"ఊరుకోమ్మా! పోయిన వాళ్ళందరూ అదృష్టవంతులని మనని మనమే వురడించుకోవటం తప్ప చెయ్యగలిగింది ఇంకేమి లేదు. మే మందరం నీకు తోడున్నాం. నువ్వేం దిగులు పడకు తల్లి! అంటున్నారు అనునయంగా.
సమాధానంగా సౌమ్య వెక్కిళ్ళు వినబడ్డాయి.
నమస్కారం! బాగున్నారా? అన్నాడు తేజస్వి అనునయంగా.
జవాబుగా తల పంకించారు పరమహంసగారు.
తెచ్చిన పాలు వంటింట్లో పెట్టి వచ్చి రెండు కుర్చీలు బయట వేప చెట్టు క్రింద వేశాడు తేజస్వి.
వాళ్ళు అక్కడ కూర్చోగానే మట్టిలో దేకుతూ ఒక అమ్మాయి వచ్చింది అక్కడికి. ఆ అమ్మాయి మరి పసిపాప ఏమి కాదు. ఎనిమిదేళ్ళు ఉండవచ్చు. కానీ ఆమె శరీరం ఏడాది పాప శరీరంలా ఉంది. తల మాత్రం పెద్దదిగా వుంది. ఈనేపుల్లల్లా వున్నాయి ఆమె కాళ్ళు చేతులూ. ఆమె ఒంటి బరువుని మోసే శక్తి కూడా వున్నట్లు లేదు ఆ కాళ్ళకి. అందుకని నాలుగుకాళ్ళ జంతువులాగా కాళ్ళమీదా చేతులమీదా కాసేపు నడుస్తూ , కాసేపు దేకుతూ వస్తోంది ఆ అమ్మాయి.
ఆమె వైపు జాలిగా చూసి అన్నాడు పరమహంసగారు.
"ఎవరి అమ్మాయి తేజస్వి?"
"పక్కింటి వాళ్ళ అమ్మాయి వాసంతి. " అని ఆ అమ్మాయికి అర్ధం కాకుండా వుండటానికి గానూ ఇంగ్లీషులో మాట్లాడడం మొదలెట్టాడు తేజస్వి.
బహుశా ప్రాజెస్టేరోన్ ఎఫెక్ట్ అనుకుంటాను.
చిత్రం! నేను ఇప్పటిదాకా ప్రాజెస్టేరోన్ డ్రగ్ గురించే చదువుతున్నాను. కంపెని అమ్మేసుకున్న తరువాత అంతా తీరికే కదా నాకు. ఇన్నాళ్ళనుంచి మంచి మందులు తయారు చేసి న్యాయంగా అమ్మాలని ప్రయత్నించి దెబ్బతిన్నాను తేజస్వి. అసలు ఈ ఇండస్ట్రిలో జరుగుతున్న అన్యాయాలేమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఇప్పుడు. అందుకే ఈ పుస్తకాలు సంపాదించాను. ఇవి చదివి, నీతో చర్చించాలని ఇలా వచ్చాను తేజస్వి. ఎలాగూ మార్నింగ్ వాక్ నాకు అలవాటే గనుక.....మళ్ళీ లేటయితే నువ్వు ఉంటావో , ఉండవో అని,"
యాంత్రికంగా అయన చేతిలోని పుస్తకాలు అందుకున్నాడు తేజస్వి. కారణం కేవలం డ్రగ్స్ గురించి చర్చించడానికేనా? అది అయి ఉండదు.
ఇక్కడ జరిగినది అంతా ఈయనకి తెలిసే ఉంటుంది. పెద్ద మనిషి కాబట్టి పరామర్శా చేసి కష్ట సుఖాలు కనుక్కుందామని వచ్చి ఉంటాడు.
అంతే అయి వుండాలి.
చాలా తప్పు పని చేశావు. ఆ అమ్మాయిని ఇబ్బందిలో పెట్టేశావు తేజస్వి అని తనని మందలిస్తాడా ఈయన?
అసలు తప్పు చేశాడా తను? ఏమో!
తేజస్వి! అన్నారు పరమహంసగారు, అతని ఆలోచన గమనించి ఆర్ద్రంగా.
ఉలికిపడి అయన వైపు చూసి, మళ్ళీ దృష్టి చేతిలోని పుస్తకాల మీదికి మరలించాడు తేజస్వి.
వాటిల్లో ఒక పుస్తకం డ్రగ్ ఇండస్ట్రి అండ్ ద ఇండియన్ పీపుల్ - డాక్టర్ అమిత్ సేన్ గుప్తా రాసిన ఆ పుస్తకాన్ని డిల్లి సైన్సు ఫోరం, ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రోప్రేజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రచురించారు.
రెండో పుస్తకం, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రచురించిన బాన్ డ్ అండ్ బానబుల్ డ్రగ్స్.
మూడోది , పాండిచేరి సైన్సు ఫోరం వారు ప్రిపేర్ చేసిన ఇన్యూస్ ఇన్ వాల్వ్ డ్ ఇన్ డ్రగ్ పాలసి.
వాటితో బాటు మరో రెండు పుస్తకాలూ కూడా ఉన్నాయి.
తిరగేసి చూశాడు తేజస్వి.
అప్రయత్నంగా , ఈస్ట్రోజెన్ అనే డ్రగ్ గురించి రాసి ఉన్న పేజి దగ్గర ఆగిపోయాయి తేజస్వి చూపులు.
ఈస్ట్రోజన్, ప్రాజెస్టేరోన్ లను (EPFORTE) కొన్ని సంవత్సరాల క్రితం ప్రేగ్నేన్సి పరిక్షలలో గర్భధారణ గురించి నిర్ధారించి చెప్పడానికి గాను వుపయోగించేవారు. తరువాత తరువాత తెలిసింది. ఈ డ్రగ్ ఉపయోగించడం వల్ల అవలక్షణాలతో కూడిన పిల్లలు పుడతారని, అందుకని దీన్ని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మని, డెన్మార్క్ సౌదీఅరేబియా, వెనిజులా, బంగ్లాదేశ్ ఇటలి, ఆస్ట్రియా బెల్జియమ్ లు, బ్రిటన్, గ్రీస్, నార్వే, న్యూజిలాండ్ , సౌత్ ఆఫ్రికా, అమెరికా దేశాలన్నింటిలోనూ నిషేధించారు.
అంతేకాదు - చివరికి అతి చిన్న దేశమైన సింగపూర్ కూడా ఈ మందు వాళ్ళ కలిగే హానిని గ్రహించి దీని తయారీని , అమ్మకాన్ని నిషేదించింది.
కానీ ఇప్పుడు మళ్ళీ కొన్ని దేశాల్లో ఈ మందుని గర్భవతులకు అబార్షన్ కాకుండా నిరోధించడానికి వాడుతున్నారు. కానీ చిత్రంగా ఇండియాలో, ఇదే మందుని "అబార్షన్ చెయ్యడానికి ఉపయోగిస్తున్నారు. అబార్షన్ కావడానికి ఈమందు ఏ మాత్రం పని చెయ్యకపోయినా కూడా! దానికి తోడు, ఇంకా ఈ రోజుకి కూడా గర్భధారణకోసం ఈ మందుని యధేచ్చగా వాడుతున్నారు ఇండియాలో.
తమాషా ఏమిటంటే ఇన్ని దేశాల్లో నిషేదించిన ఈ ప్రమాదకరమైన డ్రగ్ ని మనదేశంలో ఒక్కొక్కసారీ డాక్టరు ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా మందుల షాపుల్లో కొనవచ్చు. ఈనాటికి కూడా! అని ఆగి అన్నాడు తేజస్వి.
"పరమహంసగారూ! మీకు డాక్టర్ సద్గుణ్ తెలుసా?"
డాక్టర్ సద్గుణ్ ఎరుగని వాళ్ళేవరుంటారు? అన్నాడు పరమహంస.
"అయన ఎనిమిదేళ్ళ క్రితం అందరిలాగే మాములుగా ప్రాక్టిస్ చేస్తూ వుండేవాడు. అప్పట్లో కొంతమంది లేడీ పేషెంట్లకు ఈ డ్రగ్ వాడారు అయన.
"ఆ తరువాత కొన్ని కేసులలో అవలక్షణాలతో కూడిన పిల్లలు, ఈ అమ్మాయి వాసంతి లాగా - పుట్టడం గమనించారు.
"పేషెంట్ల దగ్గర ఫీజు వసూలు చెయ్యడం, అప్పటికప్పుడు ఏదో ఒక మందు రాసెయ్యడం తప్ప, ఆ తరువాత ఏం జరుగుతోంది అని ఆలోచించే సమయం చాలా మందికి ఉండడం లేదు ఈ రోజుల్లో.
"కానీ డాక్టర్ సద్గుణ్ అందరిలాంటి వాడు కాడు గనక అతను కనిపెట్టాడు. EP FORTE డ్రగ్ కి ఉన్న దారుణమైన సైడ్ ఎఫెక్ట్ ని. దానితో చాలా పశ్చత్తాపపడ్డాడు. కమర్షియల్ ప్రాక్టీసు అంటే విరక్తి పుట్టి తన వైద్య విధానం మార్చేశాడు.
"డాక్టర్ సద్గుణ్ ఉత్తముడు గనుక జరిగింది ఏమిటో అలోచించి , అర్ధం చేసుకుని నిర్భయంగా ఆ విషయాలన్నీ బయట పెట్టగలుగుతున్నాడు. అతనిలా ఎంతమంది ధైర్యంగా అలా బయటపడి చెప్పగలరు. జరిగింది గమనించి చెప్పే వ్యవధి అవకాశం ఎంతమందికి ఉంటాయి? ఈ డ్రగ్ ని వాడిన తల్లులలో ఎంతమంది తమకి జరిగిపోయిన అన్యాయాన్ని గుర్తించగలరు!
"ఒకవేళ అవలక్షణాలతో ఉన్న బిడ్డ పుట్టినా, అది తమ కర్మ అని సరిపెట్టేసుకుంటారే గానీ, ఎంతమందికి అర్ధమవుతుంది, తాము వాడిన మందులు వికటించడం వల్లే ఇలాంటి ఘోరాలు జరగడానికి ఆస్కారం ఉందని!
సాలోచనగా పుస్తకాలు పరమహంస గారికి తిరిగి ఇచ్చేస్తూ అన్నాడు తేజస్వి.
"పరమహంసగారూ! మీకు తెలిసే ఉండొచ్చు. అన్ని తెలిసినా కూడా చాలా కాలం పాటు తాత్సారం చేసి చివరికి ఇండియా కూడా EP FORTE ని బాన్ చేసింది. కానీ, ఆ మందుని తయారుచేసే కంపెనీలు తక్షణం కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డరు తెచ్చుకున్నాయి. దానితో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఆ డ్రగ్ విపరీతంగా అమ్ముడుపోతూనే ఉంది ఇండియాలో!
