Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 63


                                              నా పెళ్ళి ప్రస్తావన


    ఇంతలో  ఆవిడ  వచ్చారు.
    నమస్కారం  చేసి, "బాగున్నారా?" అని అడిగాను.
    "ఆఁ బాగున్నాను. ఎప్పుడొచ్చావు?" అని అడిగారు.
    "ఉదయమే తొమ్మిది గంటలకి వచ్చానండీ" అన్నాను.
    "అలాగా? అంతా  బాగున్నారా?" అని అడిగారు.
    నేను ఆశ్చర్యపోయాను. ఈవిడేనా....ఇలా  మాట్లాడుతున్నది! ఇంకా ఆశ్చర్యం నుండి  తేరుకోలేదు  ఈలోగా....
    "సరోజా" అన్న శ్రీశ్రీగారి పిలుపుతో  ఈ లోకంలో పడి, "ఏమిటండీ" అన్నాను.
    "టైమయ్యింది  ఇక ఇంటికి వెళతావా?" అన్నారు.
    "అవునండి. నేనే చెప్పాలనుకున్నాను. నేనిక  వెళతానండి"  అంటూ ఆవిడతో కూడా  చెప్పి వచ్చేశాను.


                           *    *    * 


    ఇంటికి  చేరుకొనేసరికి....అందరూ  కూర్చొని  మాట్లాడుకుంటున్నారు.
    "ఏమయ్యింది?" అని అడిగాను.
    "ఏమీ కాలేదు. నీ గురించే  మాట్లాడుకుంటున్నాం. శ్రీశ్రీగారికి  ఎలా వుంది?" అని అడిగారు నాన్నగారు.
    "బాగుంది. రేపు డిశ్చార్జి చేస్తున్నారు" అని చెప్పాను.
    "మంచి మాట చెప్పావు. ఈరోజు  నువ్వు మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళక్కర్లేదుగా" అని మా నాన్నగారు అడిగారు.
    "సాయంకాలం  నాలుగు గంటలకి  రమ్మన్నారు" అన్నాను.
    "మళ్ళీ సాయంకాలం  ఎందుకమ్మా! ఈ రోజు  సాయంకాలం  మనింటికి బంధువులొస్తున్నారు" అన్నారు.
    "బంధువులొస్తే  నాకేం?" అన్నాను.
    "వచ్చేది పెళ్ళివారమ్మా! నిన్ను  చూడడానికే  వస్తున్నారు" అని చెప్పారు.
    పెళ్ళివారన్నమాట  వినేసరికి  నా గుండె  చల్లగా  మారిపోయింది. ఆ పెళ్ళి తప్పించుకోడానికి  నేను చేసిన విచిత్రమైన ప్రయత్నాలన్నీ  విఫలమైపోయాయి.
     శ్రీశ్రీగారి చెవిని  ఈ మాట వెయ్యాలి. హాస్పిటల్ నుండి వచ్చి, బాగా రెస్ట్ తీసుకొని, తన పనిపాట్లు మామూలుగా  చేసుకునే వరకూ  శ్రీశ్రీగారికి  ఈ మాట  చెప్పకూడదని  ఇంట్లో  అందరికీ  చెప్పేశాను.
    నా మనసులో  అలజడి ప్రారంభమయ్యింది.  
    శ్రీశ్రీగారిని  చూడకుండా, వారితో  మాట్లాడకుండా వుండగలనా? పెళ్ళయిపోతే అత్తవారింటికి  వెళ్ళిపోవాలి కదా?
    అంటే....మద్రాస్ జీవితాన్నీ, సినిమా ఫీల్డునీ, శ్రీశ్రీగారిని  వదులుకోవాలన్నమాట. అంతవరకూ  ఏమీ అనుకోని నేను శ్రీశ్రీగారి  కోసం  ఎందుకింత  దిగులుపడుతున్నాను? దీనికి అర్ధం ఏమిటి? అని ఆలోచించి గతుక్కుమన్నాను.
    ఈరోజు  శ్రీశ్రీగారి దగ్గరకి  వెళ్ళడానికి  వీల్లేదంటేనే  గుండెపగిలిపోతుందా  అని భయపడ్డ నేను, రేపు శ్రీశ్రీగారు లేకుండా  బ్రతకగలనా? ప్రేమ అంటే ఇలాగే వుంటుందా? అయ్యయ్యో! కొంపదీసి నేను శ్రీశ్రీగారిని  ప్రేమించలేదు  కదా? మరి ఈ బాధకి, ఈ ఆలోచనలకి  అర్ధం ఏమిటి?
    'ఏమైనా....మా వాళ్ళు పెళ్ళి చెయ్యక తప్పరు. నేనీ సినిమా ప్రపంచానికి  శ్రీశ్రీగారికి కూడా  మంగళ హారతి పాడక తప్పదు' అనుకున్నాను.    పోనీలే....ఇదీ మంచికే! ఆవిడ చేత  చివాట్లు  తింటూ, అవమానాలుపడుతూ ఎంతకాలం పనిచేస్తాం?__అనుకుంటూంటే, "ఏమిటాలోచిస్తున్నావే? లే. అన్నం తిని పడుకుందువుగాని" అని అన్న మా అమ్మ మాటతో "ఆఁ" అన్నాను.
    నా పరధ్యానం చూసి, "మనకెందుకు  వచ్చిన బాధలు సరోజా! ఆవిడ కూడా  మన ప్రాణాలు తీస్తోంది. మంచి సంబంధం  వచ్చింది. పెళ్ళి చేసేసుకోవే" అంది మా అమ్మ.
    "సరేనమ్మా. మీ ఇష్టం" అన్నాను.
    ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా  అలజడిని  ఆపలేకపోయాను. శ్రీశ్రీగారు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిపోయారు. మూడు రోజులయ్యింది. నేను వారిని  చూడలేదు. రోజూ  కారు వస్తోంది, వెళుతోంది.
    ఓ రోజు  తప్పనిసరై, ఇక వారిని  చూడకుండా  వుండలేనన్న దృఢనిశ్చయంతో  శ్రీశ్రీగారి ఇంటికి వెళ్ళాను.
    మధ్యహాలులో, వాలు కుర్చీలో  కూర్చున్నారు.  
    "నమస్కారమండీ" అన్నాను.
    "జ్ఞాపకం వచ్చానా? ఏం అలాగున్నావు? ఒంట్లో  బాగోలేదా?" అని అడిగారు.
    'అబ్బే! అదేం లేదండీ. మీ ఒంట్లో  ఎలా వుంది? ఇంట్లో  ఎవరూ కనిపించరేం" అని అడిగాను.
    "అందరూ పెరట్లో  వున్నారు. నువ్వు కూర్చో" అన్నారు.
    "మీ ఇంటి పరిస్థితులు సర్దుకున్నాయా?" అని అడిగాను.
    "ఇది రావణాసురుడి  కాష్ఠం. ఈ సంగతి మరచిపో. అయినా నన్ను చూడకుండా మూడు రోజులై ఎలా వుండగలిగావు?" అని అడిగారు. నవ్వేశాను.
    నా బాధ ఆయనకేం తెలుసు! పెళ్ళన్న  మాట  విన్నది మొదలు శ్రీశ్రీగారి మాటల్ని, వారిని  స్టడీచేయడం  నాకు  తెలియకుండానే  ప్రారంభించాను. వారికోసం  నేను బాధపడుతున్నట్టే, నాకోసం  వారు కూడా బాధపడతారని  నాకు తెలుసు. కానీ ఇంకా గట్టిగా  తెలుసుకోవాలన్న  ప్రయత్నం!
    "ఈ మూడు రోజులు  మీరేం చేశారు?" అని అడిగాను.
    "ఏం చేస్తాను? తినడం, పడుకోవడం. ఎంతకని  నిద్రపోను? నీకు ఎన్నిసార్లు  కబురు చేసినా కదిలి రాందే! ఏం చేస్తాను? కంపెనీవాళ్ళెవరయినా  వచ్చారా?" అన్నారు.
    "వస్తే  ఇక్కడికే  పంపిస్తానని  చెప్పానుగా. మనసేమీ  బాగులేదు. మంచి మాటలేవయినా  చెబుదురూ" అన్నాను.
    "ఏమిటీ? నీకు మనస్సు  బాగులేదా? ఆశ్చర్యంగా వుందే?" అన్నారు.
    "ఆశ్చర్యానికేం  వుంది? కానీ....ఏవండీ  నికరమైన  మీ పుట్టిన తేదీ నాకుకావాలి" అని అడిగాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS