Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 65


    తర్వాత పుస్తకం టెగ్జాస్ దేశభక్తులకి అంకితం అనే ఇంకో పుస్తకాన్ని St.Elmo అనే మరో పుస్తకాన్ని వ్రాసిన ఆవిడే ఈ పుస్తకాన్ని రాసింది. ఈ రచయితను గురించి కాని ఈమె గ్రంథాలను గురించిగాని నాకు తెలిసినదంతా ఒకరోజు ఒక అమ్మాయి St.Elmo అనే పుస్తకాన్ని క్లాసులోకి తెచ్చినందుకు గట్టిగా చీవాట్లు తిందన్న సంగతి మాత్రం. ఈడొస్తున్న ఆడపిల్లల నీతి ప్రవర్తనని పాడుచేసే గ్రంథాల తెగకి చెందినదట ఆ పుస్తకం. సరే పుస్తకాన్ని తెరిచి చదివాను, ఈ ధోరణిని సాగింది. ఇంత చండాలపు వచనం రాయడం కూడా కష్టమే. కాబట్టి ఇది గొప్ప వచనం. అవకాశం చూసుకుని ఈ గ్రంథాన్ని పూర్తిగా చదవాలని నిశ్చయించాను. మరీ దరిద్రపు రాతలు రాసేవాళ్ళ నించి కూడా యువక రచయితలు నేర్చుకోవలసినవి బోలెడున్నాయి. చెడ్డ పుస్తకాలని తగలబెట్టడం చాలా దారుణం. మంచి పుస్తకాలను తగలబెట్టడంకన్నా ఇంచుమించు ఎక్కువ ఘోరమని చెప్పాలి.
    ఆ తర్వాత పుస్తకం గ్రంథకర్త పేరు T.S. ఆర్థర్. ఏమిటో ఈ పుస్తకాన్ని కూడా తగలబెట్టడం మనస్కరించలేదు. మిగతా మూడు పుస్తకాలలో ఒకటి హాల్ కెయిన్ ది. ఇంకోటి బ్రాండర్ మాథ్యూస్ ది. మరోటి ఆప్టన్ సింక్లెయిర్ ది. వీటిలో ఒక్క సింక్లెయిర్ గారి పుస్తకం మాత్రమే నేను చదివాను. అందలి రచనా విధానం నాకు గొప్ప తృప్తి ఇచ్చిందని చెప్పలేను. గాని అచ్చు ముచ్చటగా ఉన్నందువల్లా, బైండింగు బాగుండడం వల్లా దాన్ని తగలబెట్టలేకపోయాను. ముద్రణ విధానాన్ని బట్టి చూస్తే అది నా దగ్గిరున్న గొప్ప గ్రంథాలన్నింట్లో ఒకటి.
    ఏమైతేనేం ఒక్క పుస్తకంలో ఒక్క పుటకూడా నేను తగలబెట్టలేకపోయాను. చలికి కొంకరెత్తిపోతూనే రాస్తున్నాను. మంట అనేది ఎలా వుంటుందో మరిచిపోకుండడానికి గాను అప్పుడప్పుడొక అగ్గిపుల్ల వెలిగించి చూసేవాణ్ణి. వెలుగూ వేడి అనే భావాన్ని ఆస్వాదించడం కోసమని ఇలా చేసేవాణ్ణి. ఇదంతా ఎప్పుడంటే సిగరెట్టు ముట్టించడానికని అగ్గిపుల్ల వెలిగించేటప్పుడు. వెంటనే పుల్ల ఆర్పివెయ్యకుండా వేళ్ళ కొసలదాకా వెలిగే వరకూ పట్టుకునేవాణ్ణి.
    మొత్తానికి సారాంశం ఏమిటంటే నిజంగా నీకు గ్రంథాలమీద భక్తి వుందంటే, జీవితంలో వాటికున్న విలువను సరిగా గ్రహిస్తున్నావంటే నువ్వు ఏ పుస్తకంలోనూ ఏపుటని తగలబెట్టలేవు. నువ్వు చలితో చస్తున్నాసరే. నీతరం కాదు అంతే. నీకు సాధ్యం కానిది చెయ్యవలసిందని కోరడం అంతే.
    పుస్తకాలు తగలబెట్టాలనుకున్నరోజున ఎంతచలిగా వుందో ఇవాళ కూడా నా గదిలో అంత చలిగా వుంది.ఈ చలిలో కూర్చున్నాను, సిగరెట్లు కాల్చుకుంటూ, కాగితం మీద ఈ చలినెక్కించాలని ప్రయత్నిస్తూ, ఎందుకంటే శాన్ ఫ్రాన్సిస్కోలో మళ్ళీ ఎంత వచ్చినప్పుడు చలి కాలపు దినాలలో నా అవస్థ మరిచిపోకుండా ఉండడానికి.
    నా గదిలో ఒక చిన్న ఫోనోగ్రాపు ఉంది. వెచ్చదనం కోసం బస్కీలు తియ్యవలసి వచ్చినప్పుడు దీన్ని వాయిస్తాను. అయితే నా గదిలో మరీ చలి ఎక్కువయి పోయినప్పుడిది పని చెయ్యదు. అందులో లోపలిదేదో చెడిపోతుంది. మెరుగు ఇరిగిపోతుంది. చక్రాలు తిరగవు. వీపువంచి చేతలు విసురుతూన్నప్పుడు సంగీతం ఉండదు. సంగీతం లేకుండానే వ్యాయామం చెయ్యాలి. నేపథ్యగానంతో బస్కీలు తీస్తే ఇంతకన్నా మజాగా వుంటుంది. కాని చలి మరీ తీవ్రంగా వున్నప్పుడు ఫోనోగ్రాపు పనిచెయ్యదు. నేను గొప్ప దురవస్థలో పడిపోతాను. ఉదయం ఎనిమిది గంటలనించీ ఇలా కూర్చున్నాను. ఇప్పుడు పావుతక్కువ అయిదయింది. చెడ్డ చిక్కులో పడ్డాను. ఏదో ఒకటి సాధించకుండా ఒక రోజును వృధాగా నేనెప్పుడూ జారిపోనివ్వను. ఏదో ఒకటి రాయాలి. రోజంతా ఈ పుస్తకాలు, నేను చదవని ఈ పుస్తకాలు పెట్టుకు కూర్చున్నాను. ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాను గాని ఏ ఒడ్డూ దొరకదు. ఈ దినంలో చాలా భాగం ఇటూ అటూ పచార్లు చెయ్యడంతో, (ఈ ఇరుకు గదిలో ఎటువైపు రెండడుగులు వేసినా ఒక గోడ అడ్డొస్తుంది) బస్కీలు తియ్యడంతగి సరిపోతుంది. గాలి ఏమైనా వేడెక్కిందేమో చూడడానికి ఓ అరడజనుసార్లు ఫోనోగ్రాపు వేసి చూశాను. ఊహూ ఫోనోగ్రాపులోంచి సంగీతం పైకి రాలేదు.
    ఈ సంగతులన్నీ నీకు తెలియజెయ్యడం మంచిదని తోచింది. ఇందులో ఏమీ గొప్పలేదనుకో. చలి మీద ఇంత రాద్ధాంతం చెయ్యడం ఓ మోస్తరు బుద్ధి తక్కువే అనుకో. అయినా ఈనాటి యధార్థం ఈ క్షణంలో మహాద్విషయం ఇదే. అంచేత ఈ విషయం మీద రాస్తున్నాను. చిత్రం ఏమిటంటే, నాకు సంతోషం కలిగిస్తున్న సంగతేమిటంటే నా టైపు రైటరు ఇవాళ ఒక్కమాట కూడా ఇబ్బంది పెట్టలేదు. క్రిస్మస్ రోజుల్లో, ఇక్కడ చలి చాలా తీవ్రరూపం ధరించినప్పుడు నా టైపురైటరు పని చేసేదికాదు. నేను చమురు పోసిన కొద్దీ మరింత నట్టుతూ వుండేది. దానితో ఏం చెయ్యడానికీ వీలులేకపోయేది. నేను సరైన చమురు ఉపయోగించకపోవడమే ఇందుకు కారణం. కాని ఇప్పుడు నేను చలి గురించి వ్రాస్తున్నంతసేపూ నాటైపు రైటరు తనపని అమోఘంగా నిర్వహిస్తోంది. ఇందుకే నాకాశ్చర్యం. ఆనందం. ఇంత చలిగా వున్నప్పటికీ ఈ యంత్రం నేనుపయోగిస్తున్న భాషని ముద్రించడం చాలా ప్రశస్తంగా వుంది.
    ఏమయినా సరే ఈ యంత్రాన్ని వదలకూడదనిపించుతోంది. యంత్రం పని చేస్తున్నదంటే దానితోబాటు నేను పనిచెయ్యవలసిందే. అది దాని సారాంశం. చలి వేస్తున్నందున ఒక చదవదగ్గ కథ నువ్వు రాయలేకపోతే మరేదైనా రాయి. నీకు ఏది తోస్తే అది రాయి. ఎవరికైనా ఒక్క పెద్ద వుత్తరం రాయి. చలి నిన్నెంత బాధపెడుతోందే వాళ్ళకి తెలియజెయ్యి. ఈ వుత్తరం వాళ్ళ కందినసరికి ఎండ మళ్ళీ వస్తుంది. అయినా నీ ఉత్తరం మాత్రం చలి సంగతి భాషిస్తూ అక్కడే వుంటుంది. మరీ చలిగా వుండి నువ్వొక సామాన్యపు సంపాదకీయం పాటి వచనం కూడా గుచ్చెత్తలేకపోతేనేం, ఏం పోయింది? ఏం తోస్తే అదే రాయి. నిజం మాత్రమే సుమా. అబద్ధం మాత్రం రాయకు. నీ వేళ్ళు కొంకర పోతున్నాయని రాయి. వెచ్చదనం కోసం పుస్తకాలు తగలబెట్టాలనుకొని ఆపని చెయ్యలేకపోయానని రాయి. నీ ఫోనోగ్రాపు గురించి రాయి. నువ్వు రాద్ధామనుకొని రాయలేని సంగతులను గురించి చెప్పు. ఈ సంగతే నాలో నేననుకుంటున్నాను.
    ఇవాళ ఉదయం కాఫీ తాగిన తర్వాత ఒక ముఖ్యమైన కథ రాయాలని ఇక్కడకొచ్చాను. కాఫీ తాగడంవల్ల వెచ్చగా వుంది. చలి ఎంత తీవ్రంగా ఉందో ఇంకా గ్రహించడంలేదు. కాగితాలు పైకి తీసి ఈ ముఖ్యమైన కథలో నేను చెప్పదలచుకున్నవన్నీ ఒక క్రమంలో ఆలోచిస్తున్నాను. కాని ఈ కథ ఇక నేను వ్రాయడం జరగదు. ఏదైనా నేను ఒకసారి పోగొట్టుకున్నానంటే శాశ్వతంగా పోగొట్టుకున్నానన్నమాటే. చలి వల్ల ఈ కథ నేను రాయకముందే మాయమయింది. మళ్ళీ రాయడం నాశక్యం కాదు. చలినాలో ప్రవేశించి నోరు నొక్కేసింది. కుర్చీమీంచి దిగ్గున్ లేచి బస్కీలు తీసేటట్టు చేసింది. నేను చెయ్యగలిగిందంతా ఆ కథ గురించి నీకు చెప్పడం మాత్రమే. నేను రాసి ఉంటే ఆ కథ యెలా ఉండేదో చెప్పగలను. అంత ,మట్టుకు మాత్రమే దాని సంగతి నాకు జ్ఞాపకం వుంది. ఆ కథని రాయలేదు. అదెక్కడో పోయింది. నేను కథలు ఎలా రాస్తానో ఆ సంగతి కొంచెం నీకు చెబుతాను. ఇవాళ ఉదయం ఈ కథ గురించి నా మనస్సులో ఆలోచిస్తూ నేనే యే సంగతులనుకున్నానో అవి నీకు చెబుతాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS