"ఏమిటా పరధ్యానం? ఎక్కడుంది నీ మనసు" అని అడిగేరు.
అప్పుడు "రండి కూర్చోండి" అన్నాను.
నా పెంపుడు తల్లిదండ్రులు శ్రీశ్రీగార్ని చూడటం అదే మొదటిసారి. వారు ఉభయులూ శ్రీశ్రీగారికి నమస్కారం చేస్తూ "మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా వుందండి. అంతా భగవంతుడి దయ" అని అన్నారు.
"డబ్బు ఖర్చుపెట్టి, ఖండెక్కి బరంపురం నుండి రెండు రోజులు వళ్ళు హూనం చేసుకొని వచ్చారు మీరు. ఇందులో భగవంతుడి దయ ఏం వుందండీ? నేనిలా అంటున్నందుకు మీకు కష్టం అనిపించొచ్చు.
"మీకు రెండు కోవెలలు కూడా ఉన్నాయనీ సరోజ చెప్పింది. నేను ఎవర్నీ కించపరచను. ఎవరి నమ్మకాలు వారివి. దేవుడా అంటూ నేలమీద దొర్లుకుంటూ పోతామన్నా నాకేమీ అభ్యంతరం లేదు. నాకు మాత్రం దేవుడు లేడు. నేను పరమ నాస్తికుడ్ని.
దేవుళ్ళ గొడవ ఎత్తితేనే నాకు పరమ అసహ్యం. పూర్వజన్మ, వచ్చే జన్మ ఇవన్నీ ఉత్తమాటలు. నాకు నమ్మకంలేదు" అన్నారు.
దేవుడి గురించి మావాళ్ళ దగ్గర ఇలా మాట్లాడుతున్నారే అన్న బాధతో దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి?" అని నేను అడిగాను.
"నాస్తికత్వం అన్నది బానిస మనస్తత్వాన్ని నిర్మూలనం చేసేది. ఎలాగయినా సరే బానిసలుగా వుండటం బానిస మనస్తత్వం. నాస్తికత్వం అంటే మనిషిలో స్వతంత్ర భావాన్ని పెంపొందించడం. చివరికదే ఇంకొకళ్ళ మీద ఆధారపడటమన్నది పోగొట్టి స్వశక్తిమీద ఆధారపడే విధంగా తోడ్పడుతుంది. అంచేత పూజలూ, పునస్కారాలకని కాల్చేటైము, డబ్బూ కూడా స్వయంకృషికి చేస్తే ప్రయోజనం వుంటుంది" అన్నారు. "మరి నాకుదేవుడూ, పూజలూ, పునస్కారాలూ ఎక్కువకదా ఎలాగా?" అన్నాను.
"దేనిదారి దానిదే సరోజా. నేను ముందే చెప్పాను. ఎవరిష్టం వారిది. నేను ఎవర్నీ దేనికీ ఫోర్స్ చెయ్యను. ఈ ఒక్క విషయంలోనే మనిద్దరం తూర్పు పడమరలం అనుకుంటాను. నీ దైవభక్తికి నేను అడ్డురాను. నా నాస్తికత్వం జోలికి నువ్వు రాకు. దీనికిమాత్రం మనిద్దరం కాంప్రమైజ్ అయిపోవాలి. వేరే దారిలేదు" అన్నారు.
"రక్షించేరు. మీ మాటల ప్రవాహంలో నా సందేహం ఒక్కటి తీరిపోయింది."
"ఏమిటది?"
"ఇంకేం వుంది.దేవుని సమస్యే. అదొక ప్రాబ్లమ్ సాల్వ్ అయింది" అన్నాను.
"ఇంకా ఆ బుర్రలో ఎన్ని సందేహాలున్నాయి? సందేహం వుండకూడదు సరోజా. సందేహం మనిషిని చెదపురుగులా దొలిచేస్తుంది. అనుమానం, సందేహం ఈ రెండూ ఏ మనిషికీ వుండకూడదు. ఈ రెండూ వున్న వాళ్ళ జీవితం నరకం అవుతుంది. వాళ్ళు సుఖపడలేరు సరికదా ఎదుటివాళ్ళని కూడా సుఖపెట్టలేరు.
అదే విధంగా ఈ దైవభక్తి వున్నవాళ్ళు కూడా సోమరిపోతులై నానా అగచాట్లు పడడమే కానీ జీవితంలో వాళ్ళు సాధించేదంటూ ఏమీవుండదు .దైవభక్తి ,దారిద్ర్యం ఈ రెండూ ఒకే నాణానికి బొమ్మా బొరుసు లాంటిది. మన దేశంలో వున్నంత దైవభక్తి,దారిద్ర్యం మరే దేశంలోనూ లేదు" అన్నారు.
ఈయన ధోరణి ఏడిసినట్టే వుందనుకున్నాను. కారణం వారి ధోరణి నచ్చక కాదు. మా అమ్మా నాన్నగారూ బరంపురం నుండి వచ్చారు. మొట్టమొట్టసారిగా వారిని చూస్తున్నారు. ఈ ధోరణి యిలాగుంటే వాళ్ళు ఏమనుకుంటారో? పెళ్ళికి ఏమయినా అభ్యంతరం చెప్తారేమోనని బాధ.
అయినా ఏం చేస్తాను. కానీ ఇది ఒకందుకు మంచిదే. వారి సంగతి ముందే తెలుసుకుంటే మేలు అనుకున్నా.
కాఫీలు వచ్చాయి. అందరం తాగాం.
"ఇవాళ ఆఫీసుకు వెళ్ళొద్దా" అని అడిగారు.
"మధ్యాహ్నం వెళదామండీ" అన్నాను.
"మా సరోజమ్మ ఉత్తరం రాసింది. (నన్ను నా పెంపుడు తండ్రి సరోజమ్మ అంటారు) అన్ని విషయాలు మాట్లాడి, మిమ్మల్ని కూడా చూసి వెళదామని భార్యాభర్తలిద్దరం వచ్చాం బాబూ" అని నాన్నగారన్నారు.
శ్రీశ్రీగారేమీ మాట్లాడలేదు.
"మా సరోజమ్మకి మంచి సంబంధం వచ్చిందని...." యింకా ఏదో అనబోతూ వుంటే_
"ఇక అవన్నీ ఎందుకులెండి. మీ సరోజమ్మని నేనే చేసుకుంటున్నాను.
ఎప్పుడన్నది త్వరలోనే నిర్ణయించి చెప్తాను" అని లేచిపోయారు.
"అదేమిటండీ వెళ్ళిపోతున్నారా"
"అవును సరోజా. కంపెనీకి వెళ్ళి వస్తాను"
"మళ్ళీ ఎప్పుడొస్తారు?"
"మధ్యాహ్నం మూడు గంటలకి వస్తాను"
అందరూ లేచి కారుదాకా వెళ్ళాం. శ్రీశ్రీగారు ఎంత విసుక్కున్నారంటే_
"ఇవేం మర్యాదలు సరోజా! ఇంట్లో ఇంతసేపు మాట్లాడుకున్నాంగా. వెళ్ళొస్తానని చెప్పిం తర్వాత కూడా గుమ్మం దగ్గర గంట, గేటు దగ్గర గంట, కార్లో కూర్చున్నాక గంట మాట్లాడి నడిరోడ్డుదాకా వచ్చి సాగనంపాలా .ఏవిటీ అలవాట్లు" అన్నారు.
నేను కొంచెం చిన్నపుచ్చుకున్నా_వెంటనే సర్దుకున్నా. ఎందుకంటే వారికిలాటి పనులు ఇష్టం వుండవు.
మళ్ళీ అందరం కూర్చున్నాం. నా పెంపుడు తల్లి దండ్రులు నిర్ఘాంతపోయారు. శ్రీశ్రీగారి మాటలు వాళ్ళకి కొంచెం నిరుత్సాహం కలిగించినా, వారి గురించి ముందుగానే తెలిసినవాళ్ళు కనుక సర్దుకున్నారు.
* * *
