"నువ్వు - నువ్వు.... తి ... తిన్నావా?" అన్నాడు భర్త.
"అయ్యో రాత!" అనుకొంది భార్య.
27
వరూధిని కొడుకు రవికి ఆరేళ్ళు నిండాయి. వాడి పుట్టినరోజు పండగ ఘనంగా జరిపించింది. రవి తన పుట్టిన రోజు వచ్చిన బొమ్మలు, ప్యాకెట్సు విప్పి తండ్రికి చూపిస్తున్నాడు. కారూ, విమానం, డ్యాన్సింగ్ గరల్- కీ ఇచ్చి నేలమీద వదులుతూ వరూధిని ఆనందిస్తూంది. వెంకటపతి తన కొడుకు అదృష్టాన్ని తలుచుకుంటూ వాడికేసి, బొమ్మలకేసి మార్చి మార్చి చూస్తున్నాడు.
రవికి జమీందారు బిడ్డలా జరిగిపోతుంది. వాడికేం తక్కువ? వాడు పెరిగి పెద్దయేసరికి పది లక్షలకు వారసుడవుతాడు. మరి వాడెంత గొప్పవాడౌతాడో? తనే ఇలా అయిపోయాడు? తనకు మాత్రం ఏం తక్కువయిందీ? ఈ తాగుడొకటి అలవాటయి మధ్య మధ్య ఇబ్బంది పడుతున్నాడు గాని తనకు మాత్రం కొరతేముంది?
వెంకటపతి కొడుకుని తనతో పోల్చుకొని, తనకంటే రవి ఎన్ని అంతస్తులు పైన ఉంటాడో లెక్కలు కట్టుకోసాగాడు.
ఇంట్లోకి వస్తున్న రామనాథబాబును అంత దూరంలో చూడగానే వరూధిని "ఒరే బాబూ! బాబాయి వచ్చాడ్రా! బాబాయికి నీ ప్రజెంటేషన్లు చూపించు మరి!" అన్నది.
"ఆ డ్రస్సు వాడికి తొడిగి చూశావా?" కూర్చుంటూ, రవివంక ఆప్యాయంగా చూస్తూ అడిగాడు రామనాథబాబు.
"సరిపోయింది. ఆ డ్రస్సులో మీరు వాడ్ని చూళ్ళేదుగా! ఎలా వున్నాడనుకొన్నారు? అచ్చం ఎలా వున్నాడో తెలుసా?" రామనాథబాబు కళ్ళలోకి చూస్తూ అన్నది.
"ఎలా ఉన్నాడేమిటి?" అన్నాడు రామనాథబాబు.
"దొరబిడ్డలా వున్నాడు."
"దొరసాని బిడ్డలా లేడూ?" రామనాథబాబు నవ్వుతూ అన్నాడు.
వరూధిని నవ్వాపుకోలేక పోయింది. చెంపలు ఎరుపెక్కాయి. వెంకటపతి కి కూడా నవ్వొచ్చినట్లయింది.
"అంతే! అంతే!" అన్నాడు రవిని దగ్గరకు తీసుకొని తల నిమిరాడు వెంకటపతి.
"బాబు సీటు సంగతేం చేశారు?"
"మంత్రిగారి ప్రైవేటు సెక్రటరీతో రాత్రి ట్రంక్ లో మాట్లాడాను. మంత్రిగారు పబ్లిక్ స్కూలు ప్రిన్సిపాల్ తో చెప్పారట. తప్పకుండా సీటు ఇస్తానన్నాడట."
వరూధిని హృదయంలో జ్యోతులు వెలిగాయి. కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి. ఆ వెలుగులో వెంకటపతి కళ్ళు చిట్లించాడు.
"బాబు చదువుకు మంత్రిగారెందుకంటావ్?" ముఖం అంతా పెద్ద ప్రశ్నార్ధకంగా వేసి అడిగాడు వెంకటపతి.
"మీది మరీ అక్కుపక్షిగోడు! హైదరాబాద్ జాగీర్ దార్ స్కూల్లో బాబును చేర్పించబోతున్నాంగా!" అన్నది వరూధిని.
"జాగీర్దార్ రాణాలో చదువు చెప్తారా?" అన్నాడు అమాయకంగా వెంకటపతి.
"ఆఁ హాఁ! గొడ్లకాడ పేడ ఎత్తేయిస్తారు!" ఠపీమని ముఖంమీద గుద్దినట్లు అంది వరూధిని.
వెంకటపతి చిన్నబుచ్చుకున్నాడు. అతనిమీద రామనాథబాబుకే జాలివేసింది.
"అదేమిటి? తెలియకపోతే చెప్పాలి. ఏమిటా మాటలు?" వరూథిన్ని కసిరినట్టు అన్నాడు రామనాథబాబు.
దీనికంటే రామనాథబాబే ఎంతో నయం! ఇది తనే విష్ణుచక్రం తిప్పుతున్నట్లు మాట్లాడుతుంది. ఆయన లేకపోతే అసలు దీనివల్ల ఏమవుతుంది?
పెళ్ళాంమీద కోపం అలా ఆలోచించుకొని తీర్చుకున్నాడు వెంకటపతి.
"చెబితే అర్ధం చేసుకొనే మనుషులకయితే చెప్పొచ్చు!" తన వాదాన్ని బలపరచుకొంటూ మొండిగా అన్నది వరూధిని.
"చెప్పే పద్దతుల్లో చెప్తే అందరికీ అర్ధం అవుతుంది." కొంచెం కరుగ్గా వుంది రామనాథబాబు గొంతు.
వాళ్ళిద్దరి సంభాషణ తనకేం పట్టనట్టు కూర్చున్నాడు వెంకటపతి. కొడుకు చేతిలోవున్న 'డ్రంబాయ్' బొమ్మను తీసుకుని అటూ ఇటూ తిప్పాడు. 'డ్రంబాయ్' దడదడా మ్రోగించాడు. వెంకటపతి నోరు తెరిచి చూడసాగాడు. రవి తండ్రి చేతుల్లోంచి బొమ్మ తీసుకొని 'కీ' ఇచ్చి మళ్ళీ తండ్రి చేతుల్లో పెట్టాడు.
"ఆ చెప్పేదేదో ఆయనకే చెప్పకూడదూ? మధ్య నాకెందుకీ ఉపన్యాసం?" రామనాథబాబుకేసి చురుగ్గా చూస్తూ అన్నది వరూధిని.
"పట్టుకుంటే వదలవ్!"
"ఇప్పుడెవర్ని పట్టుకొన్నానంటారూ?" సాగతీసింది.
రామనాథబాబుకు నోటమాట రాలేదు. వరూధినికేసి నొసలు చిట్లించి చూశాడు.
"ఒహళ్ళను తిట్టుకోవాల్సిన అవసరం నాకేమిటి?" మళ్ళీ రెట్టించి అన్నది వరూధిని.
"నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు."
"పోనియ్! పోట్లాడే ఓపికన్నా వుందా?"
ఈసారి రామనాథబాబుకు నవ్వొచ్చింది.
వరూధిని మాటకారి. ఆమెను మాటల్లో జయించటం తనచేతకాదు. తన ఓటమిని అంగీకరించాడు. చిరునవ్వుతోనే తెలియజేశాడు. వరూధిని ప్రసన్న వదనంతో లేచి లోపలకు వెళ్ళింది. రవి బొమ్మలన్నీ ఎత్తుకొని వరండాలోకి వెళ్ళాడు. అక్కడ చేరిన నౌకర్ల పిల్లలకు అవి ఎలా తిరిగుతాయో, మోగుతాయో ఒక్కొక్కటే చూపించసాగాడు.
"నీవేమిటనేది? జాగీరు బడేమిటి?" వెంకటపతి రామనాథబాబును అడిగాడు.
"జాగీర్దారు స్కూలంటారు. అక్కడంతా బాగా ఉన్నవాళ్ళ పిల్లలు చదువుకొంటారు."
"అదెక్కడా మన వూళ్ళో లేదే? నేనెప్పుడూ వినలేదు"
రామనాథబాబు పెదవుల మీద చిరునవ్వు తొణికింది.
"స్కూలు ఇక్కడలేదు, హైదరబాదులో వుంది."
"అట్టా చెప్పండి. చాలా ఖర్చవుతుందనుకొంటా. ఎంతవుతుందేమిటి?" అడిగాడు వెంకటపతి, మెదడులోని చీకటి మబ్బులు తొలగిపోయినట్టయి.
"రెండొందలు పైగా అవుతుంది!" రామనాథబాబు చెప్పాడు.
వెంకటపతి ఆలోచించి అన్నాడు - "ఏడాదికి రెండొందలు అయితే ఫర్వాలేదనుకొంటాను. జమీందార్ల బడికదా! ఆమాత్రం కాకుండా వుంటుందా మరి!" "ఏడాదిక్కాదు. నెలకు రెండొందలు!" వెంకటపతిమీద రామనాథబాబుకు జాలీ, కోపం రెండూ కలిగాయి.
"నెలకే రెండొందలా?" వెంకటపతికి గవదలు నొక్కుకుపోయాయి. కాఫీ ట్రే పట్టుకొని వచ్చింది వరూధిని. ఆమెకేసి మూగపశువులా చూశాడు వెంకటపతి.
రామనాథబాబు కాఫీతాగి సిగరెట్ వెలిగించాడు. యథాలాపంగా వెంకటపతి త్రీఫైవ్ సిగరెట్ టిన్నులోనుంచి ఒకటి తీసి ఇచ్చాడు.
"ఇది నాకేం ఆనుద్దీ?" అంటూనే వెంకటపతి సిగరెట్ అందుకున్నాడు.
"ఇహ అదే తక్కువ మన బతుక్కి? నేర్పండి?" భర్తకేసి నిరసనగా చూస్తూ, రామనాథబాబును కవ్విస్తూ అన్నది వరూధిని.
వెంకటపతి సిగరెట్ దమ్ము గట్టిగా లాగి పొగ వదిలాడు.
"అయితే..." అంటూ భార్యకేసి చూసి "ఏమీలేదులే" అన్నాడు వెంకటపతి.
రామనాథబాబు లేచి నిలబడ్డాడు.
"ఇవ్వాళ ఐదో తారీఖు - గుర్తుందా?" రామనాథబాబు తలెగరేశాడు.
"బాబు స్కూలు ఫీజు - బట్టలూ ... ప్రయాణం ఖర్చులు.... ఈ నెల అదనంగా....." వరూధిని మాట పూర్తికాకుండానే "అంటే నీ ఉద్దేశ్యం ఆ మాత్రం బుర్ర నాకు లేదనేనా?" అన్నాడు రామనాథబాబు.
"అట్లా అడుగు! దాన్ని అట్లాగే అడుగు! ప్రతీదీ దానికే తెలిసినట్టూ ఎవరికీ తెలియనట్టూ అందుకొంటుంది" అనుకోని వెంకటపతి మనసులోనే రామనాథబాబును అభినందించుకొన్నాడు.

