగం. మరిచిపోయేవు అన్నాడు మానాన్న.
అలాగే అన్నాను నేను.
సెట్టి దుకాణం దాకా పరుగెత్తుకు వెళ్ళాను. దారిలో రూపాయి కాదు కదా దమ్మిడీ అయినా దొరకలేదు. దుకాణంలోకి వెళ్ళాను. కునికిపాట్లు పడుతున్న సెట్టి కళ్లు తెరిచాడు.
చూశారా సెట్టిగారూ అన్నాను నేను. మీరు చీనా దేశంలో ఉన్నారనుకోండి. నా అనుకునేవాళ్ళెవరూ లేరనుకోండి. ఎర్రని ఏగాణియేనా లేదనుకోండి. అప్పుడెవరైనా గృహస్థు మీకింత బియ్యం వేస్తే బాగుంటుందంటారా లేదా?
ఎందుకొచ్చావ్ అన్నాడు సెట్టిగారు. అబ్బే ఊరికే మాట్లాడిపోదామని. ఎవరైనా సంసారి మీకు సాయం చేస్తే బాగుంటుంది కాదూ? ఏమంటారు సెట్టిగారూ?
ఎంత డబ్బు తెచ్చావ్?
డబ్బు గొడవ కాదండీ. చీనాలో చిక్కుకుపోతే ఎవరు సాయం చేస్తారని.
అదంతా నాకేటెరిక?
చీనాలో మీరే అలాంటి అవస్థపడుతున్నారనుకోండి. అప్పుడు మీకెలా వుంటుంది?
నాకేటెరిక? చీనాలో నాకేం పనుంది?
కాదు సెట్టిగారూ? ఏదైనా పనిమీద అలా వెళ్ళారనుకోండి. తెలిసిన స్నేహితులెవ్వరూ ఉండరనుకోండి. అంత దేశంలో ఒక్కడూ మీకింత బియ్యం వెయ్యకుండా తరిమేస్తాడంటారా?
అబ్బాయ్ మనకాళ్ల సంగతంతా ఎందుకు? మనది చీనాదేశం కాదు. నువ్వో మీనాన్నో ఎప్పుడో ఒకప్పుడు పాటుపడి డబ్బు సంపాదించాల. ఆ పని ఇప్పుడే మొదలెట్టాకూడదూ? మీకరువిస్తే మరి సచ్చినా డబ్బు తిరిగిరాదు.
సెట్టిగారూ నా మాట మీకు తిన్నగా అర్థం కాలేడు. వెధవ అరువు. అరువు సంగతే నేను మాట్లాడలేదు. చీనాలో కోట్లకొద్దీ జనం. వాళ్ళ మధ్య ఒంటిగా మీరు, కరువు దహించుకుపోయే ఆకలి. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న అవస్థ.
సీనావూసు నాకెందుకు. ఇక్కడ ఈ రాజ్యంలో పాటుపడి పని సెయ్యకపోతే కూడు పుట్టదు. అందరూ ఏదో వుద్యోగం సెయ్యాల.
సెట్టిగారూ ఒక సేరు బియ్యం దొరికితే మీ ప్రాణాలు నిలుస్తాయనుకోండి. ఆ స్థితిలో మీరు నోరు విడిచి ఎవర్నైనా అడుగుతారా?
అడగను. నేనెవర్నీ ముష్టెయ్యండని అడగను, సచ్చినా అడగను.
తర్వాత సేరుకి రెండుసేర్ల బియ్యం తీర్చేస్తానని తెలిసినా అడగరూ? అప్పటికీ అడగరూ?
అప్పటికీ.
అదుగో. అదే కూడదండీ సెట్టిగారూ. అంత నిరుత్సాహమా? ఇలాంటి మాటల వల్లనే యుద్ధాల్లో ఓడిపోతాం. మరేం వుంది? ఇలా బిగిసి కూర్చుంటే ఏమవుతుంది. చచ్చి ఊరుకుంటాం. చీనాలో ముష్టెత్తుకోకపోతే చచ్చిపోతారు సుమండీ సెట్టిగారూ!
ఇదెక్కడ సావొచ్చింది? ఆ ఇరవై రూపాయలూ ఇక్కడ తెచ్చిపెట్టు. మీ నాన్ననేదేనా ఉద్యోగం సెయ్యమను.
పోనీండి గాని సెట్టిగారూ మీ వొంట్లో ఎలా వుంది.
నింపాదిగానే వుంది. నీకెలావుంది.
దివ్యంగా వుంది. మీ పిల్లలంతా క్షేమమా సెట్టిగారూ?
ఓ సేమంగా వున్నారు. సిన్నోడు నడుస్తున్నాడు కూడా.
ప్రశస్తంగా వుంది. మరి మీ అమ్మాయి?
సంగీతం నేర్చుకుంటోంది. సిన్న సిన్న పాటలు పాడుతుంది. మీ అవ్వ నింపాదిగా వుందా?
భేషుగ్గా వుంది. ఆవిడా చిన్న చిన్న పాటలు ఇప్పుడిప్పుడే పాడుతోంది సినిమాలో పాడాలని చూస్తోంది. మీ ఇంటావిడ బాగున్నారా?
దానికేం? సుఖంగా వుంది.
మీ యింటిల్లిపాదీ హాయిగా ఉన్నారంటే నాకెంత సంతోషమో చెప్పలేను సెట్టిగారూ. మీ చిన్నబ్బాయి పెద్దయితే డిస్ట్రిక్టుబోర్డు ప్రెసిడెంటయిపోతాడని నా నమ్మకం.
నాకూ అదే ఆశ. నాకంటే సదువురాలేదుగాని అబ్బాయిని సెన్నపట్నం పంపించాలనుకుంటున్నాను. ఆడుకూడా కిరాణా కొట్లో కూసోవడం నాకిష్టం లేదు.
మీ చిన్నబ్బాయిని చూస్తేనే చాలు ప్రెసిడెంటుగిరి చలాయిస్తాడని తెలుస్తుంది.
ఏటికావాలి పంతులూ అన్నాడు సెట్టిగారు. డబ్బేమైనా తెచ్చావా?
చూడండి సెట్టిగారూ. ఇక్కడకు నేను రావడం ఏదీ కొందామని కాదు. దారింట పోతూ కాలక్షేపం కోసమని మీదగ్గరకొచ్చాను. ఏవైనా తత్వాలు మీతో మాట్లాడడం నాకు సరదా. పోనీ ఏదో మీరే అడిగారు కాబట్టి ఓ రెండుసేర్ల బియ్యం, పావుసేరు పెసరపప్పూ కొలిపించండి.
రొక్కం చెల్లించాల.
మీ అమ్మాయి రోజమ్మ. అన్నట్టు మరిచిపోయాను. మీ రోజమ్మ బాగుందా? అంత అందమైనపిల్లని నేనెక్కడా చూడలేదు.
రోజమ్మా కులాసాగానే వుంది. పంతులూ ఇక్కడ రొక్కం సెల్లించి తీరాల. నువ్వూ మీ నాన్నా ఈ వూరంతట్లోకి ఎందుకూ పనికిరాని యెర్రిమొగాలు.
రోజమ్మ బాగుందికద! సంతోషమైన మాట చెవిన వేశారు. సెట్టిగారూ ఇవాళ మాయింటికి మహారాజశ్రీ తిరుచూర్ణం చంద్రకాంతయ్యగారు వచ్చారు. రాజు వేషం వేస్తారు. ఆయన పేరు పేపర్లో పడింది.
అతగాడి పేరు నేనినలేదు.
ఓ సేరు నెయ్యి కూడా ఇవ్వాలి. చంద్రకాంతయ్యగారికి సేరు నెయ్యి నేనియ్యలేను.
తప్పకుండా ఇవ్వగలరు.
ఇయ్యలేను. కావలిస్తే బియ్యం పెసరపప్పు తీసికెళ్ళు అంతే. మీ నాన్న ఎప్పుడేనా పనిసేస్తే యేంపని చేస్తాడు పంతులూ?
మానాన్న కవిత్వం చెబుతాడు. అదొక్కటే మా నాన్నకి చేతనైన పని. ఈ ప్రపంచంలో అతనికన్న గొప్ప కవి లేడు.
డబ్బేమైనా పెగుల్తుందా? మీ నాన్న దమ్మిడీ అయినా ఆర్జిస్తాడా?
మానాన్న డబ్బుకోసం ఏ పనీ చెయ్యడు. అవ్వా కావాలి బువ్వా కావాలంటే ఎలాగ?
అలాంటి వుద్యోగాలంటే నాకసహ్యం. అందర్లాగా మానాన్న పనిసెయ్యడేం పంతులూ?
అందరికన్నా కష్టపడి పనిచేస్తాడు మా నాన్న. మా నాన్న మామూలు మనిషికన్న రెండు రెట్లు ఎక్కువ పనిచేస్తాడు.
సరే. సరుకు తీసికెళ్ళు. ఇరవైరెండు రూపాయలపై సిల్లరయింది. ఇప్పుడంటే అరువిచ్చాను గాని ఇంకెప్పుడూ ఇయ్యను.
రోజమ్మ నడిగానని చెప్పండి.
అలాగే.
వెళ్లొస్తాను.
సరే. వెళ్ళు.
బియ్యం, పెసరపప్పు తీసుకొని పరుగెత్తుకుంటూ ఇల్లు చేరాను.
తెస్తానో లేదో అని ఇంటిముందే కనిపెట్టుకు కూచున్నారు మా నాన్న, చంద్రకాంతయ్యా. అల్లంతదూరాన ఉండగానే ఇద్దరూ నా దగ్గరకు తోసుకొచ్చి చేతిలో సరుకు చూడగానే అవ్వకి చెయ్యి వూపాను. అవ్వ అది చూశాక ఇంట్లోకి వెళ్ళింది.
సాధించుకొస్తావని నాకు తెలుసు అన్నాడు మానాన్న.
నేనూ అలాగే అనుకున్నాను అన్నాడు చంద్రకాంతయ్యగారు.
ఇరవైరెండు రూపాయలపై చిల్లర అయిందని సెట్టిగారన్నారు నాన్నా అన్నాను నేను. ఈమాటుకి పోనిచ్చాను గాని ఇకమీద అరువుబేరం పనికిరాదన్నాడు.
సరే. అది అతని అభిప్రాయం. అయితే అతగాడితో ఏం మాట్లాడావురా?
మొట్టమొదట చీనాదేశం, ఆకలీ, చావడానికి సిద్ధంగా వుండడం ఇలాంటివన్నీ మాట్లాడుకున్నాం. తర్వాత వాళ్ల కుటుంబం యోగక్షేమాలు కనుక్కున్నాను.
అంతా బాగున్నారా?
దేదీప్యమానంగా వున్నారు.
తర్వాత ముగ్గురం ఇంట్లోకి వెళ్లాం. అవ్వ నిమిషాల మీద వంట పూర్తిచేసి వడ్డించింది. పప్పూ అన్నం మజ్జిగా అన్నం తిని రెండేసి చంబుల నీళ్లు తాగాం. ఒక్క మెతుక్కూడా లేకుండా విస్తరి ఖాళీచేసి ముసిలాయన వంటింట్లో గూటివేపు చూశాడు. ఇంకేమైనా తినడానికుంటుందేమో అని.
