Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 63

    "మన జయంతి చదివేది ఇంగ్లీషు చదువులు కదక్కా! అందుకని అలా పిలుస్తుంది నిన్ను" అంది దాక్షాయణి పెద్దగా నవ్వుతూ.

    "ఏమోనమ్మా నన్ను మాత్రం అలా పిలవకు. నన్ను అమ్మా అని పిలువ్ చాలు. రేపు నీ పిల్లల చేత నిన్ను అలా పిలుపించుకో...." అంది కస్తూరి.

    "అబ్బా మళ్ళీ మొదలెట్టావా?" అంది జయంతి.

    దాక్షాయణి జయంతి మాటలకు నిశ్శబ్దంగా నవ్వుతోంది.

    "పిన్ని కాస్త కాఫీ పెట్టి యివ్వవా తలనొప్పిగా ఉంది...." అంది జయంతి.

    "ఇస్తాను....పొయ్యిమీద అన్నం, కూర ఉందికదా, అది దించి పెడతాను" అంది దాక్షాయణి.

                                                        *    *    *    

    "ఏంటి పార్వతి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? పాపం నిన్ను చిత్రహింసలు పెడుతున్నానుకదూ! తల్లి నుంచి పిల్లను వేరుచేసినందుకు పాపం తగులుతుందేమో నాకు" అన్నాడు సుందరం భోజనం చేస్తూ.

    "ఛ....అవేం మాటలండీ! కాకపోతే నాకు అక్కా వాళ్ళు, జయంతి బావగారు, మన ఇల్లు గుర్తొచ్చినప్పుడల్లా దిగులేస్తుంది. ఎంత హాయిగా కలిసిమెలిసి వుండేవాళ్ళం. అసలు పొద్దు తెలిసేదే కాదు. మన పిల్లలు ఇంత వాళ్ళు ఎలా అయ్యారో నాకు తెలియలేదు. నేనే స్నానం చేయించాలి, నేనే వాళ్ళకి భోజనం పెట్టాలి అన్ని నేనే చేయాలనే రూలు అక్కడలేదు....పాపం జయంతి, దాక్షాయణిఅక్క వాళ్ళ పిల్లలతోపాటే మన పిల్లల్ని చూసేది. ఇక్కడన్ని నేనే చేయాలి. ఎక్కడికైనా బయట కెళ్ళాలంటే పిల్లలు ఒక్కరే ఉన్నారు ఇంట్లో అనే దిగులు...." అంది శివపార్వతి దిగులుగా.

    "నిజమే పార్వతి! నేను చేసిన ఆ పొరపాటు నన్ను జీవితకాలమంతా వెంటాడుతూనే వుంటుందేమో! పిల్లలు కూడా దిగులుగా వుంటున్నారు. అక్కడ ఎంత చలాకీగా వుండేవాళ్ళో! ఏం చేద్దాం అంతా నా  ఖర్మ, నా వల్ల నువ్వు పిల్లలు బాధపడుతున్నారు." అన్నాడు ప్లేటులో చేయి కడిగేసుకుంటు.

    "అయ్యో అదేంటండిఅప్పుడే చేయి కదిగేసుకున్నారెంటి? పాపిష్టి దానిని భోజనం చేసేటప్పుడు అనవసరంగా మీ మనసు పాడు చేశాను అంది.

    "అదేం కాదులే పార్వతి-త్రుప్తిగానే భోంచేశాను, పిల్లలు నిద్ర పోయారా?" అన్నాడు.

    "అవును వాళ్ళు స్కూలు నుంచి వచ్చి హోంవర్కు చేసుకుని, భోజనం చేసి, కాసేపు ఆదుకుని ఎనిమిది గంటలకు నిద్రపోయారు" అంది శివపార్వతి.

    "పాపం మన ఊర్లో అయితే చక్కగా ఆరుబయట పిల్లలంతా కల్సి వెన్నెల్లో పది గంటలవరకు ఆడుకునేవారు. వీళ్ళ బాల్యాన్ని కూడా నేను నాశనం చేస్తున్నాను" అన్నాడు విచారంగా.

    "మీరు ప్రతిదాన్ని పెద్దది చేసి ఆలోచించకండి. వాళ్ళకేం హాయిగా వున్నారు ఇక్కడ, పక్కింటి వదినగారి పిల్లలు కూడా ఇదే వయసువాళ్ళు, ఇద్దరూ కలిసి చక్కగా ఆడుకుంటున్నారు" అంది శివపార్వతి.

    "అక్కడ మన ఊరి వాతావరణానికి, ఇక్కడి ఆ కలుషిత వాతావరణానికి తేడాలేదా శివపార్వతి" అన్నాడు దిగులుగా.

    అందుకని చేసేదేంలేదు కదా....పోనీ మన ఊరు వెళ్ళిపోదామంటే ఇక్కడ స్కూల్లో పిల్లలకు బోల్డంత డబ్బు చెల్లించి చేర్పించారాయే. ఇక మనం వెనక్కు వెళ్ళలెం..." గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదోయ్" అంటూ మన దేవదాసు పాట ఉండనే ఉందికదా" అంది పార్వతి.
    ఆమె మాటలకు సుందరం చాలాకాలం తరువాత తృప్తిగా నవ్వాడు.

    "పాపం మీ చంద్రముఖి ఏం చేస్తుందో" అంది అతన్ని ఆటపట్టిస్తూ.

    సుందరం ఆమె చెవి మెలిపెట్టి నెత్తిమీద మొట్టికాయ వేశాడు.

    "అబ్బా" అంది పార్వతి బాధ నటిస్తూ.

    "నీకు నేను బాగా చులకనై పోయాను. ఏం చేద్దాం చేసిన వెధవ పనికి జీవితాంతం ఇలా మాటలు పడాల్సిందే" అన్నాడు నవ్వుతూ.

    "మాటలేగా పడండి" అంది నవ్వుతూ.

    "అంటే చేతలు కూడా వుంటాయా ముందు ముందు" అన్నాడు భయం నటిస్తూ.

    "ఈసారి ఏమైనా వెధవ్వేషా" అంటూ ఆమె ఏదో చెప్పబోతుంటే ఆమె నోరు టక్కున మూశాడు సుందరం.

    "వద్దు పార్వతి....పొరపాటున కూడా ఇక అలాంటి మాటలనొద్దు" అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ.

    "ఆగండాగండి సార్! ఇది మన పల్లెటూరు కాదు, ఇక్కడ లైట్లు అర్పిన తరువాతే ఏదైనా" అంది నవ్వుతూ లైటార్పేసిన శివపార్వతి.

                                                    34
    బీరువాకున్న నిలువుటద్దంలో ఆమె తన సింగారాన్నంతటిని ఒకసారి తృప్తిగా చూసుకుంది.

    రింగులజుత్తు, చక్రాల్లాంటి నల్లటి కాటుకకళ్ళు, కోటేరులాంటి ముక్కు, ఎర్రని పలుచని పెదాలు, నవ్వితే సోట్టపడే బుగ్గలు, విల్లులావంగిన కనుబొమ్మల మధ్య ఎర్రని తిలకం బొట్టు, పచ్చని పసిమిచాయతో కలిసిపోయి మెడలో తన అస్తిత్వాన్ని అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తూ వ్యక్తపరిచే సన్నని గొలుసు, విశాలమైన చాతి, సన్నని నడుము, దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తు, వంగినప్పుడు లేతగా, చుడసొంపుగా పడే సన్నని మడత, నీలిరంగు జాకెట్టు పై అదేరంగు బుట్టచేతుల జాకెట్టు, గుండ్రని పచ్చని భుజాలపై చూడముచ్చటగా అతికినట్లు అమరింది. కుచ్చిళ్ళను మరోసారి సవరించుకుని ముఖానికి లైట్ గా పౌడర్ అడ్డుకుని ర్యాక్ లో వున్న పుస్తకాలు తీసుకుని బయలుదేరింది.

    జ..యం...తి!!
    "పిన్ని నేను వెళ్ళొస్తా" అంది.

    దాక్షాయణి గదిలోనుంచి బైట కొచ్చి జయంతిని కన్నార్పకుండా చూసింది.

    "ఏంటి పిన్ని అలా చూస్తున్నావ్?" అంది నవ్వుతూ.

    "నీ అందమంతా ఎక్కడో లేదు జయంతి! నవ్వినప్పుడు బుగ్గలపై పడే ఆ సొట్టల్లోనే వుంది" అంది.

    "అదొక్కటే ప్రత్యేకతనుకోవటం కూడా పొరపాటే! నువ్వు నిలువెల్లా నవసంతాలను నింపుకున్న సౌందర్యరాశివి" అంది దాక్షాయణి కవిత్వ ధోరణిలో.

    "అయ్యో ఏంటి పెద్దపిన్ని నీలో ఇంత బావుకత్వముందా?" అంది ఆశ్చర్యంగా నవ్వుతూ.

    "అంతా నీ పుణ్యమే! మీ లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చిస్తున్నావు కదా కాలక్షేపమని , వాటిని చదవటం వల్ల ఏదో కొద్దిపాటి ఇంగిత జ్ఞానం, పాండిత్యం వస్తున్నాయి" అంది నవ్వుతూ.

    "గుడ్! అయితే నాకు మంచి అభిమాని, శ్రోత దొరికిందన్నమాట" అంది జయంతి నవ్వుతూ.

    "అమ్మేది పిన్ని?" అంది జయంతి.

    "పక్కింటి చెంచమ్మ అత్తా వాళ్ళింట్లో మామిడికాయ పచ్చడి పట్టటానికి వెళ్ళింది" అంది దాక్షాయణి.

    "ఇంత పొద్దుటేనా?" అంది ఆశ్చర్యంగా.

    "అంతే మరి దాని విషయం చర్చలు జరపోద్దు" అంది దాక్షాయణి నవ్వుతూ.

    "సరే! వస్తా పిన్ని సాయంత్రం పెందలాడే వస్తాలే.....ఈలోపు నేను నిన్న తెచ్చి ఇచ్చిన ఆ కధల పుస్తకం పూర్తీ చేయి" అంది జయంతి సీరియస్ గా.

    "అలాగే! జాగ్రత్తగా వెళ్ళిరా!" అంది దాక్షాయణి.
                                          *    *    *    *
    అది విజయవాడ పట్టణంలో ఒక ప్రముఖమైన కాలేజి......

    ఆ కళాశాల ప్రాంగణంలో అడుగుపెట్టగానే "హాయ్ బ్యూటి!"ఇప్పుడేనా రావటం" అంది జయంతి స్నేహితురాలు సుహాసిని.

    "అవునే బస్సు ఆలస్యమైంది రోజు" అంది జయంతి నవ్వుతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS