Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 64


    అయినా ఈ మనిషికి తను ఇంత చెప్పటం ఏమిటి? తనూ ఒకోసారి తెలివి తక్కువ పడుతుంది. పిచ్చి మొహంలా చెప్పింది. రామనాథబాబు చెప్పిందంతా మనసులో మననం చేసుకుంటూ, ఎవరికైనా అయినవాళ్ళకు చెప్పాలనే కుతూహలం అణచుకోలేకపోయింది. ఈ మనిషికి చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే! బస్తీ కొచ్చి ఎన్నేళ్ళయింది? ఈ మనిషిలో ఆవగింజంత అభివృద్ధిలేదు. ఏదో అనుకొంటాడు. ఏదో మాట్లాడతాడు. అదీ ఒకందుకు మంచిదేనేమోలే!
    చుట్ట పారేసి వెనక్కు తిరిగిచూశాడు వెంకటపతి. వరూధిని లేదు. ఆమె ఎప్పుడు లేచి వెళ్ళిందో కూడా వెంకటపతికి గుర్తులేదు. గుర్తు చేసుకోవటానిక్కూడా ప్రయత్నించలేదు.
    
                            28
    
    వరూథినీ పిక్చర్ ప్యాలెస్  మరో పేరును సంతరించుకొంది. వరూ ప్యాలెస్ అంటేనే జనానికి అర్ధమౌతుంది. మిగతా హాలువాళ్ళకూ, బస్సుడ్రైవర్లకూ, రిక్షావాళ్ళకూ అమ్మగారి హాలు అంటేనే అర్ధం అయిపోతుంది. జనంలో కూడా చాలావరకు అమ్మగారి హాలంటేనే తెలిసిపోతుందిప్పుడు. అందుక్కారణం తరచు ఆమె హాలు దగ్గర కన్పించటమే! మొదటి ఆట ఇంటర్వెల్ సమయంలో వరూధిని వారానికి నాలుగు సార్లన్నా హాల్లో కన్పించడం జరుగుతుంది. హాలు వర్కర్లూ, రిప్రెజెంటేటివ్ లూ, మేనేజరు శివరాం ఆమెకు అడుగులకు మడుగులొత్తుతూ చుట్టూ చేరడం సినిమా కొచ్చిన జనం కూడా చూస్తున్నారు. ఆ రోజు కలెక్షన్ గురించీ, సినిమా మంచి చెడ్డల గురించీ మొదటి రోజుల్లో అడిగితేగాని చెప్పనివాళ్ళు ఇప్పుడామె మేనేజరు గదిలో కాలు పెట్టగానే రోజువారి రిపోర్టు ఇవ్వటం మొదలుపెట్టారు. ఎలాంటి సినిమాలయితే బస్తీవాళ్ళు చూస్తారో, ఆడవాళ్ళకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో, యువకులకు ఎలాంటి సినిమాలు కావాలో వరూధిని తేల్చిచెప్పే దశకు పెరిగింది. అందరూ ఆమె అభిప్రాయాలకు విలువ నిస్తున్నారు. అమ్మగారొస్తున్నారంటే వర్కర్స్ కు హడల్ గా వుంటుంది ఇప్పుడు. ప్రతీదీ ఆరా తీసుకోవడంవల్ల, ఆమెకు తెలియని విషయం అంటూ ఎక్జ్ బిషన్ లైనులో లేదు.
    రామనాథబాబు వరూథినీ పిక్చర్ ప్యాలెస్ మీద లోగడంత శ్రద్ద చూపించడంలేదు. తన సొంత హాలు మరమ్మత్తులూ, కొత్త ఫర్నిచరూ, ప్రొజెక్టరు రిపేర్ చేయించే పనుల్లో పడి ఎక్కువకాలం తన హాలు దగ్గరే ఉండిపోతున్నాడు. ఒకోసారి రెండు మూడు రోజులు వరసగా రాకుండా వుండిపోతున్నాడు. అయితే శివరాం రోజూ వెళ్ళి రామనాథబాబు ఎక్కడున్నా మంతనాలాడి వస్తూనే వున్నాడు.
