ప్రధాని అనుమతితో అతనికి త్రోవ వదిలారు.
మేరు నగదీరునిలా నచ్చడతను.
ఏసిపి కిరణ్మయి వైపు చూశాడు ప్రధాని.
అయన సైగను అర్ధం చేసుకుని "తనే విష్ణునని" చెప్పుకుంటున్న వ్యక్తిని సమీపించింది కిరణ్మయి.
"కిరణ్మయి ......నాది పెట్టుడు గడ్డం కాదు. దుష్ట శక్తులు నన్ను చీకటి కొట్లో బంధించి వుంచితే పెరిగిన గెడ్డం మీసాలు ఇవి.....అయినా ఇంత దగ్గరగా చూస్తూ కూడా నన్ను పోల్చుకోలేకపోతున్నావే!"
అవే మాటలు .......అదే కంఠం....
గొంతులో అదే మార్దవం.....అదే మందలింపు.......
ఇద్దరిలో ఎవరు నిజమయిన విష్ణు అన్న సంగతి ఎలా తెలుసు కోవాలి?
కిరణ్మయి చేతికి గరుగ్గా తగిలిందే తప్ప అతని గడ్డం ఊడిరాలేదు.
"చూశావా పవిత్రమయిన సన్యాసాశ్రామం స్వీకరించినా మరొకరిని నిందించే దుస్థితిని కలిగించావు?" విష్ణు నని చెప్పుకుంటున్న వ్యక్తీ గొంతులో బాధ......
"ఓరి అల్పుడా......నా వేషంలో వచ్చిందే కాకుండా నన్నే తప్పు పడతావా? ఇంతకుముంది ఒకడు ఇలానే వచ్చి భంగపడ్డాడు. నీ గతీ అంతే....నిజంగానే గడ్డం , మీసాలు పెంచుకుని వచ్చినంతమాత్రాన సాక్షాత్తూ విష్ణు స్వరూపాన్ని ఎదురుగా వుంచుకుని నేనే విష్ణు నంటే సరిపోతుందా? తాము దైవంగా పూజించే వ్యక్తిని అవమానిస్తూ వుంటే ప్రజలు వూరుకుంటారనుకుంటున్నావేమో........ఒక్కసారిగా వెల్లువలా ఉప్పొంగే ప్రజా వాహిని ముందు నువ్వెంత?"
విష్ణు స్వరంలో అన్యాపదేషంగా ప్రజలు ఏం చేయాలో సూచిస్తున్నట్టుగా వుంది.
"విష్ణు గురుదేవులను దూషించే దుర్మార్గుడిని వదలకూడదు......"
ప్రజలలో ఒక్కసారిగా చైతన్యం వచ్చినట్టు ఎలుగెత్తి కేకలు వేయడం ప్రారంభించారు.
"భక్త జనులారా........." ఆవేశ పడవద్దు.....శాంతించండి.......భగ భగ మండే అగ్ని గోళం లాంటి మహనీయుడు మన విష్ణు గురుదేవులు. ఆయనకు కోపం వచ్చిందంటే ఇతను మాడి మసైపోతాడు. అందుకే యితనిని శిక్షించే నిర్ణయాన్ని గురుదేవులకే వదిలేద్దాం" అన్నాడు ప్రధాని.
"అవును, అతనిని శిక్షించాలి"
"వదలకూడదు.......శిక్షించివలసిందే" ప్రజల నినాదాలు మిన్ను ముట్టాయి.
"ప్రజాభిప్రాయాన్ని శిరసా వహించడం మా కర్తవ్యం?" అంటూ విష్ణు గాలిలో అరచేయి చూపాడు.
శూన్యంలో నుంచి పుట్టుకొచ్చినట్టు విభూది అయన అరచేతిలో రాలి పడింది. ఆ విభూది గుప్పిట మూసి , ఒక్క స్కహనం కళ్ళు మూసుకుని తెరచి తనే విష్ణు నని చెప్పుకుంటున్న వ్యక్తీ వైపు విరజిమ్మాడు విష్ణు.
కానీ అతనికి ఏమీ కాలేదు.
క్షణం విష్ణు ఆశ్చర్యపోయాడు.
"పిచ్చివాడా నీవన్నీ కనికట్టు విద్యలు ఇంద్రజాలంతో ప్రజలను మోసగించవచ్చు, కానీ నన్ను మాయ చేయలేవు. నా స్థానంలో ఇంకొకరు ఉండి వుంటే కిక్కురుమనకుండా నేల కూలీ వుండేవారు. చూసేవాళ్ళకు నీ మంత్ర శక్తితో నన్ను ఏదో చేసినట్టు చెప్పి ఉండేవాడివి.
"కానీ, లాఘవంగా నీ కుడి మోచేతి క్రింద అమర్చుకున్న సైలెన్సర్ పిస్టల్ ను ప్రేల్చావు. కాని బుల్లెట్స్ నిజానికి నా శారీరంలో దిగినా అవి నన్నేమీ చేయలేవన్న విషయం నీకు తెలియదు పాపం. ఇవిగో నువ్వు ప్రయోగించిన బుల్లెట్లు అని గుప్పిట తెరచి చూపించాడతను.
బుల్లెట్లు అతని చేతులలో నుంచి జారిపడ్డాయి.
"ఓహో......నీ ఇంద్రజాల విద్యలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయాత్నమూ ఇది......నువ్వే అసలయిన విష్ణువని నమ్మేలా మాయమాటలు చెప్పినంత మాత్రానా ఈ ప్రజలు నిన్ను నమ్ముతారనుకోవడం కేవలం నీ భ్రమ....." విష్ణు గంబీరంగా అన్నాడు.
"పిచ్చివాడా........ఎవరు మాయమాటలు చెబుతున్నారో ప్రజలు తెలుసుకోవాలనే నేను వచ్చింది......నువ్వు ఎంతగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా నిజాన్ని దాచలేవు. నా శిష్యులలోని రమేష్ నీ అనుచరుడే. అతని ద్వారానే నా ప్రతి కదలికా నువ్వు తెలుసుకోగాలిగావు........
'అనుక్షణమూ ఆశ్రమ దృశ్యాలను వీడియో తీసి ఆ కాసేట్ ను వినయ కుమార్ కు అందించినట్టే అందిస్తూ మరొక కాసేట్ ను నీకు పంపేవాడు. ఆ కాసేట్ వేసి చూసుకుని నా పద్దతులు, నా అలవాట్లు, నా నడక, మాటలు అన్నీ నేర్చుకుని నాకు డూప్లికేట్ లా తయారయ్యావు. సమయం చూసి నన్ను మాయం చేసి నా స్థానంలోకి వచ్చావు. ఎలాగయినా దేశాధినేత కావాలనే నీ ఆశను ఇలా నా రూపంలో వుండి తీర్చుకోవాలనుకున్నావు." అతని గొంతు స్థిరంగా వున్నది.
జనానికి ఏది నమ్మాలో , ఏది నమ్మకూడదో అర్ధం కాని పరిస్థితి......"నువ్వు మెస్మరిజం చేసి ప్రజాలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నావు. వేదికపై ఇంత మంది పెద్దల ఎదుట వున్న నన్నే కాదంటున్నావు. నువ్వే విష్ణువని చెప్పడం నాకు నవ్వు తెప్పిస్తున్నది. అసలు నువ్వు ఏమాశించి నా పేరును ఉపయోగించుకుంటున్నావో నాకు అర్ధం కావడం లేదు. ఏ ప్రతి ఫలం కోసం ఇలా నటిస్తున్నావో చెప్పు దయతలచి నీకు క్షమా భిక్ష పెడతాను విష్ణు చిద్విలాసంగా అడిగాడు.
