Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 64


    "ఎందుకు?" అనడిగారు.
    "చెప్తారా....లేదా?" అన్నాను.
    "2_1_1910 అని  నా స్కూల్  రిజిష్టర్ లో  వున్న  దాఖలాతప్ప, నా పుట్టినతేదీ  విషయమై ఇంకో సాక్ష్యం లేదని  చెప్పాను కదా? నా జాతకం  మా బంధువుల్లో  ఎవరి దగ్గరా  వుందని  కూడా నేననుకోను. మా పెద్దబావ (భాగవతుల నరసింగరావు_ఆరుద్ర తండ్రి)ఏదో  జాతకం  రాశాడు. తను రాసిన దానికి తిరుగులేదంటాడు. అతడో రకం కర్మ సిద్ధాంతి. నా జాతకచక్రంతో పాటూ, జరిగినవీ, జరగబోయేవీ చాలా రాసిచ్చాడు. ఆ రాసిచ్చింది  ఎక్కడో  పోయింది.
    ఏ తేదీన  పుట్టానో  నాకు  తెలియనప్పటికీ  1910 అని మాత్రం  నికరంగా చెప్తున్నాను. చాలా ఏళ్ళ తర్వాత  మళ్ళీ తోకచుక్క ఆ ఏడే కనిపించింది. మా అమ్మ పోయిన కొద్ది కాలానికే  మా నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడని చెప్పానుగా.
    నా సవతి తల్లి పేరు సుభద్రమ్మ. సాధారణంగా  సవతి తల్లంటే  రాక్షసి అని అందరూ అభిప్రాయ పడతారు. మా సుభద్రమ్మ మాత్రం  నా పాలిటి  దేవతే  అయ్యింది. మా నాన్న గణితశాస్త్రంలో  మంచి పండితుడు. అలాగే జూదంలో కూడా. మా ఆస్తి  చాలావరకు  పేకాటలో  కరిగిపోయిందని చెప్పచ్చు" అన్నారు.
    "అయితే....మీరు చదివింది  ఎక్కడండీ" అని అడిగాను.
    "విశాఖపట్నంలోనే  చదివాను. బి.ఏ. డిగ్రీ మాత్రం  మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో  చేశాను" అని చెప్పారు.
    "విశాఖపట్నంలో  మీ ఇల్లు  ఎక్కడండీ" అని అడిగాను. (కారణం....నేను విజయనగరం దాన్ని. మీ బాల్యంలో  హరికథలు  చెప్పేదానినని రాశానుగా. విశాఖపట్నంలో  చాలాచోట్ల  కథలు  చెప్పాను. ఆ రోజుల్లో విశాఖ వీధులు  కొంతవరకూ నాకు పరిచయమే.)
    "విప్పర్తివారి వీధి" అని చెప్పారు.
    ఇంతలో  రవణమ్మగారు వచ్చారు.
    నేనక్కడికి  రావడం  ఇష్టంలేదని, ఆవిడ మాటలూ, చూపులతోనే  అర్ధమైపోయింది.
    "నేను కబురు పంపితేనే వచ్చిందిలేవే" అన్నారు శ్రీశ్రీగారు.
    "అది ఊరుకున్నా  మీరు వుండలేరు. మీరిద్దరే  వుండండి. నేను వెళ్ళిపోతాను" అని కోపంతో  చేతినున్న  బంగారు గాజులన్నీ  తీసేసి విసిరేశారావిడ.
    దీపాలు  పెట్టేవేళ అవుతోంది.
    నేను గబగబా  వెళ్ళి ఆ గాజులన్నీ  తీసి ఆవిడ చేతికిచ్చి, "చూడండీ మరెప్పుడూ  ఇలాంటి పని చెయ్యకండి. నేను కూడా మీ మనసు నొప్పించే పని చెయ్యను. ముందు మీరీ గాజులు  తొడుక్కోండి. ఇప్పుడు  చెపుతున్నాను. నా మాట నమ్మండి. మీరే వచ్చి నన్ను పిలిచేవరకూ మళ్ళీ మీ గుమ్మంలో  అడుగుపెట్టన"ని చెప్పేసి చకచకా  నడుచుకుంటూ  వెళ్ళిపోయాను.


                         *    *    * 


    ఇంటికెళ్ళి  జరిగినదంతా  చెప్పాను.
    "పెళ్ళి విషయం  చెప్పావా?" అని అడిగారు.
    "మీకు  చెప్పద్దని చెప్పి నేనెలా  చెప్తాననుకున్నారు?" అన్నాను.
    నాకు మాత్రం  మనసు మనసులోలేదు. పరిస్థితులు  చక్కబడి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ  హాయిగా  వుంటామన్న ఆశ లేదనుకుంటూనే నిద్రపోయాను.


                        *    *    *   


    మర్నాడు ఉదయం ఎనిమిది గంటలు  కూడా కాలేదు. శ్రీశ్రీగారు వచ్చేశారు. నాడు చెప్పలేనంత  ఆనందం, ఆశ్చర్యం కలిగాయి.
    "అదేమిటి? మీరొచ్చేశారు?" అన్నాను.
    "నువ్వెలాగూ  అక్కడికి రావని నిర్ధారణ అయిపోయింది. అందుకే నేనే వచ్చేశాను" అన్నారు.
    "ఒంట్లో ఎలా వుంద"ని  మావాళ్ళందరూ  ప్రశ్నించారు.
    "బాగుంది" అన్నారాయన.
    "ఏవండీ! డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారుగా! మీరిలా  తిరిగితే  ఎలా?" అని అడిగాను.
    "మరేం ఫరవాలేదు సరోజా! వారం పైగా   అయింది. ఇంట్లోనే  వుండి, నాకూ బోరే" అన్నారు.
    మా అమ్మ కాఫీ ఇచ్చింది.
    "ఇక రెండు పూటలా  నేనే వచ్చి వెళుతూ  వుంటాను" అనీ, కొంతసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోయారు.
    అలా మరో పదిరోజులైపోయింది. పెళ్ళివారి దగ్గరి నుండి మాకు కూడా ఉత్తరాలు వస్తున్నాయి. మా ఇంట్లో 'శ్రీశ్రీగారితో  ఈ మాట ఎప్పుడు చెప్తామా?' అని కాచుకు కూర్చున్నారు.
    శ్రీశ్రీగారు బాగా  కోలుకున్నారు. కంపెనీలకి  కూడా వెళ్ళి వస్తున్నాం.
    ఓ రోజు సాయంకాలం ,అయిదు గంటలప్పుడు  శ్రీశ్రీగారు వచ్చారు. మా నాన్నగారు కూడా ఇంట్లోనే వున్నారు. అందరం కూర్చున్నాం.
    "మా సరోజకి  పెళ్ళి చెయ్యాలనుకుంటున్నామండీ" అని మా నాన్నగారు శ్రీశ్రీగారితో అన్నారు.
    ఆయన సిగరెట్ దమ్ము తీస్తూ  ఏదో ఆలోచనలో వున్నట్టున్నారు. ఈ మాట సరిగ్గా గమనించలేదు.
    నేను వెంటనే "మిమ్మల్నేనండీ! నాన్నగారు ఏదో అంటున్నారు" అన్నాను.
    'ఏమిటి' అన్నట్టు  మా నాన్నగారివైపు  చూశారు.
    "మా సరోజకి  పెళ్ళి చెయ్యాలనుకుంటున్నాం. సంబంధం కూడా సెటిలయింది" అన్నారు.
    "సంబంధం సెటిలయిందా? సరోజకి  పెళ్ళి చేస్తారా? అదెలా  చేస్తారండీ" అన్నారు శ్రీశ్రీగారు.
    "ఎలా చెయ్యడం ఏమిటి? ఆడపిల్లని కన్నాక  ఎప్పుడైనా పెళ్ళి చేసి పంపాల్సిందేగా? తప్పుతుందా?" అన్నారు  మా నాన్నగారు.
    "మీరు సరోజకి పెళ్ళి చెయ్యడానికి  వీల్లేదండి" అని శ్రీశ్రీగారన్నారు.
    "మీరన్నది  మరీ బాగుంది. వీల్లేదంటే  ఎలా? అలాగనడంలో  మీ ఉద్దేశం ఏమిట"ని నాన్నగారు  అడిగారు.  
    "ఇందులో  ఉద్దేశానికేముంది? సరోజ  నాకు కావాలి. అది లేకుంటే నేను బతకలేను. సరోజ నాది_నా స్వంతం" అన్నారు శ్రీశ్రీగారు.
    "అంటే  అది లేకుంటే  మీరు..." అని ఆశ్చర్యంతో ఏదో అడగబోయి ఆగిపోయారు నాన్నగారు.
    "అవును. నేను చచ్చిపోతాను" అన్నారు శ్రీశ్రీగారు.
    "ఇలాంటి మాటలాడకండి. అనడం తేలికే_ఒకరికోసం ఒకరు చనిపోవడమన్నది అనుకున్నంత, అన్నంత తేలిక కాదు" అన్నారు మా  నాన్నగారు.
    "మీకు శ్రీశ్రీ సంగతింకా  తెలీదు. నేను  అనుకుంటే  తిరుగులేదు. మీరు సరోజని  ఇంకొకడికిచ్చి  పెళ్ళి చేస్తే నేను సముద్రంలో  పడిపోతాను" అంటూ చటుక్కున లేచి, సిగరెట్ దమ్ము లాగుతూ, చకచకా  గేటుదాటి వెళ్ళిపోయారు.
    
                            *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS