డిసెంబరు సెలవలకు వచ్చిన రవిని సంక్రాంతి పండగ వెళ్ళిందాకా ఇంటిదగ్గరే ఉంచింది వరూధిని. పండగ వెళ్ళిన మరునాడు ప్రయాణం అయి, రామనాథబాబుకు, కబురు పెట్టింది. రామనాథబాబు ఆడిట్ గొడవలేమో ఉన్నాయనీ, తను ఈసారి రావటం పడదేమో అన్నట్టుగా చెప్పాడు.
"ఇప్పటికే వారంరోజులు బాబుకు స్కూలు పోయింది. రేపు కాకపోతే ఎల్లుండయినా వెళ్ళాలి." ఖచ్చితంగా చెప్పింది వరూధిని.
"ప్రయత్నిస్తా రేపు ఎల్లుండిలో పనయిపోతే వెళ్దాం!" అన్నాడు రామనాథబాబు.
ఆ మూడురోజులూ వరూథినికి ముళ్ళమీద ఉన్నట్టుంది. కొడుకు చదువు ఎక్కడ వెనక పడిపోతుందోనన్న ఆరాటంలో పడిపోయింది. వెంకటపతికి కొడుకు చదువుమాట ఎలావున్నా, ఇంకా నాలుగురోజులు ఇంటిదగ్గర వున్నాడన్న సంతృప్తి కలిగింది. వీలు చిక్కినప్పుడల్లా రవిని కూర్చోబెట్టుకొని , కబుర్లు చెప్పించుకుంటూ మధురానుభూతిని పొందే వెంకటపతిని చూస్తుంటే వరూధినికి వెగటు కలిగేది. ఏదో వంకతో రవిని పిలిచేది ముఖం అదోలాపెట్టి.
నాలుగోరోజున కుర్రాడిబట్టలు సర్ది, ప్రయాణమై రామనాథబాబు కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఉదయం ఎనిమిది గంటలకల్లా కారు తీసుకొస్తానన్న రామనాథబాబు పన్నెండయినా రాలేదు. వెంకటపతిని రామనాథబాబుకోసం తోలింది. ఒంటిగంటకు తిరిగొచ్చిన వెంకటపతి, రామనాథబాబు హాలు దగ్గిరా, ఇంటిదగ్గరా కూడా లేడని చెప్పాడు. వరూథినికి వళ్ళు మండిపోయింది.
సాయంత్రం మూడు గంటలకు ఇంటిముందుకు కారొచ్చి ఆగింది. రామనాథబాబు అంతు తేల్చటానికి రిహార్సల్సు కూడా వేసుకొన్న వరూధిని గబగబా బయటికొచ్చింది.
"బాబుగారు ఊరెళ్ళిపోయారు. అర్జెంటుగా పనొచ్చిందట. కారు పంపించారు. మిమ్మల్ని వెళ్ళమన్నారు" అని చెప్పాడు డ్రైవర్ రసూల్.
"ఈ ముష్టికారు కోసమే ఆగాననుకున్నారా మీ అయ్యగారు? పి.టి. చేయించుకొని వెళ్ళేదాన్ని, నాలుగు రోజులు వేస్టయింది. ఇష్టంలేనివాడు ముందే చెప్తేపోయేదిగా?" వరూధిని రుసరుసలాడుతూ అన్నది.
"అది కాదమ్మగారూ! చాలా గొడవల్లో ఉన్నానని చెప్పమన్నారు అయ్యగారు." తల గోక్కుంటూ సణిగాడు రసూల్.
"ఏ ఊరెళ్ళారు?"
"చెప్పలేదమ్మా! కనకయ్యగారి అల్లుడి కార్లో వెళ్ళారు."
"ఊహూ! కనకయ్యగారి అల్లుడితో పోయాడా? ఇప్పుడు బయలుదేరితే ఎన్ని గంటలకు వెళ్తాం హైదరాబాద్?"
"తొమ్మిదీ తొమ్మిదిన్నర కెళ్ళొచ్చమ్మగారూ!"
"పదిగంటల కెళ్ళి అక్కడేం చేస్తాం?" తప్పంతా డ్రైవర్ దే అన్నట్టు విదిలించి కొట్టింది వరూధిని.
"తెల్లవారుఝామున బయలుదేరితే?"
"ఉదయం ఎనిమిది గంటల లోపల వెళ్తే బాబు స్కూలుకు అందుకోగలుగుతాడు. తెల్లవారకట్ల బయలుదేరితే, మనం వెళ్ళేసరికి పది దాటదూ?"
"దాటుతుందమ్మగారూ!" తల తొందరగా ఆడించాడు రసూల్.
"ఏం చేస్తాం? ఎటూగాకుండా చేసి చచ్చారుగదా?" అని వరూధిని ఆలోచనలో పడింది. రాత్రికి హైదరాబాద్ చేరడమే మంచిది. తెల్లవారి బాబును స్కూల్లో వదలొచ్చు. వాడికీ బడలికలేకుండా వుంటుంది. ఒకరోజన్నా స్కూలు కలిసి వస్తుంది.
"పెట్రోలు కొట్టించారా? అదీ ఖాళీగానే వుందా?"
"టాంక్ ఫుల్ గా కొట్టించారమ్మా అయ్యగారు." రామనాథబాబు ఎప్పుడూ అలాంటి లోపాలేమీ చెయ్యడన్నట్టు చెప్పాడు రసూల్.
రామనాథబాబు వెళ్ళడంలేదుకాబట్టి, భార్యకు తోడుగా వెళ్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది వెంకటపతికి.
బాబు స్కూలుకూడా చూడొచ్చు. జాగీర్దార్ల పిల్లలు చదివే ఆ స్కూలు ఎంత గొప్పగా వుంటుందో చూడాలి. బాబుకి పడకా భోజనం కూడా అక్కడే. అదికూడా తనకు చోదోఅలని వుంది. తను హైదరాబాదు పట్నంకూడా చూడలేదు. కారు ఎటుదిరిగీ వెళ్తుందాయె! కార్లో చోటుకూడా మస్తుగా వుంది.
రసూల్ సామాను డిక్కీలో పెడ్తుండగా వెంకటపతి ఓ జత పంచలూ, చొక్కాలూ, చుట్టచుట్టి తెచ్చుకొన్నాడు.
"అదేమిటి?" భర్తను చూసి అడిగింది వరూధిని.
"నేకూడా వద్దామని!" నసిగాడు వెంకటపతి.
"ఎక్కడికీ?" తీవ్రంగా అన్నా, వరూధిని ముఖం ప్రశాంతంగానే వుంది. వెంకటపతి మాట్లాడకుండా కారు పక్కనే నిలబడ్డాడు.
"ఎందుకూ?" భర్తముఖంలోకి చూస్తూ అన్నది వరూధిని.
"బాబు స్కూలు చూడాలి. పట్నంకూడా చూడలేదుగా?" అన్నాడు వెంకటపతి.
రసూల్ నవ్వాపుకోటానికి ప్రయత్నిస్తూ ముఖం పక్కకు తిప్పుకొన్నాడు.
"నాన్నను కూడా రానియ్యమ్మా!" రవి తల్లిని బతిమాలుతున్నట్టు అన్నాడు.
వరూధిని కొడుక్కేసి వింతగా చూసింది. వీడప్పుడే తండ్రిని చూసి జాలిపడుతున్నట్టు మాట్టాడుతున్నాడు. అధికారం అంతా అమ్మదే అన్నది వాడు ఈ వయస్సులోనే పసిగట్టాడు. తన కొడుకు చాలా తెలివికలవాడు. వాడు పెరిగి పెద్దయితే ఎంతటివాడవుతాడో? రామనాథబాబులాంటివాళ్ళు వాడి కాలిగోరుకు సరిపోరు. ఎడగా పెడగా పోతున్న ఊహల్ని అదుపులో పెట్టుకొని అన్నది వరూధిని.
"మీరు కూడా వస్తే ఇల్లెవరు చూస్తారండీ? పైగా రామనాథబాబుగారు కూడా ఊళ్ళో లేరుగా? హాలేం చేస్తారూ?"
వరూధిని భర్తను, 'మీరు' అని ఎప్పుడు సంబోధిస్తుందో, 'నువ్వు' అని ఎప్పుడు అంటూందో ఆమెకే సరిగా తెలియదు. చెప్పే విషయాన్నిబట్టీ, విధానాన్ని బట్టీ, సందర్భాన్నిబట్టీ, అవసరాన్నిబట్టీ, 'మీరు' ను 'నువ్వు'గా, 'నువ్వు'ను ఏమీగాకుండా మాట్లాడుతుంది.
"బాబును వేసవికాలం శెలవులకు తీసుకొస్తాంగా, అప్పుడొద్ధురుగానిలెండీ? అప్పుడు బాబును మీరే వెళ్ళి తీసుకొద్దురుగాని రసూల్! పద మరీ పొద్దుపోయి చేరితే అక్కడ హోటల్లో గదుల కవస్థపడాలి!" అన్నది వరూధిని.
రసూల్ కారు స్టార్టు చేశాడు. రవి కార్లోనుంచి తల బయటికిపెట్టి తండ్రికి 'టా! టా!' చెప్పసాగాడు. కారు మలుపు తిరిగిందాకా కొడుకు తండ్రికేసి చెయ్యి వూపుతూనే వున్నాడు.
దృష్టిపథంలోంచి అదృశ్యం అయిన కొడుకుని తలుచుకొన్న వెంకటపతి కళ్ళు చెమ్మగిల్లాయి.
"బోడిముండ!" బయటికి అన్నాడు వెంకటపతి నడిరోడ్డుమీద నిలబడి ఎవరయినా విన్నారో వినలేదో వెంకటపతి పట్టించుకోలేదు.
మూడోరోజుకల్లా వరూధిని హైదరాబాదునుంచి తిరిగొచ్చింది. ఇల్లంతా కలియజూసి వంటమనిషి మీదా, పనిపిల్లమీదా ధూంధాంలు చేసింది.
"రెండురోజులు ఇంట్లో లేకపోతే ఇల్లంతా అల్లకల్లోలం చేసి పారేశారు. పొట్టలు పగిలేట్లు తిని ఇచ్చకాలాడుతూ కూర్చొన్నారా?"
బుచ్చమ్మా, కమలా నోరు మెదపలేదు. పడకగదిలో ఉన్న ఖాళీ సీసాలూ, కడగని గ్లాసులూ, తినేసిన ఆకులూ, కాగితాలూ చూసిన వరూధిని కోసం తారాస్థాయినందుకొంది.
"ఈయనెక్కడ చచ్చాడే?" పనిపిల్లను చూసి గర్జించింది వరూధిని.
"ఈ రోజే.....పొద్దున్నే బయటకెళ్ళారమ్మా!"
"అంటే ఈమూడు రోజులూ ఇంట్లోనే పాతేసుకుని ఈ ఛండాలం అంతా చేశాడన్నమాట?"
కమల భయం భయంగా తల ఊపింది.
"ఆయనకు లేదనుకో బుద్ది! మీకేమయిందీ? మంద యింట్లోచేరి తింటున్నారు. పొండవతలకు?" అంటూ వరూధిని గదిలోని ఖాళీసీసాలను పనివాళ్ళమీదకు విసిరింది. వంటమనిషీ, కమలా కలిసి గబగబా గదంతా శుభ్రం చేశారు.
"గది ఊడుద్దామంటే గదిలోనుంచి బయటికి రాందే? మేం మాత్రం ఏం చేస్తాం తల్లీ!" బుచ్చమ్మ మెల్లగా అంది, తను తెప్పేమీ లేదని రుజువు చేసుకొంటున్న ధోరణిలో.
వరూధిని తలంటి పోసుకున్నది. తల చిక్కు తీసుకొంటూ నిలువుటద్దం ముందు నిలబడింది. పొడవైన నల్లటి నొక్కులజుట్టులో నుంచి దువ్వెన ఊడిరావటంలేదు. ఓ చేత్తో జుట్టు మధ్యకుపట్టి గట్టిగా చిక్కు తీసుకోవటం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనలు కళ్ళేలు తెగిన గుర్రాల్లా పరుగెత్తుతున్నాయి.

