Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 65


    అంతవరకూ కళ్ళే వెళ్ళబెట్టి ఉన్న వెంకటపతి ఈసారి నోరువెళ్ళబెట్టేడు.
    "మరి ఇక నువ్వు చేసేదేమిటి?"
    "ఫిలిం డబ్బాల గదిలో కూర్చుని తాగడం!" అంతవరకూ  బాగానే గుర్తొచ్చింది వెంకటపతికి. ఇంకా నయం, ఆ మాట పైకి అనలేదు.
    వెంకటపతి నిజంగానే ఆలోచించాడు. అసలు తను చేస్తుందేమిటి? తను హాలు దగ్గర లేకపోతే తెరమీద బొమ్మకూడా పడదేమో నన్నట్టుండేది తనకు. కాని ఇప్పుడది అడుగుతుంటే అనిపిస్తోంది - నిజంగానే తను అక్కడ చేస్తుందేమిటి?
    "మాట్లాడరేం?" ఆగ్నేయాస్త్రం సంధించి విడవబోయేముందు మహారథి శత్రు సైన్యాన్ని చూసినట్టు భర్తకేసి చూసింది వరూధిని.
    "అదే! నేనేం చూస్తున్నాను?" ఆ మాట భార్యనే తిరిగి అడుగుతున్నట్టుగా ఉంది వెంకటపతి ముఖం.
    "సిగ్గు లేకపోతేసరి?"
    తనకు ఇంకా సిగ్గు ఉన్నట్టే తలవంచుకొని నేలచూపులు  చూశాడు వెంకటపతి.
    "పదండి లోపలకు. హాలు దగ్గర కెళ్ళొద్దు. మీ అలుసు చూసుకొనే ఆ రామనాథబాబు అట్లా ఆడుతున్నాడు." వరూధిని గిర్రున వెనక్కు తిరిగి బాత్ రూంలోకి వెళ్ళింది.
    వెంకటపతి పైటవల్ కుర్చీమీదవేసి, అందులో కాళ్ళు జారేసి కూలబడ్డాడు. వీరిద్దరికీ చెడినట్టుంది. ఎందుకు చెడదూ? దీని నోరు మంచిదికాదు! దీని  బుద్దో? - ఆ ప్రశ్నకు సమాధానం వెతకడం వెంకటపతికి మనస్కరించలేదు. అలా వెతికితే తను ఏదో దిగుడుబావిలోకి దిగిపోతున్నట్టుంది.
    వాళ్ళిద్దరి మధ్యా ఏం జరిగిందో మరి? తన పని ఇరుకులో పడింది. తన కాళ్ళకూ చేతులకూ ఉచ్చులు బిగిసినట్టయిపోయింది! ఇదివరకటిలా రామనాథబాబు రావడం లేదు. వాళ్ళిద్దరూ సరిగా మాట్లాడుకుంటున్నట్లు లేదు. అప్పటినుంచే వరూధిని పిచ్చికుక్కలా తనవెంట పడుతోంది. దీనికంతా కారణం రామనాథబాబు వరూథినితో సరిగా ఉండక పోవటమే. తన కష్టాలకూ, ఇబ్బందులకూ కారణం వాళ్ళిద్దరిమధ్యా వచ్చిన తగాదాయే.
    వెంకటపతి ఆలోచించగా ఆలోచించగా తట్టిన విషయం అది.
    రామనాథబాబు వస్తూపోతూ వుంటేనే తన పని బాగుంది. తనేం చేస్తుందీ వరూధిని పట్టించుకునేది కాదు. ఇప్పుడు అన్నీ ఆరాలూ అజలూ అసలు హాలువైపుకే వెళ్ళొద్దంటుంది. వెళ్ళకుండా తను ఎలా వుండగలడు? దానికి ఎదురుగా తను ఇంట్లో వుంటే చచ్చినట్టే! ఒక్క నిముషం ఉండలేడు.
    హాలు దగ్గర సామాన్ల గదిలో క్రితం రోజున వదిలొచ్చిన బాటిల్లో మిగిలిన సగం సారా గుర్తొచ్చి వెంకటపతి దిగులుపడిపోయాడు.
    వరూధిని స్నానం చేసి గద్వాల్ చీర కట్టుకుంది. అజంతా స్టయిల్లో ముడిచుట్టుకొని పూర్తిగా ముస్తాబయింది. హైహీల్స్ చెప్పులు తొడుక్కుని వ్యానిటీ బ్యాగ్ ను వయ్యారంగా తిప్పుకుంటూ వరండాలో కొచ్చిన వరూథిన్ని హ్కోసి వెంకటపతి తెల్లమొఖం వేశాడు. వరూధిని హాలు దగ్గరకే ప్రయాణం అయిందని అర్ధం చేసుకున్నాడు. తనను వెళ్ళొద్దని ఇప్పుడు అదే ఎందుకు వెళుతున్నట్టు? తనను వద్దనడానికి కారణం?
    వెంకటపతి బుర్ర గోక్కున్నాడు. ఏదో వంకచెప్పి మరో గంటలోనో, అరగంటలోనో బయటికెళ్ళి ఆ సీసాలోది పూర్తిచేసివద్దామనుకొన్న వెంకటపతికి ఆశాభంగమైంది. అది హాలు దగ్గరేవుంటే తను ఎలా వెళ్ళడం?
    గేటు దాకా వెళ్ళిన వరూధిని తిరిగి మందగొడిగా ఇంట్లోకి వచ్చింది. వెంకటపతికి ఏమీ అర్ధం కాలేదు.
    మళ్ళీ వెనక్కు వచ్చిందేం? దీనికి మతి సరిగ్గా వున్నట్టులేదు. వరండాలో కూర్చుని భార్యకేసి తలతిప్పకుండానే చూస్తున్న వెంకటపతి అనుకొన్నాడు.
    వెంకటపతి అనుకొన్నట్టు వరూధిని మతిలో మతిలేదు. వ్యానిటీ బ్యాగ్ అవతలకు విసిరేసి పడగ్గదిలోకి వచ్చి కూర్చుంది. ముడి వూడదీయాలా, చీర మార్చుకోవాలా అన్నదికూడా తేల్చుకోలేక అలాగే కూర్చున్నది.
    ఆమె మెదడులోని ప్రతి సెల్లూ, శరీరంలోని ప్రతి అణువూ 'రామనాథబాబు' అంటున్నట్టున్నాయి! రామనాథబాబు హాలు దగ్గిర వుంటాడని ఆమెకు తెలుసు. మార్నింగ్ షో ఇంగ్లీషు పిక్చర్ ఆడతారు. దానికి చాలామంది ఆఫీసర్లు వస్తారు. అందులో కొంతమంది ఊరికినే వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ మర్యాదలు చేస్తూ, పరిచయాలు పెంచుకుంటూ రామనాథబాబు తప్పకుండా అక్కడే వుంటాడు. ఆ ఉద్దేశ్యంతోనే వరూధిని బయలుదేరింది. తీరా బయలుదేరాక వరూధినికి అనుమానం వచ్చింది, తన్ను చూసి అతను సరిగా మాట్లాడకపోతే? లేక, తను రావటం చూసి మెల్లగా హాలునుంచి వెళ్ళిపోయి ముఖం తప్పిస్తే తన పనేంగాను? పైగా అతనికోసం తను వెతుక్కుంటూ వెళ్ళినట్టు రామనాథబాబు అనుకుంటే? అంతకంటే తనకు జరిగే అవమానం మరొకటి వుండదు. తను అలుసయిపోదూ? వరూధిని కాంక్షకూ, ఆవేశానికీ, ఉద్రేకానికీ, ఆత్మాభిమానం అడ్డొచ్చింది. ఆమె కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. దుర్మార్గుడు రామనాథబాబు ఎందుకిలా హింస పెడుతున్నాడు?
    బయట కూర్చున్న వెంకటపతి వరూధిని తిరిగిరావడం మంచిదే ననుకొన్నాడు.
    ఏ వంకతో బయటికి వెళ్ళాలా అనే ఆలోచనలో పడ్డాడు. మగాడికి బయట ఎన్నైనా పన్లుంటాయిగా? అవేమిటి? వెంకటపతికి ఆలోచన తెగలేదు.
    "ఇంటిదగ్గరే వున్నారు. హాలు దగ్గిర కెళ్ళలేదేం?"
    మెల్లగా వరండాలోకివచ్చి నిలబడ్డ రామనాథబాబును గమనించలేదు వెంకటపతి.
    "వెంకటపతిగారూ! మిమ్మల్నే! అలా వున్నారేం?"    
    వెంకటపతి తలెత్తి చూశాడు.
    "లావొక్కింతయులేదు, ధైర్యము విలోలంబయ్యె!" అన్న గజరాజు పగిదికూర్చున్న వెంకటపతికి రామనాథబాబు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిలాగే అన్పించాడు. అనిపించటమేమిటి? కన్పించాడు కూడా!
    "ఒక కేస్ స్కాచ్ శ్రీ రామా మెడికల్ షాపువాళ్ళు తెప్పించారు. ఓ నాలుగు బాటిల్స్ మన కిచ్చారు. హాలుదగ్గిర పెట్టా శివరాంను అడగండి" అన్నాడు రామనాథబాబు.
    వెంకటపతి పైటవల్ కూడా వదిలేసి బయలుదేరాడు.
    మకరిని చంపి గజరాజును కైవల్యానికి పంపిన విష్ణుమూర్తి రామనాథ బాబుకంటే ఏం గొప్పపని చేశాడూ?
    గేటుదాకా వెళ్ళిన వెంకటపతిని పిల్చి "కార్లో వెళ్ళండి. మీరు దిగి తిరిగి పంపించండి" అన్నాడు రామనాథబాబు.
    కార్లో కూర్చున్న వెంకటపతి రామనాథబాబుమీద కలిగిన కృతజ్ఞతాభారం మోయలేక సీటులో కుంగిపోయాడు.
    రామనాథ బాబు వరూధిని గదిలోకి వెళ్ళాడు. వరూధిని హంసతూలికా తల్పంమీద అలిగి బిగిసి కాళ్ళు తన్ని పట్టి పడుకొన్న సత్యభామ అలనాడు శ్రీ కృష్ణుని చూసినట్టుగా రామనాథ బాబును చూసింది.
    రామనాథబాబు పారిజాతపుష్పమే తెచ్చాడో, అంతకు మించిందే తెచ్చాడో తెలుసుకోవడానికి నిరాకరించి 'నాతో నీకేం పని?' అన్నట్టు గోడవైపుకు తిరిగి పడుకొన్నది వరూధిని.
    
                            29
    
    రవి హైదరాబాదులో జాగీర్దార్ స్కూల్లో చేరి ఆరునెలలు దాటిపోయింది. మొదటి మూడు నెలలూ, వాడు అక్కడి వాతావరణంలో ఇమడలేకా, తల్లిదండ్రులకు దూరంగా వుండలేకా బెంగపడ్డాడు. దసరా శెలవలకు కొడుకుని తీసుకొచ్చి, సెలవలు కాగానే స్కూల్లో వదిలేసి వచ్చింది వరూధిని. నవంబర్లో రామనాథబాబుతో హైదరాబాదు వెళ్ళింది. అతను బిజినెస్ కు సంబంధించిన విషయాలు చూసుకొంటుంటే, వరూధిని రోజూ స్కూలుకు వెళ్ళి రవితో కొంతకాలం గడిపి వస్తూండేది. మొదట్లో కంటే ఇప్పుడు వాడు బాగానే వున్నాడు. ఇంగ్లీషు మాటలు దంచేస్తున్నాడు. హైదరాబాద్ వదిలి ఊరికి వెళ్తున్నప్పుడూ ఈసారి వాడి వినీవిననట్లే ఊరుకొన్నాడు. మారాం చెయ్యలేదు. వరూధిని కొడుకు భవిష్యత్తు సరైన పునాదులమీదే నిర్మించబడుతోందన్న భావంతో ఉప్పొంగిపోయింది. రవి యోగక్షేమాలు కనుక్కుమ్తూ ఉత్తరాలు రాస్తూ వుండేది. హైదరాబాద్ లో స్థలానికి సంబంధించిన లిటిగేషన్ కూడా వదిలిపోయింది. స్థలానికి అడ్వాన్సు ఇచ్చి ఎగ్రిమెంటు కూడా రాయించుకున్నాడు రామనాథబాబు.
    వరూధిని జీవితం మూడుపువ్వులూ ఆరుకాయలుగా వుంది! వెంకటపతి బతుకు మూడు సీసాకాయలూ-ముఫ్ఫైఆరు పెగ్గులుగా వుంది. రామనాథబాబు ఎగ్జిబిషన్ బిజినెస్ లో లోతుగా వేళ్ళు పాతుకొన్నాడు. అతనితో భాగస్వాములుగా చేరి థియేటర్లు కట్టటానికి ప్రతిజిల్లా ముఖ్య పట్టణంలోనూ ధనికులు ముందు కొస్తున్నారు. అతను చేసే వ్యాపార పరిధి కంటే అతని సమర్ధతను గురించిన ప్రచారం నాలుగింతలు పెరిగిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS