కారెక్కబోతున్న రామనాథబాబుతో "మళ్ళీ దర్శనం ఎప్పుడూ?" అన్నది వరూధిని.
"రాణీగారి అనుజ్ఞ అయినప్పుడు." పక్కనే వున్న వెంకటపతిని చూస్తూ ఆ మాటలు పైకి అనలేకపోయాడు రామనాథబాబు.
వారంరోజుల తర్వాత రామనాథబాబు జాగిర్దార్ స్కూలు అప్లికేషన్ ఫారం తీసుకొని వచ్చాడు.
"బాబుకు సీటు వచ్చిందా?" వరూధిని పట్టరాని సంతోషంతో అడిగింది.
"రాక ఎక్కడికి పోతుందిలే. ముందు ఈ ఫారం పూర్తిచేసి పంపాలి. 'మే' నెల్లో టెస్ట్ వుంటుందట. జూన్లో చేర్చుకుంటారు." కవరులోనుంచి ఫారమూ, ప్రాస్పెక్షస్ తీస్తూ అన్నాడు రామనాథబాబు.
"మళ్ళీ టెస్టేమిటి? మినిష్టరుగారితో చెప్పించేంలాభం?"
"ఎవరు చెప్పినా పద్దతి మాత్రం అదేనట. నీకెందుకా గొడవంతా! ఫారం పూర్తి చేసి రిజిస్ట్రేషన్ ఫి పంపించు!" అన్నాడు రామనాథబాబు.
ట్యూషన్ మాష్టర్ను పెట్టించి ఆ నెలంతా ఇంగ్లీషూ, లెక్కలూ చెప్పించింది వరూధిని. మే నెల మొదటి వారంలో కుర్రాణ్ణి తీసుకొని రామనాథబాబుతో హైదరాబాదు వెళ్ళింది.
వరూధిని తిరిగొచ్చేసరికి వారంరోజులు పట్టింది. వెంకటపతి కొడుకుని వదిలి ఇన్ని రోజులు ఎప్పుడూ లేడు. వాడ్ని చూడకపోతే బెంగపడిపోయినట్టయిపోయాడు. రవి వచ్చినరోజు వాడ్ని వదలకుండా తన దగ్గిరే పెట్టుకొన్నాడు. వాడు హైదరబాదులో తను చూసినవీ, తను చదవబోయే స్కూలు ఎంత గొప్పదో చెప్తూంటే తన్మయుడైపోయి విన్నాడు వెంకటపతి.
"అక్కడి పిల్లలకు ఏం డ్రస్సో చెప్పావురా బాబూ మీ నాన్నగారికి?" అన్నది వరూధిని.
"అవును నాన్నా! అంతా యూనిఫారం, ఖాకీడ్రస్సు. అంతా మిలటరీ వాళ్ళల్లే వుంటారు నాన్నా!" చెప్పాడు రవి చేతులు తిప్పుతూ.
వెంకటపతి కొడుక్కేసి గర్వంగా చూసుకొన్నాడు.
"నేను మిలటరీలో చేరిపోతా నాన్నా!" అన్నాడు రవి.
"ఏమిట్రా రవీ! నువ్వు మిలటరీలో చేరిపోతావా?" డైనింగ్ టేబుల్ మీద పళ్ళేలు సర్దుతూ మురిపెంగా అడిగింది వరూధిని.
"అవునమ్మా!"
"నువ్వు ఐ.ఏ.యస్. పాసయి కలెక్టరు కావాలని నేననుకొంటుంటే నువ్వు సైన్యంలో చేర్తానంటావేంరా?" భర్తకూ, కొడుక్కూ అన్నం వడ్డిస్తూ అన్నది వరూధిని.
"ఛీ! పిచ్చి కలెక్టరేంటమ్మా! చీఫ్ ఆఫ్ స్టాఫ్ అవుతాను" అంటూ రవి విసురుగా తల్లికేసి తిరిగాడు.
వాడి చెయ్యి తగిలి టేబుల్ మీద నుంచి నీళ్ళగ్లాసు కిందపడింది. వరూధిని చీరమీద నీళ్ళు తొణికాయి.
"ఛ! ఏమిట్రా ఇది? మిలటరీ ఆఫీసరయేవాడు ఇట్లా చేస్తాడా ఏం? ఇట్లా చేస్తే మిలటరీలోనుంచి తీసేస్తారు తెలుసా? సరిగా కూర్చో!" అంది తల్లి.
రవి నిజంగా తనను మిలటరీలోనుంచి తీసేస్తారేమోనన్నట్టు బుద్దిగా కుర్చీలో కూర్చున్నాడు.
"నాన్నా! నువ్వు చెప్పు - కలెక్టరెక్కువా? చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎక్కువా?" రవి తండ్రిని అడిగాడు.
"ఇద్దరూ ఎక్కువే!" అన్నాడు వెంకటపతి.
"ఇద్దర్లో ఎవరు ఇంకెక్కువా?"
"సర్లే! అన్నం కలుపుకో?" అన్నది వరూధిని.
"నే చెప్పనా?" అన్నాడు కొడుకు.
"ఊఁ! చెప్పు!" అన్నాడు తండ్రి.
"చీఫ్ ఆఫ్ స్టాఫ్! ఎందుకో తెలుసా? సైన్యం అంతా నాకిందే వుంటుంది."
"ఎవరు చెప్పార్రా నీ కివన్నీ?" వరూథిని మురిపెంగా అడిగింది.
"మా ట్యూషన్ మాష్టారు చెప్పాడు!" అన్నాడు రవి, తన ట్యూషన్ మాస్టారు చెప్పిందానికి తిరుగులేదన్నట్టు.
"అసలు చదువు మానేసి ఇవి చెప్పాడా ఏమిటి?" అంది వరూధిని నవ్వుతూ.
రవి అలిగినట్టు ముఖంపెట్టి అన్నం తినడం మానేశాడు.
"మీ మాస్టారు చెప్పిందే కరెక్ట్! త్వరగా అన్నం తినేయ్ బాబూ!" కొడుకుని బుజ్జగించింది వరూధిని.
భోజనాలయాక వెంకటపతి కొడుకుని తన పక్కలో పడుకోబెట్టుకొని నిద్ర పుచ్చాడు. వాడు నిద్రపోయాక లేచి వరండాలోకి వచ్చాడు. చుట్ట వెలిగించుకొని గుంజ కానుకొని తాపీగా కూర్చున్నాడు.
"హాలు దగ్గర కెళ్తున్నారా?" వరండాలోకి వస్తూనే ప్రశ్నించింది వరూధిని భర్త నుద్దేశించి.
"టైం ఎంతయిందీ?" అడిగాడు వెంకటపతి చుట్టకొడి దులుపుతూ.
"రెండో ఆట బుకింగ్ ఇంకా తెరిచివుండదు. మీరు వెళ్ళొచ్చు"
"ఇవ్వాళ పోలేన్లే. బద్దకంగా వుంది" అన్నాడు వెంకటపతి పాలుమాలి.
"ఇంట్లో ఉన్నయ్ గా సీసాలు? ఇంకా బయటేంపని మీకూ?" అన్నది వరూధిని.
"బాబును స్కూల్లో చేర్పించే దెప్పుడూ?"
"ఇంకా ఎన్నిరోజులున్నదీ! ఇవాళ మూడో తారీఖుగదూ? ఇంకో పదిరోజుల్లో బయలుదేరిపోవాలి. పదిహేనుకల్లా బాబు స్కూల్లో వుండాలి."
"అయితే హైదరాబాదులో ఇల్లు చూశారా? అద్ధెంతా?"
"ఇల్లెందుకూ?"
వెంకటపతి తలెత్తి చూశాడు. "పట్నంలో ముందుగా చూసుకోకపోతే ఎప్పుడంటే అప్పుడు దొరుకుతయ్యా?" అన్నాడు.
"ఏమిటి? నీ సొదా నువ్వూనూ? అసలు ఇల్లెందుకు అక్కడా? బాబు స్కూలు హాస్టల్లోనే వుంటాడు" అన్నది విదిలించినట్టుగా వరూధిని.
"వాడికి ఏడేళ్ళు లేవు. ఒంటరిగా అంత దూరాభారాన మనల్ని విడిచి ఎట్టా వుంటాడూ?"
"అక్కడ ఏర్పాట్లన్నీ ఉంటాయనేగా జాగీర్దార్ స్కూల్లో చేర్పిస్తోంది? అలా వుంటేనే వాడికి చదువు అబ్బి పైకొస్తాడు. లేకపోతే నీలా నాలాగానే తయారవుతాడు!"
"హైదరాబాద్ లో సినిమాహాలు కట్టబోతున్నాం కదా? మనం కూడా అక్కడే ఉంటాం. అందుకనే బాబును హైదరాబదులో చేర్పిస్తున్నారేమో ననుకొన్నాను!"
"మనం హైదరాబాదులో కాపురం ఉన్నా బాబును మాత్రం స్కూల్లో పెడ్తారు. అక్కడి చదువులు మన చదువుల్లాంటివి కావు."
"అయితే నువ్వుకూడా వెళ్ళు చదువుకో బాబు స్కూల్లో, బిల్లు కలెక్టరన్నా అవుదువుగాని."
వెంకటపతి నవ్వటానికి ప్రయత్నించాడు. అయినా నవ్వు రాలేదు.
"హైదరాబాదు చుట్టూ ఆరునెళ్ళనుంచీ తిరుగుతున్నారు. ఇంతకీ హాలు కట్టే సంగతి ఎంతవరకు వచ్చినట్టూ?"
"మనం చూసిన స్థలం చాలా మంచిదే. కాని ఏదో లిటిగేషన్ లో వుందట. అక్కడ సాయిబుల ఆస్తులన్నీ ఏవో గొడవలుగానే వుంటాయట! ఇంకా నయం! మనకు ముందే తెలిసింది. ఒకసారి మోసపోయింది చాలక.... మళ్ళీ....."
"వేరే స్థలం చూడొచ్చుగా?" మధ్యలోనే అందుకొని అన్నాడు. వెంకటపతి కొడుకుని వదిలి వుండలేక మనసులో మధనపడసాగాడు. అంతకుముందు హైదరాబాదు వెళ్ళడం అంటేనే ఇష్టపడనివాడు కొడుకు కోసం ఏదైనా వదిలి వెళ్ళడానికి మనస్సు దృఢపరచుకొన్నాడు. ఎలాగయినా సినిమాహాలు ప్లాను కుదిరి హైదరాబాద్ లో కట్టడం జరగాలని మనసారా కోరుకొన్నాడు వెంకటపతి.
"స్థలాలెందుకు లేవూ? కట్టుకుపోయినన్ని వున్నాయ్. ఈ స్థలం అయితే చాలా మంచి సెంటర్లో వుంది. చవుగ్గా కూడా దొరుకుతుంది. మనం నాలుగైదు వేలు ఖర్చు పెట్టి ఐ.జి.పి. వాళ్ళను పట్టుకొంటే ఆ స్థలం లిటిగేషన్ లోనుంచి బయటపడుతుంది. రామనాథబాబుగారు పెద్ద పెద్దవాళ్ళను పట్టుకొని మొత్తంమీద పని సాధిస్తారులెండి. రెండు మూడు నెలల్లో స్థలం మనం రిజిష్టరు చేయించుకోవచ్చు. ఈ లోపల ప్లాన్లూ, పర్మిషన్లూ, లోన్లూ చూసుకోవాల్సినవి చాలా వున్నాయి. అవి పూర్తి అయేసరికి ఆ స్థలం లిటిగేషన్ లో నుంచి బయటపడుతుంది." తను చెప్పేది భర్త వినడం లేదని గుర్తించి ఆపేసింది వరూధిని.

