Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 64

 

    "నారాయణ...నారాయణ.....'


    "ఏమిటి నారదా? చాలా రోజులకు కలిసినావు. ఏమిటి సంగతులు?" అడిగాడు యమధర్మరాజు.


    "స్వామి! తమకు కోపం రాకున్నచో ఒకమాట...."


    "ఏమిటది నారద మునింద్రా?"


    "మీరు వచ్చిన కార్యమును మరచి ఇక్కడ అన్నియును చక్కబెట్టుచున్నారు.


    "అంటే?"


    "ఏమున్నది....శ్రీచంద్ర మాటలతో కాలము వెళ్ళబుచ్చుతున్నాడు. మీరు తొందరచేయుకున్నచో....మీకే ప్రమాదం" అన్నాడు నారదుడు.


    "అవును సుమీ. ఇప్పుడే అసలు సంగతి తెల్చుతాను" అన్నాడు యమధర్మరాజు.


    "తేల్చడం ముంచడం కాదు సమవర్తి. ఇది యొక మంచి అదను. ఇప్పుడా మానవుడు ఓషన్ పార్క్ లో తన లవర్ తో స్విమ్మింగ్ పూల్ నందు ఈత కొడుతూ ఖుషిగా వున్నాడు. ఎత్తు నుండి దూకి ఈత కొట్టడం ఇక్కడి మానవులకు సరదా. ఆలోచించుకొనుము. మీ బుద్దికి పదును పెట్టుము."


    ఆలోచనలో పడిపోయాడు యమధర్మరాజు.


    వెంటనే అక్కడ్నుంచి మాయమై ఓషన్ పార్క్ లో ప్రత్యక్షమయ్యాడు.


    అక్కడున్న వాతావరణాన్ని చూసి ముగ్ధుడైపోయాడు.


    టోరాటోరా, సూపర్ లూప్ అవన్నీ చూస్తుంటే అక్కడి ప్రజల కేరింతలు చూస్తుంటే మహా ఆనందంగా, ఉత్సాహంగా అనిపించింది. అవన్నీ అతనికి ఎక్కాలనిపించింది.


    ఒక్కొక్కటి ఎక్కి థ్రిల్లింగ్ గా ఫీలయ్యాడు.


    "అబ్బా! ఏమైనను మానవులు భలే తెలివిమీరిన వారు. ఇన్నిన్ని వినోదాలు, సౌకర్యాలు, సుఖాలు వదలుకుని చావాలంటే వాళ్ళకి ప్రాణం ఒప్పదు. అందుకే చావంటే భయపడి చావడమే కాదు విచారం కూడాను. వాళ్ళకిశ్తమైనవన్ని వదులుకుని రావాలంటే ప్రాణం ఒప్పదు' అనుకున్నాడు.


    అన్నిటికంటే అతనికి నచ్చింది మెట్లన్నీ ఎక్కి పైనుండి నీళ్ళలో జారుడుబండలా జారే ఐటమ్. కాళ్ళు నొప్పి పుట్టేవరకు ఎక్కి జారుతూనే వున్నాడు. జారినకొద్ది 'యమ' థ్రిల్లింగ్ గా ఉందతనికి.


    అందర్నీ తోసుకుని మరీ ఎక్కి ఓ పది పదిహేనుసార్లు జారాడు.


    అయినా తనివి తీరలేదు.


    చీకటి పడసాగింది.


    లైట్ల వెలుతురులో పార్కంతా లైట్స్ తో మహా అందంగా మెరుస్తోంది.


    అలసట అనిపించడంతో ఓ కోక్ తాగి మళ్ళీ విజ్రుభించాడు యమధర్మరాజు.


    అంతా గమనిస్తున్నాడు నారదుడు. 'ఇక ఈయన ఇక్కడ్నించి కదిలేలా లేడు' అనుకుని "స్వామీ! ఇక్కడిలా సెటిలయ్యారేమిటి?" అంటూ ఎదురొచ్చాడు.


    "రా నారదా! బలే బలే ఉన్నాయిలే ఇక్కడి ఆటలన్నీ.....ఛ.....మన లోకము వుంది ఎందుకు? ఎప్పుడూ చావులు, పాపులు, శిక్షలు.....ఇలాంటి పార్క్ ఒకటి మనం కట్టుకోవాలయ్యా" అన్నాడు సంతోషంగా.


    "అలాగే ప్రభూ! తమరు యమలోకానికి వెళ్లగానే ప్లాన్ తీసుకుని కన్ స్ట్రక్షన్ మొదలు పెడుదురు గానీ ప్రస్తుతం శ్రీచంద్ర గురించి ఆలోచిస్తే బావుంటుంది"


    "అరెరే.....అతని చావు సంగతి చూడాలి కదా. మరిచిపోయాను ఈ సంతోషంలో ఓకె....ఓకె....శ్రీచంద్ర ఎక్కడున్నాడో వెదుకుదాం పద" అన్నాడు కర్తవ్యంలో గుర్తు తెచ్చుకుంటూ.


    దూరంగా వున్న స్విమ్మింగ్ పూల్ చూపిస్తూ "అతనక్కడున్నాడు ప్రభూ! రండి వెడదాం" అన్నాడు నారదుడు.


    స్విమ్మింగ్ పూల్ దగ్గర జనం లేరు.


    శ్రీచంద్ర ఎత్తు నుంచి డైవ్ చేస్తున్నాడు అతని వెనుకే సమీర ఇద్దరూ కాసేపు అలా ఈతకొట్టి మళ్ళీ డైవ్ చేయడం....."


    శ్రీచంద్ర , సమీర కళ్ళు మూసుకుని నీళ్ళలోకి డైవ్ చేసారు.


    యమధర్మరాజు స్విమ్మింగ్ లో ఉన్న నీళ్ళవైపు చూసాడు. నీళ్ళు ఆటోమేటిగ్గా ఇంకిపోసాగాయి.


    ఆ విషయం సగం వరకూ వచ్చాక అర్ధమైంది శ్రిచంద్రకు ముచ్చేమట్లు పోసాయి.


    కొద్ది క్షణాల్లో నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి.


    తను తలలు పగలగడం ఖాయం అనుకున్నాడు శ్రీచంద్ర.


    యమధర్మరాజు నవ్వుకున్నాడు గర్వంగా.


    సరిగ్గా అప్పుడే బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచాడు.


    స్విమ్మింగ్ పూల్ చుట్టూ రకరకాల పూలచెట్లు ఉన్నాయి. బ్రహ్మదేవుడు కళ్ళు తెరచి చూడ్డంతోనే ఒక్కసారిగా గాలి వీచింది.


    చెట్ల నుంచి రంగులరంగుల పూలు ఆకులు స్విమ్మింగ్ పూల్ లో పడిపోసాగాయి. చూస్తుండగానే ఆ పూలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి అందులో గులాబీలు, సంపెంగలు, మల్లెలు, మందారాలు, కనకాంబరాలు , సన్నజాజులు....అన్నీ రకాల పూలూ ఉన్నాయి గుట్టగా.


    శ్రీచంద్ర స్విమ్మింగ్ పూల్ లో నిండిపోయిన రంగు రంగుల పూల మధ్య పడ్డాడు.


    ఫామ్ బెడ్ మీద పడ్డ ఫీలింగ్.


    మెత్తగా, మత్తుగా, గమ్మత్తుగా, హాయిగా ఉందతనికి. పూల మెత్తదనం హాయి గొలుపుతోంది.


    ఆశ్చర్యంలో నుంచి శ్రీచంద్ర తేరుకోకముందే అతని మీద సమీర పడింది.


    కింద పూల మెత్తదనం, పైన అందమైన అమ్మాయి వెచ్చదనం.


    "ఏరా చందూ! ఇదే సన్నివేశం గనుక ఏ రాఘవేంద్రరావో చూసి వుంటే ఈపాటికి అందమైన పాటొకటి మనం అందుకునేవాళ్ళం" అంది.


    ఆల్రేడి శ్రీచంద్ర ఆ ఉహల్లోకి వెళ్లిపోయాడు.


    యమధర్మరాజు విసురుగా అక్కడ్నించి వెళ్లిపోయాడు.


    
                                                          * * *


    "మానవా!"


    "ఏమి నారదా" అన్నాడు శ్రీచంద్ర ఫాస్ట్ పుడ్ సెంటర్ లో చికెన్ సిక్స్ టి ఫైవ్ ను ప్లేటులో సర్దుతూ.


    "ఏమది.....మంచి ఘుమఘుమమను వాసన నాసికను సోకుచున్నది."


     "చికెన్ సిక్స్ టిఫైవ్ దీని నామధేయం. ఒక్కసారి టెస్ట్ చేస్తారా?"


    "వద్దులే" అంటూనే చికెన్ సిక్స్ టి ఫైవ్ పీస్ నోట్లో పెట్టుకుని " అమృతం కన్నా రుచిగా వున్నది. మా సురులకు దీని రుచి చుపించవలెను" అంటూనే "ఈ ఘోరము వింటివా?" అన్నాడు.


    "ఏ ఘోరం ?" అడిగాడు అమాయకంగా శ్రీచంద్ర.


    "నిన్నటికి నిన్న నిన్ను యమపురికి పంపుటకు ఆ మాయదారి యముడు ఏం చేసాడో తెలుసా? స్విమ్మింగ్ పూల్ నందలి నీటిని మాయం చేసి...."


    "అది యముడి పనా? ఎంతటి ఘోరం.....నేనింకా బుద్దిగా చచ్చుదామని అనుకుంటిని"


    "వద్దొద్దు మానవా! జీవితంలో ఎన్నియో సాధించవలయును. అయినా మాయదారి యముడి మాటలు నమ్మకు. ప్రాణములు పోయిన పిదప ఎంత విచారించినమన ఏమి లాభం? బెట్టు చేయుము. జాగ్రత్త సుమీ. అయిననూ నాకెందుకులే. ఏమైనా అనినచో తంపులమారి అందురు" అంటూ పెట్టాల్సిన ఫిట్టింగ్ పెట్టి అక్కడ్నుంచి చల్లగా జారుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS