Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 64


                                    చలి : చలి

    ఇవాళ శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా చలిగా వుందనీ, నేను
    కొంకర్లెత్తి పోతున్నానని నీకు తెలియజెయ్యా లను
    కుంటున్నాను. నాగదిలో ఎంత చలిగా వుందనుకున్నావు.
    కథ రాయాలని మొదలు పెట్టినప్పుడల్లా ఈ చలి నన్ను
    బలవంతంగా ఆపి వేస్తోంది. వెంటనే నిలబడి వ్యాయామం
    చేస్తూ వుంటాను.
    అంటే దీని అర్థం కొరడుగట్టపోతున్న కధా రచయితలకి వెచ్చదనం ఇవ్వడానికి గాను కొంత ప్రయత్నం జరగాలన్న మాట. ఒక్కొక్కసారి మరీ చలిగా వున్నప్పుడు నేను గొప్ప రచన సాగించగలుగుతాను. ఇంకొకసారేమో అది సాధ్యం కాదు. ఎండలు కాస్తున్నప్పుడూ ఇంతే. కథ రాయకుండా ఒక్క రోజైనా వ్యర్థం చెయ్యడం నాకిష్టం లేదు. అంచేతనే ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. చలిమీద నాకు చాలా కోపం వచ్చిందని నీకు చెప్పడానికి. కాలిఫోర్నియాలో ధనవంతులైనవాళ్ళు జీవించే వెచ్చని భవనంలో కూర్చుని ఈ చలి సంగతంతా కల్పించి రాస్తున్నాననుకోవద్దు. నేనిప్పుడు కూర్చున్న గదిలో చలి కొరుక్కుతినేస్తోంది. ఎక్కడా ఒక్క సూర్యకిరణం కూడా కనబడదు. ఈ చలి విషయం తప్ప ఇంకోటి ఏముంది చెప్పడానికి. ఈనాటి సంఘటన ఈ చలి ఒక్కటి మాత్రమే. కొరడు వారిపోతున్నాను. నా దంతాలు గజగజమని చప్పుడు చేస్తున్నాయి. చలితో స్తంభించిపోతున్నా కథానికా రచయితల కోసం డెమోక్రాటిక్ పార్టీవారు ఎప్పుడైనా చేసింది ఏమైనా వుందా అని అడుగుతున్నాను. తతిమ్మా వాళ్ళందరికీ వేడి దొరుకుతుంది. మేము సూర్యరశ్మి మీదనే ఆధారపడాలి.
    చలికాలంలో సూర్యుడి సాయం దొరకదు. అది ప్రస్తుతం నా సందిగ్ధావస్థ. రాయాలని తహతాహ. చలి వల్ల రాయలేకపోవడం.
    కిందటేడు చలికాలంలో ఒకరోజు సూర్యుడు వచ్చాడు. నా గదిలో సూర్యకాంతి ప్రసరించింది. నా టేబులు మీదికి వెలుతురు వ్యాపించింది. నా టేబులూ, గదీ నేనూ వెచ్చదనం అనుభవించాము.
    కాబట్టి నేను త్వరగా ఇన్ని బస్కీలు తీసి ఓ కథ రాయడానికి కూర్చున్నాను. కాని ఇది చలికాలపు రోజు. మొదటి పేరా ముగించానో లేదో సూర్యుడు మబ్బుల్లో మాయమైపోయాడు. నేను గదిలో మిగిలిపోయాను - చలికి కొట్టుకుపోతూ, కథ రాసుకుంటూ, ఎంత మంచి కథ అనుకున్నావు. ఎవ్వరూ అచ్చువెయ్యరని నాకు తెలిసికూడా అంత మంచి కథను రాయడం మానివేయలేకపోయాను. దానికి ఫలితం కథ ముగించేసరికి కర్రలాగ కొంకర్లెత్తి పోయాను. నా మొగంలో నెత్తురు గడ్డకట్టిపోయింది. కాళ్ళూ చేతులూ కదల్చలేకపోయాను.
    ఎన్ని సిగరెట్లు కాల్చానో గదినిండా పొగ. ఆ పొగ కూడా గడ్డకట్టిపోయింది. మేఘంలాగా నా గదినంతా ఆ పొగ ఆవరించింది. అయినా చలిమాత్రం అలాగే వుంది. ఇంకోమాటు కథ రాస్తూ రాస్తూ ఒక తొట్టె తెచ్చి అందులో మంటచేద్దామనుకున్నాను. నేను చెయ్యాలనుకున్నదేమిటంటే నా పుస్తకాల్లో ఓ అరడజను పైకి తియ్యడం వాటికి నిప్పంటించడం అలా చేస్తే నాకు వెచ్చదనం తగిలి నా కథ రాసుకోవడానికి వీలవుతుంది. ఒక పాత తొట్టిని చూసి దాన్ని నాగదిలోకి తెచ్చాను. కాని తగలబెట్టడానికి పుస్తకాల కోసమని చూస్తే ఒక్కటీ దొరకలేదు. నా పుస్తకాలన్నీ పాతవీ, చవకవీ, ఇవి సుమారు అయిదువందలుంటాయి. చాలా మట్టుకు వాటిలోనివన్నీ అణాకీ. బేడకీ కొన్నవే. కాని తగలబెట్టదగ్గ శీర్షికలకోసం వెదికితే ఒక్కటీ కనబడలేదు. జర్మన్ భాషలో శరీరశాస్త్రం మీద రాసిన ఒక పెద్ద బరువైన పుస్తకం వుంది. దాన్ని తగలబెడితే ఖణీగా ఒక గంటసేపు మండుతుంది. అయితే దాన్ని తెరిచి ఆ అందమైన భాషలో ఒక్క పంక్తి చదివానో లేదో, ఇత్యాది - ఒక నాతరమయిందికాదు. అసాధ్యాన్ని కోరడం వంటిది. నాకాభాష అర్థంకాదు గాని, పుస్తకం అంతట్లోకీ ఒక్క ముక్క కూడా బోధపడదు కాని అదేమిటో పుస్తకం నన్ను తగలబెట్టవద్దని అరిచినట్లయింది. రెండు మూడేళ్ళ కిందట ఆ పుస్తకాన్ని ఐదణాలిచ్చి కొన్నాను. సుమారు ఆరు పౌన్ల బరువుంది. కాబట్టి వంట చెరుకుగా చూసినా మంచి బేరమే చేశానన్న మాట. పేజీలు  చింపి చక్కగా మంట చేసుకోగలిగివుందును.
    కాని ఆ పని చెయ్యలేకపోయాను. పుస్తకంలో వెయ్యి పైచిలుకు పేజీలున్నాయి. ఒకతూరి ఒక పేజీగా చింపి నిప్పంటించాలనీ ప్రతిపేజీ తగలబడుతూండడం చూడాలనీ అనుకున్నాను. కాని ఆ అక్షరాలన్నీ అగ్గిలో తుడిచిపెట్టుకు పోతావుంటే, అమోఘమైన ఆ భాష నా లైబ్రరీలోంచి అంతర్ధానమై పోతుందంటే ఆపని మరి నాకు చేతనయింది కాదు. ఇప్పటికీ ఆ పుస్తకం నాదగ్గరుంది. గొప్ప గొప్ప రచయితల గ్రంథాలు చదివి విసిగిపోయినప్పుడు ఈ పుస్తకం దగ్గిరకి వెళ్ళి నాకర్థం కాని ఇందలి భాషని చదువుకుంటాను. ఇలాంటి వాక్యాలున్న వెయ్యి పేజీల గ్రంథాన్ని తగలబెట్టడం ఎంత అపచారం. ఇంకా ఇందులోవున్న ఎంచక్కని బొమ్మల సంగతే చెప్పలేదు.
    తర్వాత చవకరకం నవలలకోసం వెదికాను. ప్రపంచంనిండా ఇటువంటి వాజ్మయం హోరెత్తి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి. నువ్వెరుగుదువు. ప్రకటిస్తున్న పది పుస్తకాలలో తొమ్మిది దమ్మిడీకి పనికిరాని చౌకబారు సాహిత్యం. ప్రాణం లేని తుక్కు. అప్పుడు నేననుకున్నాను, మన లైబ్రరీలో ఇలాంటి ఒక అరడజను పుస్తకాలు లేకపోయాయా వాటినీ తగలేస్తే నా చలిపోతుంది నాకథ రాసుకోవచ్చును. అని, ఆ మట్టున ఆరు పుస్తకాలు ఎంచి తీశాను. అవన్నీ కలిసి జర్మన్ శరీరశాస్త్ర గ్రంథమంత బరువున్నాయి. వాటిలో మొదటిది ఒకే గ్రంథంలో రెండు సంపుటాలు.  మొదటి సంపుటిలో 378 పేజీలు , రెండో దాంట్లో 430 పేజీలు  వున్నాయి. ఈ పేజీలన్నీ కలిసి భేషైన మంట అవుతాయి. చాలాసేపు మండుతాయి. అయితే మరి నేనీపుస్తకాన్నెప్పుడూ చదవలేదు. నేను చదవనైనా చదవని పుస్తకాన్ని ఏ మొగం పెట్టుకొని తగలేస్తాననిపించింది. చూడగా అది చాలా నాశిరకం వచన గ్రంథం లాగా కనిపించింది. తప్పకుండా తగలెయ్య దగ్గదనే తోచింది. కాని అంతపని చెయ్యలేకపోయాను. అందులోంచి చదివాను. చూస్తే ఇదంతా ఘనమైన యధాస్థానంలో ఉంచేశాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS