Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 62


    నాకు అయిదో ఏట  తిరుపతిలో  ఉపనయనం, విశాఖపట్నంలో  అక్షరాభ్యాసం  జరిగాయి. నా ఉపనయనం 1915లో  జరిగింది. ఆ సంవత్సరం నాకు ముఖ్యమైన సంవత్సరం. అప్పటివరకూ  చుట్టుపక్కల  ఉండే ఊర్లే కానీ  దూర ప్రయాణం చేసి ఎరగను.
    ఒడుగుకి  తిరుపతి  వెళ్ళడమంటే  అదో పెద్ద ప్రయాణం అన్నమాట. గూడూరుదాకా  ఒక బండి, అక్కడి నుండి తిరుపతికి  మరో బండి. ఏడుకొండలెక్కి  ఎగువ తిరుపతికి  మళ్ళీ  డోలీలమీద  ప్రయాణం. నాకు కూడా  తిరుపతిలో  పూర్తిగా గుండు గీయించేశారు" అంటూ, "ఏది ఆ సిగరెట్ ఇలా  అందుకో" అన్నారు. ఇచ్చాను.
    "చెప్పండి" అన్నాను.
    "చెప్తాను  కానీ కాఫీ  తెప్పిస్తావూ?" అని అడిగారు.
    "తెప్పిస్తానుండండి" అంటూంటే  కారు హారన్ చప్పుడయ్యింది.
    ఆవిడ వచ్చేశారు. "మరో  పదినిముషాలుండి  నేనిక వెళతానండి" అన్నాను.
    "రేపు కారు పంపిస్తాను. రా" అన్నారు.
    "కారు వద్దు. నేనే వస్తానులెండి" అన్నాను.
    "ఎన్ని గంటలకి?" అని అడిగారు.
    "ఉదయం  వస్తాను. కానీ చిన్న కండిషనండీ. మీ గురించి ఇంకా  వివరాలు  చెప్పాలి" అన్నాను.
    "సరే. ముందు నువ్వు రా చూద్దాం" అన్నారు.


                         *    *    *   


    మరునాడు ఉదయం  తొమ్మిది గంటలకి  హాస్పిటల్ కి చేరుకున్నాను.
    "ఇంత ఆలస్యమయ్యిందే? బస్సులో  వచ్చావా? లేక లేని దేవుడ్ని  పట్టుకొని మొరపెట్టుకోవడంలో  లేటయిందా?" అని అడిగారు.
    "దేవుడు లేడని  అంటారేమిటి? లేడని  మీరు మాత్రం  ఎలా చెప్పగలరండీ?" అని అడిగాను.
    "ఉన్నాడన్న  నమ్మకంతో  కన్నా, లేడేమోనన్న  సందేహంతో  బతుకు సరోజా! బాగుపడతావు. నీ పూజలూ  పునస్కారాలవల్ల, భక్తి భజనల వల్ల నువ్వు  మోసపోతావేకానీ  అనుకున్నదేమీ  సాధించలేవు" అని ప్రారంభించారు.
    "మా అమ్మ కూడా  పూజలూ  పునస్కారాలూ  చేసేదిట. ఆవిడ పూజలన్నీ  తన కడుపు  ఫలించాలనే  చేసిందిట. ఫలించే  నేను పుట్టానట. ఏమైంది? నా ఆటాపాటా, ముద్దూ ముచ్చటా  కళ్ళార చూడకుండానే  కళ్ళు మూసింది. కొండా కొండా అని మేం ఇంట్లో  పిలిచేకొండంత  నా తమ్ముడు ఆత్మహత్య చేసుకోడానికి  మా దరిద్రమే  కారణం.
    అవి నా దరిద్రపు  రోజులు. రెండేసి  రోజులు తిండిలేకుండా  బతికేవాడ్ని. పది సంవత్సరాలు గడ్డురోజుల్ని  చవి చూశాను. ఆ రోజుల్లోనే  'మహా ప్రస్థానం' గీతాలు  రాశాను. అంత దరిద్రపు  రోజుల్లోనూ  నేను ఎవరినీ 'దేహీ' అని యాచించలేదు. రోజుకి  ఇరవైమైళ్ళు  ఒళ్ళూపై  తెలియకుండా  నడిచేవాడిని. నేనొక  ఏకాకిని  సరోజా!" అంటూ నిట్టూర్పు  విడిచి.       
    "ఇదంతా  ఎందుకు  చెబుతున్నానంటే  కష్ట కాలంలో  భగవంతుడ్ని ధ్యానించడానికి  మించిన  పిరికితనం ఇంకొకటి  వుండదని నా అచంచల విశ్వాసం. నేను  చెప్పిందేమైనా  బుర్రలో కెక్కిందా? లేక నా మాటలు వింటూ  మనసులో  మాత్రం ఏ అమ్మమ్మదండకమో  వల్లించుచుంటున్నావా?" అని అడిగారు.    
    "అబ్బే! అదేంలేదు  చెప్పండి" అన్నాను.
    "ముందు కాఫీ  తెప్పించు సరోజా!" అన్నారు. ఇద్దరం  కాఫీ తాగాం.
    "కంపెనీ  వాళ్ళెవరైనా  వచ్చారా?" అని అడిగారు.
    "అందరికీ  ముందుగా  నేనే చెప్పేశానుగా. మరో పదిహేను  రోజులు  ఆ విషయాలేవీ ఆలోచించకండి" అన్నాను.
    "సరే మరి రేపు  సాయంకాలం  ఇంటికి  వెళుతున్నా" అన్నారు.
    "మంచిదండీ. ఎంతకాలమని  ఇక్కడుంటాం?" అన్నాను.
    "నువ్వు వస్తావుగా?" అని అడిగారు.
    "చూద్దామండీ  ఆ విషయం  ఎందుకిప్పుడు?" అన్నాను.
    "ఇప్పుడే  తేలాలి  సరోజా!" అన్నారు.
    "తప్పకుండా  వస్తానండి. అయినా....ఎంతసేపూ  సినిమా గొడవలు, ఇంటి గొడవలేకానీ  మీ చిన్నప్పటి విషయాలు  చెబుదురూ" అన్నాను.
    "నాకు  మాట్లాడడం  వచ్చిన కొత్తలోనే  పాటలు  పాడేవాడినట. మా తాతయ్య శ్రీరంగం సూర్యనారాయణగారు (శ్రీ శ్రీ తండ్రిని పెంచుకున్న వ్యక్తి) నన్ను  ఒళ్ళో  కూర్చోపెట్టుకొని  భారత రామాయణ  కథలు  చెప్పేవారు. నాచేత పాటలు  పాడించేవారు" అన్నారు.
    "మీకు  అక్షరాభ్యాసం  శాస్త్రోక్తంగా  జరిగిందా?" అని అడిగాను.
    "అవును. నాచేత  అయిదో ఏట బియ్యంలో  పసుపు  కొమ్ముతో  'ఓం నమశ్శివాయ' అని  దిద్దించారు. చిన్నపిల్లలు  స్కూలుకి  వెళ్ళడానికి తెగ భయపడి  ఏడుస్తారు. నాకా రెండూ వుండేవి కావు. కారణం....మా మాష్టారే.
    అక్షరాభ్యాసానికి  ముందు ఇంటి  గోడలన్నీ  నీటి రంగుల  కుంచెలతో  ఎక్కువగా  జంతువులు  బొమ్మలు గీసి  పాడుచేసేవాడిని. నాకు కేరమ్స్, ఫుట్ బాల్, నాటకాల్లో  వేషాలు  వెయ్యడం  అంటే చాలా సరదా.
    శ్రీరామనవమి  ఉత్సవాలు  ఎంతో బాగా జరిగేవి. అందులో  నీలిరంగు పూసుకొని  రాముడి వేషం వేసుకొని  నేనే రాముణ్నని  గెంతేవాడిని. మొదటిసారిగా  రామాయణ కథను  మా తాతగారు  చెప్తే, మహాభారత కథలు  ఆయన పెంపుడు కొడుకైనా మా నాన్నగారు  చెపుతుంటే  వినేవాడిని" అని చెప్పాను.
    "మరి అప్పుడు రుచించిన రామాయణ భారతాలు దేవుడి  గురించేకదండీ" అన్నాను.
    "అది నీలాంటి  మూర్ఖులకి  సరోజా! అని కూడా జరిగిన  కథలేగానీ....అవతారాలూ, దేవుళ్ళూ అంటే నేను ఒప్పుకోను. ఎవరిష్టం వారిది. నేను కాదనను. మనల్ని  బాధించే  సెంటిమెంట్లు  కరిగించేవాడ్ని  కరగించవు. ప్రతీ జాతి జీవితంలోనూ  ఒక్కొక్క  పరీక్షా సమయం వస్తుంది. అప్పుడే మనం ధైర్యంగా ముందడుగు  వేసి నిలబడాలి.
    
                            *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS