కాని సత్యమేదీలేదు. సమస్య పులుముకుపోయింది. చరిత్రకారులు గాభరాపడిపోయి నిలబడిపోతారు. చవులు రాలుతూన్న కొండ ఇంకా చవుడు రాలుతుంది. ఆ కొండకి లోపలా, వెలుపలా, సత్యం కారులాడుతుంది. నీళ్ళకి లోపలా వెలుపలా చంద్రుడులోంచి బంగీకట్టి పంపించిన నీళ్ళు, కెరటాల ప్రత్యేకపుటమ్మకం, పంట్లాం వెల పది రూపాయల బేడ. టోపీ తాకట్టుపెడితే చేతిలో పావలా పడుతుంది. నెక్ టై ఎవడూ తాకట్టుపట్టడు. ఏ బజారులోనూ చెల్లదు. అబ్బేదాన్ని అమ్మజూబితే లాభంలేదు.
అంచేత మరో సిగరెట్టు కాల్చుకోవడమే మంచిది. మరోమాటు కాలెండరు వేపు చూసి ఇవాళ తారీఖు అచ్చులో అసందిగ్ధంగా ఇది జనవరి మాసమే అని తెలుసుకో. ఆ చూస్తున్నది నువ్వే అనుకో. ఆ మూల కూర్చుని తన మౌనాన్ని ఆరాధించుతున్న ఆవలించే గ్రామఫోన్ ని ఓమాటు ముట్టుకో ఇంతట్లోకే తెల్లారిపోతుంది చెట్టు పడమటగా ఒరిగేలోగా.
సంవత్సరం ఈ సంవత్సరమే. క్షణం ఈ క్షణమే అప్పుడే చెట్టూ కొండా కలిసి మాట్లాడగలిగిన తతిమ్మావాళ్లతోబాటు అంటున్నాయి; బహుశా, కాని కేవలం బహుశా, ఇక్కడే కాబోలు. ఈ ధరిత్రిలో సరిగ్గా ఈ స్థలంలో రోడ్డుపక్క నిలబడి క్రమంగా భూమిలోకి హరించుకుపోతున్నాడు కుర్రాడు. నగరం తన గర్భంలోకి తీసుకుంటోంది. కాబట్టి అధ్యక్షపుంగవా నువ్వు లేచి ఆవులించి నీలో నువ్వు ఉపన్యసించుకో. సోదర సోదరీమణులారా! అదను దగ్గరపడింది. ఈ ప్రపంచం పేరిట మీ ప్రతిపాదనను అంగీకరిస్తున్నాను. నాకు కలుగజేసిన గౌరవాన్ని వినయ విధేయతలతో స్వీకరించి న్యూయార్కు నుంచి టోకియోదాకా శ్మశానాలలో పువ్వులు మొలిపిస్తూన్న గొప్ప గొప్ప వాళ్ళందరి పక్కనా నిలబడుతున్నాను. వినమ్రభావంతో ఈ గౌరవ పదవిని మోస్తూ మీకందరికి మ్రొక్కి నా యొనర్పింపబోవు నుపన్యాసమునకు సారాంశం బెద్దియన మహాశయులారా నా బలాన్ని ధారపోసి, నా రక్తంలో మాంసంలో చర్మంలో ఆస్థులలో ఉన్న శక్తి యావత్తూ వినియోగించి సూర్యకాంతపు పుష్పాలకు ఆహారమైపోతాను. ఎంచేతనంటే వాటి బలం అద్వితీయం. అవి అచ్చంగా సూర్యడిలాగే ఉంటాయి. మిగిలినవన్నీ సూర్యుడికి హీనమైన అనుకరణలు. మిణుగురులూ, మిడిగుడ్లూ, మినుములూ, మిడతలూ, చిన్నవీ, పెద్దవీ ఈ దృశ్యాన్ని చెడగొడుతూ నిరాశ హెచ్చిస్తూ అందాన్ని పెంపొందిస్తాయిలెండి. వాటికి జాగా ఇచ్చేసి నేను నింపాదిగా తప్పుకుంటాను. మహాశయులారా నేను ఆడినమాట తప్పను. పువ్వుల కోసమని నేను దండంపెట్టి సెలవు పుచ్చుకుంటున్నాను. పోతున్నాను. పోతున్నాను పోయాను.
గడియారం పలుకుతూన్న భాషకి ఇంకా స్పష్టత ఏర్పడలేదు-సుమారుగా ఉంది. రాత్రి జనవరి మాసానిది. ఇక్కడే ఆ కుర్రాడు మెల్లిగా తన కోటు విప్పి మెల్లిగా షాపువాడి చేతిలోపెట్టి మెల్లిగా షాపువాడితో అన్నాడు. చూడండీ ఇదో ఖరీదైన కొత్తకోటు కాకపోవచ్చు. చాలాకాలం నుంచీ నేను తొడుక్కుంటున్నాను. కాని ఇంకో పేదకుర్రాడు దీన్ని తొడుక్కొని ఇంకో చలికాలం గడపవచ్చు. నాకు కావలసిందంతే. ఇంకో పేద కుర్రాడు ఇంకో చలికాలం వెచ్చగా ఉండాలి. అది మన సంప్రదాయం. దాన్ని మనం కాపాడాలి. అప్పుడే మనకాలం అయిపోయిందంటున్నారు. అప్పుడే రెండు శతాబ్దాలు అనుకున్నకంటె ముందుగానే వచ్చి తొందర చేస్తున్నట్టు పుకార్లు బయలుదేరాయి. ఇంకా పుట్టని పాపలు చాలామంది ఈ లోకంలోకి వచ్చేస్తామని కళ్ళు వాచిపోయేటట్టు ఏడుస్తున్నారు. తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ఇదివరకు ఆడిన నాటకాన్నే ఇంకోమారు ఆడాలని అనగా ఒక బిడ్డ, మగ, ఇంకో బిడ్డని, ఆడదాన్ని, తీవ్రంగా వాంఛించడం, మళ్ళీ వానలో అసంఖ్యాకంగా అలాంటి వాళ్ళే ఆ వాంఛనే అంతకన్నా తీవ్రంగా, అంచేత చూడండీ ఈ కోటు కప్పుకుని ఇంకో కుర్రాడు ఇంకో చలికాలం బతికి తీరాలి. లేకపోతే అంతా సమాప్తమైపోతోంది. నేను వెళ్ళిపోయానంటే శాశ్వతంగా వెళ్ళిపోతాను. నాతోబాటు ఈ రెండో అతనూ పోతాడు. అప్పుడు ఎలుకలు హేళనగా నవ్వుతాయి. మానవుడు తన చచ్చిపోయిన నెత్తిని గోక్కుంటూ అయ్యో మనం ఎలుకలకి లోకువయిపోయాంగదా అనుకుంటాడు. ఎలుకలు త్వరగా పిల్లల్ని కంటాయి. ఆలస్యంగా చచ్చిపోతాయి. అందుకే మనల్ని చూసి అవి నవ్వుకుంటాయి.
కాబట్టి నేను నేను సెలవుతీసుకుంటున్నాను. ఇదిగో ఇక్కడే. ఈ ఇంట్లోనే. కాని ఇప్పుడిక్కడ ఒక పెద్ద చెట్టుంది. సెలవు, పెద్ద చెట్టుంది కాబట్టి సెలవు. అన్నిచోట్లా అంతమందీ ఏదో వెదుక్కుంటూ ఎన్నడూ కనుక్కోలేకపోతూ అందరూ అంతటా ఎవరువారు నాకు సెలవిప్పించండి. ఇదివరకు ఇక్కడే. మళ్ళీ ఇప్పుడూ ఇక్కడే. ఇంతట్లో పగలు, ఇంతట్లో రాత్రి. ఇలా రావడం అలా పోవడం, ఆహా! దయామయా, నువ్వీ ఇంట్లో లేనేలేవు సెలవు సెలవు. ఇంతట్లోనే పగలు ముగిసిపోతోంది. శూన్యంలోకి జాలిగా మృత్యువు వస్తోంది కాబట్టి సెలవు పుచ్చుకోవాలి. అహో! భగవంతుడా, నిన్ను వెతుక్కుంటూన్న మాకు చీకటిలోని శూన్యం దొరుకుతుంది. అందుచేత సెలవు. అదిగో, చెట్టు ఆ పెద్దచెట్టు-భూగర్భంలో లోతులోతులికి తన వేళ్ళని పంపిస్తోంది. ఎప్పుడో ఒకప్పుడు ఈ భూగోళాన్ని బద్దలు కొట్టడానికి జేస్తున్న సన్నాహం కాలంలో, భగవంతుడిలో కలిపి వెయ్యడానికి సన్నాహం ఓ ఈశ్వరా, నిన్ను వెదుక్కుంటూ మేము ఏడవకుండా నశించిపోతాం ఏ నొప్పీ లేకుండా. కాని ఈ వాంఛలకి అంతులేదు. ఇంకా ఇంకా అడుగుతాం కాబట్టి సెలవు. ఇక్కడే ఒకక్షణం కిందటనే ఆ కుర్రాడి మొగం దేవుడివేపు చూసి వెర్రిగా నవ్వడం మేము చూశాం. ఇప్పుడున్నదల్లా ఈ పెద్ద చెట్టుమాత్రం ఎవరికోసం ఏడవకుండా ఏ భావం కోసం విలపించకుండా ఏ దేవుణ్నీ వెదుక్కోకుండా తానే దైవాంశ కాబట్టి సెలవు. ఇప్పటికీ ఎప్పటికీ సెలవు.
(ఒక కుర్రాడు డబ్బులేక కోటు తాకట్టుపెట్టి కోటులేక చలిలో చచ్చిపోయాడనే విషయం ఈ కథలో ప్రధానాంశం - అనువాదకుడు)
* * * *
