Previous Page
నరుడా ఏమి నీ కోరిక పేజి 66

 

    "శ్రీచంద్ర నా పెద్ద కొడుకు అయితే నువ్వు నా చిన్నకొడుకువి" సత్తిపండును అక్కున చేర్చుకుని అన్నాడు గరుడాచలం.


    సత్తిపండు కళ్ళు కన్నీళ్ళతో చెమ్మగిల్లాయి.

 

                                                            * * *


    పెళ్ళిపీటల మీద శ్రీచంద్ర, సమీర కూచున్నారు.


    వేదమంత్రాలు వినిపిస్తున్నాయి.


    బాజాభజంత్రీలు మోగుతున్నాయి.


    ఎక్కడ చూసిన పట్టుచిరల రెపరెపలు తుళ్ళింతలు, నవ్వులు....సరదాలు.....కళ్యాణమండపం మొత్తం లైట్లతో మామిడి తోరణాలతో మెరిసిపోతోంది. పూలతో చేసిన డెకరేషన్ ఏంతో అందంగా, హుందాగా వుంది.


    అలాంటి సమయంలో.....


    యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. శ్రీచంద్ర వైపు చూసి "యమ యమాః" అన్నాడు.


    వెంటనే పెళ్ళిపీటల మీద ఉన్న శ్రీచంద్ర, యమధర్మరాజుతో సహా మాయమయ్యాడు.


    పెళ్ళిపందిర్లో కలకలం. హడావుడి.

 

                                                           * * *


    కళ్ళు తెరిచిన శ్రీచంద్రకు పచ్చికబయళ్ళు, కొండలు కనిపించాయి.


    ఎదురుగా యమధర్మరాజు గర్వంగా నవ్వుకుంటూ "మానవా! నా మాట కాదని నువ్వు కళ్యాణం ఎలా జరుపుకుంటావు?" కోపంగా అన్నాడు.


    సరిగ్గా అపుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై-


    "భయం వలదు మానవా! నా తలరాతకు నీ ఆయుష్షు రేఖకు తిరుగులేదు" అన్నాడు.


    "అయితే నేను వెళ్ళనా స్వామీ!" అని నాలుగు అడుగులు ముందుకేసాడు.


    యముడు తీక్షణంగా చూసాడు.


    అంతే, బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుని తెరిచాడు. ఫ్రీగా అయిపోయి మళ్ళీ ముందుకు కదిలాడు శ్రీచంద్ర.


    యముడు తీక్షణంగా చూడ్డంతో మళ్ళీ బిగుసుకుపోయాడు.


    ఇద్దరూ తమతమ ఆధిపత్యాలను పరీక్షించుకుంటున్నారు.


    శ్రీచంద్రకు ఇది విషమ పరిక్ష అయింది.


    "ఆగండిద్దరూ" గట్టిగా కేకేవేశాడు.


    ఇద్దరూ విస్మయంగా చూస్తుండిపోయారు.


    "అసలు మీరిద్దరూ నా గురించి ఏమనుకుంటున్నారు? నేను టెన్నిస్ కోర్టులో బంతిననుకుంటున్నారా? మీరు ఆడుకునే వాలీబాల్ ని అనుకుంటున్నారా? నేను గొప్పంటే నేను గొప్ప అని నన్ను బంతాట అడుకుంటారా?" కోపంగా అన్నాడు.


    నారదుడు ప్రత్యక్షమయ్యాడు.


    శ్రీచంద్ర కోపంగా నారదుడి వైపు చూసి "కయ్యాలమారి నారదా! ఇదంతా నీ వల్లనే వచ్చింది" అన్నాడు.


    గతుక్కుమన్న నారదుడు "అయ్యారే.....పోయి పోయి తిరిగి తిరిగి నా మీదకే వచ్చిందా? అయినా మానవా .....ఆ ఇద్దర్ని ఎన్ని మాటలన్నను ప్రయోజనమేమున్నది.....ఆ జగన్నాటక సూత్రధారిని కేకేసి పిలువు. భక్తవత్సలుడు పిలిస్తే రాకమానడు. హాయిగా పాలసముద్రంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు శ్రీలక్ష్మితో" అంటూ శ్రీచంద్రను గిల్లి వదిలాడు.


    శ్రీచంద్ర ఆకాశం వంక చూసి "ఆహా....పాలసముద్రంలో మహలక్ష్మితో కాళ్ళు పట్టించుకుంటూ రెస్టు తిసుకున్తున్నావా? మహా ప్రభో........మహా విష్ణువో దిగిరా.....నన్ను ఈ ఇద్దరూ బంతాట ఆడుకుంటున్నారు. రావయ్యా రా!" అంటూ అరిచాడు.


    కళ్ళు తెరిచాడు మహావిష్ణువు చిర్నవ్వుతో.


    ఠపీమని మాయమయ్యాడు పాలసముద్రం నుండి.


                                                         * * *


    "భక్తా! పిలిచావా?" అడిగాడు శ్రీచంద్ర వైపు చూస్తూ శ్రీ మహావిష్ణువు.


    "కాదు ప్రభూ అరిచాను. నాకీ బాధ ఏల? నువ్వే నన్ను వైకుంఠం తిస్కేళ్ళు. శ్రీలక్ష్మికి చేతులు నొప్పెట్టినప్పుడు నేను నీ కాళ్ళు నొక్కుతా" అన్నాడు.


    శ్రీమహావిష్ణువు చిర్నవ్వుతో-


    "నువ్వు పూర్ణాయుష్కుడివి మానవా" అని బ్రహ్మవైపు, యముడి వైపు తిరిగి.....


    "ఈ ఇద్దరిలో మేమంటే మేమే అధికులనున్న భావన వచ్చింది. ఈ సృష్టిలో ఎవరి పని వారు నిర్వర్తించవలెను. కర్మఫలములు నాకు సంబంధించినవి. అది తెలియక ఆవేశపడిపోయారు. ఎవరి గొప్ప వారిదే. ఎవరి ఆధిక్యత వారిదే. ప్రాణములు హరించు విధిని నిర్వహించు యమధర్మరాజు తన వృత్తిలో గొప్పవాడు. తలరాతలు రాసి సృష్టి చేయు బ్రహ్మ తన వృత్తిలో గొప్పవాడు. ఇద్దరి మధ్య అభిజాత్యం ప్రమాదకరమని.....ఇందులో అధికులమను విషయం అప్రస్తుతమని తెలియజెప్పడానికే ఈ జగన్నాటకం ఆడించా నీ ద్వారా. ఈ విషయం స్పష్టమవడం నా లీలే. ఈవిధంగా నువ్వు ధన్యుడవు. కలియుగంలో విధాతను, నరకలోకాదిపతిని, మహావిష్ణువును, నారద మహర్షిని దర్శించిన భాగ్యం నీది" అంటూ బ్రహ్మ వైపు, యముడివైపు చూసాడు.


    వారిద్దరూ ఒకరికొకరు చేరి మహావిష్ణువు దగ్గరికి వచ్చి "మాది తప్పిదమే వైకుంఠవాసా!" అన్నారు మనస్పూర్తిగా.


    'తప్పిదం మీది కాదు. ఈ నిజం లోకమునకు తెలియవలె. ఎవరికి వారే గొప్ప అన్న సత్యం తెలుసుకొనవలె. ఇతరుల గొప్పతనమును కించపరచటం సభ్యత కాదని గమనించవలే. సర్వేజనా సుఖినోభవంతు. శ్రీచంద్రా! ఇక నుంచి నువ్వు యమజాతకుడవు. పూర్ణాయుష్కుడవై జీవించు. ఇక్కడ విషయములు అన్నీ మరచిపో. నీకేమి జ్ఞాపకముండవు. తధాస్తు" అన్నాడు.


    నారాయణ "నారాయణ....నారాయణ...." అన్నాడు.

 

                                                           * * *


    శ్రీచంద్ర కోసం వెతుకుతున్న అందరూ మళ్ళీ శ్రీచంద్ర పెళ్ళిపీటల మీద ఉండటం చూసి హాయిగా ఉపిరి పీల్చుకున్నారు.


    "ఎక్కడికి వెళ్లావురా చందూ?" అడిగింది సమీర గిచ్చుతూ.


    "ఎక్కడికెళ్ళాను......" అని అలోచించి "ఏమో!" అన్నాడు.


    "నైట్ కి చెబుతా నీ పని?" అంది మరోసారి ఎవరూ చూడకుండా కాలిమీద గిచ్చుతూ.


    మంగళ వాయుద్యాల మధ్య సూత్రధారణ పూర్తయింది. అక్షింతలు పడ్డాయి. ఆకాశంలోంచి కూడా.


    
        రచయిత్రి మాట


    నవ్వడం యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం....అన్నారోసారీ మాటల సందర్భంలో జంధ్యాలగారు.


    నవ్వు ఆరోగ్యానికి టానిక్ లాంటిదని ఎందరో చెప్పారు. నవ్వడం వల్ల కొన్ని రసాయనాలు మనలో విడుదలై మనని ఆరోగ్యవంతంగా వుంచుతాయని సైంటిస్టులు నొక్కి వక్కాణిస్తున్నారు.


    అంతెందుకు సృష్టిలో మనిషి తప్ప నవ్వగలిగే ప్రాణి ఎవరో చెప్పండి.....అలాంటి నవ్వగల అపురూప అవకాశం 'మనకే' వుంది.


    ఉదయం లేచింది మొదలు టెన్షన్ తో అనుక్షణం సీరియస్ మొహాలేసుకుని 'అటేన్షన్' గా వుండాల్సి వస్తుంది. రిజర్వ్ డ్ నెస్ పేరుతో కొందరు, 'ఇగో' లతో మరికొందరు, నవ్వడం మహాపాపమని ఫీలయి ఇంకొందరు.....'అ! ఏం నవ్వుతాం లేద్దురు!' అని ఇంకా మరికొందరు....'అబ్బ, నవ్వే ఓపిక లేదు' అని ఆపై కొందరు....ఇలా రకరకాలుగా 'నవ్వు' కు దూరమయ్యే వాళ్ళకు ....ఓసారి 'నవ్వు' గురించి చెప్పాలనే ఈ నవ్వోపాఖ్యానం.


    నవ్వితే మన శరీరంలో ప్లజేంట్ నెస్, మన ఆరోగ్యానికి ఐ.ఎస్. ఐ మార్క్ గ్యారంటి! ఒట్టు! నవ్వితే అందంగా విచ్చుకునే మీ పెదాల మీదొట్టు!


    అందుకే....మిమ్మల్ని నవ్వించాలని కాసేపు ఈ నాలుగు పేజీల్లో నవ్వుల్నీ విరజిమ్మాలనే ప్రయత్నమే ఈ నవల.


    ఈ నవల చదివి మీరు కడుపుబ్బా నవ్వినా, పెదవుల మాటున చిర్నవ్వు దాచుకున్నా, ఇందులోని పాత్రలు గుర్తొచ్చి ముసిముసి నవ్వులు చిందించినా 'అర్రె....విడచ్చు నరుడా ఏమి నీ కోరికలోని సత్తిపండులానో, గరుడాచలంలానో వున్నాడని ఫీలయి ఎక్స్ ప్రేషనిచ్చినా.....అబ్బ....అప్పుడే అయిపోయిందా? అని ఓ నిట్టూర్పు విడిచినా......

 

    థాంక్యూ.....  థాంక్యూ రీడర్స్.....నిజ్జంగా అప్పుడు ఆ క్రెడిట్ మీదే!


    ఇంతకన్నా ఈ నవలని సక్సెస్ చేసి, ఉత్తరాల్లో అభిమానాన్ని కురిపించిన మీకు ఇంకేం చెప్పగల్ను?


    ఈ సీరియల్ తో నన్ను మీకు దగ్గరగా చేర్చిన 'ఆంధ్రభూమి' కి లాటఫ్ థాంక్స్!

 


                                                 --------అయిపొయింది--------


 Previous Page

WRITERS
PUBLICATIONS