Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 67


    "నేను ముందు సీట్లో మీ దగ్గర కూర్చుంటా" అన్నారావిడ.
    "ఇక్కడ జాగా లేదు. వెనక సీట్లో కూర్చో" అన్నారు.
    ఆవిడ కారెక్కారు. వెనకసీట్లో ఇద్దరం  చెరోవైపూ  కూర్చున్నాం.
    స్టాండర్డ్ కంపెనీ  గేటు దాటి కారు రోడ్డుమీద కొచ్చింది. ఆవిడ ఆవేశం కట్టలు తెంచుకొని  వచ్చేసింది. ఇక ఇదీ అదీ అనిలేదు 'ఓ__' అని అరుపులు ప్రారంభించారావిడ.
    "నోరు మూస్తావా లేదా" అన్నారు.
    "దాన్నిక్కడ  దింపి  టాక్సీలో  పొమ్మనండి" అన్నారావిడ.
    'దాని బరువు నువ్వేం మోస్తున్నావు? నిన్ను మోస్తున్నట్టే  దాన్ని కూడా కారే మోస్తోంది. సరోజ దిగదు. దిగడానికి వీల్లేదు..."
    "ఏమండీ..." అని నేను ఏదో అనబోయేను.
    "నోర్ముయ్యి" అన్నారాయన.
    భగవంతుడా ఈ రోజు  ఏం జరగాలని రాసివుందో  అనుకున్నా.
    ఇక ఆవిడ తిట్ల ప్రవాహానికి అడ్డులేదు. పది మాటలకి  ఒకమాట  నేను జవాబిస్తున్నాను. శ్రీశ్రీగారు నోరెత్తలేదు. మా ఇద్దరి మాటలమధ్య బేక్ గ్రౌండ్ మ్యూజిక్ లా  సిగరెట్టు దమ్ములాగే ధ్వని మాత్రం వస్తోంది. ఆవిడ మాటలతో నన్ను పిచ్చిగా రెచ్చగొడుతున్నారు. నాలా ఓర్మి నశిస్తోంది.
    "వారి దగ్గరకి  ఇలా  ఎంతమంది రాలేదు. పోలేదు. కానీ ఇలా పట్టుకుని ఎవరూ వేలాడలేదు. ఈ మంతనాలు ఎంతకాలమో  నేనూ చూస్తాను. ఈ ఆటలు నా దగ్గర సాగవు. వారికి ఉంపుడు కత్తెగా  జీవితాంతం వుండాల్సిందేకానీ, పెళ్ళి చేసుకోడానికి  వీల్లేదు. నా కంఠంలో  ప్రాణం వుండగా నాకు సవతిగా రాలేవు. వారికి రెండవ భార్యవి కాలేవు. నన్ను ఎదిరించి  మీరిద్దరూ ఎంత దూరం వెళతారో  చూస్తాను.
    శ్రీశ్రీ వుంచుకున్నదన్న  పేరేగాని, పెళ్ళానివని  ఎవరూ  చెప్పుకోరు" అంటూ మాటలు తిరగేస్తోందావిడ.
    ఇక నాలో  సహనం  నశించింది. ఈవిడతో ఇక లాభం లేదనుకుంటూ_"చూడండి. దయచేసి  నన్ను రెచ్చగొట్టకండి. నా సంగతి మీకు తెలీదు. గౌరవ మర్యాదలకి పాకులాడే  మనిషిని. మీ మాటలతో నాలో మార్పులు కలుగుతున్నాయి. వాటితో వచ్చే మంచి చెడ్డలకి  మీరే బాధ్యులు  అవుతారు. ఈ క్షణం దాకా  నేనింకా మంచి అభిప్రాయంతోనే వుంటున్నాను. దయచేసి  మరేమీ మాట్లాడకండి" అన్నాను.
    "నేనూ ఆఖరిసారిగా  చెప్తున్నాను. ఒక్కటి మాత్రం  జ్ఞాపకం  పెట్టుకో. శ్రీశ్రీకి ఒక్కర్తే పెళ్ళాం. మళ్ళీ మరొకర్తి  పెళ్ళాం అనిపించుకోలేదు. నా ఖర్మకాలి నువ్వు వార్ని  వదలకుంటే  ఉంపుడుకత్తెవుగా  చచ్చేదాకా పడివుండాల్సిందే" అన్నారావిడ.
    అంతే! నా ఒళ్ళు భగ్గున  మండింది. ఆవిడ్నిచూసి "చూడండీ! మీ అహంభావం, మీ మాటల కోసమైనా  నేను మీతో పందెం కట్టాలి. మీరింక విచారించి లాభంలేదు. నేనూ మీకు చెప్తున్నా! ఇన్నాళ్ళూ తీరని సమస్యతో సతమతమౌతూ, మంచికిపోయి  మాటలుకాచేను. నన్ను రెచ్చగొట్టి నా సమస్యను మీరే పరిష్కరించారు. నా ఆఖరి నిర్ణయానికి మీరేకారకులు.
    నేను శ్రీశ్రీగారిని పెళ్ళి చేసుకుంటాను. శ్రీశ్రీ పెళ్ళాన్ననిపించుకుంటాను. మీకు సవతిగా రాకపోతే నా పేరు మార్చుకుంటాను. నేనన్నమాట  నిలబెట్టుకోకపోతే  ఉపద్రష్ట సూర్యనారాయణ కూతుర్ని కాను. ఎవరడ్డుతారో చూస్తాను" అని వళ్ళు  తెలియని కోపం, అవమానంతో  అనేశాను. నాలో ఆవరించిన ఆవేశానికి నేనే ఆశ్చర్యపోయాను.
    శ్రీశ్రీగారు  ఒక్కసారి చురుగ్గా  నా కళ్ళలోకి  చూశారు. అంతే_ఇక ఆవిడ మాటలేవీ  నా చెవికి ఎక్కలేదు. ప్రళయం వచ్చినా పట్టించుకొనేస్థితిలో  లేను. ఈ లోకాన్ని  విడిచి  నా ఆలోచనలకు హద్దూపద్దూ లేకుండా పోతున్నాయి.
    శ్రీశ్రీగారితో  నా జీవితం  ముడిపడబోతోంది. ఇక నా నిర్ణయాన్నెవరూ మార్చలేరు. ఆవేశంలో అకస్మాత్తుగా  తీసుకున్న నిర్ణయం అయినా మంచిదే. శ్రీశ్రీగార్ని కాదని వేరొకర్ని  పెళ్ళిచేసుకున్నా, జీవితం నరకమే అవుతుంది కానీ సుఖం వుండదు.
    వచ్చేవాడు ఎలాంటివాడో, అతనికి శ్రీశ్రీగారి గురించి, వారి మంచితనం గురించి, గొప్పతనం గురించి కాని ఏం తెలుస్తుంది. 'ఈ అమ్మాయి శ్రీశ్రీ దగ్గర మూడేళ్ళుగా పనిచేస్తోంది, ఊరికే  వదిలివుంటాడా' అని అనుకోవడమే కాకుండా_జీవితాంతం నన్ను దెప్పుతూనే వుంటాడు.
    మరొకర్ని పెళ్ళిచేసుకోవడం  మనసుకి రాని మనువే అవుతుంది.
    నేను నిజంగానే శ్రీశ్రీగార్ని  ప్రేమిస్తున్నానన్నమాట  అని నికరంగా  తేల్చుకున్నాను. ఈ పాడు ప్రేమ ఇంతకాలం  ఎక్కడ  దాగిందో. శ్రీశ్రీ భార్యనవటం  నిజంగా  నా అదృష్టమే. వారిచరిత్రలో నాకూ వారి భార్యగా ఏ మూలో సూది మోపినంత  జాగా  వుంటుంది. అంతకుమించి ఏం కావాలి. చావో రేవో_మంచో చెడో తేల్చుకుందామనేకదా మొదట్లో  వారి దగ్గర  ప్రవేశించాను. దాని పరిణామం  ఇదే కాబోలు _ అని ఆలోచిస్తున్నాను.
    ఇంటికొచ్చేం. "దిగు సరోజా" అని శ్రీశ్రీగారన్న మాట పరధ్యానంగా  వున్న  నాకు వినిపించలేదు. "సరోజా నిన్నే" అని కళ్ళ గుర్తుగా ఆనటంతో.
    "ఏమిటండీ?" అన్నా.
    "ఏవిటాలోచిస్తున్నావు. ఇల్లు వచ్చింది దిగు" అన్నారు.
    గతుక్కుమన్నాను. చటుక్కున కారుదిగి "వస్తానండి. నమస్కారం" అన్నాను.
    కారు తిన్నగా మా ఇంటికే  వచ్చిందన్నమాట.
    "నేను గంటలో  వస్తాను సరోజా"_అని శ్రీశ్రీగారు వెళ్ళిపోయారు.
    ఇంట్లోకి  అడుగుపెడుతూనే  చెంబుడు మంచినీళ్ళు  గడ గడ తాగేశాను. "అలాగున్నావేమి"టని  అమ్మ అడిగింది. "ఏం లేదమ్మా" అన్నాను.
    "ఏమీ లేకపోవటం  ఏమిటి నీ ముఖం. కార్లో  నీతో కూడా  వచ్చినావిడెవరు?" అని అడిగింది.
    "శ్రీశ్రీగారి భార్యమ్మా" అన్నాను.
    "ఎవరూ? రవణమ్మగారా?"
    "ఆఁ! సాక్షాత్తూ  రవణమ్మగారే" అన్నా.
    "ఆవిడెలాగొచ్చేరు? ఆశ్చర్యంగా వుందే" అంది అమ్మ.
    "అదే గమ్మత్తమ్మా!" అన్నాను.
    "అందరూ  కల్సి  ఒక్కసారిగా  ఎలాగొచ్చారే" అని మళ్ళీ అడిగింది.    
    "చెప్తాలే అమ్మా! నన్ను కాస్త సర్దుకోనీ" అన్నాను.
    ఇక ఏమ్మాట్లాడకుండా  "కాఫీ తాగుతావా" అంది అమ్మ.
    "ప్లీజ్ అమ్మా! స్ట్రాంగ్ కాఫీ" అన్నాను.
    అమ్మ లోనికివెళ్ళింది. బెడ్ పరిచేశాను. లైట్లు  ఆర్పేశాను. అంతే_పక్కమీద వాలాను.
    జరిగిందేమిటి? నిజమేనా! నేనేమిటి మాట్లాడాను. అలా మాట్లాడటం తప్పు కాదా? ప్చ్! తప్పేమిటి_ గాడిదగుడ్డు. దగ్గర దగ్గర మూడు ఏళ్ళుగా  మడి కట్టుకొని  కూర్చున్నాను. మంచిపేరు లేదు. రంపపు కోత  అనుభవిస్తున్నాను. మంచిమాటే. ఇక నేను శ్రీశ్రీకే స్వంతం. ఆత్మాభిమానం వెన్నుచరుస్తోంది. ఇక మీదొచ్చే  పరిస్థితుల్ని  ఎదుర్కొని  నిలవాలని  అనుకుంటూ వుండగా_
    "చీకట్లో  ఏం చేస్తున్నావే" అని అమ్మ వచ్చింది.
    "ఏమీ లేదమ్మా, తలకాయ నొప్పిగా వుంది" అన్నాను.
    "ఏదో జరిగింది. చెప్పకుండా  దాస్తున్నావు" అంది అమ్మ.
    "నీ దగ్గర దాపరికం  ఏం వుందమ్మా" అనేశాను.
    అమ్మ వెళ్ళిపోయింది. మళ్ళీ కళ్ళు  మూసుకున్నాను.
    
                             *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS