గొల్లవాడి కూతురు
మనుష్యులంతా పాటుపడాలని మా ముసలవ్వ
(దానమ్మ కడుపు చల్లగా) అభిప్రాయం.
క్షణంక్రితం అన్నం వడ్డిస్తూ నాతో అంది అవ్వ. నువ్వేదేనా
మంచిపని ఒకటి, మనుష్యులకి లాభించేపని నేర్చుకో-ఏదేనా
చెయ్యి, మట్టితోనో, కర్రతోనో, ఇనుంతోనో, గుడ్డతోనో. ఏ
పనీ చేతకాకపోవడం నీలాంటి కుర్రాడికి తగదు. నువ్వేదేనా
చెయ్యగలవూ? ఓ బల్ల, కుర్చీ మామూలు పళ్లెం, కంబళీ,
కాఫీ గిన్నె? ఏదేనా నీకు చేతనవునూ?
అవ్వ నావేపు కోపంగా చూసింది.
నాకు తెలుసు - అంది మా అవ్వ - నువ్వోరాతగాడివనుకుంటున్నావు. బహుశా ఔననే నా అభిప్రాయం. అన్ని సిగరెట్లు కాలుస్తున్నందుకు నువ్వేదేనా కావచ్చును. ఇల్లంతా పొగతో నింపేస్తావు. కాని ఓ గట్టి వస్తువేదేనా చెయ్యగలవూ? ఉపయోగానికొచ్చేది, కనబడేది, ముట్టుకోదగ్గది.
పారశీల రాజ్యానికి ఒకరాజు ఉండేవాడు - అంటూ ప్రారంభించింది అవ్వ. ఆ రాజుకొక కొడుకు! ఆ కొడుకొక గొల్లవాడి కూతురిని మోహించాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నాడా అబ్బాయి, దొరా! నేనో గొల్లపిల్లను ప్రేమించాను. ఆమెనే పెళ్ళిచేసుకుంటాను అని. రాజన్నాడు - 'నేను రాజుని. నా కొడుకువి నువ్వు, నా తదనంతరం రాజువౌతావు. గొల్లపిల్లనెలా పెళ్ళాడుతావురా అబ్బాయీ? అని. అబ్బాయి, "దొరా! అదంతా నాకు తెలియదు. ఈ పిల్లంటే నాకు చాలా ఇష్టం. ఈ పిల్లనే నా రాణిని చేసుకుంటాను అన్నాడు.
ఇది భగవంతుడు సంకల్పించిన ప్రేమ అని రాజు గ్రహించాడు. సరే ఆపిల్లకి కబురుచేస్తానన్నాడు. ఒక నౌకర్ని పిలిపించి, ఒరే గొల్లవాడి కూతురు దగ్గరికి వెళ్ళి ఆ పిల్లని నా కొడుకు ప్రేమిస్తున్నాడనీ, పెళ్ళి చేసుకోదలచుకున్నాడనీ చెప్పు, అన్నాడు. నౌకరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి రాజుగారి కొడుకు నిన్ను ప్రేమించాడు. నిన్ను పెళ్ళిచేసుకుంటానన్నాడని అన్నాడు. అమ్మాయి అడిగింది. రాజు కొడుక్కి ఏం పని వచ్చునని. రాజుగారి కొడుకు పనిచెయ్యడమేమిటన్నాడు నౌకరు. ఏదోపని నేర్చుకోవాలంది అమ్మాయి. నౌకరు రాజు దగ్గరకి వెళ్ళి అమ్మాయి చెప్పింది చెప్పాడు.
కొడుకుతో రాజన్నాడు, "గొల్లవాడి కూతురు నువ్వేదేనా పనిలో నేర్పు సంపాదించాలంటున్నది. అయిందా, ఇంకా ఆ పిల్లనే పెళ్ళాడాలనే వుందా?" అని. సరే అన్నాడు కొడుకు. నారతో కంబళ్ళు నేయడం నేర్చుకుంటానన్నాడు. కుర్రాడికి రకరకాల మోస్తరుగా, రంగురంగుల్లో రమ్యమైన బుటే దారీలతో కంబళ్ళు అల్లడం నేర్పించారు. మూడు రోజుల్లో కుర్రాడు సున్నితమైన కంబళ్లు తయారుచెయ్యగలిగాడు. నౌకరు వెళ్ళి గొల్లపూడి కూతురుతో అన్నాడు- ఈనార కంబళ్ళు రాజుగారి కొడుకు నేశాదని.
గొల్లవాడి కూతురు నౌకరు వెంట రాజభవనానికి వెళ్ళింది. రాజు కొడుక్కి భార్య అయింది.
ఒకరోజు బాగ్దాదు నగర వీధుల్లో - అంది మా అవ్వ - రాజకుమారుడు నడుస్తున్నాడు. ఒక చక్కని పరిశుభ్రమైన భోజనశాల చూచి అందులోకి ప్రవేశించాడు.
అవ్వ చెబుతోంది, ఈచోటు దొంగలూ, కత్తికోతలవాళ్ళూ నివసించేది. వీళ్ళు రాజు కొడుకుని అపహరించి ఒక చీకటి కొట్లో పడేశారు. నగరంలోని మహా మహా వాళ్ళని అలాగే దాచేసి, అందరికన్నా దిబ్బగా ఉన్నవాళ్ళని చంపి అందరికన్నా బక్కపలచని వాళ్లకు వండిపెడుతూ ఆడుకునేవాళ్లు. రాజుగారి కొడుకు అందరికన్నా బక్కపలుచన. అతడే పారశీకరాజు కొడుకని తెలియకపోబట్టి చంపెయ్యలేదు. దొంగలనీ, కత్తి కోతలవాళ్ళనీ చూసి రాజకుమారుడేమన్నాడూ. నేను నార కంబళ్ళు నేస్తాను. అవి చాలా ముఖ్యమైనవి అని. అంటే, నార పట్టుకొచ్చి నేయమన్నారు. మూడురోజుల్లో మూడు కంబళ్ళు నేసి రాజుకొడుకు వాళ్ళతో అన్నాడు కదా, పట్టుకెళ్ళండి వీటిని పారశీక రాజభవనానికి. ఒక్కొక్క కంబళికి మీకు నూరేసి బంగారు నాణాలిస్తాడు రాజు. అలాగే కంబళ్ళు తీసుకెళ్ళారు వారు రాజుగారి భవనానికి. కంబళ్లని చూడగానే ఇవి తన కొడుకు నేసినవే అని తెలిసిపోయింది రాజుకి. వెంటనే వాటిని గొల్లవాడి కూతురు దగ్గరికి తీసికెళ్ళి రాజన్నాడు, ఎవరో వీటిని మన మహలుకి తెచ్చారు, చూడగా ఇవి తప్పిపోయిన నా కొడుకు నేసినట్లున్నాయని. గొల్లవాడి కూతురు ఒక్కొక్క కంబళిని పరీక్షగా చూసి వాటిలోని లతల మధ్య నేర్పుగా పారశీక దేశస్థుల లిపిలో అల్లిన సందేశం చదివింది. తన భర్త దగ్గర్నించి వచ్చిన యీ వర్తమానాన్ని రాజుకి నివేదించింది.
అంతట రాజుగారు - అవ్వ అంది - ఈ దొంగలూ, కత్తికోతల వాళ్ళూ ఉన్నచోటికి చాలామంది సైనికుల్ని పంపించారు. సైనికులు బందీలందరినీ విడిపించారు. అంతమంది దొంగల్నీ, కత్తికోతలవాళ్ళనీ సంహరించారు. రాజుగారి కొడుకు సురక్షితంగా తండ్రి భవనం చేరుకున్నాడు. మహలులోకి వెళ్ళి మళ్ళా తన భార్యని ఎప్పుడు చూశాడో అప్పుడు రాజుగారి కొడుకు అణకువతో తలవంచి ఆవిడ కాళ్ళు ముట్టుకుని అన్నాడు. ప్రేయసీ, నీవల్లనే నాకు ప్రాణాలు దక్కాయి అని. రాజుగారు కూడా గొల్లవాడి కూతురిని చాలా మెచ్చుకున్నారు.
చూశావా! అందరూ ఎందుకొక పనిలో నేర్పు సంపాదించవలసి ఉంటుందో అని అడిగింది అవ్వ.
చూశాను. ఔను స్పష్టంగా చూశాను అన్నాను నేను. రంపం, సుత్తి, కొంచెం కలప కొనడానికి తగినంత డబ్బు సంపాదించిన తక్షణం శాయశక్తులా ప్రయత్నించి ఒక కుర్చీగాని, లేకపోతే నా పుస్తకాలు పెట్టుకోవడానికొక చిన్న బీరుగా గాని తయారుచేస్తానన్నాను.
* * * *
