Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 68


    దేవుడు మారిస్తేనో లేక తనే మనసు మార్చుకొనో, అంతకంటే గతిలేకో, ఇంతకంటే వేరే ఆడది దొరక్కో భర్త తిరిగొచ్చాడు. భార్య, భర్త కాళ్ళను పట్టుకొని క్షమించమంటూ భోరుభోరున ఏడుస్తోంది. పిచ్చిముండ కాకపోతే తన కన్యాయం చేసిపోయినవాడి కాళ్ళమీద పడి ఏడుస్తుందేం? తప్పు అతనిదయితే, తను క్షమించమని ప్రాధేయపడుతుందేం?
    ఆవిడ్ని చాచి చెంపమీద కొట్టాలనిపించింది వరూధినికి. అది తెరమీద జరిగింది. నిజంగా తన జీవితంలో తన కళ్ళముందు అలాంటి సన్నివేశం తటస్థపడితే అంతపనీ చేసి వుండేది. వరూథినికి తెరమీద కన్పించే చిత్రం అపసవ్యంగా అతుకులు బోతుకులుగా వుంది. కొన్ని సంఘటనలు చూస్తున్నా బుర్రలోకి ఎక్కటంలేదు. భార్యాభర్తల మధ్య జరిగే సంఘర్షణ ఆమె మానసిక ప్రతిఘటనాశక్తిని పెంచిందేగాని, సానుభూతితో స్పందించలేదు.
    కాళ్ళమీదపడ్డ భార్యతో ఏదో చెప్తున్నాడు భర్త. వరూధిని శ్రద్దగా వినడానికి ప్రయత్నించింది. అతను ఏదో చెప్పాలని - చెప్పలేకపోతున్నట్టుగా ముఖం పెట్టి.......నా.....అంటూ పెళ్ళాన్ని వాటేసుకొని భోరున ఏడ్చాడు.
    "ఏడుస్తాడేం? అంట్లవెధవ, ఏడవకేం చేస్తాడ్లే పిరికి సన్యాసి!" అనుకొంది వరూధిని.
    వాడు ఆ ఆడంగోడు, ఆ చవట వెధవ హీరో, ఈ సత్తుతపేళా ముఖంది హీరోయిన్! ఈ పిచ్చి జనం అంతా డబ్బులిచ్చి మరీ చూస్తారా? ఈ సినిమాలుచూపించడానికి తనలాంటి లక్షలు ఖర్చుపెట్టి థియేటర్లు కట్టించటమా? ఛ! ఛ! అంతకంటే బుద్దితక్కువ పని మరొకటి వుండదు.
    వరూధిని రియాక్షన్ మాంచి ధోరణిలో పడింది.
    ఆ హీరో ఆదర్శ భర్తకు ప్రతిరూపం! పెళ్ళాన్ని ముందదిగిన ప్రశ్నేమిటి? "పిల్లలేరీ?" భార్య నోటికి చేతులు అడ్డం పెట్టుకొని ముఖం గోడకు రుద్దుకుంటుంది.
    అదేం యాక్షన్? దాని బొంద యాక్షన్?
    "నా బాబూ! నా చిట్టీ!" అంటూ భర్త గుండెలు బాదుకుంటూ బయటికి పరుగు తీశాడు. "ఏమండీ! ఏమండీ!" అంటూ భార్య భర్త వెనకే పరుగు తీసింది.
    ఇంతకీ ఆ భర్త వచ్చింది పెళ్ళాంకోసం కాదన్నమాట? పిల్లల కోసం వచ్చినవాడు ఆ ఏడుపు ముందే ఏడవచ్చుగా? ఈ రసాభాసంతా ఎందుకు?
    తర్వాత తెరమీద, స్పీడుగా పోయే కారూ, రైలుకట్టలూ, కాలవలూ, కొండలూ కనబడుతున్నాయి. అదంతా పిల్లల్ని వెతకటంలోని భాగమన్నమాట?
    ఇదంతా డైరెక్టరుగారి బుర్రలా వుంది? తప్పిపోయిన పిల్లల్ని వెదకడం అలాగా? బట్టలషాపులో ఆడవాళ్ళతో కలిసిపోయిన పెళ్ళాన్ని వెతుక్కోవడంకూడా తెలిసినట్టులేదు. ఈ డైరెక్టరుకు. ఇంకా పిల్లల్ని వెదకటం ఏం చూపిస్తాడు నా బొంద?
    వరూథినికి తెరమీద పిల్లలకోసం భార్యాభర్తలు చేస్తున్న గగ్గోలుమీద రోత పుట్టింది.
    వెతకటం అంటే ఆమెకు గుర్తొచ్చింది. అన్నట్టు ఆవిడపక్కన కూర్చున్న ఆయనెవరూ?
    వరూధిని తలతిప్పి కుడివైపు దూరంగా గోడపక్కగా ఉన్న సీట్లకేసి చూసింది. వాళ్ళిద్దరూ కూర్చొనివున్న సీట్లు ఖాళీగా వున్నాయి. ఆ వరుసలోనివి, ఇంకా ముందువీ పరిశీలనగా చూసింది. కాని అతడు లేడు. ఆమె లేడు.
    వీళ్లెప్పుడు వెళ్ళినట్టు? తన ముందునుంచి ఎవరూ వెళ్ళలేదే? మరీ ఎట్లా మాయమయ్యారూ? అవతల కుడివైపున వున్న గేటునుంచి వెళ్ళారా? అది ఎప్పుడూ మూసే వుంటుంది. అది తీయించుకొని వెళ్ళగలిగారంటే వారెవరై ఉండాలి?
    వరూథిని చివాలున లేచింది. లేచినఊపుకో, లేక రక్తంలోని నైన్ వడికో గాని తూలింది. ముందు సీటుమీద చెయ్యివేసి తనను తానే నిలదొక్కుకుంది. 'ఓ యస్!' తనకేం? తనిప్పుడు బాగానే వుంది.  మెల్లగా అడుగులు వేసుకుంటూ బయటికొచ్చింది. బయ వరండాలో తలుపుపక్క స్టూలుమీద కూర్చున్న గేటు కీపర్ లేచి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. వరూధిని వాడివంకన్నా చూడకుండా, వరండాలో నడిచి థియేటర్ బయటికొచ్చింది. హాలు బయటికి రాగానే చల్లగాలి తగిలి హాయిగా అన్పించింది.    
    అతను ఎటు పోయాడూ?
    ఆలోచన ఆమె మనసునుబట్టి పీడించసాగింది. పార్కింగ్ ప్లేన్ లోంచి ఓ కారు ముందుకొచ్చి ఆగింది. ఆ కారుని గుర్తుపట్టింది. రామనాథబాబుదే! రసూల్ తననుచూసిం కారు తెస్తున్నాడనుకున్న వరూధిని ఒక్కడుగు ముందుకువేసి, థియేటర్ మెట్లమీద ఆగిపోయింది.
    రామనాథబాబు కారు డోర్ తీసి నిలబడ్డాడు. ఆమె ఎక్కింది. ఆమెపక్కనే అతడూ ఎక్కి కూర్చున్నాడు. వెంటనే కారు సాగిపోయింది. గేటుదాటి రోడ్డెక్కింది.
    సందేహంలేదు. తను థియేటర్లో చూసింది వాళ్ళిద్దర్నే! ఇంతకీ అదెవతి? పెళ్ళాంమాత్రం కాదు. అంతవరకూ తనకు తెలుసు. ఎన్నాళ్ళనుంచి దీంతో? అందుకేనా అతను హైదరాబాద్ రానిది? ఇదేనా అర్జంటు పనిమీద వెళ్ళటం? రెండు మూడు నెలలుగా రామనాథబాబు, తనంటే పట్టీ పట్టనట్టు, అంటీ అంటనట్టు తిరగడానికి కారణం ఇదేనన్నమాట?
    వరూథినికి మత్తు దిగిపోయింది. వళ్ళు చల్లబడిపోయింది. తలలోని మబ్బులు విచ్చిపోయాయి. పరుగెత్తి పరుగెత్తి అలసిపోయిన గుర్రంలా అయిపోయింది. కాళ్ళు ముందుకు సాగలేదు. థియేటర్నుంచి త్వరగా వెళ్ళాలని ప్రయత్నం చేసింది. కాని, మెట్లమీదనే చెక్కిన ప్రతిమలా నిలబడిపోయింది.
    "ఒరేయ్! ఓ జట్కాలోపలకు తీసుకురా!" శివరాం హాలు కుర్రాడికి చెప్పి వరూధిని దగ్గిర కొచ్చాడు.
    "ఎంతసేయిందీ మీరొచ్చీ? నేను చూడలేదు" అన్నాడు.
    "కార్లో వెళ్ళిందెవరూ?" శివరాం కేసి చూడకుండానే అడిగింది.
    "రామనాథబాబుగారే!"
    ఆవిడెవరని నే నడిగింది?"
    శివరాం సమాధానం చెప్పలేదు. వరూథినికి తల, తను నిలబడ్డా సినిమాహాలు మెట్లకేసి కొట్టుకు చావాలనిపించింది! తను అడక్కూడని ప్రశ్నే అడిగింది. లజ్జా, బిడియం వున్న ఆడది చేయాల్సిన పని కాదు. అసలు తనెవరని ఆ మాట అడిగింది? అందులోనూ శివరాంను. రామనాథబాబు అడుగులకు మడుగులొత్తేవాడివి. అతనికింద నౌకర్ని తన కిందున్న నెలజీతగాడ్ని.
    వరూధిని శివరాంను తలెత్తి చూసింది. తనవైపే చూస్తూ నవ్వుతున్నవాడల్లా ముఖం దాచేసుకొన్నాడు.
    శివరాంనుంచి సమాధానం లేకుండా వెళ్ళదల్చుకోలేదు వరూధిని. నిండా మునిగినదానికి చలేమిటి అన్నట్టుంది ఆమె ధోరణి. ఆమెవరో తెలుసుకోవాలన్నది ఆమె గుండెల్ని పట్టి పీడించసాగింది. ఈర్ష్యాద్వేషాలతో వళ్ళంతా ఉడికిపోతోంది.
    "ఎవతట అదీ? ఏ ఊరు?" వరూధిని తనేం మాట్లాడుతోందో, ఎలా మాట్లాడుతోందో తెలియని స్థితిలో ఉన్నది.
    "కోలవెన్ను షావుకారుగారి కోడలు."
    "ఇక్కడే వుంటుందా?"
    "నాలుగైదు నెళ్ళనాడు వచ్చారు. మామగారు, భుజంగరావుగారి నర్సింగ్ హోంలో వున్నారు."
    "ఉహూఁ - అదన్నమాట కథ!"
    అంతేనన్నట్టు తల ఊపాడు శివరాం.
    "ఆవిడ మొగుడేం చేస్తుంటాడూ?"
    శివరాంకు నెత్తిమీద కమ్మరివారి సుత్తెలా తగిలిందా ప్రశ్న.
    "సుబ్బారాయుడుగారా? వూళ్ళో వ్యవసాయం చూసుకొంటాడు. మధ్య మధ్య వచ్చి పోతుంటాడు. ఆమెగారు అసలు షావుకారుగారి మేనకోడలే. ఆ తర్వాత కోడలైంది."
    "వాళ్ళు మీకు చుట్టాలా?"
    శివరాంకు పక్కటెముకల మీద పోలీసులాఠీలా తగిలింది! ముఖం వెగటుగా పెట్టుకొని  "మాకేం కారు మా పక్క వూరే వాళ్ళది" అన్నాడు.
    "అయితే వాళ్ళు మీ బంధువ్లు కాదన్నమాట!"
    రామనాథబాబుమీద కసి శివరాంమీద తీర్చుకోవటానికి తప్పిస్తే ఆ మాటకు అర్ధం లేదని వరూధినికి తెలిసే అన్నది.
    "అసలు మా వూరే కాదంటే?" శివరాం నిరసనగా అన్నాడు.
    సినిమా వదలబోయేముందు మోగే బెల్ మోగింది. హాలుమీద పెద్దలైటూ, వరండాలో లైట్లూ, వెలిగేయి. అంత లైటు వెలుగులో వరూధిని నిలబడలేకపోయింది. ఆ వెలుగులో తన ముఖం శివరాం చూట్టంకూడా బాధగానే అనిపించింది ఆమెకు. అప్పుడు తన ముఖం అద్దం లేకపోయినా ఎలా వుంటుందో అర్ధం చేసుకోగల తెలివితేటలున్నాయి వరూధినికి. విసురుగా మెట్లుదిగి జట్కా ఎక్కి కూర్చుంది. శివరాం జట్కా దగ్గిరకు వెళ్ళకుండా బుకింగ్ ఆఫీసు దగ్గరకు వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS