అమెరికా వుందనుకో అనుకున్నాను. ఇవాళ ఉదయం నాలో అమెరికా అంటే అమెరికా అంతా. అన్ని నగరాలు, అన్ని ఇళ్ళు, అందరు ప్రజలు, రావడం, పోవడం, పనిపిల్లలు రావడం, వాళ్ళు పోవడం, మనుష్యుల ప్రవేశ నిష్క్రమణాలు చావు, బ్రతుకు, చలనం, సంభాషణ, యంత్రాల ధ్వనులు, ఉపన్యాసాలు, అమెరికాలో బాధలు స్మరించు, భయాన్ని అమెరికాలో ఊపిరి తీస్తున్న అన్నింటి లోతులోతుల్లో అగాధంగా పాకుతున్న ఆ కాంక్షల్ని స్మరించు. మహా యంత్రాలని జ్ఞాపకం తెచ్చుకో. గిర్రున తిరిగే చక్రాలు పొగ, అగ్ని, గనులు, వాటిలో పనిచేసే మనుష్యులు, గల్లంతు, గందరగోళం, వార్తా పత్రికలన్నీ, సినిమా భవనాలనీ, అమెరికా జీవితంలో భాగమైన ప్రతీదాన్నీ జ్ఞాపకం తెచ్చుకో. నీ రచనకి ఏది లక్ష్యం అంటే ఈ గొప్ప దేశాన్ని స్ఫురింపజెయ్యడం.
తర్వాత సామాన్యం నించి విశేషానికి మళ్ళు. ఎవరో ఒకే ఒక మనిషి దగ్గరికి వెళ్ళు. అతనితో కలిసి జీవించు. అతని లోపలికి ప్రవేశించు. దయగా, ప్రేమగా అర్థం చేసుకో. అతని బ్రతుకనే సత్యాన్ని అందరికీ చాటించు. అలా అతడు సజీవంగా ఉండడంలోని జాజ్వల్యాన్ని బయటపెట్టు. ఆ సంగతిని అమోఘమైన భాషలో రాయి - ఆడంబరం వద్దు. ఈ కాలపు మనిషి అని చూపించు. ఈ యంత్రాల్లో, అగ్నిలో, పొగలో వార్తా పత్రికలలో, ఈ రణగొణధ్వనిలో అతడూ ఒక భాగమే అని సూచించు. అతనితో కలిసి అతని రహస్యాన్ని సమీపించు. దాని సంగతి అతనితో నిమ్మళంగా అను. అందరి మానవుల రహస్యం అదే అని చెప్పు. ఎవరినీ వంచించకు. ఎవరినీ సంతోషపెట్టడానికి అబద్ధాలు కల్పించి రాయకు. నీ కథలో ఎవ్వరూ హత్య కానక్కరలేదు. యావచ్చరిత్రలో, యావత్కాలంలో ఏది మహాసంఘటన అని ఒప్పుకొని తీరాలో అదే నీకథావస్తువు. ఊరికే బతకడంలో వున్న సత్యం. అది వినమ్రమైనది. అందులో శిల్పం లేదు. దాన్ని మించిన కథా వస్తువు లేదు. నీ శీలాన్ని పోషించడానికి ఎవ్వడూ క్రూరంగా ప్రవర్తించక్కరలేదు. లోకంలో క్రౌర్యం వుంది. దానిమాట వచ్చినప్పుడు అదీ చెప్పు. యుద్ధం మాట చెప్పు. లోకంలోని కుళ్ళు, అందవికారం, వ్యర్థత ఇవీ చెప్పు. వీటిని కూడా ఆప్యాయంగా వర్ణించు. ద్వేషించకు. కాని ఎప్పుడూ జీవిత సత్యాన్నే నొక్కి చెప్పు. ప్రధాన విషయం అదే. నీ కథని గంభీరమైన చరమావస్థకి తీసుకు పోనక్కరలేదు. నీ వచనం ఉదాత్తం కావడానికి నీ కథానాయకుడు మహాత్కార్యాలు కాని, రాక్షస కృత్యాలు గాని చెయ్యనక్కరలేదు. అతడు ఎప్పుడూ చేస్తున్న పనులే చెయ్యనియ్యి. పగలూ, రాత్రి బతుకుతూ వుంటాడు. బతుకుతున్నాడన్న సంగతేరాయి. నడవనీ, మాట్లాడనీ, ఆలోచించనీ, నిద్రపోనీ, కలలు కననీ, మేలుకోనీ, మళ్ళీ నడవనీ, మళ్ళీ మాట్లాడనీ, కదలనీ, బతకనీ. అది చాలు. రాయదగ్గది ఇంకోటేదీ లేదు. నీ జీవితంలో నువ్వెప్పుడైనా ఒక కథని చూశావా? జీవిత సంఘటనలేవీ కథా రూపంలో గాని కనబడవు. నీ చిత్తశుద్ధి ఒక్కటే నీకు కావలసిన పద్ధతి. నీ చైతన్యం ఒక్కటే నీకు కావలసిన సంఘటన. ఈ మానవుని గురించి ప్రసంగించు. ఇతని జీవితాన్ని గుర్తించు. మానవుడే నీ కథా వస్తువు.
నేను కథ రాసివుంటే ఎలాగ వుండేదో నీకు ఈ చెప్పినదానివల్ల. సరిగా బోధపడిఉండక పోవచ్చును. ఏమిటో రాయడం, ఎలా రాయడం అని ఆలోచిస్తున్న సమయమప్పుడు నా కడుపులో కాఫీ పడి వెచ్చగావుంది. తీరా ఇప్పుడు చలి చంపేస్తోంది. నా మనస్సులో ఉన్నది ఇంతకంటే స్పష్టంగా ఇక చెప్పలేను. కథ రాసివుంటే చాలా సున్నితంగా నడిచేదేమో కాని ఇప్పుడు మిగిలిందంతా ఈ జ్ఞాపకం మాత్రమే. నేను చెయ్యగలిగిందంతా ఈ జ్ఞాపకాన్ని మాటల్లో పెట్టడం మాత్రమే. రేపు నేను ఇంకో కథ రాస్తాను. కేవలం ఇందుకు విరుద్ధమైన కథ. ఈ దృశ్యాన్ని కేవలం ఇంకో కోణం నుంచి చూస్తాను. నిశ్చయంగా చెప్పలేను గాని ఒకవేళ నేను పొగరుబోతుతనంగా ఈ దేశాన్ని ఇందలి ప్రజల జీవితాన్నీ వెక్కిరిస్తానేమో కూడా. ఇది సాధ్యమే. నేనిలా చెయ్యగలను. ఇదివరకు నేను చేశాను కూడా. ఒక్కొక్కమాటు రాజకీయ కక్షల్ని, రాజకీయాల్లోని లంచగొండితనాన్ని చూసినప్పుడు వెర్రెత్తి పోయి ఈ మన గొప్పదేశాన్ని హేళన చేస్తూ రాస్తాను. నాలోకి నీచత్వం వచ్చి మానవుడు క్షుద్రుడని పనికిమాలిన వాడనీ కుళ్ళు వెధవనీ అంటాను. ఇది మానవుడి దోషం కాదని నేనెరుగుదును. కాని మానవుడే అని అబద్దమాడతాను. తప్పు ఇంకో చోట వుంది. దాన్ని కనిపెట్టడానికి చాలా శ్రమకావాలి. కాని ఎదురుగుండా ఎవణ్నో పెట్టుకొని వెక్కిరించడం సులభం. రచయితగా సత్యాన్ని కనిపెట్టడమే నా పని. కాని హేళనకి దిగినప్పుడు నిజాన్ని దాచేస్తాం. ఎవరూ నిజం చెప్పకుండా ఉన్నారు. నేనెందుకు చెప్పాలి? అసలు నిజమన్నదే లేదు. ఉన్నదంతా వ్యాకరణం, కామాలు, ఫుల్ స్టాప్ లు అలాంటి చెత్త మాత్రమే. కాని అదికాదు. నాకు పిచ్చెత్తిపోయి వెక్కిరిస్తానుగాని ఇందులో చాలా వుంది. నాకు తెలుసు. ఆఖరికి ఇదంతా ఒక విషాద కావ్యం, మొత్తంమీద దీన్నంతా చూసి జాలి పడాలి.
ఈ రోజంతా నా గదిలో చలికి వడగొట్టుకుపోయి కూచున్నాను. సజీవంగా ఉన్న మన అందరి గురించీ నిష్కల్మషమైన నిజాన్నేదో చెప్పాలని చూశాను. కాని ఈ చలి వల్ల ఏమీ చెప్పలేను. నేను చెయ్యగలిగిందంతా బస్కీలు తీయడం, సిగరెట్లు కాల్చడం మనస్సు చెడిపోయి బాధపడడం.
ఈవాళ ఉదయం కాఫీ తాగి వెచ్చగా ఉన్నప్పుడు ఈ గొప్ప కథ నా మనస్సులోకి వచ్చింది. అచ్చులో పడడానికి సిద్ధంగా. కాని అప్పుడది మాయమయిపోయింది. నేనిక చెప్పగలిగిందంతా శాన్ ప్రాన్సిస్కోలో చాలా చలిగా వుందని, నేను కొంకర్లెత్తిపోతున్నానని.
* * * *