    రామనాథబాబు తనకు తీరిక చిక్కినప్పుడల్లా వరూధిని ఇంటికి వెళ్ళేవాడు. అతను వెళ్ళేసరికి ఆమె ఇంట్లో లేకపోతే చిరాకు పడేవాడు. ఎన్నోసార్లు అలా జరిగింది. వంట మనిషో, పనిపిల్లో, అమ్మగారు హాలు దగ్గరకు వెళ్ళారని చెప్పినప్పుడు అతనికి వంటికి కారం పూసినట్టయేది. నాలుగైదుసార్లు వరూధిని హాలు దగ్గరుందంటే అక్కడికి వెళ్ళాడు. అయినా అక్కడ వరూధినితో మాట్లాడ్డం అంత ఇష్టంగా ఉండేది కాదు. కొన్నాలలు గడిచేసరికి వరూధిని హాలు దగ్గరుందంటే ఆ ఛాయలకే వెళ్ళడం మానేసేవాడు. అక్కడ అంతమంది  మగాళ్ళమధ్య వరూధిని నిలబడి మాట్లాడుతుండటం చూస్తే రామనాథబాబుకు తల కొట్టేసినట్టయేది. ఒకసారి నేరుగా హాలు దగ్గర కొచ్చిన రామనాథబాబు తనను చూసి గిర్రున వెనక్కు తిరిగి వెళ్ళడం వరూధిని గమనించింది. అతనికి తను తరచు హాలు దగ్గరకు రావడం ఇష్టంలేదని గట్టిగానే పసికట్టింది. రామనాథబాబు తనకు తెలియకుండానే దూరం అవుతున్నాడని బాధపడసాగింది. సన్నగా మొదలైన బాధ భయం భయంగా మారసాగింది. ఈ సమయంలో రామనాథబాబును దూరం చేసుకొంటే చాలా నష్టాలున్నాయన్న అభిప్రాయం ఆమెలో వేళ్ళు తన్నింది.
    ఇంకా హైదరాబాదు థియేటర్ ప్రారంభ దశలోనే వుంది. ఈ థియేటర్ లీజు వ్యవహారాలు తుది రూపం దాల్చలేదు. ప్రస్తుతం జరగాల్సిన పనులెన్నో వున్నాయి. ఉత్తరోత్తరా జరగాల్సినవి చాలా వున్నాయి. అందుకు రామనాథబాబు సహకారం, అందా తనక్కావాలి. అంతేనా రామనాథబాబు గురించి తను కోరేది! అసలు రామనాథబాబు తనకేమీ కాడా? రామనాథబాబు అవసరం తనకు లేదా? తన సర్వస్వం రామనాథబాబుకే అర్పించింది. ఇప్పుడతను దూరమౌతుంటే తను సహించగలదా?
    వరూధినికి దుఃఖం పొర్లుకొచ్చింది. దీనంతటి కి తనే కారణం. రామనాథబాబు తప్పేమీ లేదు. తను అతిగా ప్రవర్తించాటం మంచిది కాదేమో!
    హాలు దగ్గర కెళ్ళటానికి సిద్దమయి వాకిట్లోకి వచ్చిన వరూథిని గిర్రున వెనక్కు తిరిగింది. ఇంట్లోకెళ్ళి పట్టుచీర మార్చి నేతచీర కట్టుకుంది. ముడిలో పువ్వులుకూడా భారంగానే తోచాయి. తీసి డ్రెసింగ్ టేబుల్ మీదకు విసిరింది. ముడివిప్పి జడ వేసుకొంది.
    వంటమనిషి "అదేమిటమ్మా! హాలు దగ్గిర కెల్తానన్నారుగా? వాకిట్లో జట్కావాడు ఎదురు చూస్తున్నాడు." అన్నది.
    "నే వెళ్ళటం లేదు. జట్కను పంపించేయ్!"
    "ఏమ్మా? వంట్లో బాగా లేదా?" ఆదుర్దాగా అడిగింది వంటమనిషి.
    వరూధిని మాట్లాడలేదు. పక్కమీద పడి దిండులో తలదూర్చి పడుకొంది. బుచ్చమ్మ మాట్లాడకుండా గదినుంచి బయటకు వెళ్ళింది.
    ఓ వారం రోజులు వరూధిని థియేటర్ వైపు కన్నెత్తయినా  చూడలేదు. ఇల్లు వదిలి బయటికేపోలేదు ఏమీ తోచడంలేదు. ఊరికే ఇంట్లో ఉంటే పిచ్చెత్తినట్లుగా వుంది. అక్కడికి వెంకటపతికి గుచ్చి గుచ్చి ప్రశ్నించేది.
    "ఆఁ - వస్తానే వున్నాడు!" అంతకుమించి చెప్పేవాడుకాదు వెంకటపతి వరూధిని రామనాథబాబును గురించి అడిగితే. హాలుకు సంబంధించిన వ్యవహారాలు అడిగితే "అంతా బాగానే ఉంది" అనేవాడు.
    అతని వాలకం, సమాధానాలు చెప్పే ధోరణికి వరూధినికి కంపరం పుట్టిపోయేది. అయినదానికీ కానిదానికీ వెంకటపతిని పొడిచి కవ్వించేది వరూధిని. వీలైనంతవరకూ పెళ్ళాం కళ్ళముందునుంచి తప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు వెంకటపతి. ఎప్పుడూ హాలు దగ్గరే వుండిపోతున్నాడు. అక్కడే స్టోర్సు గదిలో కూర్చొని తాగేవాడు. తను పొందే ఆనందమేదో ఆ సామాన్ల గదిలోనే అనుభవించేవాడు. నిద్రొస్తే అక్కడే నిద్రపోయేవాడు.
    ఆ రోజు ఆదివారం. వెంకటపతి ఏడు గంటలకల్లా తయారయి బయలుదేరాడు.
    "ఇంత పొద్దున్నే ఎక్కడికి?" భర్తకు ఎదురుగావచ్చి అడిగింది వరూధిని.
    "హాల్ దగ్గరకే! ఆదివారంగా? మార్నింగ్ ఆటుందిగా?"
    "మార్నింగ్ షో వుంటే నువ్వేం చేస్తావూ?"
    వెంకటపతి మాట్లాడలేదు.
    "అసలు నీకేం పనక్కడ?" ప్రాథమిక ప్రశ్న వేసింది వరూధిని.
    "ఏం చేస్తానా? రోజూ చేసేదే!" అన్నాడు వెంకటపతి.
    "హాలు ఊడుస్తావా?"
    వెంకటపతి తలెత్తి భార్యకేసి కోపంగా చూడబోయాడు. భార్య ముఖంలోకి చూసేసరికి కోపం అంతా ఆవిరైపోయింది. గాబరాపడ్డాడు. చూపులు గోడకేసి తిప్పుకున్నాడు.
    "హాలు ఊడ్చేవాళ్ళున్నారు."
    వెంకటపతి భార్యముందు నిలబడడం ముళ్ళమీదున్నట్టుంది.
    "టిక్కెట్లమ్ముతావా?"
    "వెంకటపతి మాట్లాడలేదు.
    "అందుకూ మనుషులున్నారు."
    వెంకటపతి చూపులు గోడమీదనుంచి భార్య మీదకు తిరిగాయి. ఏమిటి ఇవ్వాళ ఇది ఇంత ఇదిగా ఉంది?
    "గేటులో నిలబడతావా?"
    "ఏంటి నీ గొడవ పొద్దున్నే?" అనగలిగాడు వెంకటపతి. అప్పటికే నరాలు గుంజసాగాయి. తెల్లారాక కొంచెమయినా గొంతులో పడలేదు.
    "దానికీ మనుషుల్ని పెట్టాం జీతం యిచ్చి!"
    కాళ్ళు లాగుతున్నాయి. పెళ్ళాంకేం సమాధానం చెప్తాడు?
    "ప్రొజెక్టరు నడుపుతావా?"
    ఏమిటది? దీని కివ్వాళేదో పిచ్చెక్కినట్టుంది, అనుకొన్నాడు వెంకటపతి.
    "అది నీకు చాతకాదు. ఆపరేటరున్నాడు."
    వెంకటపతి భుజం మీద టవల్ తీసి మళ్ళీ వేసుకొన్నాడు - అంతకంటే చేయడానికీ, చెప్పడానిగ్గానీ ఏమీతోచక.
    "కలెక్షన్ చార్టూ, కమీషనూ - బిజినెస్ చూస్తావా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS