Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 64

 

    ఆ అనంత ప్రజా వాహిని అలా విరుచుకు పడడం చూసిన ప్రధాన మంత్రి ఖంగుతిన్నాడు.
    "అన్ని మతాలు చెప్పేది దైవం ఒక్కటే అని......మరెందుకు ఈ జాతి వివక్ష? వున్నవాడు లేని వాడిని దోచుకోవాలనే కసి రేగాదానికి కారణం ఏమిటి? జాతి యావత్తూ ఒకే త్రాటిపై నడపగల నాయకులు నడుం బిగించినప్పుడు ఈ దేశ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించ బడుతుంది.
    "హిందూ ధర్మ సిద్దాంతాలను పూర్తిగా ఆకళింపు చేసుకున్న వారెవరైనా సరే స్వర్ణయుగాన్ని తలపుకు తెచ్చే హిందూ రాజ్యాన్ని పునః ప్రతిష్టించాలి. అందుకు యువత పూనుకోవాలి. అప్పుడే రాజకీయ చైతన్యం పెల్లుబికి ఎల్లెడలా సమానత్వం చిందిస్తుంది. అలాంటి నాయకులే మనకు ఇప్పుడు కావాలి........
    
                                                    *    *    *    *

    "అటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకోండి. ఎలాంటి అసమానతలు లేని హిందూ రాజ్యాన్ని నెలకొల్పడానికి, అలాంటి మహనీయుడిని వెదకడానికి , కావాలంటే నేను ఆ దేశం నలుమూలలా తిరిగి ప్రచారం చేస్తాను. నా ప్రజల బాగుకోరి అహోరాత్రులు విశ్రమించకుండా ఈ దేశ యువతను జాగృతం చేస్తాను. ఆ బ్రహ్మ నాకిచ్చిన ఈ ఆయుష్షును ప్రజా సేవకు అంకితం చేస్తాను.
    'జిందాబాద్ విష్ణు స్వామీజీ!"
    "జిందాబాద్ .......' ప్రజల నుంచి స్పందన.
    అసలు ప్రధాన మంత్రికి విష్ణు ఏం చెబుతున్నాడో ఎటు పోతున్నదో అర్ధం కావడం లేదు.
    "మీరే మీ నాయకులను ఎన్నుకోండి. అంతే తప్ప ఎక్కడో ఏసి గదులలో రాజకీయవాదులు నిర్ణయించే అభ్యర్ధులను బలపరచకండి. మీ బాధలు, సమస్యలు తెలిసి మీకు పూర్తీ న్యాయం చేయగల మీ అభ్యర్ధిత్వాన్ని మీరే సూచించండి. అప్పుడు ఏ ప్రభుత్వమయినా దిగి రాక తప్పదు."
    "అవును.......అవును."
    ప్రజలలో హోరు.....
    విష్ణు ప్రసంగం ఇంకాస్సేపు అలాగే జరిగితే తన కుర్చీ కిందకు నీళ్ళు వస్తాయేమోనని భయపడి పోయాడు ప్రధాని.
    అందుకే దిగ్గున లేచి నిలుచున్నాడాయన.
    కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది.
    ప్రజల నుంచి స్వామీజీని కీర్తిస్తూ స్లొగన్స్ పుట్టుకొచ్చి నలుదిశలా మారుమ్రోగి పోతున్నాయి.
    భారత ప్రధాని ఏదయితే జరగకూడదని ఆశించాడో, తన ప్రమేయం ఏమీ లేకుండానే అదే ప్రమాదం ముంచుకు రావడంతో తల పట్టుకుని కూర్చుండిపోయాడు.
    "భక్తులారా ఆగండి........నేను సన్యాసిని తప్ప రాజకీయ నాయకుడిని కాదు. నాకు పదవుల మీద వ్యామోహం లేదు. కీర్తి కాంక్ష అంతకన్నా లేదు. మరి నాకెందుకు ఆ పదవులు."
    స్వామీజీ మాటలు విన్న ప్రధానిలో క్షణం విస్మయం.....
    "మీలో చైతన్యం కలగడానికి ఉద్భోదించానే తప్ప నాకెందుకు ఈ రాజకీయాలు? ఈ దేశానికి నేత పదవే కాదు ప్రపంచాధినేత పదవి నాకు ఇస్తానన్నా తీసుకోవడానికి నేను సిద్దంగా లేను చిరునవ్వుతో చెప్పాడు విష్ణు.
    "లేదు...........లేదు......"
    "మీలాంటి విజ్నుడైన ప్రధాని మేధావి అంతటి అత్యున్నత పదవిని అలంకరిస్తేనే హిందూ సామ్రాజ్య స్థాపన జరుగుతుంది.........."
    ప్రజలలో నినాదాల హోరు అధికమైంది.
    ప్రజా స్పందన ప్రధానికి అర్ధమయింది.
    ఇంకా తను మౌనం వహించడం వల్ల ప్రయోజనం లేదనిపించడంతో మైక్ ముందుకు వచ్చాడు ప్రధాని.
    "గురుదేవులు వంటి గొప్పవ్యక్తి హిందూ సామ్రాజ్య స్థాపనకు నడుం బిగించడం కన్నా మించిన అదృష్టం మనకు ఇంకేం వుంటుంది......వారి కోసం నేను ఏ త్యాగానికైనా సిద్దంగా వున్నాను."
    కరతాళధ్వనులు మిన్ను ముట్టాయి.
    అసలు సిసలయినా రాజకీయ వాదిలా ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు ప్రధాని.
    ఎవ్వరూ అతనిని వారించలేదు.
    అయన మాటలను ఖండించనూ లేదు.........
    కానీ, ప్రధానమంత్రికి తెలియని నగ్నసత్యం ఒకటి వుందక్కడ?
    ఆ సభలో గుమికూడిన జనంలో ప్రతి పదిమందిలో ఒకడు విష్ణు భక్తుడేనని .....కావాలనే వాళ్ళు విష్ణుని స్తుతిస్తున్నారని!
    జన సందోహంలో పదిమంది కేకలు వేస్తె ప్రక్క నున్న వాళ్ళకు కూడా వంతలు పాడడమే తెలుసు తప్ప ముందు వెనుకలు ఆలోచించరు.......
    ఇప్పుడు సరిగ్గా ఆ లాజిక్ నే తారకమంత్రంలా ఉపయోగించాడు విష్ణు.
    తనకు కావాల్సిన పదవిని ముచ్చటగా ప్రజలచేత చెప్పించుకుని, సాక్షాత్తూ ప్రధాని చేతనే అవుననిపించుకున్న విష్ణు మేధాశక్తికి ఆశ్చర్యపోయింది కలెక్టర్ ధీరజ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS