"పదపద క్లాసుకు టైం అయింది" సుహాసిని జయంతి భుజంపై చేయి వేస్తూ అంది.
"అలా భుజం పైన చేయి వెయ్యొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి" అంది జయంతి ఆమె చేతిని తీసి వేస్తూ.
"అబ్బా జయంతి! నేనూ ఆడపిల్లనే!" అంది సుహాసిని.
"అది నువ్వు చెపితేనే తెలుస్తుంది.....అప్పుడప్పుడు నేను గుర్తు చేయబట్టి" అంది జయంతి.
"నేను ఆడపిల్లను కాబట్టే నువ్వింకా కన్యగా ఉన్నావు....అదే మగవాడ్ని అయినట్లయితేనా?!" అంది జయంతిని నిలువెల్లా తినేసాలా చూస్తూ.
"చీ....రౌడిదానా....అన్నీ రౌడి మాటలే....అసలు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యావో తెలీటం లేదు. అంతా నా ఖర్మ" అంది నెత్తి కొట్టుకుంటూ జయంతి.
సుహాసిని ఆమె మాటలకు పెద్దగా నవ్వింది.
ఆ నవ్వుకు సైకిల్ స్టాండులో ఉన్న అబ్బాయిలు ఈలలు వేశారు. వన్స్ మోర్!" అంటూ.
"చీ...చీ......రేపటి నుంచి నువ్వు నా పక్కన నడిచావంటే చంపేస్తాను" అంది జయంతి.
"ఎందుకే! నా పేరే సుహాసిని......అందుకే వాళ్ళు నా నవ్వుని ఎంజాయ్ చేస్తున్నారు. నవ్వటం కూడా తప్పేనా తల్లీ.....భుజం మీద చేతులు వేయకూడదు, నీ పక్కన నడవకూడదు....నడిచినా నవ్వకూడదు. ఆహా! ఏం రూల్స్ తల్లీ.....మనం గంధర్వ కన్యలమయినా బాగుండేది గేటు దగ్గర ప్రత్యక్షమై అక్కడ ఠప్ మంటూ మాయమై మళ్ళా క్లాసు రూంలో ప్రత్యక్షమయ్యే వాళ్ళం. ఏం చేద్దాం మానవకన్యల మయిపోయాం ఆఫ్ కోర్స్ ....నువ్వు మానవకన్య రూపంలో ఉన్న గంధర్వ కన్యవనుకో...." అంది సుహాసిని ఆమె చెవిలో మెల్లగా.
ఇద్దరూ క్లాసు రూం గుమ్మంలో నిలబడ్డారు.
"మే ఉయ్ కమిన్ మేడం...." అంది సుహాసిని నవ్వుతూ.
"కమిన్!" అంది మేడమ్.
ఇద్దరూ వడివడిగా అడుగులు వేస్తూ తమ బెంచి దగ్గరకు చేరుకొని అక్కడ కూర్చున్నారు.
జయంతి నడుస్తున్నప్పుడు వెనకనుంచి అబ్బాయిలు.....
"నీలిమేఘమా!.....జాలి చూపుమా!...." అంటూ పాట పాడారు. ఆమె నీలిరంగు చీరే , అదే రంగు జాకెట్టు వేసుకోవటం వల్ల.
జయంతి మెల్లగా స్టుపిడ్, రాస్కెల్స్ అంటూ తిట్టుకుంటూ వెళ్ళి బెంచి మీద కూర్చుంది.
మేడం ఇంగ్లీషు లెసన్ 'రోమియో జూలియట్' చెపుతోంది. ఆమె చెపుతుంటే మధ్యమధ్యలో వెనుక బెంచి అబ్బాయిలు చప్పట్లు, ఈలలు వేస్తూ గొడవ చేస్తున్నారు. మేడంకు ఇవన్నీ అలవాటే కనుక అవేం పట్టించుకోకుండా లెసన్ పూర్తి చేసింది.
లెసన్ పూర్తయిన వెంటనే వెనుక బెంచిలో కూర్చున్న నవీన్ మేడం! నాదో చిన్న డౌట్ మేడం!" అన్నాడు వినయంగా.
"యస్! వాటిజ్ దట్!" అంది మేడం కళ్ళజోడు సరిచేసుకుంటూ.
"షేక్ స్పియర్ ముస్లిమా మేడం?" అన్నాడు మళ్ళీ వినయంగా చేతులు కట్టుకుని.
"వాటిజ్ దట్ సిల్లీ క్వశ్చన్?!" అంది.
"హి ఈజ్ ఇంగ్లీష్ పర్సన్!" అంది మళ్ళీ సీరియస్ గా.
"మరి ఇంటిపేరు 'షేక్' అని పెట్టుకున్నాడు ఎందుకు మేడం! మా ప్రెండ్ షేక్ షీరాగాడు షేక్ స్పియర్ మావాడే మా రిలేటివ్ అవుతాడు ఇక్కడే వించి పేటలో వుండేవాడు. తరవాత లండన్ లో సెటిల్ అయ్యాడు....అంటున్నాడు మేడం!" అన్నాడు వినయంగా.
క్లాస్ రూం అంతా ఘొల్లున నవ్వింది.
"షిడౌన్ యూ ఇడియట్!" అంది.
ఇంతలో బెల్ మోగటంతో అంతా ఘొల్లుమని నవ్వుతూ బెంచిల పైన చేతుల్తో కొడుతూ క్లాస్ రూం బయటకు వచ్చారు.
35
బస్సుదిగి జయంతి వడివడిగా నడుచుకుంటూ వెళ్తుంది. రావిచెట్టు దగ్గిర బస్సు ఆగుతుంది. అక్కడినుంచి ఉళ్ళోకి వెళ్ళాలంటే మట్టి రోడ్డులో అరపర్లాంగు నడవాలి. అక్కడ ఇళ్ళు పెద్దగా ఉండవు. మధ్యలో రామాలయాన్ని దాటి వెళ్ళాలి.
అప్పుడు సమయం ఆరుగంటలవుతుంది.
మసకమసక చీకటి.
కాలేజి అయిపోయిన వెంటనే లైబ్రరీలో కూర్చుని షేక్ స్పియర్ నాటకం చదువుతుండటం వల్ల టైం తెలియలేదు జయంతికి. దాంతో నాలుగు గంటల బస్సు మిస్సయింది.
అందుకే ఈరోజు ఆలస్యమయింది.
రామాలయం సమిపీంచగానే.....
"హాలో జయంతిగారూ! బావున్నారా?" అందో కంఠం.
జయంతి ఉలిక్కిపడింది.
అటూ ఇటూ చూసింది.
ఎవరూ కనిపించలేదు. "నేనండి! గుర్తుపట్టలేదా మహేంద్రని!" అన్నాడు నవ్వుతూ ఎదురుగా వచ్చి.
"మీరా?!" అంది అశ్చర్యంగా జయంతి.
"అరె! ఎందుకంత ఆశ్చర్యం?" అన్నాడు మహేంద్ర.
"ఏం లేదు" అంది కంగారుగా అటూ ఇటూ చూస్తూ.
అక్కడ సమీపంలో ఎవరూ లేరు.
జయంతితో పాటు బస్సు దిగిన నలుగురు వ్యక్తులు ఎప్పుడో ఆమెను దాటి వెళ్ళిపోయారు.
"ఎంటండి కాలేజి నుంచా?" అడిగాడు మహేంద్ర. "అవును....ఇప్పటికే ఆలస్యమయింది వెళ్ళాలి" అంది కంగారుగా.
"చాలాకాలం తరువాత కలిశాం. కాసేపు రామాలయంలో కూర్చుని కబుర్లు చెప్పుకుని వెళదాం!" అన్నాడు అదోలా నవ్వుతూ.
