Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 67

    "అదేం కాదు, మేటర్ ఈజ్ వేరీ సీరియస్" అంది జయంతి.

    "ఈజిట్?!" అంది దాక్షాయణి.

    జయంతి పెద్దగా చప్పట్లు కొట్టి నవ్వింది.

    "ఎందుకే అలా నవ్వుతున్నావు?" అంది దాక్షాయణి.

    "నీ ఇంగ్లీషు విని, ఫర్వాలేదే....బాగానే పికప్ చేశావు" అంది జయంతి.

    "ఏదో నీ పుణ్యం" అంది దాక్షాయణి.

    "కంగ్రాట్స్! కీపిటప్" అంది జయంతి.

    "థాంక్స్: అంది దాక్షాయణి నవ్వుతూ.

    దాక్షాయణి జయంతిలా ఇంగ్లీషు మాట్లాడాలనే కోరిక బలీయంగా వుండటంతో ఆమె ఉత్సాహాన్ని ఎందుకు నీరుకార్చాలని జయంతే ప్రతిరోజూ ఆమెకు ఇంగ్లీసు పాఠాలు నేర్పుతుంది. దాక్షాయణి పట్టుదలతో వాటిని అభ్యసిస్తుంది.

    "ఇంతకీ ఏంటే ఆ విషయం? సురేంద్ర సంగతి ఇంతవరకు చెప్పలేదు నువ్వు" అంది దాక్షాయణి.

    జయంతి ఇందాక రామాలయం దగ్గర జరిగిన సంఘటన చెప్పింది. అంతా విని దాక్షాయణి అలానే నిశ్చేష్టురాలై చూస్తుండిపోయింది.
    "ఏంటి పిన్ని అలా అయిపోయావువెంటి? అందుకే అమ్మా, నాన్నలకు చెప్పొద్దు అంది. చెపితే రేపట్నించి నాచేత కాలేజి మాన్పించివేస్తారు" అంది జయంతి.

    "ఆశ్చర్యపోక ఇదేమన్నా చిన్న విషయమా? పాపం సురేంద్ర ఆ సమయంలో అక్కడకు రాకపోతే నీ జీవితం ఏమయ్యేది?" అంటూ కంగారుపడిపోయింది.

    "కూల్ డౌన్.....కూల్ డౌన్" అంది జయంతి నవ్వుతూ.

    "వాడే పగబట్టి మళ్ళీ ఏమైనా చేస్తాడేమోనే! సురేంద్ర పై కూడా కక్ష కట్టి వుంటాడు. ఈ విషయం బావగారికి చెపితేనే మంచిది. పంచాయితీ పెట్టించి అందరి ముందు దోషిగా నిలబెడతారు. అప్పుడు వాడికి భయం వుంటుంది. ఎవరికి చెప్పకపోతే వాడికి భయం ఎందుకుంటుంది?" అంటూ కొత్త లాజిక్ చెప్పింది దాక్షాయణి.

    "ఇది నిజమే అనిపిస్తుంది ఒక విధంగా జయంతికి.

    "ఆలోచించి ఏదో ఒకటి చేద్దాంలే పిన్నీ. వాడు మాత్రం ఇక నా జోలికి రాడు. వస్తే ఈసారి వాడికి పడే శిక్ష పెద్దవాళ్ళ సమక్షంలో వుంటుంది" అంది జయంతి.

    "ఏమో! నాకెందుకో భయంగా ఉంది" అంది దాక్షాయణి.

    "భయం లేదు, గియం లేదు. నీకు అనవసరంగా చెప్పినట్లున్నాను" పద పోదాం" అంటూ లేచింది జయంతి.

                                                       36

    సర్వోత్తమరావు పంచాయితీ బోర్డు ప్రెసిడెంటు పదవి నుంచి కూడా తప్పుకున్నాడు. అయన దాదాపుగా ఇంట్లోనే వుంటున్నాడు. ఏదైనా అవసరం వస్తేనే తప్ప ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం లేదు. సుందరం కేసు విషయం ఆయన్ని బాగా కృంగదిసింది. రామశేషు ఇలానే దిగులుతోనే పోయాడు. కస్తూరికి అయన వాలకం చూస్తుంటే భయం వేస్తుంది.

    ఎందుకో ఈమధ్య ఆమెకు కూడా దిగులుపట్టుకుంది. గంపెడు సంతానాన్ని ఎలా ఈదుకురావాలో అర్ధం కావటం లేదు. పిల్లలు ఇంకా పసివాళ్ళే. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. భాద్యతలు ఎక్కువగా వున్నాయి. ఆదాయం తక్కువగా వుంది.

    రెండేళ్ళ క్రితం వరకు ఆ ఇంట్లో దిగులు అనేది లేకుండా అందరూ సంతోషంగా ఉల్లాసంగా వుండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు క్రమంగా ఆ ఇంటిని చీకటి అవరిస్తోంది.

    ఇంటి పరిస్థితిని గమనించే కస్తూరి కొత్తగా పాల వ్యాపారం మొదలు పెట్టింది. ఎవరేమనుకున్నా ఫర్వాలేదు. ఇల్లు గడవడం ముఖ్యం. ఆదాయం ముఖ్యం అనుకుని, పాలు, వెన్న అమ్ముతుంది. ఆ పనిని కాళమ్మకు అప్ప చెప్పింది.

    మొత్తం అయిదు గేదెలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళందరికోసం రెండు గేదెలు ఇచ్చే పాలను వినియోగిస్తుంది. మిగిలిన మూడు గేదెల పాలను అమ్ముతుంది.

    ఈ విషయంలో సర్వోత్తమరావు ఏమి పట్టించుకోలేదు. అవును, కాదు అని ఏమి చెప్పలేదు. కస్తూరి అందుకే ధైర్యం చేసి ప్రారంభించింది. పాలమీద వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకు సరిపోతుంది.

    మొదట్లో కస్తూరికి కాస్త ఇబ్బందిగానే ఉండేది. పాలు అమ్మటం అంటే ఆమెకు తల కొట్టేసినంత పని అయింది. ఇదివరకు ఎవరెన్ని పాలు కావాలన్నా ఉచితంగా ఇచ్చేది. అందరూ గొప్పగా చెప్పుకునేవారు.

    "పెద్దమ్మగారి చేతికి ఎముకలేదు మహాలక్షి అమ్మ కడుపు, పిల్లల కడుపు చల్లగా ఉండాలి!" అంటూ దీవెనల వర్షం కురిపించేవారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా పదో పరకో వారికీ ఇచ్చి పంపేది. ఇక బియ్యం పచ్చళ్ళు కూరలు సరేసరి.

    అంతగా దానధర్మాలు చేసే ఆ కుటుంబం నేడు తమ పరిస్థితే తిరిగబడి రోజురోజుకి దిగుళ్ళ సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది.

    సుందరం పట్నం నుంచి నెలకోసారి వస్తూ తృణమో ప్రణమో ఇచ్చి వెళుతున్నాడు. అతనైనా ఎంతకని ఇస్తాడు" వాళ్ళకి పిల్లలున్నారు. వాళ్ళ బాగోగులు చూసుకోవాలికదా? ఏంటో ఇంటి పరిస్థితి నాకేం అర్ధం కావటం లేదు.

    ఇవి కస్తూరి ఆలోచనలు . ఆ ఆలోచనలతోనే ఆమె క్రమంగా దిగులు పెరిగిపోతూ రోజురోజుకి చిక్కిపోతోంది. మనోవ్యాధికి మందు లేదు అంటారు ఇదే కాబోలు, అన్ని విషయాలను దాక్షాయణి నిశ్శబ్దంగా గమనిస్తోంది. ఇంటి పరిస్థితి ఆమెకు కూడా అగమ్యగోచరంగానే ఉంటుంది.

    తన పిల్లలూ పసివాళ్ళే. అటు వారికోసం డబ్బు సమకూర్చుకోవాలి. వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు, రాబోయే కాలం మరింత గడ్డుకాలం. ప్రస్తుతమైతే వ్యాపారం బాగానే సాగుతుంది. కానీ అన్ని రోజులు మనవే కావు కదా. దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దకొమంటారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS