Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 65

 

    శ్రీచంద్ర ఆలోచనలో పడ్డాడు.


    "అవును.....తనెందుకు చావాలి?" హాయిగా సమ్మీని పెళ్ళి చేసుకుని పిల్లాపాపలతో జీవించాలి గానీ" అనుకున్నాడు. పైగా దొంగచాటుగా తనని యమధర్మరాజు చంపాలని ప్రయత్నించడం.


    ఉహూ.....తను చచ్చినా చావకూడదు మనసులో స్థిరంగా అనుకున్నాడు.


    
                                                                      * * *


    త్రిలోకాన్ని కుర్చీలో కూచోబెట్టారు.


    ఎదురుగా హిప్నాటిస్ట్.


    "చూడండి హిప్నాటిస్ట్ గారూ......మీరేం చేస్తారో మీ ఇష్టం. కానీ మా నాన్నకు ఈ ఉహల్లో బ్రతికే పిచ్చి పోవాలి. ఎప్పుడే క్షణంలో ఏ వేషం వేయాలన్న ఆలోచన వస్తుందో తెలియదు. అది ఏ ప్రమాదానికి దారి తీస్తుందో" అంది సమీర దిగులుగా.


    "డోంట్ వర్రీ....." అని త్రిలోకం కళ్ళలోకి చూస్తూ "మీరు హాయిగా నిద్రపోతున్నారు......నిద్రపోతున్నారు......మీకు నా మాటలు తప్ప మరేమీ వినిపించడం లేదు" అన్నాడు.


    క్రమక్రమంగా త్రిలోకం కళ్ళు మూతలుపడ్డాయి.


    "మీ పేరు త్రిలోకం......మికేలాంటి ఆలోచనలూ, ఊహలు కలగటం లేదు. చచ్చేవరకు మీరు త్రిలోకమే......అంతకు మించి మీరేమి కారు.......కారు.....కారు....." అన్నాడు.


    తల ఊపాడు త్రిలోకం.


    "మీ పేరు త్రిలోకమే.....త్రిలోకమే.....త్రిలోకమే" మూడుసార్లు అని ఓసారి తన జుట్టు పిక్కుని లేచాడు హిప్నటిస్ట్.


    "ఇక మీ నాన్నకు వచ్చిన భయం ఏమి లేదు. అతనికి ఇక ముందు ఎలాంటి ఉహాలు రావు" అన్నాడు హిప్నటిస్ట్.


    "థాంక్యూ సార్" అంది చేతులు జోడించి సమీర.


    "హమ్మయ్య ఇక అర్ధరాత్రుళ్ళు, పగళ్ళు, నేను 'అది' అని నేను 'ఇది' అని విచిత్రవేషాలు వేసి ఇబ్బంది పెట్టడు" అనుకుని హాయిగా నిట్టూర్చింది సమీర.


    తండ్రి కుట్టించుకున్న రకరకాల దుస్తులు బీరువా అడుగున దాచింది పొరపాటున అతని కంట పడితే ప్రమాదమని.

 

                                                              * * *


    శ్రీచంద్ర ఫాస్ ఫుడ్ సెంటర్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అయింది. దాని స్థానంలో మంచి హొటల్ ప్రారంభించాలని ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని సత్తిపండుకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు శ్రీచంద్ర.


    అంతకు నాలుగు రోజుల క్రితమే రామేశ్వరి తండ్రి గురునాధం సత్తిపండుని తిట్టాడు ఫాస్ ఫుడ్ సెంటర్ కి వచ్చి.


    తన కూతురితో తిరిగితిన్నాడని తెలిసిపోయింది అతనికి. నానా మాటలు అని వెళ్ళాడు. శ్రీచంద్ర అన్నీ విని మర్నాడు అతన్ని పిలిపించి మాట్లాడాడు. సత్తిపండుకు తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇచ్చేస్తానని , అప్పుడు అతను హొటల్ ఓనర్ కిందే లెక్క అమ్మాయిని ఇవ్వడానికి ఇంకేం అభ్యంతరం" అని నచ్చజెప్పి గరునాదాన్ని ఒప్పించాడు పెళ్ళికి.


    సత్తిపండు కన్నీళ్ళతో శ్రీచంద్ర కాళ్ళకి నమస్కరించాడు.


    "గురూ! అన్నా తమ్ముళ్ళు ఆస్తి కోసం కోట్లాడుకుంటున్న ఈ రోజుల్లో ఫ్రెండ్ కోసం నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నీకు చేయెత్తి నమస్కరించాలనిపిస్తోంది. నీ రుణం నేనెలా తీర్చుకోగలను."


    "ఆ....బుల్లి సత్తిపండుని. త్వరలో ఇస్తే అదేచాలు" నవ్వుతూ అన్నాడు శ్రీచంద్ర. ఆవిధంగా సత్తిపండు పెళ్ళీ కుదిరిపోయింది.


    
                                                               * * *


    శ్రీచంద్రకు, సమీరకు కూడా పెళ్ళి నిశ్చయంచేశారు. పెళ్ళీ పనులు హడావుడిగా జరుగుతున్నాయి. రెండు కుటుంబాలు కలుసుకున్నాయి.


    త్రిలోకం ఉహలజిస్టు నుంచి మాములు త్రిలోకంగా మారిన విషయం తెలిసిన గరుడాచలం పాత సంఘటనను మళ్ళీ త్రిలోకానికి గుర్తుచేయలేదు.


    శ్రీచంద్రకు పెళ్ళీ కళ వచ్చేసింది.


    
                                                         * * *


    "మానవా.......ఇదన్యాయం. ఇదే క్రమం.....ఇది ఘోరం" అన్నాడు కోపంగా ఉక్రోషంగా యమధర్మరాజు.


    "ఏది యమధర్మరాజా? బలవంతంగా నా ప్రాణములు తీసుకోవాలన్న మీ కోరిక అన్యాయమా? నన్ను చంపుట కొరకు మాయోపాయములు పన్నుట అక్రమమా? మీ పంతం కోసం స్విమ్మింగ్ పూల్ లో నేను చచ్చునటుల ప్లాన్ చేయడం అన్యాయమా?" తాపీగా అడిగాడు శ్రీచంద్ర.


    బుర్ర గోక్కున్నాడు యమధర్మరాజు.

    "నాకదంతా అనవసరం. నువ్వు చచ్చుతానన్నావ్. అన్నమాట ప్రకారం చచ్చును...."


    "సారీ మైడియర్ యమధర్మరాజా! తీరిగ్గా నింపాదిగా ఆలోచించగా నాకెందుకో చావవలెనన్న"ఆలోచన అసహ్యంగా అనిపిస్తోంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అందులకు..."


    "మానవా! యముడితో పరిహాసమా?"


    "మానవ శక్తి ముందు, నిష్కళంకమైన నా భక్తీ ముందు ఏ శక్తి అయినా పనిచేయదు. అయినా మిస్టర్ యమధర్మరాజా! నేనెందులకు చావాలి? నాకు ఆయుష్షు వుంది. నిండు నూరేళ్ళు బ్రతికే చస్తాను."


    "అది అసంభవం...."


    "అయితే నేను చచ్చుట కూడా" అన్నాడు శ్రీచంద్ర.


    "మానవా!"


    "నేను చచ్చుట మనుకున్నాను" మరింత తాపీగా అన్నాడు శ్రీచంద్ర.


    యముడు కోపంగా శ్రీచంద్రవైపు చూసి "నువ్వెలా కళ్యాణం జరుపుకుందువో చూస్తా" అని మాయమయ్యాడు యముడు.


                                           * *


    శ్రీచంద్ర కొద్దిగా బెదిరినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.


    ముహూర్తం వేకువఝామున.


    సమీరను పెళ్ళి కూతుర్ని చేశారు.


    శ్రీచంద్రను పెళ్ళి కొడుకుని చేశారు.


    సత్తిపండు కొత్త బట్టల్లో కళకళలాడుతున్నాడు. నాలుగు రోజుల క్రితమే రామేశ్వరితో అతని పెళ్ళి జరిగిపోయింది. సత్తిపండు, రామేశ్వరి సంతోషంగా పెళ్ళి పనులు చేయసాగారు. వాళ్ళలో పెళ్ళి తాలుకూ అనందం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. పెళ్ళి పెద్దల్లా అన్నీ దగ్గరుండి చేస్తున్నారిద్దరూ.


    "ఒరే పండూ! ఇటూ రా నాయనా!" అన్నాడు ఆప్యాయంగా గరుడాచలం.


    "ఇది నిజమా?" అన్న షాక్ లో వుండిపోయాడు సత్తిపండు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS