ప్రస్తుతం ఇంటికి కావలసిన సరుకులన్నీ ఆయనే తెస్తున్నారు. అంటే సగానికి పైగా ఖర్చును ఆయనే భారిస్తున్నాడు. అటు సుందరం ఇంటి విషయం పట్టించుకోవడంలేదు. మధ్యలో ఈయన ఒక్కరే పాకులాడుతున్నారు.
అసలు ఇంటి భాద్యతను సమానంగా పంచుకోవలసిన ధర్మం సుందరం పైన వుంది. అతనివల్లే ఇంటి ఆర్ధిక పరిస్థితి చిన్నబిన్నం అయిపోయింది. అలాంటిది ఏదో కుంటిసాకులు చెప్పి తెలివిగా తప్పించుకున్నాడు.
తప్పించుకున్నాడా! ఇంటి పరిస్థితి ముందు ముందు ఇలా తయారవు తుందని ముందుగానే ఉహించి వేరే కాపురం పెట్టాడా? ఏమో అలా ఎందుకు ఆలోచించకూడదు? అతని మనస్తత్వం ఆ వరాలు విషయంలోనే అర్ధమయింది స్వార్ధపరుడని.
స్వార్ధపరుడు కనుకనే ఇంటి పరువు మర్యాదలను గూర్చి పట్టించుకోకుండా తన సుఖం తానూ చూసుకుని అతని పరువు, కుటుంబ పరువు బజారుకు ఈడ్చాడు. అలా చేసిన వాడు ఇంటిని చక్కదిద్దే భాద్యత తీసుకున్నాడు అంటే అది లేదు.
నిశ్శబ్దంగా పెళ్ళాం పిల్లలను తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఇలా వెళ్ళిపోతే ఈ గంపెడు కుటుంబం నా వల్ల వీళ్ళ పరువు మర్యాదలు మట్టిలో కలిసిపోయాయి, మరి అన్నయ్య ఒక్కడే ఈ కాంట్రాక్టు పనులు చేయగలడా? లేదా? నేను ఒకేసారిగా ఇలా వెళ్ళిపోతే అయన పరిస్థితి ఏంటి అని ఆలోచించాడా?
నిస్వార్ధపరుడు అయితే అసలు ఈ ఇంటిని వదిలి వవెళ్ళడు. తన వల్ల కుంగిపోయిన ఇంటిని తిరిగి పునఃనిర్మించటానికి తన శాయశక్తులా కృషి చేస్తాడు. భాద్యతను తీసుకుంటాడు. అతను వెళ్ళిపోయేటప్పుడు నేను కూడా అలా ఆలోచించలేదు.
అప్పట్లో అతని మీద జాలి మాత్రమే వుంది. శివపార్వతి పిల్లలు దూరమయ్యరనే బాధ తప్పించి ఈ ఇంటి పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు. చూద్దాం భగవంతుడు ఈ ఇంటి పరిస్థితిని చక్కదిద్దకపోతాడా?
ప్రస్తుతం మరీ అంత దైన్యస్థితికి దిగజారలేదు కదా? కాకపొతే జయంతి పెళ్ళి చేయాలంటే పొలం అమ్మవలసిందేగా. పొలం అమ్మి పెళ్ళి చేశారంటే సర్వోత్తమరావుగారి పని అయిపోతుంది అని ఊరంతా అనుకుంటుంది.
జయంతి ఒక విధంగా మేలేచేస్తుంది. ఇప్పుడే పెళ్ళి వద్దు అని ఖండితంగా చెప్పటంవల్ల కుటుంబపరిస్థితి బజారున పడటంలేదు. ఈ విషయాలన్నీ ఆయనతో ఓరోజు మాట్లాడాలి. అయన ఆలోచనలు ఎలా వున్నాయో తెలుసుకోవాలి అనుకుంది దాక్షాయణి.
37
జయంతి విఫ్. ఎ. పూర్తయిపోయింది.
ఆమె కాలేజి చదువు పుర్తవటం అయితే అయింది, గానీ అప్పటికి ఇంటి పరిస్థితి మరీ క్షిణించింది, తన చెల్లెలు తమ్ముళ్ళు చదువులకు ఫీజులు, పుస్తకాలు కొనటానికి ఆ ఇంటి పరిస్థితి గడ్డుగా తయారయింది.
జయంతి కాలేజి ఫీజులకు మాత్రం మాధవరావు సహాయం చేశాడు. కూతురు పట్టుదల చూసి ఆయనకు ముచ్చట వేసింది. తన ఆసక్తిని ఎందుకు కాదనలనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితిల్లోను చదువు మానేయకుడదని తనే కాలేజికి వెళ్ళి జయంతి ఫీజులు కట్టేవాడు. పుస్తకాలకు ఏమైనా డబ్బు అవసరమైతే జయంతి బాబాయ్ ని అడిగేది. ఎలాగో పూర్తయింది. ఇప్పుడు ఇక డిగ్రి చదివే అవకాశం లేదు.
డిగ్రీలో చేరాలంటే బోల్డన్ని డబ్బులు కావాలి.
ఈ పరిస్థితుల్లో మళ్ళీ బాబాయ్ ని ఇబ్బంది పెట్టడం సబబు కాదని జయంతి బి.ఎ. చదివే ఆలోచన మానుకుంది. లోలోపల ఆమెకు విపరీతమైన దుఃఖంగా వుంది. బి.ఎ. పూర్తిచేయాలనే కోరిక బలీయంగా వున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. తనను తాను సంభాళించుకుని రాజీపడిపోయింది. తల్లీ ఒకటే విధంగా పోరుపెడుతుంది పెళ్ళి చేసుకో, పెళ్ళి చేసుకో అని, సర్వోత్తమరావుగారిని కూడా ప్రతిరోజూ అడుగుతూనే వుంది జయంతి పెళ్ళిచేద్దామని.
అయన కూడా అదే వుద్దేశంలో వున్నాడు.
కానీ జయంతి ఒప్పుకోవటంలేదు.
"నీ చదువు పూర్తయింది. బి.ఎ. లో చేరే ఆర్ధిక స్థోమత ప్రస్తుతానికి లేదు. పెళ్ళిచేసుకోనంటున్నావు.....మరి ఏం చేయాలనుకుంటున్నావు జయంతీ?" ఆరోజు సాయంత్రం డాబాపైన కూర్చుని అడిగింది దాక్షాయణి.
జయంతి సమాధానం చెప్పలేదు. ఆమెనే క్షణం సేపు నిశితంగా చూసింది.
"ఏంటి జయంతీ! మాట్లాడవే" అంది దాక్షాయణి నవ్వుతూ.
"నా నిర్ణయం వింటే ఇంటిల్లిపాదీ మరొకసారి నామీద దండయాత్ర చేస్తారు పిన్నీ! నా మనసు నువ్వొక్కదానివే అర్ధం చేసుకోగలవు. అందుకే నీకు చెపుతున్నాను". అంది జయంతి సీరియస్ గా.
ఏంటది!?" ఆశ్చర్యంగా అడిగింది.
"నేను ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను" అని బాంబు పేల్చింది జయంతి.
దాక్షాయ ఉలిక్కిపడింది.
"ఏంటి జయంతీ! నువ్వనేది....ఉద్యోగమా? అదెలా సంభవం? ఇంట్లో ఒప్పుకోరు" అంది వెంటనే.
"నాకు తెలుసు పిన్ని! ముందే చెప్పాగా. నామీద మరోసారి దాడి చేస్తుంది అమ్మ అని" అంది జయంతి నవ్వుతూ.
"అమ్మే కాదు....నీ నిర్ణయాన్ని మీ బాబాయ్ కూడా ఒప్పుకోకపోవచ్చు" అంది దాక్షాయణి.
"బాబాయ్ ని నువ్వే ఒప్పించాలి. అమ్మను నేను ఒప్పించుకుంటాను. నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే, నువ్వు బాబాయ్ ని ఒప్పించాలి పిన్నీ" అంది సీరియస్ గా.
"అంటే మీ బాబాయ్ ఒప్పుకోకపోతే....నాకు నీ మీద ప్రేమ లేనట్లేనా? అవేం పిచ్చిమాటలు....నీ మీద ప్రేమకు, మీ బాబాయ్ ఒప్పికోకపోవటానికి సంబంధం ఏంటి? నీ రీజనింగ్ ఎమి బాలేదు" అంది దాక్షాయణి సీరియస్ గా. చాలాకాలం తరువాత ఆమె మధ్యలో ఇంగ్లీషు పదం వాడింది.
