Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 66

   "అయినా జయంతి-నువ్వు ఇంత చీకటి పడేవరకు వుండకు, ఐదింటికే ఇంటికి చేరుకోవాలి" అన్నాడు హెచ్చరిస్తున్నట్లు.

    "రోజు అలానే వస్తాను బావా! ఈరోజే ఆలస్యమయింది" అంది జయంతి.

    ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళారు.

                                          *    *    *    *

    జయంతి ఇంటికి వెళ్ళగానే అడిగింది కస్తూరి.

    "ఏంటే....ఇంత ఆలస్యమయింది? మేము భయపడి చస్తుంటే"

    "ఏం లేదమ్మా! బాగా లేటయింది. బస్సు దిగగానే సురేంద్ర బావ కనిపించాడు. ట్రాక్టరు మీద తీసుకొచ్చాడు" అంది జయంతి.

    "అబ్బో! చాలాకాలానికి గుర్తోచ్చామే....." అంది కస్తూరి.

    జయంతి మనసు చివుక్కుమంది. పోనీ అతను చేసిన మేలు గూర్చి చెపితే, అసలు నన్ను కాలేజి మాన్పించేస్తారు. చెప్పకపోవటమే మంచిది.

    "సరే! స్నానం చెయ్యి, ముఖం చూడు ఎలా వాడిపోయిందో " అంది కస్తూరి ఆప్యాయంగా.

    జయంతి దాక్షాయణివైపు చూసి నవ్వి లోపలికి వెళ్ళింది. ఆమె  వెనకే దాక్షాయణికూడా వెళ్ళింది.

    "ఏంటి జయంతీ! ఏంటి కధ? ఇద్దరూ కలిసోచ్చారు? చాలాకాలం తర్వాత" అంది దాక్షాయణి.

    "స్నానం చేసి వచ్చాక చెపుతా పిన్ని! ఈలోపుగా నువ్వు డాబా పైనా ఉండు సన్నజాజిపూలు కోస్తూ" అంది జయంతి.

    దాక్షాయణి జయంతిని ఆశ్చర్యంగా చూసి సరే అంది.

    జయంతి స్నానానికి వెళ్ళింది.

    "అక్కా! నేను పూలు కోయటానికి వెళుతున్నాను. పనేం లేదుగా నాతో" అంది దాక్షాయణి.

    "ఏం లేదులే! వంట అయిపోయిందిగా. వెళ్ళిరా" అంది కస్తూరి నవ్వుతూ.

    దాక్షాయణి పూల సజ్జ తీసుకుని డాబా పైకి వెళ్ళింది.

    తలంటుస్నానం చేసి, జుత్తు వదులుగా వేసుకుంది. బ్లాక్ సిల్కు చీరే, అదేరంగు జాకెట్టు చేసుకుని, నుదుట కుంకుమ తిలకం కళ్ళకు కాటుక, చెవులకు లోలాకులు, అందమైన ముక్కుపై ముక్కుపుడక, నీరెండలో తళుక్కున మెరుస్తుంది. నలుపు రంగు చీరే జాకెట్టులో ఆమె పచ్చని శరీర ఛాయ మరింత ద్విగుణీకృతమోతోంది.

    ముప్పై సంవత్సరాల దాక్షాయణి వయస్సుకు తగిన అందంతో, హుందాతనంతో, పల్లెటూరి ముత్తయిదువుకు నిదర్శనంగా ఆరోగ్యంగా వుంది.

    కిందనుంచి డాబా పైకి పాకిన సన్నజాజి తీగకు వున్న మొగ్గలను నెమ్మదిగా తుంపుతూ సజ్జలో వేస్తోంది.

    ఆ సాయం సంధ్యలో ఆమె అందం రెట్టింపయింది.

    దాక్షాయణిది బాహ్యసౌదర్యమే కాదు, అంతఃసౌందర్యం కూడా గొప్పదే. అందుకే కస్తూరికి ఆమంటే ప్రత్యేకమైన అభిమానం, మాధవరావుకు పెళ్ళి సంబంధం చూడటానికి కస్తూరితో పాటు, భ్రమరాంబ కూడా వచ్చింది. సర్వోత్తమరావు, కస్తూరి, భ్రమరాంబ, మాధవరావుతో పాటు సంఖ్య కోసం అప్పుడు జయంతిని కూడా తీసుకెళ్ళారు.

    జయంతికి అప్పుడు ఐదేళ్ళు. ఎడ్లబండ్లు కట్టుకుని వాళ్ళింటికి వెళ్ళే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. దాక్షాయణి నాన్నగారు గతికితే అతకదు వదినాగారు! మేము భోజనం చేయం" అని ఎంత వారించినా దాక్షాయణి అమ్మా నాన్నలు "ఇంకా అతకక పోవటం ఏంటి వదినా....అబ్బాయి, అమ్మాయి జంట అతికినట్లు సరిపోతేను....మాకు అలాంటి పట్టింపులు ఏమీలేవు. మీరు నిక్షేపంగా భోంచేయండి" అంటూ బలవంతంగా భోజనాల ఏర్పాట్లు చేశారు. ఆ రోజు వంటలన్నీ దాక్షాయణే చేసిందట. వంట పరీక్షలో కూడా తొలిరోజే నెగ్గింది దాక్షాయణి.

    మాధవరావు తెగ సంభరపడిపోయాడు. అదే మొదటి పెళ్ళిచూపులు, మొదటి పెళ్ళిచూపుల్లోనే లక్షణమైన అమ్మాయి కుదిరింది. మావాడికి అంది కస్తూరి. మాధవరావు సిగ్గుపడిపోయాడు. "అదేంటి మాధవా! అమ్మాయి నిన్ను చూసి సిగ్గు పడాలి గానీ, నువ్వు అమ్మాయిని చూసి సిగ్గుపడతావెంటి?" అంది భ్రమరాంబ.

    ఆ మాటలకు అందరూ నవ్వారు.

    ఆ విషయాలన్నీ గుర్తొచ్చి దాక్షాయణి నవ్వుకుంది. ఆమె కెందుకో పెళ్ళిచూపుల రోజు గుర్తొచ్చింది పూలు కోస్తుంటే. ఎందుకు గుర్తొచ్చింది? ఆలోచిస్తుంది. అ....అది సంగతి! ఆరోజు కూడా నేను మా డాబాపైన ఎక్కి పొద్దుటే పూజకోసం పూలుకోస్తుంటే దూరంగా ఎడ్లబండులు కనిపించాయి.

    నేను అలానే చూస్తుండిపోయాను అవి ఇటు వేపే వస్తుంటే కంగారుగా కిందకెళ్ళి అమ్మతో చెప్పాను. "అమ్మా! వాళ్ళు వస్తున్నారే" అని అందుకు గుర్తొచ్చిందన్నమాట. పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను ఆలోచిస్తూ నవ్వుకుంది.

    "ఏంటి పెద్ద పిన్ని నీలో నువ్వే నవ్వుకుంటున్నావు?" అడిగింది జయంతి. తను కూడా తలంటు స్నానం చేసి జుట్టును తుండుతో తుడుచుకుంటూ.

    "చెపితే నువ్వు ఎగతాళి చేస్తావులే....నాకే ఆశ్చర్యంగా వుంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు గుర్తోచ్చాయా? అని" అంది దాక్షాయణి నవ్వుతూ.

    "నవ్వన్లె! నువ్వు మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పి తీరాల్సిందే..." పట్టుబట్టింది జయంతి.

    "అసలు నువ్వు నీ విషయం చెపుతానని డాబా పైకి రమ్మని, అది చెప్పకుండా నన్ను చెప్పమంటావెంటి? ముందు నీ సంగతి చెప్పు" అంది దాక్షాయణి కింద కూర్చుంటు.

    "చెపుతాన్లే. చెపితే నువ్వు ఆశ్చర్యపోతావు. అందుకే ముందు నువ్వు చెప్పు" అంది జయంతి.

    "ఏం లేదు జయంతీ! నా పెళ్ళిచూపులరోజు గుర్తొచ్చిందిలే" అంది దాక్షాయణి అందంగా సిగ్గుపడుతూ.

    "అబ్బ....ఎంత అందంగా సిగ్గుపడుతున్నావు పిన్ని! మా బాబాయ్ నిజంగా అదృష్టవంతుడే" అంది పెద్దగా నవ్వుతూ.

    "ఎందుకు?" అంది దాక్షాయణి సీరియస్ గా నవ్వుతూ.

    "ఎందుకేమిటి? వనకన్యలాంటి పెళ్ళాం దొరికినందుకు..." అంది జయంతి నవ్వుతూ.

    "ఏయ్....అందుకే నిన్ను రౌడిపిల్ల అనేది" అంది దాక్షాయణి.

    "ఉన్నమాటే తల్లీ....ఈ సాయంసంధ్యలో పూల సజ్జతో ఆ చీరే , ఆ కట్టు, బొట్టు అబ్బో....అన్నీ నీకు అతికినట్లు సరిపోయాయి పిన్నీ" అంది జయంతి.

    "సర్లే, నీ మాటలకేంగానీ , ఇందాక సురేంద్ర విషయం చెపుతా నాన్నవుగా? చెప్పు ముందు" అంది దాక్షాయణి.

    జయంతి సీరియస్ అయిపోయింది.

    "నువ్వు ఎవరితో చెప్పానంటే చెపుతా" అంది జయంతి.

    దాక్షాయణి ఆశ్చర్యపోయింది.

    "అదేంటి, అంత రహస్యమా? కొంపతీసి గిరిజ భయపడుతున్నట్లు సురెంద్రని పెళ్ళి చేసుకున్నవా ఏంటి రహస్యంగా?' అంది ఆశ్చర్యం నటిస్తూ దాక్షాయణి.

    "ఏయ్ నిన్నూ.....అంటూ పక్కనే చిన్న పుల్ల వుంటే దానిని తీసుకుని దాక్షాయణి వీపు మీద కొట్టింది టపటప మూడు దెబ్బలు

    "ఏయ్...ఏయ్....ఏంటది? దెబ్బతగుల్తుంది....." అంది నవ్వుతూ దాక్షాయణి.

    ఈ ఏడాదిలో వాళ్ళిద్దరూ చాలా దగ్గరయ్యారు. శివపార్వతి కూడా లేకపోవటం వల్ల, ఒకరి విషయాలు ఒకరు చెప్పుకుంటూ పిన్ని-కూతుళ్ళు లాగా కాకుండా, ఓ మంచి స్నేహితుల్లా కలిసి మెలిసి వుంటున్నారు.
    "లేకపోతే ఏంటా పిచ్చి మాటలు? గిరిజక్క వింటే గుండాగి చచ్చిపోతుంది" అంది నవ్వుతూ.

    "మరేంటి, ఎవరికి చెప్పొద్దు, రహస్యం అంటే అలా ఆలోచించకుండా మరెలా ఆలోచిస్తాను? అసలే వయసులో వున్న అందమైన చిలిపి ఆడపిల్లవి, నేను అలాగే అనుకున్నాను" అంది దాక్షాయణి.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS