"లేదు వెళ్ళాలి....అయినా నీతో కబుర్లెంటి? నన్ను వెళ్ళని!" అంది కాస్త కటువుగా ధైర్యం చేసి.
"అరెరె.... అంత కోపం దేనికండి....ఆరోజు మిమ్మల్ని రక్షించిన వాడిని నేనే ఆ రౌడి వెధవ నుంచి....."అన్నాడు సీరియస్ గా నవ్వుతూ.
"అదంతా నాటకం....నువ్వే ఆ రౌడిగాడిని పంపి అలా నన్ను రక్షించినట్లు నాటకం ఆడి ఉంటావు...." అంది జయంతి.
"అరెరె.....నీకు చాలా విషయాలు తెలుసే!" అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు.
"వదులు!" అంటూ చేయి విదిలించి అతన్తో పెనుగులాడింది జయంతి.
"వదలటానికి కాదు జయంతి పట్టుకుంది. ఏడాది క్రితం కంటే ఇప్పుడు మరింతగా పెటపెటలాడుతున్నావు......ఈరోజు నిన్ను వదలను. అప్పటి నుంచి ఛాన్స్ కోసం చూస్తున్నాను. ఇప్పటికి చిక్కావు" అన్నాడు మహేంద్ర వెకిలిగా నవ్వుతూ.
"అనవసరంగా గొడవల్లో పడతావు....చేయి వదులు!" అంది జయంతి.
"మర్యాదగా నా మాట విని రామలయంలోకి రా.....లేకపోతే చంపేస్తాను!" అంటూ బొడ్లో నుంచి బటన్ నైఫ్ తీశాడు మహేంద్ర.
జయంతికి ఏం చేయాలో పాలుపోలేదు. గజగజ వణికిపోయింది.
"ఏడాది నుంచి నీ అందాన్ని అనుభవించాలని చూస్తున్నాను జయంతి. ఇంత కాలానికి నా పంట పండింది. ఇక్కడ నిన్ను ఆడుకోవటానికి ఎవడు రాడే. వచ్చినా నా చేతిలో మట్టి కరవాల్సిందే!" ఊ! నడువ్ లోపలికి !" అంటూ గద్దించాడు.
"మహేంద్రా! ప్లీజ్! నా జీవితాన్ని అన్యాయం చేయకు!" అంది జయంతి.
మహేంద్ర పగలబడి నవ్వాడు.
"జీవితాలు నాశనం చేయటమే నా పని జయంతీ.....జోకులు వేయకుండా నోరు మూసుకో!" అంటూ ఆమెను అలాగే చేతుల మీద ఎత్తుకుని రామలయంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ దాదాపు అంతా నిర్మానుష్యంగా వుంది. జయంతి ఒక్కసారిగా.....
"రక్షించండి.....కాపాడండి...." అంటూ పెద్దగా అరిచింది. మహేంద్ర ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆమె అలా అరుస్తుందని ఉహించలేదు.
"ఏయ్...." అంటూ ఆమె నోట్లో తన హ్యండ్ కర్చీఫ్ తీసి కుక్కబోయాడు. జయంతీ మళ్ళీ అరిచింది. "రక్షించండి--కాపాడండి" అని సురేంద్ర ట్రాక్టర్ తోలుకుంటూ అప్పుడే అటువేపుగా వెళుతున్నాడు, అతని చెవిలో పడ్డాయి ఆ కేకలు.
ఎవరై వుంటారు? అనుకుంటూ ట్రాక్టరు ఆపి, రామలయంలోకి వెళ్ళాడు. అక్కడ చీకట్లో రెండు ఆకారాలు పెనుగులాడుతున్నాయి.
సురేంద్ర క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒక్కసారిగా అతని పైకి దూకాడు. ఆతని దవడ కండరం పైన బలంగా కొట్టాడు. అతను ఆ దెబ్బకు వెళ్ళి పదిగజాల దూరంలో పడ్డాడు. జయంతి సురేంద్రని గుర్తు పట్టింది.
"బావా!" అంటూ అతన్ని గట్టిగా వాటేసుకుని భోరున ఏడ్చింది.
సురేంద్ర రక్తం సలసలా కాగిపోయింది. అతని కళ్ళు చింత నిప్పుల్లా మారాయి.
"జయంతీ! నీకేం భయం లేదు. వెళ్ళి అక్కడ పక్కన నిలబడు. వాడి పని నేను పడతాను. మహేంద్రగాడు కదూ
వాడు....?" అన్నాడు సురేంద్ర.
జయంతి అవును అన్నట్లు తలూపింది.
"ఏరా! నీ బాబు కరణం మామీద పగబట్టి మా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుని భంగపడ్డారు. ఆ కరణం గాడు జెయిలు కెళ్ళాడు....మళ్ళీ నువ్వొకడివి తయారయ్యావా?" అన్నాడు సురేంద్ర మహేంద్ర చొక్కా పట్టుకుని.
"మర్యాదగా చొక్కా వదులు" అన్నాడు మహేంద్ర.
అతని అహం దెబ్బ తింటుంది జయంతి ముందు.
"నీకు మర్యాద ఏంట్రా! ఈరోజు నా చేతిలో నీ చావు ముడింది" అంటూ అతని ముఖం పైన గట్టిగా గుద్దాడు.
వెంటనే మళ్ళీ సురేంద్ర అతని చొక్కా పట్టుకుని పైకి లేపి వెంటనే ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అలా కొన్ని నిముషాలపాటు అతన్ని చితకబాది చివరిసారిగా హెచ్చరిస్తున్నాను......మళ్ళీ జయంతి వేపు కన్నెత్తి చూశావో నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త" అంటూ అతని డొక్కలో కాలు పెట్టి తన్నాడు సురేంద్ర.
అతను 'అమ్మా'అంటూ కిందపడి గిలగిలా తన్నుకుంటున్నాడు. సురేంద్ర జయంతి చేయి పట్టుకుని 'పద జయంతి' అన్నాడు.
జయంతి అలానే స్థాణువులా సురేంద్రను చూస్తూ నిలబడిపోయింది.
"బావా! ఈరోజు నువ్వు ఇక్కడకు రాకపోతే నా బ్రతుకు ఏమయ్యదో ? తలుచుకుంటేనే భయం వేస్తుంది. నీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు" అంది జయంతి.
"జయంతి! నేనే ఎన్ని జన్మలెత్తినా మావయ్య ఋణం తీర్చుకోలేను. నా పెళ్ళి ఎంత వైభవంగా చేశారో తెలియంది కాదు. చిన్నప్పటి నుంచి నన్ను ఎంత బాగా చూశారో మీరంతా.....ఆ ఋణం ఈ విధంగా తీర్చుకున్నాను. జయంతి--పద వెళదాం...ఇంకే వెధవ నిన్ను కన్నెత్తి కూడా చూడడు...." అన్నాడు సురేంద్ర.
"బావా! ఒక్క విషయం" అంది జయంతి.
"ఏంటి జయంతీ?" అన్నాడు సురేంద్ర.
"ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఇంట్లో చెప్పకు.....అమ్మా నాన్న భయపడిపోతారు. నన్ను కాలేజి కూడా పంపరు-సరేనా?" అంది జయంతి.
"ఓస్ అంతేనా? నేనింకేమిటో అనుకున్నా......అంత సీరియస్ గా అడుగుతుంటే....." అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ.
జయంతి కూడా నవ్వుతూ ట్రాక్టర్ ఎక్కి కూర్చుంది. సురేంద్ర ట్రాక్టరు స్టార్ట్ చేశాడు.
