అతనిలో ఎందుకింత స్వార్ధం పెరిగిందో.....అధికార దాహం అసలెందుకు పుట్టిందో అర్ధం కావడం లేదామెకు.
ఆమె ఆలోచనలలో వుండగానే పోలీసులు ఎవడో ఒక వ్యక్తిని దూరంగా నెట్టడం గమనించింది ధీరజ.
గడ్డం, మీసాలు పెరిగిన ఒక వ్యక్తీ స్టేజీ పైకి రావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.
"ఆ భక్తుడు ఏదో చెప్పాలని వస్తున్నట్టున్నాడు. అతనిని స్టేజీ మీదకు రానివ్వండి.' అన్నాడు విష్ణు.
పోలీసులు మౌనం వహించారు.
ఆ వ్యక్తీ మెల్లగా స్టేజీ ఎక్కాడు.
"ప్రజలారా.....విష్ణునని చెప్పుకుంటున్న ఇతను పచ్చి మోసగాడు మైకుని అందుకుని గడ గడా చెబుతున్న ఆ వ్యక్తీ మాటలకు అందరూ ఖంగుతిన్నారు.
విష్ణు మాత్రం అతని వైపు చిరునవ్వుతో చూచాడు.
"ఎవరు నువ్వు......." అన్నాడు ప్రధానమంత్రి.
"నేనే విష్ణుని"
ప్రజలలో కలవరం......
ధీరజలో తత్తరపాటు.......
కిరన్మయిలో ఆందోళన.....
రీటాలో సంచలనం.......
విష్ణు చిరునవ్వులో ఎలాంటి మార్పులేదు.
"ఇతనెవరో పిచ్చివాడులా వున్నాడు. తనేం మాట్టడుతున్నడో తెలియని ఉన్మాదంలో ఏదేదో మట్టాడుతున్నాడు. చివరకు గురుదేవులనే మోసగాడు అంటున్నాడు. స్వామీజీ మనందరి కళ్ళ ఎదురుగా కనిపిస్తుంటే తన మాటలను ఎవరూ నమ్మరనే ఇంగితం కూడా లేని పిచ్చివాడు.......వీడిని ఇంకాసేపు ఇక్కడే వుంచితే ఏదేదో వాగుతాడు. ముందు తీసుకెళ్ళండి." అంటూ సేక్యురీటీని ఆదేశించాడు ప్రధాని.
పోలీసులు హడావుడిగా స్టేజీపైకి వచ్చారు.
"యూ చీట్.....విష్ణునని చెప్పుకుంటూ ఎందుకురా ఇలా ప్రజలను వంచిస్తావు? ఈ ప్రజలు నీ కపటవేషాన్ని గుర్తించలేరనుకుంటున్నావా?" అతను మరింత ఆవేశంగా అన్నాడు.
"లేనిపోనివి చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న వీడిని పట్టుకుని పరీక్షించండి. నిజమేమిటో బయట పడుతుంది.'
విష్ణు అనడం ఆలస్యం అతని శిష్య బృందంలో ఒకడు శరవేగంతో అతనిని సమీపించి విసురుగా అతని గడ్డం పట్టి లాగాడు.
అంతే.......
పెట్టుడు గడ్డంతో పాటు విష్ణులా కనిపించే మాస్క్ ఊడివచ్చింది.
ప్రజలలో హాహాకారాలు చేలరాగాయి.
విష్ణులో అదే చిరునవ్వు.
ప్రధానికి ఆ సన్నివేశాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో అంతుపట్టలేదు.
"చూశావా......విష్ణు గురుదేవులను అప్రతిష్టపాలు చేయడానికి ఓర్వలేని వాళ్ళు ఎవరో కుట్ర పన్నుతున్నారని అర్ధమవుతుంది. మారువేషం వేసుకుని వచ్చినంత మాత్రాన అతని మాటలు నమ్మడానికి ప్రజలు గుడ్డివాళ్ళు కాదు. అమోఘశక్తి సంపన్నులయిన గురుదేవులతో పోటీ పడాలంటే మాటలా?" ప్రధాని ఆవేశంగా చెబుతూనే వున్నాడు.
"ఎందుకు పోటీ పడకూడదు?"
ప్రజలలో నుంచి ఎవరో సూటిగా ప్రశ్నించడంతో ప్రధాని ఖంగు తింటూ ప్రసంగాన్ని ఆపి అతని వైపు చూశాడు.
అచ్చం విష్ణులా కనిపించే మరొక వ్యక్తీ నిలిచివున్నాడు ఆ గుంపులో.
"ఓహో....మరొక నకిలీ విష్ణు తయారయ్యాడన్నమాట"
స్టేజీ మీదనున్న విష్ణు శిష్యులలో ఒకడు వ్యంగ్యంగా అన్నాడు.
"నకిలీ కాదు.......ఆసలు విష్ణును నేనే"
అతని నోటి నుంచి వచ్చే ఒక్కొక్క అక్షరం ఫిరంగి గుండులా దూసుకు వచ్చి భూనభోంతరాలు దద్దరిల్లిపోతున్నట్టు ఖంగు ఖంగు మంటూ వినిపిస్తున్నాయి.
సహజంగా మైక్ వుంటే తప్ప అంత పెద్ద కంఠంతో వినిపించదు.
అలాంటిది అంత బిగ్గరగా తాము ఎలా వినగలుగుతున్నామో భక్త జనులకు అర్ధం కావడం లేదు.
పరిశీలనగా అతని వైపు చూశాడు ప్రధాని.
ఆ వ్యక్తీ ముఖ మండలం తేజోవంతంగా ప్రకాశిస్తున్నది.
ధీరజ చూపులు అతన్ని శల్య పరీక్ష చేశాయి.
మరుక్షణమే ఆమె హృదయంలో ఏదో తెలియని అలజడి ప్రరంభమయింది.
అదే కలవరం ఏక కాలంలో కిరణ్మయిలో కూడా కలిగింది.
ఆ ఇద్దరూ స్టేజి పైనున్న విష్ణును తొలిసారిగా పరీక్షగా చూశారు.
అతనిని స్టేజీ పైకి రానీయండి. అతని బండారాన్ని కూడా బయట పెడదాం. పూజ్యులయిన గురుదేవులతోనే తమాషా చేస్తున్నాడు అల్పుడు."