హైదరాబాదులో తను విన్నది నిజమేనా? సినిమా హాలు గోపాలరావు పని కట్టుకొని తనున్న గదికొచ్చి చెప్పాడు. ఏమీలేకపోతే అతనెందుకొచ్చి చెప్తాడు? అసలతనికేం అవసరం వచ్చింది? కావాలంటే లాయరు దగ్గరక్కూడా తీసుకెళ్తానన్నాడు. అతని మాటలు నమ్మలేక వెళ్ళలేదు. వెళ్తే అసలు విషయం బయటపడేదేమో?
రామనాథ బాబు ఎలాంటి మనిషో తనకు తెలియదా? తను సినిమా హాలు ప్రాజెక్ట్ చెడగొట్టటానికే గోపాలరావు అన్నీ కల్పించి చెప్పి వుండకూడదా? ఆ స్థలం తాను కొట్టేయాలని ఇంత పన్నాగం పన్నాడేమో! లేకపోతే అతను అంత పనిగట్టుకొని తన దగ్గరకొచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది? అవీ ఇవీ చెప్పి తనను వల్లో వేసుకోవాలని చూస్తున్నట్టున్నాడు! ఆయన చూపులూ! మాటలూ! వెళ్ళిపోతూ హోటలుగదిలో తన వంక ఎలా చూశాడు? మళ్ళీ కలుస్తానన్నప్పుడు గొంతెలా పెట్టాడు?
జుట్టు చిక్కు విడి దువ్వెన సాఫీగా సాగుతోంది.
అన్నం తిని వరూధిని పక్కమీద నడుం వాల్చింది. ప్రయాణపు బడలికా వదల్లేదు. వళ్ళంతా విరగ్గొట్టినట్టుగా వుంది. కునుకు పట్టినట్టే పట్టి బుర్రలోని ఆలోచనల తీవ్రతకు తేలిపోతుంది.
"ముదనష్టపాడు లేనిపోనిది పెట్టాడు మనసుకు!" ఆలోచనల ధాటికి ఆమె పెదవులు కదిలాయి. అప్రయత్నంగానే బయటికి అనేసింది. ఆ తర్వాత ఆమె మనసు కొంత ఊరడిల్లింది. నెత్తిమీద నుంచి బరువు దించినట్టయింది. తల్లోని చిక్కుముడి ఊడిపోతున్నట్టనిపించింది. హాయిగా నిద్రపట్టింది.
వరూధిని నిద్రలేచేసరికి సాయంకాలం ఆరుదాటిపోయింది.
"అబ్బ! ఎంత నిద్రపోయాను!" అనుకొంటూ వంటగదిలోకి వచ్చింది. వంటమనిషి బుచ్చమ్మ కాఫీ కలిపి ఇచ్చింది.
"వార్రాలేదా పొద్దున్నుంచీ?"
"మధ్యాహ్నం మీరు పడుకొన్నప్పుడొచ్చి భోంచేసి మళ్ళీ వెళ్ళిపోయారు."
"రామనాథ బాబు ఊర్నుంచి వచ్చారా?"
"ఏమోనమ్మా! తెలియదు. మీరు వెళ్ళాకయితే ఇక్కడకు రాలేదు. పొద్దున వాళ్ళ నాయర్ మార్కెట్ లో కన్పించాడు. గువ్వాపిట్టలకోసం వచ్చానన్నాడు. అయ్యగారు లేకపోతే వాటికోసం ఎందుకు వస్తాడూ? ఏమోనమ్మా! ఇంకెవరి కోసమైనా పిట్టల్ని కొనుక్కుపోతున్నాడేమో నాయరు మరి!" బుచ్చమ్మ వరూధిని కాఫీ తాగుతున్నంతసేపూ అలా చెప్పుకుపోతూనే వుంది.
ఆవిడ్ని మాట్లాడనిచ్చేవాళ్ళుండాలేగాని, అవతలవాళ్ళు విన్నా వినకపోయినా ఉండలోనుంచి దారంపోగు లాగినట్టు, ఒకదానికొకటి గొలుసులు కలిపి చెప్పుకుపోతూనే వుంటుంది.
వరూధిని కాఫీ..... కప్పులో కొంత వదిలేసి, వంటమనిషి చేతుల్లో పెట్టి, బాత్ రూంలోకి వెళ్ళింది.
వరూధిని పూర్తి మేకప్ అయ్యేసరికి ఏడున్నర దాటింది.
"జట్కా పిల్చుకు రమ్మంటారా?" కమలమ్మ అడిగింది.
వరూధిని వాచీ చూసుకొని "ఇంకా టైం వుందిలే! ఓ అరగంట ఆగి రిక్షాపిలువ్" అని చెప్పింది ఎందుకు జట్కా మానేసి రిక్షా పిలవమంటోంది అని ఆలోచిస్తూ కమల వెళ్ళింది.
ఎనిమిదింబావుకు వరూధిని ఎక్కినా రిక్షా వరూథినీ పిక్చర్ ప్యాలెస్ ముందు ఆగింది.
ఆఫీసు గదిలో శివరాం తలవంచుకొని పని చేసుకుంటున్నాడు. ఆఫీసు గది పక్కన ఓ క్షణకాలం నిలబడింది. ఎవరూ ఆమెను గమనించనట్లులేదు. తిన్నగా రిజర్వుడు క్లాసు గేటు ముందు కెళ్ళింది. గేటు కీపరుకూడా లేడు. తలుపు తోసుకొని వెనక పక్క ఎడం వైపు సీట్లల్లో ఒకదాంట్లో కూర్చొంది. రిజర్వుడు క్లాసులో పెద్దగా జనం లేరు. హాలంతా కలయజూసింది. కాసేపటికి హాల్లో మనుష్యులు మసక మసకగా కన్పించారు. రిజర్వుడు క్లాసులో కుడివైపున గోడ పక్కగా ఒక స్త్రీ, ఒక పురుషుడూ కూర్చొని ఉన్నారు. ముందు వరసలో పల్చపల్చగా అక్కడో ఇద్దరూ ఇక్కడో ఇద్దరూ కూర్చొని వున్నారు. కాటరింగ్ కుర్రాడు లోపలకొచ్చి గోడ పక్కగా కూర్చున్నవాళ్ళ దగ్గర కెళ్ళి వంగి నిల్చున్నాడు. ఏదో మాటల్లో పడివున్నవాళ్ళు కుర్రాణ్ణి పట్టించుకోలేదు. వాడలాగే పది నిముషాల దాకా నిల్చున్నాడు. అలా కేటరింగ్ కుర్రాడు నిరీక్షిస్తూ నిలబడ్డాడంటే అవతల వాళ్ళెవరో గొప్పవాళ్ళయి వుండాలి. ఆ సంగతి వాడికి కూడా తెలిసి వుండాలి. లేకపోతే వాడు చిటికెలువేసి మరీ ఖాళీ గ్లాసులూ, బాటిల్సూ తీసుకెళ్తాడు!
వరూథినికి కుతూహలం పెరిగి వాళ్ళకేసి పరిశీలనగా చూడసాగింది. వాళ్ళు ఆమెను చూసినట్టులేదు. కాని ఆమెకు అతడ్ని ఎక్కడో చూసినట్టుగానే వున్నది. దూరంగా వుండటం వల్ల ఆమె అతన్ని పోల్చుకోలేకపోతోంది. అతన్ని పోల్చుకోవటానికి కొంతసేపు ప్రయత్నించి, సినిమా అయిపోయాక వెలుగులోనే చూడొచ్చని, వాళ్ళమీద నుంచి కళ్ళను తెరమీదకు మళ్లించింది. మనసును తెరమీద కన్పించే దానిమీద లగ్నం చెయ్యటానికి ప్రయత్నించసాగింది.
అది తను చూసిన చిత్రమే. అయినా కథ మర్చిపోయినట్టుగానే వుంది. ఇంటర్ వెల్ తర్వాత కథ నడుస్తోంది. భర్త భార్యను అనుమానించి వెళ్ళిపోయాడు. భార్య పిల్లల్ని పెట్టుకొని, దేముడి పటం ముందు నిలబడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పాడుతోంది. తన పాతివ్రత్యాన్ని కాపాడమనీ, భర్తకు తన శీలాన్ని నిరూపించి తనను తన భర్త దగ్గరకు చేర్చమని ఆ మహా ఇల్లాలు దేవుడితో మొర పెట్టుకొంటోంది. పిల్లలుకూడా తల్లితోపాటు పాట లంకించుకొన్నారు. ఇద్దరు పిల్లలూ, తల్లి చెంపలమీద కారుతూన్న కన్నీటిని తుడుస్తోన్నారు. వాళ్ళ కళ్ళల్లోంచి కారే కన్నీటికి ప్రేక్షకుల చెంపలు తడిసిపోతున్నాయి.
కథ మధ్యలో నుంచి చూడటం వల్లనో ఏమో వరూధినికి ఏడుపు రాలేదు. మనసు కలత పడలేదు. పైగా అదంతా ఓ తమాషాగా అనిపించింది.
పిచ్చిముండ! కాకపోతే తన శీలాన్ని భర్తముందు నిరూపించమని దేవుణ్ణి వెడుకుంటుందేం? తన పాతివ్రత్యాన్ని తన భర్త చేత నమ్మించలేని ఆడది సంసారం ఏం చేస్తుంది? సంఘంలో ఎలా బ్రతుకుతుంది? మొగుడి మనస్సు మార్చాల్సింది తను కాదా? వట్టి పుణ్యానికే భార్య మీద అనుమానపడి పారిపోయే మొగుడిమీద దానికి అంత ప్రేమ ఎందుకో? అది భక్తా? అలా ఉంటేనే, అది పతివ్రతా? దాని బొంద! అది భక్తీ కాదూ, ప్రేమా కాదు, మొగుడ్నొదిలి బ్రతకలేక అలా ఏడుస్తూంది. పైగా దాని మెడకు గుదిబండల్లా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అట్లా చెప్పుకుని దేవుడి ముందేడిస్తే బాగుంటుందిగా? దేవుడైనా నిజం చెప్పినందుకు సంతోషిస్తాడుగా? ఈ రకం పత్రివ్రతలు దేవుడి ముందు కూడా నిజం చెప్పరు. మొగుడికి చెప్తారా? అందుకే వాళ్ళకు అపనమ్మకం పుట్టి, అనుమానాలు పెరిగి పారిపోతారా! నిజంగా దానికి మొగుడు కావాలా? అన్ని ఏడుపులు ఏడుస్తుంది? కావాలంటే అ మాత్రం మొగుడు దొరకడా? చీటికి మాటికి పెళ్ళాం బిడ్డల్ని వదిలి పారిపోయేవాళ్ళేనా ఆదర్శ భర్తలంటే? ఆడదాన్ని పువ్వుల్లో పెట్టి పూజించే మగవాళ్ళు ఎందరు లేరు? తన భర్తలాంటివాళ్ళు.....వెంకటపతిలాంటివాళ్ళు దేశంలో ఎంతమందిలేరు? దేశం గొడ్డుపోయిందా? నిజమైన భర్తలంటే వాళ్ళే! భార్యేం చేసినా భరించేవాడే భర్త. అదే నిజమైన, నిస్వార్ధమైన ప్రేమా. అదే ఆదర్శ దాంపత్యం. వాడే ఆదర్శమైన భర్త. అలాంటి భర్త దొరికిన ఆడదానిదే అదృష్టం. దాని జీవితం పండు వెన్నెల. మూడు పువ్వులూ ఆరు కాయలూ అలాంటి భర్త దొరకాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. మరి ఈసినిమా ఏమిటి? వీడు చెప్తున్నదేమిటి? ఈ కథ రాసిన వాడెవడు? ఈ సినిమా తీసినవాడెవడు? ఈ డబ్బాలు తెచ్చి ఈ హాల్లో ఆడిస్తున్నవాడెవడు?
వరూధినికి గోద్రెజ్ బీరువాలో మిగిలిపోయిన వైన్ బాటిల్ గుర్తొచ్చింది. అందులో ఇంకా ఎంత ఉంది? క్వార్టరు కూడా లేనట్టుంది. అంటే సగం బాటిల్ పైగా అరగంటలోనే తాగేసిందా? ఛ! అంత ఎక్కువ తాగకూడదు. తాగితే ఏమయింది? ఇప్పుడు తను బాగానే వుందిగా? సినిమా బాగానే కన్పిస్తోంది. తను సీట్లోనే కూర్చొని వుంది. ఇంకేం తను బాగానే వుంది. ఆ మిగతాదికూడా తాగేస్తే సరిపోయేది.
వరూథినికి నవ్వాగలేదు. వళ్ళంతా వెచ్చ వెచ్చగా హాయిగా వుంది. మనసు శరీరంతో సహా గాల్లోకి తేలిపోతున్నట్టుంది.

