మన్యాలనుంచి వచ్చిన మనిషి
అప్పుడు నాకు బాగా చిన్నతనం ఇంకా సరిగ్గా
ఆరోయేడు రాలేదు. ఆ రోజుల్లో ఒక ముసలి అబ్బి
తంబూరా పాడుతూ పాడుతూ వచ్చి మా ఇంటిముందు
నిలబడ్డాడు. ఇంట్లోంచి నేను పరుగెత్తుకొని వచ్చి మళ్ళీ
పాడుతాడేమో అని నిలుచున్నాను. పాడలేదు. మానేశావేం?
పాడవూ? అన్నాను. అబ్బాయీ, కాసిన్ని మంచినీళ్ళిప్పిస్తావా?
నీకు పుణ్యం ఉంటుంది. అలిసిపోయిన ఈ ముసలి
ప్రాణిని కాపాడు. మన్యాలనించి వస్తున్నాను అన్నాడు
ముసిలి.
మన్యాలా? ఏం మన్యాలు?
గుణుపురం మన్యాలనించి అన్నారు ముసలాయన. ఇప్పించా?
గుణుపురం మన్యాలనించి ఎందుకొస్తున్నావ్?
అక్కడే నేను పుట్టాను. నా మనస్సును అక్కడే దిగవిడిచాను.
అయితే నీ మనస్సు మన్యాల్లో ఏం చేస్తోంది?
విచారంతో ఏడుస్తోంది. అబ్బాయీ కొంచెం మంచి తీర్ధం తీసుకొద్దూ. నాలిక ఆర్చుకు పోతోంది.
మీ అమ్మ ఎక్కడుంది?
ఈ వూళ్ళోనే. కాని ఆవిడ మనస్సు మాత్రం ఇక్కడ లేదు.
మరైతే ఎక్కడుంది?
గుణుపురం మన్యాల్లో. మంచినీళ్ళు తీసుకురావూ చిట్టీ?
మీ వాళ్ళంతా మన్యాల్లో మనస్సు వదిలిపెట్టేస్తారేం?
అది మా కుటుంబం ఆనవాయితి. ఇవాళ ఇక్కడ. రేపు ఎక్కడో.
అంటే?
ఇవాళ బదుకు, రేపు చావు.
మీ అమ్మమ్మ ఎక్కడుంది?
యలమంచిలిలో.
ఆవిడ మనస్సుకూడా మన్యాల్లోనే వుండిపోయింది కాదూ?
తప్పకుండా. కుండలో నీళ్లు చల్లగా వుంటాయి. కన్పించదూ.
ఇంతట్లో మానాన్న వచ్చి గడపమీద నిలబడ్డాడు. పాడుకని మేలుకున్న సింహంలాగ బొబ్బరించాడు.
ఒరే, నీకు బుద్ధిలేదూ? పెద్దమనిషి మంచినీళ్ళు కావాలంటూ వుంటే పెత్తనాలు చేస్తున్నావ్? వెళ్ళి చెంబెడు నీళ్లు పట్రా, పాపం సొమ్మసిల్లి పడిపోకముందు. ఏమయిందిరా నీ మర్యాదా, మప్పితం?
ఎట్టకేలకెవరైనా మనింటికొస్తే లోకం భోగట్టా కనుక్కుంటాను. అదీ తప్పేనా?
వెళ్ళి ముందు నీళ్ళు తీసుకురారా. బెల్లం కొట్టిన రాయిలా కదలవేం? చస్తాడు బ్రాహ్మడు. వెళ్ళరా వేగం.
నువ్వెందుకు వెళ్ళకూడదూ? వచ్చేటప్పుడు మంచినీళ్లు తీసుకురాలేకపోయావూ? నువ్వేం పని చేస్తున్నావు నాన్నా?
మరేం? నేనేపనీ చెయ్యలేదట? నీకు తెలియదూ గొప్ప ప్రబంధం రాస్తున్నానని? పద్యాలు మనస్సులో ఆలోచిస్తున్నాను.
అది నాకేం తెలుసు? తల చేత్తో పట్టుకుని నిలబడతావు? పద్యాలు రాస్తున్నట్టు నాకెలా తెలుస్తుంది?
తెలియకపోతే తెలుసుకోవాలి - అన్నాడు మానాన్న.
నమస్కారం బాబూ అన్నాడు ముసిలాయన. మీ కుర్రాడూ నేనూ మాట్లాడుతున్నాం. ఈ ప్రాంతాల్లో వానలు పడ్డాయనీ, ఈయేడు చక్కగా పంటలు పండుతాయనీ చెబుతున్నాడు మీవాడు.
(శ్రీరామ రామ! ఈ ముసిలాడితో ఇవన్నీ చెప్పలేదే నేను.
పంటల మాట ఎప్పుడొచ్చిందసలు?)
నమస్కారం అన్నాడు మానాన్న. లోపలికి దయ చెయ్యరూ. కాళ్లు కడుక్కుంటారా? వంట అయిపోవచ్చింది.
ఆకలితో కడుపు దహించుకు పోతోంది. ఈ క్షణమే వస్తున్నాను. 'నేరంగ మెల్లిపోతానే' అన్న పాట వొచ్చునూ? అని ముసలాయన్ని అడిగాను. తంబురా మీద పలికిస్తావ్ ఆ పాట. అదంటే నాకెంతో ఇష్టం. ఏమో మరి. ప్రపంచంలో అన్ని పాటలకన్నా అదే నాకు చాలా ఇష్టం.
నా తండ్రీ, అన్నాడు ముసిలాయన. నీక్కూడా నాకొచ్చి నన్నేళ్ళు వస్తే ఈ ప్రపంచంలో పాటలు ప్రధానంకావని నీకు తెలుస్తుంది. అన్నమే ముఖ్యమని బోధపడుతుంది.
ఏమైనా ఆ పాట నువ్వు పాడితే వినాలనుంది.
గుమ్మం ఎక్కి ముసిలాయన మానాన్న చేతులు పట్టుకుని అన్నాడు. నాపేరు తిరుచూర్ణం చంద్రకాంతయ్య నాటకాల్లో వేషాలు వేస్తాను.
మీ దర్శన భాగ్యం వల్ల మా యిల్లు పావనమయింది అన్నాడు మానాన్న. అబ్బీ అబ్బీ ఈయన తాగడానికి మంచినీళ్ళు తీసుకురా. వెళ్ళి చెంబుతో నీళ్ళు తెచ్చాను. అన్ని నీళ్ళూ గుక్క విడవకుండా తాగేశాడు ముసిలాడు. కాస్త సేదతీరి వీధంతా పరకాయించి చూశాడు. దూరంలో పొలాలు, ఇంకా దూరంలో ఆకాశం చూశాడు. సాయంత్రపు సూర్యుడు అస్తమించుతూండడం చూశాడు.
ఇక్కడికి అయిదు వందల మైళ్ళ దూరంలో వుంటుందనుకుంటాను మా దేశం అన్నాడు ముసిలాయన. ఇవాళ ఏం కూర చేశారు ఈ జీవి ప్రాణం నిలవడానికి?
అబ్బీ నువ్వు కోమటి కొట్టుకు వెళ్ళవలసి ఉంటుంది. రెండు సేర్ల బియ్యం పావుసేరు పెసరపప్పు తేవాలి అన్నాడు మానాన్న.
డబ్బులుతే.
అరువిమ్మని అడుగు సెట్టిగారిని. నాదగ్గర దమ్మిడీ కూడా లేదు.
సెట్టి మనకిక అరువివ్వనన్నాడు. ఇచ్చి ఇచ్చి ప్రాణం చాలొచ్చిందన్నాడు. మనమీద కారాలూ మిరియాలూ నూరుతున్నాడు. నీకేమో ఉద్యోగం లేదట. ఎన్నాళ్ళయినా అప్పు తీర్చవట. ఇప్పటికే ఇరవై రూపాయలు మనం బాకీ.
వెళ్ళి ఆ మాటా ఈ మాటా చెప్పి సాధించుకురా. ఇది నీవంతు పని.
నా మాట వినడు. ఓ మంచీ చెడ్డా అఖ్కర్లేదు వాడికి. అదంతా నాకేటెరిక అనేస్తాడు. ఇరవై రూపాయలూ ఇచ్చాక మాట్లాడమంటాడు.
వెళ్లరా అట్టే మాట్లాడక. వెళ్ళి రెండుసేర్ల బియ్యం పావుసేరు పెసరపప్పూ లాక్కురా, నువ్వు తీసుకురాగలవు. నాకు తెలుసు.
వెళ్ళమ్మా, వెళ్ళు... రెండు సేర్ల బియ్యం, పావుసేరు పెసరపప్పూ ఇమ్మను సెట్టిగారిని - అన్నాడు ముసిలాయన.
వెళ్ళు మరి ఆలస్యం చెయ్యక. కొట్టుకెళ్లి నువ్వెప్పుడూ ఉత్త చేతుల్తో రాలేదు. నువ్వొచ్చేలోగా అవ్వని పొయ్యిలో నిప్పు రాజెయ్యమంటాను. మహారాజుల్లాగ భోంచేద్దాం అన్నాడు మానాన్న.
నాకేం తెలియదు బాబూ! మనం డబ్బెగెయ్యాలని చూస్తున్నామన్నాడు సెట్టి. నువ్వే ఉద్యోగం చేస్తున్నావో చెప్పమంటాడు.
అంతేనా? సరే వెళ్ళి చెప్పు. ఇందులో దాపరికం ఏముంది? నేను కవిత్వం రాస్తానని చెప్పు. మానాన్న పగలూ రాత్రీ కవిత్వం అల్లుతూ ఉంటాడని చెప్పు.
అలాగే చెబుతానుగాని అది సెట్టిమీద పనిచేస్తుందని అనుకోను. మీ నాన్న కవిత్వం చెబితే ఎవరికి గొప్ప అంటాడు. అందరు నిరుద్యోగుల్లాగా నువ్వు ఎక్కడకైనా వెళ్ళడం ఎవర్నైనా చూడడం అదేమీ లేదట, ఏ పని చెయ్యవట. ఎందుకూ పనికిరావట.
సెట్టీ నీకు పిచ్చెత్తిపోయిందని నేనన్నానని అను. నీకు తెలియదేమోగాని నా అంత గొప్ప కవి లేడనిచెప్పు. ప్రపంచంలో ఎవరికీ తెలియని మహా కవుల్లో మొదటివాణ్ణని చెప్పు.
చెప్పినా సెట్టికి నచ్చుతుందని తోచదు. అయినా చూస్తాను. ఏమో నాకు చేతనైనది చేస్తాను. ఇంట్లో ప్రస్తుతం ఏమీ లేదూ?
ఏ కొంచమో అటుకులు మాత్రం ఉన్నాయి. నాల్గు రోజుల్నుంచీ వరుసగా అటుకులే తిని బతుకుతున్నామని నీకూ తెలియదూ? ఇవాళైనా ఇన్ని బియ్యం తెచ్చి ఇంట్లో పడెయ్యకపోతే నేను రాస్తున్న ప్రబంధం పూర్తికాదు.
ఏమో నాచేతనైనదంతా చేసే చూస్తాను.
