
నాకు రవణమ్మగారే కళ్ళముందు మెదలసాగారు.
నన్నెంతో అభిమానించి ప్రేమగా చూసేవారు. దగ్గర కూర్చోపెట్టుకుని వెండి గిన్నెలో అన్నం పెట్టేవారు. ఇద్దరం అన్ని కోవిళ్ళకి, ఎన్ని స్థలాలకి వెళ్ళేం. మహాబలిపురం, కంచి, తిరుపతి. తిరుకోళికుండ్రం_ ఒకటేమిటి ఇద్దరం పాతపొత్తుగా వుండేవాళ్ళం. ఆవిడకి శ్రీశ్రీగారంటే పంచప్రాణాలు. పండులేకుండా ఒక్కనాడు కూడా శ్రీశ్రీగారికి అన్నం పెట్టలేదావిడ, భోజనం కాగానే_ఏపిల్, బత్తాయో, ద్రాక్షో, అరటిపండో ఏదో ఒక రకం పండు. అన్నంలో గడ్డపెరుగు, ఆవకాయ, ఇవన్నీ చూసేనుకదా. కళ్ళముందు రీలుగా తిరగడం ప్రారంభించింది.
ఇప్పుడేఁవయింది. పోట్లాడుకున్నాం. ఆ కుటుంబంలో మనిషిని కాబోతున్నాను. దీనికింత ఆలోచనా, అంత బాధ ఎందుకు? అనుకొంటూ వుండగా_
"శ్రీశ్రీగారొచ్చారక్కయ్యా" అని మా రామం చెప్పి లైటు వేసింది.
"చీకట్లో ఏం చేస్తున్నావు సరోజా"
"వెలుగుని వెతుక్కుంటున్నాను"
"అబ్బబ్బో కవిత్వం చెప్పేస్తున్నావేవిటి"
"మీరేమిటి ఉషారుగా ఉన్నారు?"
"ఉషారుకాక మరేఁవిటి! నా వరకూ పెద్ద భారం తగ్గించావు. మీ ఇద్దరి పోట్లాటలో అసలు విషయం తేలిపోయింది."
"మరి ఆవిడ మిమ్మల్నేవీ అనకుండా వూరుకున్నారా?"
"నేనింట్లోకి వెళితేగా. దాన్ని దింపేసి అలాగే అన్నపూర్ణాకి వెళ్ళాను. వస్తూ పార్క్ లేండ్స్ కి వెళ్ళి స్వీటుతోసహా రవ్వదోసె తిని కాఫీ తాగి వస్తున్నాను."
"అయితే ఈ రాత్రి జాగారమేనా?"
"అబ్బా ఆ సంగతి ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది. కానీ నువ్వేమిటి అంత ధైర్యంగా దానితో మాట్లాడి పందెం కట్టేశావు."
"ఏవండోయ్ ! ఆవిడంటే నాకు భయం అనుకున్నారా? ఎంతమాత్రంలేదు. ఆవిడ్ని అర్ధం చేసుకోవడం కష్టం కానీ ఎంత మంచి ఆవిడో నాకు తెలుసు. మరి నా విషయంలో అంటే న్యాయమే కదండి. ఏ ఆడది_తన భర్తని ఇంకొక స్త్రీకి వదులుతుందండీ. నేను చచ్చినా ఆవిడ తప్పంటే ఒప్పుకోను. పోతే ఆవిడే నన్ను రెచ్చగొట్టి అనవసరంగా నా చేత మాట్లాడించారు. ఇక అంతే! నేనూ ఒళ్ళూ పై తెలీకుండా ఆ ఆవేశంలో మాట్లాడేశాను" అన్నాను.
"ఇప్పుడు బాధపడుతున్నావా ?"
"ఏం పడి ఏం లాభం?" అన్నా నవ్వుతూ.
ఈ లోగా బైట నుంచి 'టెలిగ్రామ్' అని వినిపించింది.
వెళ్ళి సంతకం చేసి తీసుకొని వారి చేతికిచ్చాను.
"మా ఇంకో మావగారూ, అత్తగారూ రేపు మెయిల్ లో వస్తున్నారుట" అని నవ్వారు.
వైరిచ్చిన ప్రకారం నా పెంపుడు తల్లిదండ్రులు వచ్చేశారు. మా ఇల్లు ఇద్దరమ్మలూ, నాన్నలతో కళకళలాడి పోతోంది.
అందరం సావధానంగా కూర్చొని మాటల్లో పడ్డాం. పది గంటలు కావస్తోంది.
"పెళ్ళి అన్నది పదికాలాల పంట అమ్మా! టాటా నగరం సంబంధం చేసుకో అమ్మా" అని నా పెంపుడు తల్లిదండ్రులు కూడా అన్నారు.
వాళ్ళకింకా ఇక్కడ జరిగిన వ్యవహారాలన్నీ తెలియవు. ఎటూ జెడ్ అన్నీ వివరంగా చెప్పేను.
"అంటే నీ ఉద్దేశం" అని అమ్మ అడిగింది.
"ఉద్దేశానికేముందమ్మా. ఇంత దూరం వచ్చాక ఇక వెనక్కి వెళ్ళడం, లేక మరొకరిని వివాహం చేసుకోవడం అన్నది జరగనిపని. నేను శ్రీశ్రీగారిని చేసుకుంటాను" అని ఖచ్చితంగా చెప్పాను.
ఇద్దరు నాన్నలూ, అమ్మలూ ఒకటైపోయారు.
"ఇదేం అన్యాయమే. శ్రీశ్రీగారికి ఏం తక్కువనికానీ వారు మామూలు మనిషని అనటం కానీ కాదు. ఆయన జగమెరిగిన బ్రాహ్మణుడు. ఆయన్నొక అవతార పురుషుడిగానే మేం అనుకుంటున్నాం. అన్నిటికీ అతీతులాయన. అటువంటి మహానుభావుడి సంబంధం కలుపుకోవటానికి మించిన అదృష్టం వేరే ఏముంటుందమ్మా. కాని ఆయన వయసేమిటి. నీ వయసేమిటి. పైగా మొదటి భార్య వుంది. ఆవిడకీ నీకూ మధ్య పరిస్థితులుకూడా బాగులేవని అంటున్నావు. ఇంతకాలం పడిందిచాలు. శ్రీశ్రీగారిని చేసుకున్నావంటే జీవితాంతం సవితి పోరుతో చావవలసిందే. ఎందుక్కోరి తెచ్చుకుంటావు" అని ప్రారంభించారు.
"నిన్నటివరకూ నాకూ ఆ ఉద్దేశంలేదు. ఆయన్ని చూడకుండా నేను వుండగలనా అన్న అనుమానం వచ్చి చాలా రోజులైంది. అయినా పెళ్ళి చేసుకుందామనే తలపు రాలేదు. దీనికి కారణం ఆయన భార్యే. అన్నీ ఆలోచించి ఈ నిర్ణయానికొచ్చాను.
నేను శ్రీశ్రీగారి దగ్గర ఇంతకాలం పనిచేసిన తర్వాత రేపు ఇంకొకర్ని పెళ్ళి చేసుకున్నా సుఖపడేదేంలేదు. అతని దగ్గర కూడా నా కేరక్టర్ కి సంబంధించిన తగవులూ, అనుమానాలూ, మాటలూ ఎలాగూ తప్పవు. అంతకన్నా వయస్సు తేడా వున్నా వారి దగ్గర పనిచేసినదాన్ని కనుక వారి దగ్గరే సెటిలయి పోవటం మంచిది.
మేం ఇద్దరం ఒకర్నొకరు కోరుకుంటున్నాం. ఒకళ్ళను విడిచి ఇంకొకళ్ళం వుండలేని స్థితికి వచ్చాం. ఇద్దరం ఒకర్నొకరం ప్రేమించుకున్నాం కూడా. నేను శ్రీశ్రీగారిని ప్రేమిస్తున్నట్టు ఈ మధ్యే తెలుసుకున్నాను. ఇక మరెవ్వరూ కాదనకండి. కాదన్నా లాభంలేదు. రేపో ఎల్లుండో పెళ్ళి కాదు. దానికి కూడా కొంత టైము పడుతుంది.
శ్రీశ్రీగారు కూడా వచ్చే వేళయింది. వారితో కూడా మాట్లాడితే మీకు కొంత అయిడియా ఉంటుంది" అని నా పెంపుడు తల్లిదండ్రులకి చెప్పాను.
"నువ్వంతగా పట్టుపడితే మేం ఇంక చేసేదేముంది? నువ్వు బాగుండటమే మాకు కావాలి. బాగా వయస్సు తేడా వుందన్న విషయం ఒక్కటే ఆలోచించాలి. కానీ మిగిలిన విషయంలో శ్రీశ్రీలాంటి భర్త దొరకటం పూర్వజన్మ సుకృతమే" అంటూండగా__
"మీరు కూడా ఇప్పుడున్న జన్మని వదిలేసి తెలీని జన్మ చూరు పట్టుకొని ఎందుకండీ వేలాడటం" అంటూ శ్రీశ్రీగారు వచ్చారు. ఎందుకో తెలీదుగాని పెళ్ళి అనే మాట వచ్చిన దగ్గర్నుండి వారిదగ్గర మునపటంత స్వేచ్ఛగా వుండలేకపోయేదాన్ని. ఏదో తెలీని భయం. సిగ్గు. మరిన్నాళ్ళూ ఇవన్నీ ఏమయినట్టు? అసలు క్రమేపీ నాలో ఈ మార్పు లేమిటి? అనే ఆలోచనతో వారిని పలకరించలేదు.
వారి ముఖం చూస్తున్నాను. మాటలు వింటున్నాను. కానీ "రండి కూర్చోండి" అని అనలేదు.
