Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 64

 

    అంతకు కొన్ని గంటల క్రితమే శశికాంత్ తో కలిసి సుఖాలు కొల్ల గొట్టింది వుజ్వల.

 

    మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కార్తిక్ తో.

 

    కొత్త మగాడు -కొత్త కోర్కెలు..... కొత్త రుచులు!

 

    చాలా సేపటి తరువాత తను నిద్రపోతుంటే కార్తిక్ మాటలు కలలోలా వినబడ్డాయి ఉజ్వలకి.

 

    "వెళ్ళివస్తాను హాని!"

 

    సీ యూ బేబీ!

 

    సో లాంగ్ డియర్!

 

    కార్తిక్ వెళ్ళిపోయిన తరువాత మరో గంటకి లేచి కూర్చుంది ఉజ్వల. కోరికల టెన్షను తగ్గి, తెలిగ్గా ఉంది ఉంది శరీరం.

 

    కానీ మనసులోని టెన్షను మరి కాస్త మిగిలే ఉంది. అది కూడా మరుగున పడాలంటే...........

 

    కాసేపు చెస్!

 

    తన కిష్టమైన గేమ్!

 

    చదరంగం!

 

      ఎత్తుకి పై ఎత్తులు!

 

    కింద మాగ్నేటేక్ బేస్ ఉన్న అతి చిన్న దంతపు పావులతో ఉన్న పాకెట్ సైజు చెస్ బోర్డు తీసింది ఉజ్వల.

 

    నల్లపావులు, తెల్లపావులు, రెండు వైపులా పేర్చి రెండు ఆటలు తనే ఆడడం మొదలెట్టింది.

 

    కొద్ది క్షణాల తరువాత ఆమె కంఠంలో నుంచి ఉల్లాసంగా వెలువడడం మొదలెట్టాయి మాటలు.

 

    "ఇదిగో! కార్తిక్! ఆ బంటు ఎవరో తెలుసా? ఇది నువ్వే! బీ ప్రిపెర్డ్ ఫర్ ఏ వార్ బాయ్! తయారుగా వుండు! ఇక్కడ నిలబడు నువ్వు!" అని ఒక బంటుని కదిలించి ఒక గడిలో నిలిపింది.

 

    తరువాత మరో పావుని తీసుకుని, "తేజస్వి! ఈ బంటుని నువ్వు చూశావా? నీ శత్రువులు వ్యూహం పన్నుతున్నారు. కాచుకో! ఏం?" అని ఆ పావుని కూడా కదిలించింది.

 

    "రెడీ! ఇప్పుడు మీరిద్దరూ ఎత్తుకి పైఎత్తు వేసి ఎవరు ఉంటారో ఎవరు ఉడతారో తేల్చుకోవాలి ప్రొసీడ్!"


    ఆ తరువాత ఆమె దృష్టి రాజు మీద పడింది. ఆ పావుని ఎత్తి మళ్ళీ కింద పెట్టేసింది ఉజ్వల.

 

    "శశీ! నువ్వే ఈ రాజువి!

 

    "లీజర్ లీ, స్లోలి, అండ్ ష్యుర్ లీ!"

 

    అనుకుంది ఉజ్వల.

    

                                                          * * *

 

    తెలతెలవారేదాకా మగత నిద్రలో మెదులుతూనే ఉన్నాడు తేజస్వి. ఆ తరువాత ఒక గంట సేపు గాడనిద్ర పట్టేసింది అతనికి. మళ్ళీ అంతలోనే ఎవరో తట్టి లేపినట్లు మెలకువ వచ్చేసింది.

 

    లేచి లేవగానే ముందుగా చిన్నీ కోసం చూశాడు తేజస్వి. చిన్నీ తన పక్కనే దుప్పటి ముసుగులా కప్పుకున్నట్లు అనిపించింది అతనికి.

 

    కానీ నిజానికి చిన్నీ అక్కడలేడని , అక్కడ రెండు దిండ్లు పెట్టి వాటిమీద దుప్పటి కప్పేసి, తన దోవన తాను వెళ్ళిపోయాడని తేజస్వికి ఇంకా తెలియదు.

 

    తరువాత, పక్కగదిలో పడుకుని ఉన్న సౌమ్య దగ్గరికి నడిచాడు తేజస్వి.

 

    అతని అడుగుల చప్పుడు వినబడగానే చటుక్కున తల ఎత్తి చూసింది సౌమ్య. రాత్రి అంతా అలా ట్రంకు పెట్టె మీదే నుదురు ఆనించి ఉండడంవాళ్ళ నుదుటి మీద నొక్కుకుపోయి దురదృష్టరేఖగా కనబడుతోంది ఒక గీత. లోకంలోని విషాదమంతా తన కళ్ళలోనే కాపురం ఉంటున్నట్లు దీనంగా ఉంది. సౌమ్య పలకరిస్తే చాలు, దుఖం పొంగి పొరలిపోయేటట్లు వుంది ఆమెకి.

 

    అందుకని, ఇప్పుడేమి మాట్లాడకుండా పాలకార్డు తీసుకుని, పాల బూత్ వైపు వెళ్ళాడు తేజస్వి.

 

    నడుస్తున్నంత సేపు అతనికి ఒకే ఆలోచన!

 

    తప్పు చేశాడా తను!

 

    సౌమ్యని తనతో తీసుకువచ్చేయడం వల్ల ఆమె పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయిందా!

 

    సౌమ్యని ఇక్కడికి తీసుకువచ్చేముందు ఇవన్ని ఇంత వివరంగా ఆలోచించలేదు తను. ఆలోచించే అవకాశం కూడా అసలు లేకపోయింది.

 

    ఇప్పుడిక అలోచించి మాత్రం ప్రయోజనం ఏం ఉంది? ఆలోచించినా చెయ్యడానికి వేరే పద్దతి ఏముంది? దిక్కు లేకుండా పోయింది సౌమ్యకి. ఇక ఎక్కడికి వెళ్ళగలదు తను? ఎక్కడ ఉండగలదు?

    
    ఆమెకి బంధువులు ఉన్నారు సరే, కానీ ఆమె తల్లి చావుకే రాని ఆ బంధువులు ఆమెని ఆడుకోవడానికి సిద్దపడతారా?

 

    ఏమో! నమ్మకం లేదు!

 

    తేజస్వి బూతు నుంచి తిరిగి వచ్చేసరికి అతనికి ఒకప్పుడు బాస్ అయిన పరమహంస గారు ఉన్నారు ఇంట్లో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS