"అవును .......నిజమే......నేను నిన్ను వేయవలసిన ప్రశ్నను నువ్వే నన్ను వేస్తున్నవన్నమాట. అసలు ఏం జరిగిందో ప్రజలకు తెలియవలసిన మాట నిజమే. సజీవ సమాధి కోసం నిర్ణయించిన స్థలంలో అంతకు ముందే సొరంగం తవ్వి వుంచుకున్నావు, నువ్వు లోపలకు వచ్చి నా స్థానంలో నువ్వు వుండి నన్ను బందించావు.
"అప్పటి నుంచి నేను నీ చెరలో వున్నాను. నీ మనసులో మెదిలే దురేద్దేశాన్ని పసిగట్టి రాత్రి మాయమై పోయాను. బహుశ అందుకే నన్ను మోసగాడిగా నిరూపించడానికి తెలివిగా నాకన్నా ముందు ఒక మాయగాడిని ప్రవేశపెట్టి ప్రజలలో నీమీద విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. వాస్తవానికి నువ్వు విదేశీ ఏజెంట్ వన్న సంగతి తెలిస్తే ఈ ప్రధాని గుండె ఆగిపోతుంది. ఆ పదవి కోసమే నా వేషాన్ని వేసుకున్నావని వూహించి వుంటే ఇక్కడున్న అధికారుల మతులు పోవడం ఖాయం........" చిద్విలాసంగా చెబుతున్నాడతను.
'అపు నీ ప్రేలాపనలు. నీకు ఎంత ధైర్యం లేకపోతే నాముందే నా వేషంలో నిలిచి కల్లబొల్లి కబుర్లతో ప్రజలను భ్రమలో ముంచివేస్తున్నావు. నువ్వే నిజమయిన విష్ణువి అయితే నీ శక్తి చూపించు. నీ మహాత్యాన్ని ప్రజలకు చూపగలిగితే అప్పుడు నమ్ముతారు ప్రజలు......." అన్నాడు విష్ణు ఎగతాళిగా.
"అవును..........అవును"
ప్రజలలో స్పందన!
"నువ్వు చేసే ఇంద్రజాల విద్యలను నేను ప్రదర్శిస్తే నన్ను ప్రజలు తెలుసుకుంటారు అని నువ్వు చెప్పడం వింతగా వున్నది. నా స్వలాభం కోసం నేను ఎప్పుడూ ఏ విద్యలూ ప్రదర్శించను, ప్రదర్శించలేదు కూడా! నాలోని ఆత్మశక్తి నన్ను నడిపిస్తుంది. ఏ విద్యలనయినా లోక కళ్యాణం కోసమే వినియోగించాలి తప్ప స్వార్ధానికి ఉపయోగించకూడదు. ఇది నాకు తెలిసిన సత్యం........
"నీలాంటి విదేశీ గూడచారికి సరయిన శిక్ష విధించాలంటే వీళ్ళ కయితే న్యాయస్థానాలు కావాలి, నాకు నా ఆత్మసాక్షే న్యాయస్థానం. నువ్వు నా శక్తి ఎలా వుంటుందో చూపించు.........చూపించు అని ముచ్చటపడుతున్నావు . నీకంత కోరికగా వుంటే నేనెందుకు కాదంటాను."
తనే విష్ణునని చెప్పుకుంటున్న ఆ వ్యక్తీ.........స్టేజీపైనే పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. సింహాసనాన్ని అధిష్టించి వున్న విష్ణు అతని చర్యలను వినోదంగా చూస్తున్నాడు.
"నేను గనుక సర్వకాల సర్వావస్థలందు ఎలాంటి స్వార్ధ ఫలాపేక్ష లేకుండా నిత్యమూ ఆ దైవాన్ని కొలిచిన పక్షంలో నా గురుదేవుని చేత దీక్ష పొందినది మొదలు నాలో యోగ శక్తి వున్నమాట నిజమే అయితే........ఈనాడు నా మాతృభూమిని కబళించ జూస్తున్న ఈ విదేశీ ఏజెంట్ నిగురు రాశిలా మారిపోవుగాక...."
అంటూనే అర్దనిమిలిత నేత్రాలతో ధ్యానంలో మునిగిపోయాడతను.
అప్పటికీ ఏమీ కాకపోవడంతో ప్రజలు, అధికారులు, అనధికారులు అంతా విరగబడి నవ్వుతున్నారు.
"వాడొక విష్ణు........వాడికొక శక్తి వున్నది........దానిని మనం నమ్మాలి.' విష్ణు భక్తుడొకడు వ్యంగ్యంగా అంటున్నాడు.......
అంతే........
ఉన్నట్టుండి తటిల్లున మెరుపు మెరిసినట్టయింది.
ఉలిక్కిపడుతూ మాటలను అపెశాడతను.
ఆ మెరుపులో నుంచి తెల్లని కాంతి పుట్టుకొచ్చి పద్మాసనం వేసుకుని కూర్చుని వున్న విష్ణు చుట్టూ వలయాకారంలో ఆక్రమించుకున్నది.
అందరూ చూస్తుండగానే విష్ణు శరీరం గాలిలో పైకి లేచింది.
ఆ దృశ్యాన్ని రెప్ప వేయడం కూడా మరచిపోయి చూస్తుండి పోయారందరూ.
మరుక్షణంలోనే టార్చ్ లైట్ ఫోకస్ చేసినట్టు విష్ణు నుదుటి నుంచి కాంతిరేకలు దూసుకు వచ్చాయి.
సింహాసనాన్ని అధిష్టించిన విష్ణుని ఆ కాంతి రేకలు తాకిన మరుక్షణం దీపావళి పటాసులు పేలినట్టు అక్కడ పెద్ద విస్పోటనం........సంభవించింది. అందరికళ్ళు మసకబారాయి. చెవులు గింగిర్లు పడ్డాయి.
అసలు అక్కడ ఏమయిందో ఎవరికీ తెలియడం లేదు.
సింహాసనం ఉన్న స్థానంలో తెల్లని వెలుగు మాత్రం ఉన్నది.
క్రమెపీ ఆ వెలుగు అంతరించిపోతున్నది.
ఇప్పుడు అక్కడ అసలు ఒక మనిషి కూర్చున్న ఛాయలు లేవు.
ఆ స్థానంలో బూడిదగుట్ట మాత్రం మిగిలి వున్నది.
ఆ వెలుగు తిరిగి విష్ణు నుదుటిని తాకి చిన్న జ్యోతిలా మారి అందరూ చూస్తుండగానే ఆకాశంలోకి వెళ్ళిపోయింది.
ఆ మరుక్షణమే విష్ణు శరీరం గరిమనాభిని కోల్పోయింది.
కట్టే విరిగి పడినట్టు అచేతనంగా వెనక్కు వాలిపోయాడు విష్ణు.
అందరూ కంగారుగా విష్ణును సమీపించారు.
"దాహం........దాహం.........తులసీ తీర్ధం .........భవానీ......"
విష్ణు పెదవులు అస్పష్టంగా ఉచ్చరిస్తున్నాయి.....
ఆ మహానుభావుని అంతిమ ఘడియలు అవేనని అందరికీ అర్ధమయింది.
ఎవరో పిలిచినట్టు జనంలో నుంచి వచ్చింది భవానీ.......!
"నా విష్ణు నాకోసమే తుది ప్రాణాలను కూడబెట్టుకుని వుంటాడని నాకు తెలుసు. అతని పిలుపు అందుకునే వస్తున్నాను . నాకు స్వప్నంలో కనిపించి చెప్పాడు విష్ణు. "నీ చేతులమీదుగా తులసీ తీర్ధం త్రాగాలని వున్నది. వెంటనే బయలుదేరిరా.......అని దాని అర్ధం ఇదేనన్నమాట" కన్నీరు మున్నీరుగా విలపిస్తూ విష్ణు తలను ఒడిలోకి చేర్చుకుని అతని నోట్లో తులసి తీర్ధం పోసింది భవానీ.
మరుసేకనులో విష్ణు కనులు శూన్యంలోకి చూస్తున్నాయి.
బ్రతికినంతకాలం కఠోర బ్రహ్మచారిగా జీవించి, యోగాశాక్తిని సాధించి, చివరకు దేశ సౌభాగ్యం కోసం.......లోక కల్యాణం కోసం ఆ తపః ఫలాన్ని ధారపోసి నింగికి ఎగసిన ఆ మహానీయిని గుర్తు చేసుకుంటూ చేతులెత్తి నమస్కరించారు భక్తజనులు.
ఎవరూ అధిరోహించలేని కీర్తి శిఖరాగ్రాన్ని తన విష్ణు.......అందుకోకలిగినందుకు కలెక్టర్ ధీరజ మనసులోనే అతనికి నివాళులు అర్పించింది.
కానీ, ఆవేదనకు చిహ్నంగా ఆమె కళ్ళలో నీరు ఉబికింది......
కారణం..........ఆమె కూడా ఒక అవివాహితే!
ఆమెకూ ప్రేమానుభూతులు తెలుసు......రెండు మనసులు మమైకమవడాన్నే పవిత్ర ప్రేమ అనేటట్టయితే డానికి నిర్వచనం తామిద్దరేనన్న నమ్మకం ఆమె కున్నది. ఆ బంధాన్ని తెంచుకుని ఆమె రాలేకపోవడం ఆమె బలహీనత కాదు.
భారత స్త్రీ మనసా, వాచా , జీవితంలో ఒకరినే కోరుకుంటుంది. అలానే, భారతి, కిరణ్మయి, రీటా భవానిల విహయంలోనూ అదే జరిగింది.
వాళ్ళు కూడా విష్ణుని తమ దైవంగానే కాదు.....తమలోని ఆణువణువూ అతడే నన్న ఆత్మ తృప్తితో తమ శేష జీవితాన్ని అతను చేపట్టిన ప్రజాహిత కర్యలకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు.
-----సమాప్తం----
