"బుద్దొచ్చిండా?" అది భార్య గొంతు.
ఎదురుగా భార్య.
అది తిట్టులా అనిపించలేదు గరుడాచలానికి. వెళ్ళి భార్య చేయి పట్టుకున్నాడు క్షమించమన్నట్టు.
"పదండి నాన్నా.....అటో రెడీగా ఉంది" అన్నాడు శ్రీచంద్ర.
అటో ఇంటివైపు మళ్ళింది.
గరుడాచలం పూర్తిగా మారిపోయాడు.
భార్య భుజం మీద తల పెట్టి పడుకున్నాడు. అ దృశ్యం అద్భుతంగా కనిపించింది శ్రీచంద్రకు.
"థాంక్యూ.......యమధర్మరాజు" అనుకున్నాడు శ్రీచంద్ర.
* * *
"ఏయ్.....ఎక్కడికెళ్తున్నావ్?" తనని విదిల్చి వెళ్తున్న యమధర్మరాజుని అడిగింది పీలూ.
"ఈ రోజు గరుడాచాలాన్ని తిట్టావు. రేపు నాకన్నా డబ్బు ఎక్కువ వున్నావాడు వస్తే వాడ్ని మారుస్తావు. కేవలం డబ్బు కోసం శారీరక సుఖం కోసం మనుష్యులను మారిస్తే దాన్ని ప్రేమ అనరు. వ్యాపారం అంటారు. అవసరం కోసం ఎప్పుడూ సంబంధాలు పెట్టుకోవద్దు. ఆర్ద్రత కోసం, ఓ మనిషి నాకూ వున్నాడన్న ఫీలింగ్ కోసం మరో మనిషి తోడు కోరుకోవాలి....." గబగబా చెప్పి వెనుదిరిగాడు యం.డి. రాజు అనబడే యమధర్మరాజు.
పీలూ అలానే నిశ్చేష్టురాలై చూస్తుండిపోయింది. ఓ నగ్నసత్యం తెలుసుకున్నానన్న షాక్ అది. ఓ పరాజయం ఫీలింగ్.
ఏది ఏమైనా ఆమె ఆలోచనలో పడింది. ఆమెలో మార్పు రావడానికి అట్టే సమయం పట్టదు.
* * *
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కూర్చుని కూరలు కోస్తోంది రామేశ్వరి.
సమీర అన్నీ సర్దుతోంది.
సత్తిపండు టోకేన్స్ ఇష్యూ చేస్తున్నాడు.
కాస్త రష్ పెరగడంతో మరో ఇద్దరు పనివాళ్ళను పెట్టుకున్నాడు శ్రీచంద్ర. టోకెన్ సిస్టమ్ పెట్టేసాడు.
మంచి సెంటర్ లో వుందేమో వ్యాపారం తొందర తొందరగా అభివృద్ధిలోకి వచ్చేస్తోంది.
అందుకే సమీర హుషారుగా అంది "చందూ! ఎల్లుండి ఆదివారం. మనమంతా కలిసి ఓషన్ పార్క్ వెళ్తున్నాం."
"ఎందుకు తల్లి! అవన్నీ ఎక్కి గంతులేయడానికా? ఎంట్రెన్స్ టికెట్టే బోలెడుంది తెలుసా? ఏం అక్కర్లేదు మనసులోనే లెక్క వేసుకుని అన్నాడు శ్రీచంద్ర.
"వార్నీ! బిజినెస్ ఇంత డెవలప్ అయింది. కాస్త పైనాన్షియల్ పొజిషన్ బెటరయింది. ఇంకా డబ్బుల దగ్గర పినాసిలాగా లెక్క వేస్తావేంటి! నేను జాబ్ చేసినప్పటి డబ్బులు కాస్తంత ఉన్నాయిలే. అవి కూడా తెస్తాను. అందరం కలిసి హాయిగా తిరిగొద్దాం....కదా సత్తిపండూ!" అంది సపోర్ట్ కోసం.
"అవునొదినా చాలా కరెక్టుగా చెప్పావ్. కనీసం ఆదివారమైనా ఎంజాయ్ చెయ్యకపోతే ఎలా? నా దగ్గర దాచుకున్న డబ్బులు యాభై వున్నాయి. అవి ఇస్తాలే పోనీ" అన్నాడు సత్తిపండు సమీరని సపోర్టు చేస్తూ.
"నా దగ్గర లొండు వందలున్నాయి దాచుకున్నవి అవి నేను తెస్తాలే" అంది రామేశ్వరి.
"హు! అయితే మొత్తానికి అందరూ కలిసి పోయారన్నమాట. నన్ను ఒంటరివాడ్ని చేసేసి. ఒకే......మరి తప్పుతుందా?" అన్నాడు శ్రీచంద్ర.
"హుర్రే....." హుషారుగా అరిచింది సమీర శ్రీచంద్ర వొప్పుకోవడంతో.
"నేను కూడా హుర్రే" అంటూ అరిచాడు సత్తిపండు.
చీ..చీ.... ఏళ్ళు వచ్చాయి గానీ అడ లక్షణాలు కొన్ని కూడా లేవు నీలో" సమీర అల్లరికి విసుక్కున్నాడు శ్రీచంద్ర.
* * *
ఆ రోజు ఆదివారం.
అనుకున్నట్టుగానే అందరూ ఓషన్ పార్క్ బయలుదేరారు కారులో. రామేశ్వరి టామోటా బాత్ తయారుచేసి తీసుకొచ్చింది. సమీర కొత్తిమీర దట్టించి దద్దోజనం తయారుచేసి తెచ్చింది. శ్రీచంద్ర కొన్ని చిప్స్ పాకెట్స్, బ్రెడ్ జామ్ కొన్నాడు. అందరూ కలిసి సరదాగా బయలుదేరారు. కారులో ఒకటే అల్లరి సమీర, సత్తిపండు.
హౌరెత్తేలా సాంగ్స్ పెట్టింది సమీర.
టీనేజిలో వుండే ఆనందమే అది. బరువూ బాధ్యతలు లేకుండా, ఏ సమస్యలూ తెలియకుండా హాయిగా, థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది ఎవరికైనా. ఏ వ్యక్తీ అయినా టీనేజి వయసుని మర్చిపోలేరు.
పదకొండు గంటలకల్లా ఓషన్ పార్క్ చేరుకున్నారు. తీరా టిక్కెట్లు తీసుకుని లోపలికి వెళ్తున్నప్పుడు తెలిసింది వాళ్ళకి అవుట్ సైడ్ ఫుడ్ లోపలికి ఎలవ్ చేయరని. చేతికి బ్యాండ్ వేసి, బ్యాగ్ లు చెక్ చేసి ఫుడ్ ప్యాకేట్స్ అన్నీ బయటే పెట్టమని చెప్పాడు సెక్యుర్టి.
ఇక తప్పదని తెచ్చినవన్ని బయటే వదిలేశారు.
"వాళ్ళ క్యాంటిన్ గిరాకి దెబ్బ తింటుందని కాబోలు" అని తిట్టుకున్నారు కాసేపు సరదాగా.
లోపలికి వెల్లడంతోనే మన వయసు మర్చిపోతాం అలాంటి ప్లేస్ కి వెళ్లగానే.
శ్రీచంద్ర కళ్ళు తిరుగుతాయని కొన్ని ఉర్కున్నాడు గానీ సత్తిపండు రామేశ్వరి, సమీర టోరాటోరా , సూపర్లుష్, జంపింగ్ కాప్స్ అన్నీ ఎక్కారు. కేకలు, కేరింతలతో మధ్యాహ్నం వరకు ఆడారు.
లంచ్ అవర్ అక్కడున్న క్యాంటిన్ లో మీల్స్ చేసారు.
వన్ అవర్ రెస్ట్ తీసుకుని మళ్ళీ మొదలుపెట్టారు.
ఈసారి వాటర్ గేమ్స్ అన్నీ. సమీర, శ్రీచంద్ర కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. సత్తిపండు రామేశ్వరి అంతా తిరిగి చూసి వచ్చారు.
నలుగురూ కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. పెళ్ళయ్యాక ఏయే ఉళ్లు హానిమూన్ కు వెళ్ళాలో, ఏ శారిస్ కొనుక్కోవాలో అన్నీ మాట్లాడుకున్నారు.
శ్రీచంద్ర బిజినెస్ ఇంకా ఎలా డెవలప్ చేయాలో అందర్నీ ఆలోచించమన్నాడు.
అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు.
మొత్తానికి గంటసేపు ఆడి అందరూ అలసిపోయారు. సమీరకి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. ఓ చీర కొనిస్తానని ప్రామిస్ చేసాడు శ్రీచంద్ర. అప్పుడు గానీ వదిలిపెట్టలేదు.
వెళ్ళిపోయే ముందు స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నారు శ్రీచంద్ర సమీర. సత్తిపండు కు రామేశ్వరికి స్విమ్మింగ్ రానందున ఊరుకున్నారు.
డిపాజిట్ కట్టి స్విమ్మింగ్ కాస్టుమ్స్ తెచ్చుకున్నారు సమీర, శ్రీచంద్ర.
* * *
